జ్యోతిబసు స్మరణ… హక్కులకు ప్రేరణ

కాకలు తీరిన కమ్యూనిస్టు యోధుడు, సీపీఐ(ఎం) ఆవిర్భావ ముఖ్యుడు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్‌ జ్యోతిబసు. దేశ రాజకీయాల్లోనే విశిష్ట నేతగా గుర్తింపు పొందిన, ప్రజా సంక్షేమానికి అలు పెరగని పోరాటం చేసిన నాయకుడాయన. 23ఏళ్ల పాటు నిరాటంకంగా ముఖ్య మంత్రిగా ఉండి రికార్డు సృష్టించి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన మార్క్సిస్టు దిగ్గజం. ముఖ్యమంత్రి గా జ్యోతిబసు ఆధ్వర్యంలో సాగించిన లెఫ్ట్‌ ఫ్రంట్‌ పాలన రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చింది. కరువు రాష్ట్రంగా కునారిల్లిన పశ్చిమ బెంగాల్‌ను అన్నపూర్ణగా చేసింది. ఇది ఆయన నమ్మిన కమ్యూనిజం సిద్ధాంతం, ఆచరించిన ప్రజాసంక్షేమ పాలన ఫలితమే. జ్యోతిబసు 1935లో ఇంగ్లాండులో న్యాయశాస్త్రం చదువుతూనే గ్రేట్‌ బ్రిటన్‌ కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడై రాజకీయాలపై ఆసక్తి పెంచు కున్నారు. 1940లో న్యాయశాస్త్ర విద్య పూర్తిచేసుకొని మిడిల్‌ టెంపుల్‌ వద్ద బారిస్టర్‌గా అర్హత పొందారు. అదేయేటా భారత దేశానికి తిరిగొచ్చారు. 1941-43 మధ్య బెంగాల్‌, అస్సాం రైల్వే వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. 1944 నుంచి ట్రేడ్‌ యూనియన్‌ బాధ్యతలు చేపట్టారు. స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత 1946లో తొలిసారిగా బెంగాల్‌ శాసనసభకు ఎన్నికయ్యాడు. 1946-47లో బెంగాల్‌లో సాగిన తెభాగః పోరాటం, కార్మికవర్గ సమ్మెల్లోనూ, మత ఘర్షణల నిరోధంలోనూ గొప్ప పాత్ర వహించారు. 1964లో కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఐ(ఎం)గా ఏర్పడినప్పుడు ఎన్నుకున్న తొమ్మిదిమంది పాలిట్‌ బ్యూరో సభ్యులు (నవరత్నాలు)లో ఒక మణిపూస జ్యోతిబసు. బిసి రారు ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో శాసన సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1967లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవడంతో అజరు ముఖోపాధ్యాయ నేతృత్వం లోని ప్రభుత్వంలో 1967 నుండి 1969 వరకు పశ్చిమబెంగాల్‌ ఉపముఖ్య మంత్రిగా పనిచేశారు.
అర్థఫాసిజాన్ని ఎదుర్కొని…
లౌకిక పాలనతో నిలిచి…
1972లో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు రిగ్గింగ్‌ అయినప్పుడు, జ్యోతిబసు రేడియోలో ఆ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే గూండాల దాడిలో గాయపడ్డ లెఫ్ట్‌ కార్యకర్తలను పరామర్శించ డానికి వెళ్లిన ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ‘ఇది అర్థఫాసిస్టు రాజ్యం. ప్రజలు మనల్ని ప్రేమించే వరకు మనం ప్రజల వద్దకు వెళ్తూనే ఉండాలి. ఈ చీకటి రోజులు ఎంతో కాలం ఉండిపోవు’ అని జ్యోతిబసు వారికి ఉద్భోదించారు. అక్కడినుండి 1977 దాకా పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ప్రతి ఎన్నికల్లో రిగ్గింగ్‌, రక్తపాతం యథేచ్ఛగా జరిగాయి. ఆ ఐదేండ్లు లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఎన్నికలను బహిష్కరిం చింది. అయినా, లెఫ్ట్‌ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులను ధీటుగా ఎదుర్కొని, ప్రజలతో మమేకమయ్యారు. దీంతో 1977 ఎన్నికల్లో జ్యోతిబసు ఆధ్వర్యంలో లెఫ్ట్‌ఫ్రంట్‌ విజయ దుందుభి మోగించింది. అక్కడినుండి 2011 వరకు అంటే 34ఏళ్ల పాటు వామపక్ష కూటమి అధికారంలో కొనసాగింది. జ్యోతిబసు నేతృత్వంలో ప్రభుత్వం ఆపరేషన్‌ బర్గా కింద 14లక్షల మంది బర్గాదార్ల (కౌలుదార్ల)ను నమోదు చేయించింది. 11లక్షల ఎకరాల భూమిని శాశ్వతంగా వారి అధీనంలోకి తెచ్చి, సాగుచేసేవారి హక్కుకు రక్షణ కల్పించారు. భూ సంస్కరణల చట్టం కింద దాదాపు 13.7లక్షల ఎకరాల భూమిని సేకరించి, 10.4లక్షల ఎకరాలను 25లక్షల భూ వసతిలేని సాగుదారు కుటుంబాలకు పునఃపంపిణీ చేశారు. దాదాపు ఐదు లక్షల పేద కుటుంబాలకు ఇండ్ల స్థలాలను పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా భూ సంస్కరణల కింద పునఃపంపిణీ చేసిన భూమిలో 20శాతం బసు నేతత్వంలోని వామపక్ష ప్రభుత్వంలో పంపిణీ అయింది. భూ సంస్కరణల వల్ల దళితులు, ఆది వాసులు ప్రధానంగా ప్రయోజనం పొందారు. వామపక్ష ప్రభుత్వం వచ్చేనాటికి 57లక్షలుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల సంఖ్య 1999 నాటికి 1.23 కోట్లకు పెరిగాయి. నివాస ప్రాంతాలకూ, పాఠశాలలకూ మధ్య సగటు దూరం తగ్గింది. ఇక సామాజిక సూచీలు కూడా ఎంతో మెరుగుపడ్డాయి. కార్మికుల జీవన ప్రమాణాలు పెరిగాయి. మైనారిటీలకు సామాజిక భద్రత కల్పించడం, ఆర్థిక తోడ్పాటునందించడం ముఖ్య కర్తవ్యంగా పెట్టుకొని జ్యోతిబసు కృషిచేశారు. ఇందిరాగాంధీ హత్య అనంతరం సిక్కులపై దాడులను నిలువరించడంలోనూ, బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం యావద్దేశంలో మతకలహాలు చెలరేగినప్పుడు బెంగాల్‌లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా జ్యోతిబసు పటిష్ట చర్యలు తీసుకున్నారు. ఒకప్పుడు మత కలహాలకు నిలయంగా ఉన్న బెంగాల్‌ను మత, సామాజిక సామరస్యానికి ఆశాదీపంగా నిలబెట్టారు.
కంప్యూటరీకరణ వ్యతిరేక ఉద్యమం
జ్యోతిబసు ఆధ్వర్యంలోని లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఎల్‌ఐసి సంస్థ పరిరక్షణకు పూర్తి బాసటగా నిలిచింది. అఖిల భారత బీమా ఉద్యోగుల పోరాటాలకు (ఎఐఐఇఎ) అండదండలు ఇవ్వడం వల్ల, బీమా ఉద్యోగుల అనేక పోరాటాలు విజయవంతమయ్యాయి. ”ఇలాకో విజిల్‌” పేరుతో ఆటోమేషన్‌ (కంప్యూటరీకరణ)కి వ్యతిరేకంగా ఏఐఐఇఏ, జరిపిన పోరాటంలో జ్యోతిబసు, లెఫ్ట్‌ ఫ్రంట్‌ శ్రేణులు నిర్వర్తించిన మహాత్తరమైన పాత్రను ఎల్‌ఐసి ఉద్యోగులు ఎన్నటికీ మర్చిపోలేరు. 1968 దసరా సెలవుల్లో సూపర్‌ కంప్యూటర్‌ను కలకత్తాలోని ఎల్‌ఐసి ఇలాకో భవనంలో పెట్టాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. దీనికి జ్యోతిబసు ఒప్పుకోలేదు. ఇలాకో భవనం దగ్గర కాళీ మాత విగ్రహం పెట్టి దసరా పండగ నిర్వహించారు. జ్యోతిబసు, ఇతర కమ్యూనిస్టు నేతలు, రాజకీయ నాయకులు, జాతిన్‌ చక్రవర్తి, జ్యోతిర్మయి బసుతో బాటు అనేక మంది ఈ విజిల్‌లో పాల్గొన్నారు.24 పర గణా జిల్లాలోని గిరిజనులు (వీరికి గతంలో కరువు సందర్భంగా అంబలి ఇచ్చి ఎఐఐఇఎ యూనిట్లు వారిని ఆదు కున్నాయి) తమ విల్లంబులతో వచ్చి ఈ విజిల్‌లో మమేకమయ్యారు. 24గంటలూ, 365రోజుల పాటు ఈ మహా ఉద్యమం కొనసాగింది. నవంబర్‌1967 నుండి మార్చి 69 వరకు (రాష్ట్ర పతి పాలన అమలు ఉన్న కాలంలో) అక్కడ ప్రజాతంత్ర ఉద్యమం బీమా ఉద్యోగుల పోరాటాలకు రక్షణా కవచంగా ఉంది. దీంతో అక్కడ రాష్ట్రపతి పాలన ఉన్న సందర్భంగా ఎలాగైనా కంప్యూటర్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలనే ప్రభుత్వ, ఎల్‌ఐసి యాజమాన్య ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ఫోర్ట్‌ విలియమ్స్‌లో మిలిటరీ రక్షణలో ఉన్న కంప్యూటర్‌ను, పశ్చిమ బెంగాల్‌ నుండి వెనక్కు తరలించారు. కంప్యూటరీకరణ వ్యతిరేక ఉద్యమం చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ పోరాటం దేశ కార్మిక చరిత్రలోనే ఒక ప్రముఖమైన ఘట్టం. ఆనాడే కంప్యూటర్లు ఎల్‌ఐసిలో ప్రవేశించి ఉంటే సంస్థలో వేలాది మంది ఉద్యోగాల పోవడమే గాక, దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వ సంస్థలోనూ తర్వాత తరాల ఉద్యోగులకే ఉద్యోగ అవకాశాలు ఉండేవి కావు. అందుకే ఇది మహాత్తర పోరాటం. దీనిలో లెఫ్ట్‌ఫ్రంట్‌, జ్యోతిబసు చిరస్మరణీయమైన పాత్రను తరాలు గుర్తుంచుకుంటారు. ఏఐఐఇఎ 26వ అఖిల భారత సమావేశాలు కలకత్తాలో ఈ ఏడాది జనవరిలో జ్యోతిబసు రీసెర్చ్‌ సెంటర్‌ ప్రాంగణంలో స్ఫూర్తివంతంగా నిర్వహించు కోవడం విశేషం. కేంద్ర బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలపై, ఉద్యోగుల హక్కులపై, కార్మికవర్గంపై నిరంతరం దాడులు జరుగుతున్న ప్రస్తుత నేపథ్యంలో జ్యోతిబసు జీవితం కార్మిక వర్గానికి, ప్రత్యేకించి బీమా ఉద్యోగులకు ప్రేరణ ఇస్తుంది. మొక్కవోని దీక్షతో ఎల్‌ఐసి సంస్థను, ప్రభుత్వ రంగాలను, కార్మిక హక్కులను, దేశ సమ్మిళిత సంస్కృతిని కాపాడుకోవడమే జ్యోతిబసుకు మనమిచ్చే నిజమైన నివాళి.
(నేడు జ్యోతిబసు 109వ జయంతి)
పి. సతీష్‌
9441797900

Spread the love