ఉద్యమ బలం… గళం… కలం… ఎంహెచ్‌

అద్దాల కొంపలో కూచుని రాళ్లు రువ్వడం, తెల్లజెండాలెత్తడం, కాసుకు కక్కుర్తిపడటం, చచ్చిన చేప వాలున పడి కొట్టుకుపోతే బతికిన చేప ఎదురీదడం, సలాం కొట్టడం, దివాళాకోరుతనం, నికరంగా నిలబడటం సూత్రబద్దంగా నిలవడం, కంకణధారిగా పనిచేయడం ఇలాంటి పదప్రయోగాలన్నీ ఆయనే ప్రాచుర్యంలోకి తెచ్చారు. తీరు తెన్ను అనే వాడుకను తీరుతెన్నులు చేసిందీ ఆయనే. కమ్యూనిస్టు పత్రికలను తీర్చిదిద్దినవారిలో మద్దుకూరి చంద్రం తర్వాత ఆయననే చెప్పుకోవాలి. చివరి దాకా అదే కృషి కొనసాగించడం ఎంహెచ్‌ ప్రత్యేకత.
2001 జూన్‌ 18న ఆయన మరణానంతర కాలంలో మోడీ రాకడ, కరోనా సవాలు వంటివీ చూశాం. ఇన్నిటిమధ్యనా ప్రజాశక్తి ముందుకు పోవడం, రాష్ట్ర విభజన తర్వాత నవతెలంగాణ పత్రిక ఏర్పాటు ఇవన్నీ ఎంహెచ్‌, ఇతర పెద్దలు వేసిన పునాదిపై వెలసినవే. తర్వాతి కాలంలో ఉద్యమానికి, పత్రికకూ కూడా నాయకత్వం వహించిన బాధ్యులు నాయకులు ఆ మార్గాన్ని ముందుకు సాగుతున్నందుకే ఈ రోజున కలుషిత వివాదాస్పద రాజకీయ వాతావరణంలోనూ ప్రజాశక్తి విభిన్న ఒరవడితో ప్రత్యేకత నిలబెట్టుకోగలుగుతున్నది.
తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ మహత్తర పురోగమనానికీ, ఆటుపోట్లకూ, పునర్మిర్మాణాలకూ సారథ్యం వహించిన పెద్దలలో ప్రముఖ స్థానం వహించిన నేత మోటూరు హనుమంతరావు. ఎంహెచ్‌ అనే రెండక్షరాలతో నిలిచిపోయిన ఆ మనిషి ఉద్యమాల మార్గదర్శి, ఆక్షరాల రూపశిల్పి. ఆశయాలనూ ఆచరణనూ మేళవించిన అరుదైన అనుభవం ఆయనది. రాజీపడని సిద్ధాంతబలం, కట్టుతప్పని పట్టుదల, ప్రమాణాలకు ప్రతిరూపమైన ప్రయాణం మోటూరుది. ప్రచార పటాటోపం లేని ప్రతిభ ప్రజాసేవ ఆయన స్వంతం. సమాజంలో పదవుల కోసం పాకులాట, సంపదలకై వెంపర్లాట, అసహన దూషణలూ, నీతిమాలిన మీడియా ధోరణులు ప్రబలుతున్న ఈ రోజున మోటూరు విలక్షణమైన ఆదర్శంగా గోచరిస్తారు. ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం, సంపాదక కృషి, పార్లమెంటరీ ప్రస్థానం, నిరాడంబరత్వ నిబద్దత మార్గదర్శకమవుతాయి. దశాబ్దాల పాటు ఆయన నాయకత్వంలో నడచిన నాటి నాయక శ్రేణికీ, తదుపరి తరంలో తనతో సన్నిహితంగా మసలిన మాలాంటివారికీ కూడా ఆయన జ్ఞాపకం ఒక చెరగని ఉత్తేజం. అంత సుదీర్ఘ కాలం కమ్యూనిస్టు ఉద్యమ నాయకత్వంతో పాటు కమ్యూనిస్టు పత్రికల నిర్వహణతోనూ అంతగా పెనవేసుకుపోవడం మోటూరుకే చెల్లింది.
నిర్బంధాలు… నిషేధాల మధ్యనే…
అక్టోబరు విప్లవంతో పుట్టానని సగర్వంగా చెప్పుకునే మోటూరు గుంటూరు ఎసి కాలేజీలో చదువుతున్నప్పుడే కమ్యూనిస్టు అయ్యారు. అది బ్రిటిష్‌ పాలనలో ఆ పార్టీపై నిషేధం ఉన్న కాలం. ఆయన గది లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌, బాట్లీవాలా వంటివారు వచ్చినప్పుడు ఆశ్రయమైంది. చిన్న వయసులోనే ఉన్న కొద్దిపొలం అమ్మి గుంటూరులో సిటీ స్టూడెంట్స్‌ ఎంపోరియం పేరిట పుస్తకాలషాపు పెడితే దానిపైనా సిఐడిలు దాడిచేశారు. అక్కడినుంచి ఎలాగో తప్పించుకున్నారు. ఉత్తరోత్తరా మోటూరు ఉదయంగా మహిళా ఉద్యమ పతాకమెగరేసిన ఉదయలక్ష్మిని సంస్కరణ వివాహం చేసుకోవడం, కమ్యూనిస్టుపార్టీలో సభ్యులవడం 1937లోనే జరిగాయి. లావుబాల గంగాధరావు వంటివారు సమకాలీనులైతే సుందరయ్య బయటనుంచి వచ్చివెళ్లేవారు. మాకినేని బసవపున్నయ్య నుంచి మోటూరు గుంటూరు జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బాధ్యత తీసుకున్నారు. 1942 వరకూ పార్టీపై నిషేధం, నిర్బంధం మధ్యనే ఉద్యమాన్ని పెంపొందిచేందుకు కృషిచేశారు. క్షేత్రస్థాయి ఉద్యమ నిర్మాణం, నాయకత్వంతో పాటు పత్రికా రచన కళాసాహిత్యంలోనూ ఎంహెచ్‌ పట్టు పెంచుకున్నారు. అప్పుడే తెలంగాణ సాయుధ పోరాటం మొదలైంది. మొగల్‌రాజపురంలో కాట్రగడ్డవారి పొగాకు బేరన్లలో నిర్మించుకున్న ప్రజాశక్తినగర్‌ అందుకు సహాయసామగ్రి అందించే ఆశ్రయమైంది. 1947లో వచ్చిన ప్రకాశం ఆర్డినెన్సు కమ్యూనిస్టులపై దారుణమైన వేటగా మారింది. ప్రజాశక్తి నగర్‌ ధ్వంసం చేయబడింది. అప్పటికే మోటూరు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడుగా ఎన్నికైనారు. ప్రజాశక్తి స్థానంలో మాసపత్రికగా జనత తీసుకుని రావడానికి సన్నాహాలు జరిగాయి. 1977లో ప్రజాశక్తిలో చేరాక నేను పాత పత్రికలు తిరగేస్తుంటే జనత తొలి సంపాదకీయంలో ఎంహెచ్‌ భాష కనపడింది. ఆయనను వెళ్లి అడిగితే తనే రాసిన సంగతి గుర్తుకు వచ్చింది. అయితే ఇంతలోనే ఆయను అరెస్టు చేయడంతో గంగినేని వెంకటేశ్వరరావు, బొమ్మారెడ్డి ఆపత్రికను కొనసాగించారు. మొదటినుంచి ఈ విధంగా పత్రికలతో ఎంహెచ్‌ పాత్ర కనిపిస్తుంది. భయంకరమైన కడలూరు జైలు జీవితం గడిపారు. జైలులోనే పోలీసు కాల్పులు జరిపితే అనుమర్లపూడి సీతారామరావు బలికావడం ఈయనకు కొద్దిలో గుండు తప్పిపోవడం జరిగాయి. ఇంకా చాలామందికి గాయాలు తగిలాయి. అనంతపురం తొలిపాత్రికేయులలో ఒకరైన రామకృష్ణకు అప్పుడే ఒక కన్నుపోయింది. ఆయన కూడా చాలాకాలం ప్రజాశక్తి విలేకరిగా పనిచేశారు.
చట్టసభలు… జైలు శిక్షలు… పత్రికలు…
నిషేధం ఎత్తివేత తర్వాత 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా జరిగిన తొలి ఎన్నికలలో ఎంహెచ్‌ రేపల్లె నుంచి మంత్రి చంద్రమౌళిని ఓడించి శాసనసభకు ఎన్నికైనారు. కమ్యూనిస్టుల నాటి విజయ పరంపరలో ఈ గెలుపు కూడా ఒక సంచలనం. 1953లో ఎంహెచ్‌ విశాలాంధ్ర సంపాదకు డయ్యారు. సైద్ధాంతిక విభేదాల తర్వాత తనుగా ఆ బాధ్యతలకు రాజీనామా చేశారు. 1962, 1966లో ఆయనను రెండుసార్లు అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. 1964లో సీపీఐ(ఎం) రాష్ట్ర తొలి కార్యదర్శిగా ఎన్నికైన ఆయన తీవ్రవాద ఉద్యమ చీలిక కూడా చూశారు. ఎడాపెడా విచ్చిన్నాలనే పదం ఆయన నోట నిరంతరం వినిపించడానికి కారణమదే. ఈ రెండు సందర్భాలలోనూ ఉద్యమ పునర్నిర్మా ణానికి కీలకబాధ్యత వహించారు. మొదట జనశక్తి తర్వాత ప్రజాశక్తి వారపత్రిక పునః ప్రారంభంలో సంపాదకుడుగా పేరు లేకపోయినా అన్ని కీలక విషయాలపైనా దిశానిర్దేశం చేసే రచనలందిస్తూనే వచ్చారు. 1974 నుంచి పెరిగిన కాంగ్రెస్‌ నిర్బంధం, దానికి పరాకాష్టగా 1975 ఎమర్జెన్సీ కూడా ఉద్యమానికి తీవ్ర సవాలు విసిరాయి. అజ్ఞాతవాసంలో ఉంటూనే ఎంహెచ్‌ నాయకత్వం అందించారు. ఎమర్జెన్సీ సెన్సార్‌షిప్‌లో కూడా సంజరుగాంధీ జాతరను అపహస్యం చేస్తూ అంజిపేరిట ఆయన రాసిన ‘రాజువెడలె’ సంచలనం తెచ్చింది. ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికలు, 1978లో శాసనసభ ఎన్నికలు అన్నింటా ఎంహెచ్‌ ముందుండి పనిచేశారు. 1978లో శాసనమండలికి ఎన్నికైనారు. రాష్ట్రానికి తిరిగివచ్చిన సుందరయ్య 1982లో రాష్ట్ర కార్యదర్శి అయ్యేవరకూ ఎంహెచ్‌ 18ఏళ్లపాటు బాధ్యతల్లో ఉన్నారు. 1953 నుంచి చివరివరకూ సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న ఆయన 1998లో పొలిట్‌బ్యూరో సభ్యులయ్యారు. ఈ విధంగా ఎంహెచ్‌ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో, విధాన నిర్ణయంలో ఆద్యంతం ఒక ముఖ్య పాత్రధారి. 1986 నుంచి ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మధ్యలో ఒకటిరెండు సార్లు అనారోగ్యం వెంటాడినా జాగ్రత్తలు తీసుకుని మళ్లీ బాధ్యతల్లోకి రావడం ఆయన దీక్షా దక్షతలకు నిదర్శనం.
వర్గ చైతన్య ఖడ్గదారి
తెలుగు నుడికారం కమ్యూనిస్టు భావజాలం, రాజకీయ నైశిత్యం వ్యంగ్యం మేళవించి కొత్త ఒరవడి తీసుకొచ్చారు. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితాత్మకంగా తెలుగుభాషను పొరాట భాషగా మార్చింది. ఎంహెచ్‌ కలం తెలుగుభాషలో రాజకీయ వర్గచైతన్యపరమైన భావజాలానికి సరికొత్త పదసంపద సమకూర్చింది. మార్క్సిస్టు మేధావులు, పండితులు అనేక మంది ఉండొచ్చు. కానీ ఆ భాషను శక్తివంతంగా సిద్ధాంత రాజకీయ ప్రచారానికి వాడుకోగలిగిన వారిలో మాకినేని బసవపున్నయ్యను, మోటూరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గ్రామీణ జీవనం నుంచి సంప్రదాయ ప్రయోగాల నుంచి, ఇంగ్లీషు వాడుకల నుంచి కలగలిపిన శక్తివంతమైన భాష అది. అనుభవం నుంచి పుట్టింది గనక అందులో కృత్రిమత్వం ఉండదు. అద్దాల కొంపలో కూచుని రాళ్లు రువ్వడం, తెల్లజెండాలెత్తడం, కాసుకు కక్కుర్తిపడటం, చచ్చిన చేప వాలున పడి కొట్టుకుపోతే బతికిన చేప ఎదురీదడం, సలాం కొట్టడం, దివాళా కోరుతనం, నికరంగా నిలబడటం సూత్రబద్దంగా నిలవడం, కంకణధారిగా పని చేయడం, ఇలాంటి పదప్రయోగాలన్నీ ఆయనే ప్రాచుర్యంలోకి తెచ్చారు. తీరు తెన్ను అనే వాడుకను తీరుతెన్నులు చేసిందీ ఆయనే. కమ్యూనిస్టు పత్రికలను తీర్చిదిద్దినవారిలో మద్దుకూరి చంద్రం తర్వాత ఆయననే చెప్పుకోవాలి. చివరి దాకా అదే కృషి కొనసాగించడం ఎంహెచ్‌ ప్రత్యేకత. ఉద్యమ పరంగానూ పత్రికపరం గానూ ఇన్ని అనుభవాలు ఉన్నాయి గనకే చివరిదశలో వెంటబడి మరీ ఆయనతో అనేక జ్ఞాపకాలు రాయించడం మాకు చాలా సంతృప్తి కలిగించే విషయం. ఆయన మాట, రాత, వస్త్రధారణ, పలకరింపు, ఆదరణ విలక్షణమైనవి.
ప్రజాశక్తి పురోగమనంలో…
1981లో ప్రజాశక్తి దినపత్రికగా మారినప్పుడు మళ్లీ అప్పటి నుంచి ఇరవయ్యేండ్లు 2001 దాకా నిర్విఘ్నంగా సంపాదక బాధ్యతలు నిర్వహించిన ఎంహెచ్‌ అనారోగ్య కారణాల వల్ల వైదొలిగారు. కమ్యూనిస్టు పత్రికలకు భవిష్యత్తు లేదనే అంచనాలు అధిగమిస్తూ పలు ఎడిషన్లతో విస్తరించిన ప్రజాశక్తి పెరుగుదలలో నేను, వి.కృష్ణయ్య, కొరటాల తదితరులతో పాటు పనిచేయడం ఒక మంచి అనుభవం. నిజానికి మా కమ్యూనిస్టు కుటుంబంలో నాన్న నరసింహయ్య, అమ్మ లక్ష్మమ్మలతో పాటు బాల్యం నుంచి ఆయన గళాన్ని, కలాన్ని అనుసరిస్తూ వచ్చిన నాకు ఆయనతో సహ సంపాదకుడుగా కొన్నేళ్లు పనిచేయడం, ప్రత్యక్షంగా దీర్ఘకాలం ఆయన సూచనలు అందుకోవడం గొప్ప అవకాశం. ఇప్పటికీ ఏకీలక సందర్భం వచ్చినా ఎంహెచ్‌ ఎలా స్పందించేవారు, ఏమి రాసేవారు తప్పక స్పురిస్తుంది. అందుకే నా ”వెయ్యేళ్ల చరిత్రను” ఎంహెచ్‌కు అంకితం చేస్తూ గతాన్ని, వర్తమానాన్ని కూడా వర్గదృష్టితో చూడటమెలాగో నేర్పించిన వ్యక్తిగా ఆయనకు జోహారులర్పించానందుకే. నాలాంటి నా ముందటి రెండు మూడు తరాల కార్యకర్తలందరికీ ఆయన చెరగని స్పూర్తి. కొత్త ఆలోచనలను ఆహ్వానిస్తూ యువతను కలుపుకుని పోతూ మౌలిక విలువలను నిలబెట్టడంలో ఆయన పట్టువిడుపులు అనుసరణీయం… వాస్తవానికి ఎంహెచ్‌ జీవితం మలిదశలో మతోన్మాదం పెరుగుదల, సోవియట్‌ విచ్చిన్నం, సమాజంలో స్వార్థపూరిత అవకాశవాదం వెర్రితలలు వేయడం, సరళీకరణ వంటివన్నీ ఎదుర్కొన్నారు. ఇన్ని బాధ్యతలలోనూ సమస్యలలోనూ కార్యకర్తల పట్ల, తోటి నాయకుల పట్ల, సిబ్బంది పట్ట ఎంహెచ్‌ చూపిన ప్రేమానుభవాలు చెరగని ముద్రవేశాయి. ఆయన కుటుంబం మొత్తం ఆ విధంగానే ఉద్యమంతో నిలబడటం కూడా ఇందులో భాగమే. ఉదయం గారైతే అందరికీ అమ్మే. ఉద్యమంలో తప్పనిసరైన సమిష్టితత్వానికి పరస్పరత్వానికి వారి ప్రేమాభిమానాలు తార్కాణాలు.
    2001 జూన్‌ 18న ఆయన మరణానంతర కాలంలో మోడీ రాకడ, కరోనా సవాలు వంటివీ చూశాం. ఇన్నిటిమధ్యనా ప్రజాశక్తి ముందుకు పోవడం, రాష్ట్ర విభజన తర్వాత నవతెలంగాణ పత్రిక ఏర్పాటు ఇవన్నీ ఎంహెచ్‌, ఇతర పెద్దలు వేసిన పునాదిపై వెలసినవే. తర్వాతి కాలంలో ఉద్యమానికి, పత్రికకూ కూడా నాయకత్వం వహించిన బాధ్యులు నాయకులు ఆ మార్గాన్ని ముందుకు సాగుతున్నందుకే ఈ రోజున కలుషిత వివాదాస్పద రాజకీయ వాతావరణంలోనూ ప్రజాశక్తి విభిన్న ఒరవడితో ప్రత్యేకత నిలబెట్టుకో గలుగుతున్నది. మీడియాలో చొరబడిన అనారోగ్యకర ధోరణులను సాంకేతిక ఆర్థిక సవాళ్లనూ తట్టుకుని విశిష్టత చాటుకుంటున్నది. ఎంహెచ్‌, ఆయనతో పాటు దీర్ఘకాలం పనిచేసిన బొమ్మారెడ్డి పేర్లమీద బహుకరించే అవార్డులు అందుకు ప్రతీకలుగా ఉంటాయి.
తెలకపల్లి రవి

Spread the love