దేశ ఆర్థిక పరిస్థితి… వాస్తవాలు

జీడీపీని ప్రాథమికంగా లెక్కించే కొత్త పద్ధతిలో సంఘటిత రంగంలో వృద్ధిరేటు ఏ మేరకు ఉందో వ్యవసాయేతర అసంఘటిత రంగంలో కూడా అదే మోతాదులో ఉంటుంది అన్న ప్రాతిపదికను అనుసరిస్తారు. అసంఘటిత రంగానికి సంబంధించిన గణాంకాలు సేకరించడానికి ఎక్కువ సమయం పడుతుంది గనుక సంఘటితరంగం వృద్ధిరేటుతో సమంగా అసంఘటిత రంగం కూడా వృద్ధి చెందుతుంది అని పరిగణిస్తారు. కాని అసంఘటిత రంగం సంఘటితరంగం కన్నా బాగా ఎక్కువగా దెబ్బతింది. ముఖ్యంగా కరోనా కాలంలో తగిలిన దెబ్బ నుండి ఆ రంగం ఇంకా కోలుకోనేలేదు. శ్రామిక ప్రజలు తమ ఆదాయాలను ప్రధానంగా ఆహారరమీద ఖర్చు చేస్తారు. ఆ తర్వాత అసంఘటిత రంగంలో ఉత్పత్తి అయే సరుకులను తమ వినియోగం కోసం కొనడానికి ఖర్చు చేస్తారు. మొత్తం వస్తూత్పత్తి రంగంలోనే వృద్ధి దాదాపు లేదు. అందులో ప్రత్యేకంగా అసంఘటిత రంగంలో పూర్తిగా మాంద్యం నెలకొంది. అంటే శ్రామికవర్గం కొనుగోలుశక్తి ఏమీ పెరగలేదని కనిపిస్తోంది. పైగా ప్రభుత్వ వ్యయం ఈ కాలంలో వాస్తవ విలువలలో ఏమీ పెరగలేదు. స్థూల స్థిరపెట్టుబడిలో పెరుగుదల కనిపిస్తున్న మాటనిజం. కాని వినిమయంలో గాని, ఎగుమతులలో గాని పెరుగుదల లేనప్పుడు పెట్టుబడులు పెట్టడంలో పెరుగుదల కొనసాగుతుందని భావించలేం.
ఇటీవల, మే 31వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరపు ఆఖరి త్రైమాసిక ఆర్థిక వృద్ధిరేటు వివరాలు వెల్లడి చేశారు. ఆ మూడు నెలల వృద్ధి రేటు 6.1శాతం ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కలిపి లెక్కిస్తే వృద్ధిరేటు 7.2శాతం నమోదైంది. రిజర్వు బ్యాంక్‌, ఐఎంఎఫ్‌ వేసిన ముందస్తు అంచనాల ప్రకారం 6.8శాతం వృద్ధిరేటు ఉంటుందనుకున్నది వాస్తవంలో 7.2 ఉండేసరికి ప్రభుత్వ భారతదేశం అత్యంత వేగంగా పెరుగుతున్న ఆర్థిక శక్తి అంటూ గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టేసింది.
ముందస్తుగా అనుకున్న 6.8శాతం కన్నా వాస్తవంగా 7.2శాతం వృద్ధిరేటు నమోదు కావడం బట్టి మన దేశపు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి మీద ఉన్న అంచనాలు ఏమాత్రమూ మార్చుకోవలసిన పని లేదు. 2019-20 నుండి 2022-23 మధ్య కాలంలో లాక్‌డౌన్‌ సంవత్సరం 2020-21ని పక్కన పెట్టి లెక్కిస్తే మన ఆర్థిక వృద్ధిరేటు ఏడాదికి 2.85గా ఉంది. (ముందస్తు అంచనాల ప్రకారం ఈ ఏడాది ఆఖరి త్రైమాసికపు వృద్ధి 6.8 ఉంటుందన్న ప్రాతిపదికన లెక్కిస్తే ఇది 2.7గా ఉంటుంది) అంతే కాదు, 2022-23లో నమోదైన వృద్ధిరేటును 2023-24లో కొనసాగించడం అసాధ్యం అని దాదాపు ప్రతివారూ భావిస్తున్నారు. స్థూల డిమాండ్‌లో పెరుగుదల ఏమీలేకపోవడమే దీనికి కారణం. మన ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుని ఉందన్న విషయం నిస్సందేహం.
కాని మన ప్రభుత్వం మాత్రం ఆర్థిక వ్యవహారాలను తాము చాలా సమర్థవంతంగా నిర్వహించిన కారణంగానే ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలోకెల్లా మనమే ఎక్కువ వృద్ధిరేటును నమోదు చేయగలిగామంటూ గొప్పలు పోతున్నది. ఇక్కడ మన ప్రభుత్వం దాచిపెడుతున్న విషయం ఒకటుంది. కరోనా కాలంలో ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలలోకెల్లా అతి ఎక్కువ మోతాదులో ఆర్థిక పతనం మన దేశంలోనే సంభవించింది. ఇక ఏ ఇతర దేశంలోనూ అమలు చేయనంత దుర్మార్గమైన రీతిలో ఇక్కడ లాక్‌డౌన్‌ అమలు జరిగింది. దాని ఫలితంగా 2020-21లో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నింటిలోకీ అతి ఎక్కువ స్థాయిలో మన ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. ఆ స్థితినుండి మళ్ళీ కరోనాకి మునుపు ఉండిన స్థాయికి చేరుకోవాలన్నా చాలా ఎక్కువ వృద్ధిరేటు నమోదు కావలసివుంది. అందుకే 2020-21 ఆర్థిక సంవత్సరాన్ని పక్కన పెట్టి అంతకుముందు సంవత్సరం 2019-20 నుండి ఇప్పటిదాకా వృద్ధిరేటును లెక్కించాం. అప్పుడు వృద్ధిరేటు 2.85గా నమోదైంది. (2020-21 సంవత్సరాన్ని కూడా కలిపి లెక్కిస్తే ఈ మాత్రం వృద్ధి కూడా కనిపించదు) అప్పుడు కూడా ఇంత తక్కువ వృద్ధిరేటు నమోదవడం అంటే దేశం ఆర్థిక మాంద్యంలో ఉందన్నమాట. అంతే తప్ప చాలా గొప్ప వృద్ధి సాధిస్తోందని భావించడం సరైనది కాదు.
తాజా జీడీపీ గణాంకాలు మరో ఆందోళనకర ధోరణిని వెల్లడిస్తున్నాయి. 2018-19 కన్నా 2022-23లో వాస్తవ జీడీపీ వృద్ధి 13.37శాతం ఎక్కువ ఉంది. అయితే 2018-19లో 6.3శాతంగా ఉన్న నిరుద్యోగం రేటు 2023 మార్చి నాటికి 7.9శాతానికి ఎగబాకింది. (సిఎంఐఇ వెల్లడించిన గణాంకాలు) జీడీపీ వృద్ధిరేటు పెరుగుతున్నప్పుడు, అందునా, జనాభా పెరుగుతున్న వేగం కన్నా జీడీపీ వేగంగా పెరుగుతున్నప్పుడు నిరుద్యోగం రేటు తగ్గాలే తప్ప పెరగకూడదు కదా! మరి ఎందుకు నిరుద్యోగం వేగంగా పెరుగుతోంది?
ఆర్థిక వ్యవస్థ పెరిగే వేగం కన్నా జనాభా, అందులోనూ నిరుద్యోగ జనాభా వేగంగా పెరిగిపోతే అప్పుడు నిరుద్యోగం రేటు పెరగడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని ఇక్కడ దానికి భిన్నంగా నిరుద్యోగ జనాభా పెరుగుదల వేగం కన్నా ఆర్థిక వృద్ధి పెరిగిన వేగం ఎక్కువ. అంటే నిరుద్యోగం పెరిగిపోడానికి లేబర్‌ సప్లై పెరగడం కాదు కారణం. దానికి భిన్నంగా లేబర్‌ డిమాండ్‌ తగ్గిపోవడం వల్ల నిరుద్యోగం పెరిగింది. సిఎంఐఇ వెల్లడించిన మరో అంశం దీనిని ధృవపరుస్తోంది. 2019-20లో 40కోట్ల 89లక్షల మంది ఉద్యోగాలలో ఉంటే మార్చి 2023 నాటికి 40కోట్ల 76లక్షల మంది మాత్రమే ఉద్యోగాలలోఉన్నారు.
అంటే నికరంగా ఉద్యోగాలు తగ్గిపోయాయన్నమాట. దీనిని బట్టి మూడు విషయాలను గ్రహించవచ్చు. మొదటిది: 2020-21లో కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత కోలుకున్న క్రమంలో నమోదైన వృద్ధి అదనపు ఉద్యోగాలను కల్పించే కార్యకలాపాలవలన సాధించినది కాదు. అంటే సంఘటిత రంగంలో సాధించినదాని కన్నా హీనమైన వేతనాలు ఉండే అసంఘటిత రంగంలోనే ఏపాటి ఉద్యోగాల కల్పన అయినా నమోదైందన్నమాట. (ఈ అసంఘటిత రంగం లాక్‌డౌన్‌ కారణంగా అతి ఎక్కువగా దెబ్బతింది. అంతకు ముందు పెద్ద నోట్ల రద్దు వలన కాని, జీఎస్‌టీ అమలు వలన కాని అతి ఎక్కువగా దెబ్బతిన్నది ఈ అసంఘటిత రంగమే). రెండవది: మనుషుల ద్వారా నిర్వహించబడే కార్యకలాపాలలో ఎక్కువ భాగం డిజిటైజేషన్‌ అవుతున్నాయి. అందువలన తక్కువమంది ఉద్యోగులతోనే ఎక్కువ పనులు జరుగుతున్నాయి. ఇది శ్రామిక ఉత్పాదకతను బాగా పెంచుతోంది. అంటే ఉత్పత్తి అవుతున్న సంపద పెరుగుతున్నా, దానిని ఉత్పత్తి చేయడానికి అవసరమైన మానవ వనరులు మాత్రం తగ్గుతున్నాయి. ఇక మూడవది: చాలా రంగాలలో పొదుపు చర్యల పేరుతో గాని, ఉద్యోగులను తగ్గించే పేరుతో గాని లే-ఆఫ్‌లు అమలు కావడం పెరిగింది. దీని ఫలితంగా ఒక్కసారిగా ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతున్నది. ఫిబ్రవరి 2023లో 40కోట్ల 90లక్షల ఉద్యోగాలు ఉంటే, మార్చి 2023లో 40కోట్ల 76లక్షలకు అవి పడిపోయాయి. (ఒక్క నెలలోనే 24లక్షల ఉద్యోగాలు పోయాయి)
జీడీపీని ప్రాథమికంగా లెక్కించే కొత్త పద్ధతిలో సంఘటిత రంగంలో వృద్ధిరేటు ఏ మేరకు ఉందో వ్యవసాయేతర అసంఘటిత రంగంలో కూడా అదే మోతాదులో ఉంటుంది అన్న ప్రాతిపదికను అనుసరిస్తారు. అసంఘటిత రంగానికి సంబంధించిన గణాంకాలు సేకరించడానికి ఎక్కువ సమయం పడుతుంది గనుక సంఘటితరంగం వృద్ధిరేటుతో సమంగా అసంఘటిత రంగం కూడా వృద్ధి చెందుతుంది అని పరిగణిస్తారు. కాని అసంఘటిత రంగం సంఘటితరంగం కన్నా బాగా ఎక్కువగా దెబ్బతింది. ముఖ్యంగా కరోనా కాలంలో తగిలిన దెబ్బ నుండి ఆ రంగం ఇంకా కోలుకోనేలేదు. అటువంటప్పుడు సంఘటిత రంగంలో ఉండే వృద్ధిరేటుతో సమంగా అసంఘటిత రంగంలో కూడా వృద్ధి ఉంటుందనుకోవడం వలన వాస్తవ వృద్ధి కన్నా గణాంకాలలో చూపేది చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ సంఘటిత రంగంలో కూడా ప్రయివేటు కార్పొరేట్‌ రంగంలో ఉన్న కొన్ని లిస్టెడ్‌ కంపెనీల పనితీరును మాత్రమే లెక్కలోకి తీసుకుని తక్కిన కంపెనీలన్నీ అదే తీరుగా పనిచేసివుంటాయని భావించి వృద్ధిరేటు లెక్కిస్తారు. దీని వలన కూడా వాస్తవ వృద్ధి కన్నా ఎక్కువ వృద్ధి ఉన్నట్టు లెక్కల్లో కనిపిస్తుంది. ఈ అతి అంచనాలనే మోడీ ప్రభుత్వం చూపించి ప్రచారం చేసుకుంటోంది.
ఒకవేళ ఈ అంచనాలన్నీ వాస్తవ పరిస్థితినే సూచిస్తున్నాయని కాసేపు అనుకుందాం. అప్పుడు కూడా వస్తూత్పత్తి రంగంలో వృద్ధి కేవలం 1.3శాతం మాత్రమే ఉంది. వ్యవసాయరంగంలో 4శాతం వృద్ధి నమోదైంది. రుతుపవనాలు, వర్షాభావం, వరదలు వగైరా పలు కారణాల వలన వ్యవసాయోత్పత్తిలో వృద్ధి ప్రతీ ఏడు నిలకడగా కొనసాగుతుందని చెప్పలేం. ఇక సేవారంగంలో (ఇందులో వాణిజ్యం, హోటళ్ళు, రవాణా, సమాచార రంగం, ప్రసారసేవలు వంటివి ఉంటాయి) 14శాతం వృద్ధి నమోదైంది. ఈ రంగంలో వేగంగా వృద్ధి జరిగినందున మొత్తం మీద జీడీపీ వృద్ధిరేటు పెరుగుదల కనిపిస్తోంది.
ఈ అంశం కీలకం. వస్తూత్పత్తి రంగంలో, వ్యవసాయ రంగంలో ఉత్పత్తి జరిగే సంపదలోనుంచి వచ్చే అదనపు విలువ మీద సేవారంగం కార్యకలాపాలు ఆధారపడి ఉంటాయి. సేవారంగంలో ఉద్యోగుల నుండి అదనపు విలువ ఏమీ ఉత్పత్తి కాదని ఆడం స్మిత్‌ స్పష్టం చేశాడు. సోషలిస్టు దేశాలలో (సోవియట్‌ యూనియన్‌, తూర్పుయూరప్‌ దేశాలలో సోషలిస్టు వ్యవస్థ ఉండినకాలంలో) సేవారంగాన్ని మినహాయించి జీడీపీ లెక్కించేవారు. ఇప్పటికే ఉత్పత్తి అయిన సంపదను పంపిణీ చేయడమో, ఆ వస్తువుల వినియోగం జరిగే క్రమంలో వాటికి సంబంధించిన సేవలను అందించడమో తప్ప సేవారంగం అదనపు సంపదను దేశానికి జోడించదు. అటువంటి సేవారంగంలో కనపడిన వృద్ధి మొత్తం జీడీపీలో ప్రధానభాగం అయినప్పుడు అందులో సంబరపడవలసినది ఏమీ లేదు.
శ్రామిక ప్రజలు తమ ఆదాయాలను ప్రధానంగా ఆహారరమీద ఖర్చు చేస్తారు. ఆ తర్వాత అసంఘటిత రంగంలో ఉత్పత్తి అయే సరుకులను తమ వినియోగం కోసం కొనడానికి ఖర్చు చేస్తారు. మొత్తం వస్తూత్పత్తి రంగంలోనే వృద్ధి దాదాపు లేదు. అందులో ప్రత్యేకంగా అసంఘటిత రంగంలో పూర్తిగా మాంద్యం నెలకొంది. అంటే శ్రామికవర్గం కొనుగోలుశక్తి ఏమీ పెరగలేదని కనిపిస్తోంది. పైగా ప్రభుత్వ వ్యయం ఈ కాలంలో వాస్తవ విలువలలో ఏమీ పెరగలేదు. స్థూల స్థిరపెట్టుబడిలో పెరుగుదల కనిపిస్తున్న మాటనిజం. కాని వినిమయంలో గాని, ఎగుమతులలో గాని పెరుగుదల లేనప్పుడు పెట్టుబడులు పెట్టడంలో పెరుగుదల కొనసాగుతుందని భావించలేం. జీడీపీ గణాంకాలలో అన్నింటికన్నా ఆందోళన కలిగించే విషయం శ్రామిక ప్రజల వినిమయంలో పెరుగుదల ఏమీ లేకపోవడం. ”ప్రపంచంలోకెల్లా మనదే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ” అని ఎంత గొంతు చించుకున్నా, ఈ చేదు నిజాన్ని పాలకులు కప్పిపుచ్చలేరు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love