ప్రభుత్వ విద్య ప్రజల ఆకాంక్షలవైపు అడుగేసేనా?

కరోనా తదనంతరం ప్రభుత్వ పాఠశాలల్లోఎన్‌రోల్‌మెంటు గణనీయంగా పెరిగింది. పెరిగిన విద్యార్థుల సంఖ్యకనుగుణంగా బోధనా సిబ్బందిని,బోధనా సౌకర్యాలకు సంబంధించి సానుకూల సత్వరచర్యలు తీసుకున్నట్లైతే ఎన్‌రోల్‌మెంట్‌ను నిలుపుకోగలిగే అవకాశం ఉందేది. కానీ పెంచాల్సిన ప్రభుత్వం ఆవైపు దృష్టి కేంద్రీకరించకపోగా కరోనాకు ముందు ఖాళీపోస్టులు సబ్జెక్టు టీచర్ల స్థానంలో, పనిచేస్తున్న 20వేల విద్యావాలంటీర్లను పునర్నియామకం చేయలేదు. కరోనా సమయంలో పెరిగి మళ్ళీ తగ్గిన నమోదును పరిశీలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరగడంపట్ల ప్రభుత్వానికి శ్రద్ధ చూపడంలేదేమోననే సందేహం కలగడం సహజం. రాష్ట్ర వ్యాప్తంగా 5వేల ప్రొఫెసర్లు ఇతర సిబ్బంది ఖాళీలున్నాయంటే ఉన్నత విద్యలో ఉన్నతాన్నేమని
అర్థం చేసుకోగలం. నియామకాల నోటిఫికేషన్‌లకు ఆటంకాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. ఆ ఆటంకాల వెనుకున్న సూత్రధారుల ఆటలు కట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. దానికేమాత్రం వెరవరాదు. విద్యారంగంతోపాటు ప్రభుత్వం నిర్మాణాత్మక విమర్శగా స్వీకరించి పరిష్కార కార్యాచరణను ప్రకటించాలి. అందుకోసం మరో ఉద్యమానికి సైతం పూనుకోవాలి. కావలసిందల్లా విద్యా రంగంపట్ల, పేదప్రజల చదువులపట్ల చిత్తశుద్ధి.
మానవమేధస్సు అమోఘమైనది. ఆ మేధస్సు పరిణితి, ఆలోచనల ఘర్షణల మూలమే మనం చూస్తున్న అనేక ఆవిష్కరణలు. ఆ విధమైన నూతన ఆవిష్కరణలకు, శాస్త్ర సాంకేతిక పురోగమనాకి విద్య చుక్కానిలాంటిది. ఒక దేశం అభివృద్ధి, పౌరుల క్రియాశీల ఆలోచనా స్రవంతిని ఆదేశ విద్యావిధానం నిర్దేశిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈనాడు అనేక దేశాల అభివృద్ధి లేదా వెనుకబాటుతనాన్ని పరిశీలించినప్పుడు ఈ వ్యత్యాసం మనకు స్పష్టంగా గోచరిస్తున్నది. అలాంటి విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికీ సమానమైనదిగా నాణ్యమై నదిగా ఉండాలి. స్వాతంత్య్రం సాధించి 75ఏండ్లు గడిచినా అక్షరాస్యతలో ఇంకా 75శాతానికి చేరువలోనే ఉన్నాం. మహిళా అక్షరాస్యత 65శాతం వద్దే ఉన్నది. దళిత, ఆదివాసి వెనుకబడిన వర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో 50శాతం వద్దే ఆగిపోయింది. ఇదంతా అందరికీ విద్యనందించటంలో పాలకవర్గం నిర్లక్ష్యం ఉదాసీనతయే కారణం. విద్యార్థుల ప్రమాణాలకు సంబంధించి తరచుగా మనకు వినపడే నాణ్యతా విషయాన్ని పరిశీలిస్తే మనం తరచూ ”అంద రికీ సమాన విద్య” అంటున్న మాటల్లో సమానమైన, నాణ్యమైన ఆనేది సమపాళ్ళలో విద్య అందుతుందా? అనేది సంశయమే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించుకున్న తరుణంలో రాష్ట్రంలోని విద్యారంగ స్థితిగతులను పరిశీలిస్తే అనేక విషయాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల విషయాన్ని చూసినప్పుడు అనేక కారణాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. విద్యార్థి సమగ్ర మూర్తిమత్వ ఎదుగుదలకు తోడ్పడే విద్యనందించాల్సిన ప్రభుత్వ పాఠశాలవిద్య అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. ‘ఐఏఎస్‌ కొడుకైనా, అటెండర్‌ కొడుకైనా’ ఒకే విధమైన పాఠశాలలో చదువుకునే విధంగా ‘కేజీ టు పీజీ’ విద్యనందిస్తామన్న వాగ్దానాలను, దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సర్వీసు సమస్యల పరిష్కారంపై ‘అర పేజీలో రాసు కుందాం’ అంటూ ఇచ్చిన హామీల నినాదాలను విద్యా భిమానులేమీ మరువలేదు.
ఉపాధ్యాయుల ఖాళీలు
రాష్ట్రంలోనున్న ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్‌ ఆధ్వర్యంలోని 26,074 పాఠశాలల్లో దాదాపు 20వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఏడేండ్లుగా పదోన్నతులు లేనందున 11వేల పోస్టులు భర్తీకి నోచుకోక ఖాళీగా ఉంటున్నాయి. ఇందులో 2వేలదాకా ఉన్నత పాఠశాలల గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల పోస్టులు. ఇంత పెద్ద మొత్తంలో సబ్జెక్టు టీచర్లు, ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండటం పాఠశాలల అడ్మినిస్ట్రేషన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండడం సహజమే కదా! అర్థ పుష్కరకాలం పైగా పండిట్‌, పిఇటి అప్‌గ్రేడేషన్‌ సమస్య సాగదీయడం విద్యాశాఖకు ఓమచ్చగా మిగిలిపోతున్నది. పరిష్కారమార్గాన్ని పరిశీలించే బదులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులే కోర్టుకు వెళ్ళారంటూ క్లిష్టమైన సమస్యగా చిత్రీకరించి చెప్పుకోవడమే సులభమైన మార్గంగా ఎంచు కోవడమనేది విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లిప్తధోరణి కాక ఏమనుకోవాలి? రాష్ట్రంలోని 33జిల్లాలకుగాను కేవలం 7జిల్లాల్లోనే పూర్తిస్థాయి డీఈఓలు ఉన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడేనాటికున్న 12డీఈఓ పోస్టులకు గాను ఐదుఖాళీగా ఉండగా నూతన జిల్లాలకు మంజూరీ చేయాల్సిన పోస్టులు ఇంతవరకు లేవు. జిల్లాల్లో ఇంఛార్జిలు లేదా పూర్తి అదనపు బాధ్యతలుగా విధులు నిర్వహించే డీఈఓలు ఉన్నారు. కీలకమైన జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉండడం మూలంగా పాఠశాలల గైడెన్స్‌, పర్యవేక్షణకు సంబంధించిన సమగ్రతలో లోటు ఏర్పడుతున్నది. ఉపాధ్యాయుల సీనియారిటీ లిస్టులు, సర్వీసు సమస్యల పరిష్కారానికి సంబంధించిన పరిస్థితులు ఉపాధ్యాయులను అసంతృప్తికి గురి చేస్తున్నాయి. మారిన పరిస్థితుల కనుగుణంగా ఉప విద్యాశాఖాధికారుల అదనపు పోస్టులు మంజూరు చేయాల్సి ఉన్నది. మండల స్థాయిలోనైతే మండల విద్యాధికారులు లేనందువలన పర్యవేక్షణా భారంతో ఒక్కొక్క ఇంఛార్జి యంఈఓ అరడజను మండలాల బాధ్యతలతో నెట్టుకొస్తున్న పరిస్థితి. ఇది ఉపాధ్యాయులపై కూడ అదనపు పనిభారానికి కారణమవుతున్నది. మొత్తం 612మండలాలకుగాను కేవలం 17మండలాలలోనే పూర్తికాలపు యంఈఓలు ఉండటం, పదిహేనేండ్లుగా యంఈఓ పోస్టులు భర్తీకాకపోవడం మూలంగా పాఠశాల విద్యలో కలిగిన ప్రతినష్టాన్ని, లోపాల్ని అసర్‌-2022 నివేదిక తేటతెల్లం చేసింది.
విద్యార్థుల ఎన్‌రోల్‌మెంటు
కరోనా తదనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంటు గణనీయంగా పెరిగింది. పెరిగిన విద్యార్థుల సంఖ్యకనుగుణంగా బోధనా సిబ్బందిని, బోధనా సౌకర్యాలకు సంబంధించి సానుకూల సత్వర చర్యలు తీసుకున్నట్లైతే ఎన్‌రోల్‌మెంట్‌ను నిలుపుకోగలిగే అవకాశం ఉందేది. కానీ పెంచాల్సిన ప్రభుత్వం ఆవైపు దృష్టి కేంద్రీకరించకపోగా కరోనాకు ముందు ఖాళీపోస్టులు సబ్జెక్టు టీచర్ల స్థానంలో, పనిచేస్తున్న 20వేల విద్యావాలంటీర్లను పునర్నియామకం చేయలేదు. కరోనా సమయంలో పెరిగి మళ్ళీ తగ్గిన నమోదును పరిశీలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరగడంపట్ల ప్రభుత్వానికి శ్రద్ధ చూపడంలేదేమోననే సందేహం కలగడం సహజం. తగినంతమంది టీచర్లు లేకపోవడం, మౌలిక వసతుల లేమి లాంటి కారణాలు ఎన్‌రోల్‌మెంటు తగ్గడానికి కారణమవుతున్నాయి. ఎన్‌రోల్‌మెంటు సమస్య విద్యా ప్రమాణాల సంక్షోభానికి కారణమవుతున్నది. గత విద్యాసంవత్సరం ఎన్‌రోల్‌ మెంటును గమనిస్తే మొత్తం 18235 ప్రాథమిక పాఠశాలలో 1290 ప్రాథమిక పాఠశాలల్లో సున్నా ఎన్‌రోల్‌మెంటు నమోదైంది. 10మంది వరకు విద్యార్థులున్న పాఠశాలలు 1415 ఉండగా 20వరకు విద్యార్థులున్న పాఠశాలలు 4031 ఉన్నాయి. 100మందికి పైబడి విద్యార్థులున్న పాఠశాలలు 2,500 ఉన్నాయి. తక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఇద్దరు, ముగ్గురు టీచర్లు సరిపోతారనుకున్నా బోధన మాత్రం ఐదు తరగతులకు, అన్ని సబ్జెక్టులకు జరగాల్సిందే కదా! మొత్తం ప్రాథమిక పాఠశాలల్లో 1686ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే తరగతికొక్క ఉపాధ్యాయుని చొప్పున ఐదుగురు ఉన్నారు. ఇక ఉన్నత పాఠశాలల విషయానికొస్తే 100 అంతకు తక్కువ విద్యార్థులున్న పాఠశాలలు 1500 దాకా ఉన్నాయి. 800 ఉన్నత పాఠశాలల్లో 300కు మించి విద్యార్థులున్నారు. ఇందులో వేయికిపైగా విద్యార్థులున్న పాఠశాలలున్నాయి. వీటిలో ఫిజికల్‌ డైరెక్టర్‌, ఆర్స్‌, డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌ పోస్టులు మచ్చుకు కూడా కానరావు. ఈ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించాలంటే సరిపడా సబ్జెక్టు టీచర్లు, వసతులు ఉండాలి. అప్పుడే ఈ విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. నాలుగున్నర వేలకుపైగా ఉన్న మొత్తం ఉన్నత పాఠశాలల్లో రెండున్నర వేల పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులు పదోన్నతులులేని కారణంగా ఖాళీగా ఉన్నాయి. మరో 300కుపైగా పాఠశాలలకు పోస్టులు మంజూరు చేయాల్సి ఉన్నది. ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాలల్లో నియామకాల ప్రక్రియ లేనందువలన మూతపడుతున్నవి.
మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
ప్రభుత్వ పాఠశాలల మౌలిక స్థితిగతులను సంపూర్ణంగా మార్చి అభివృద్ధి చేసే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రకటించిన మన ఊరు-మనబడి, మన బస్తీ-మన బడి కార్యక్రమం స్వాగతించదగిందే. నిర్ణీతకాల వ్యవధిలో పాఠశాలలకు సంబంధించి ఈ పనులన్నీ పూర్తయ్యేవిధంగా ప్రభుత్వం చర్యతీసుకోవడం అత్యంత ఆవశ్యం. ప్రభుత్వం చిత్త శుద్ధితో ఇవన్నీ అమలు చేసినప్పుడు ఉపాధ్యాయులు, సంఘాలు తప్పని సరిగా సానుకూల దృక్పథంతోనే వాటిని వినియోగించుకుంటారు. ఎటొచ్చీ ఇది ప్రచార కార్యక్రమంగా ఉండకూడదనేదే ఉపాధ్యాయుల ఆలోచన. అలాగే ముఖ్యమైన అంశం ఏంటంటే బోధనలో ఉపాధ్యాయునితోపాటు పాఠ్యపుస్తకాలు కీలకం. ఇవి సకాలంలో విద్యార్థికి అందాలి. గత విద్యాసంవత్సరం రెండు నెలల ఆలస్యం మూలంగా రకరకాల కార్యక్రమాలు సృష్టించి నెట్టుకొచ్చిన పరిస్థితిని చూశాం. ఈ విద్యాసంవత్సరం విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు ఉచితంగా అందజేస్తామన్న ప్రభుత్వం నిర్ణయం అభినందనీయం. వీటితోపాటు ఏకరూప దుస్తులు సకాలంలో విద్యార్థులకు అందేవిధంగా తగు ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం చాలా ప్రధానం మధ్యాహ్న భోజనం మరింత పౌష్టికరమైన ఆహారంగా ఉండేందుకు అవసరమైన నిధులను పెంచాలి. దీంతో ప్రభుత్వ పాఠశాల లన్నింటిలో అల్పాహారం అందించాలి. పేద విద్యార్థు లందరూ బడికి వచ్చేవిధంగా ఈ చర్యలు తోడ్పడతాయి. డ్రాప్‌ అవుట్స్‌ సమస్య గణనీయంగా తగ్గుతుంది.
ఉన్నతవిద్యపై దృష్టి అవసరం
కేజీ టు పీజీ అమలులో భాగంగా ఏర్పాటు చేశామంటున్న గురుకులాల సంఖ్యను పెంచడంతోపాటు ఆ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలి. విద్యారంగంలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, చుట్టం టీచర్‌ లాంటివి శోభనిచ్చే పదాలు కావు. శాస్త్ర, సాంకేతిక రంగం కొత్తపుంతలు తొక్కుతున్న క్రమంలో, సమాజం లోని సమకాలీన పరిణామాలలో ఉన్నత విద్యారంగానిది కీలకపాత్ర. నూతన ఆవిష్కరణ లకు విశ్వవిద్యాలయాలు నిలయాలుగా మారాలి. సమాజపరిణామ క్రమానికి దిశానిర్దేశం చేసే ఆలోచనా స్రవంతికి పుట్టి నిల్లుగా ఉండాలి. అందుకు నిరంతర అధ్యయన, పరిశోధనల కవసరమైన ఏర్పాట్లు అధ్యాపకులు విశ్వ విద్యాలయాల కవసరం. కానీ నేడు దశబ్దాల తరబడి ప్రొఫెసర్లు, లెక్చరర్ల ఖాళీలతో జూనియర్‌, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు వెలవెల పోతున్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లతో కాలం గడుస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 5వేల ప్రొఫెసర్లు ఇతర సిబ్బంది ఖాళీలున్నాయంటే ఉన్నత విద్యలో ఉన్నతాన్నేమని అర్థం చేసుకోగలం. నియామకాల నోటిఫికేషన్‌లకు ఆటంకాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. ఆ ఆటంకాల వెనుకున్న సూత్రధారుల ఆటలు కట్టించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. దానికేమాత్రం వెరవరాదు. విద్యారంగంతోపాటు ప్రభుత్వం నిర్మాణాత్మక విమర్శగా స్వీకరించి పరిష్కార కార్యాచరణను ప్రకటించాలి. అందుకోసం మరో ఉద్యమానికి సైతం పూనుకోవాలి. కావలసిందల్లా విద్యా రంగంపట్ల, పేద ప్రజల చదువులపట్ల చిత్తశుద్ధి. తద్వారా విద్యా భిమానులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, యువ కులందరూ ఒక్షే లక్ష్యంతో భవిష్యత్తుకు బాటలు వేసే విద్యారంగాన్ని కాపాడుకోవడం కష్టమైన పనేమి కాదు. ఇదే దశాబ్ది ఉత్సవాల లక్ష్యం కావాలి.
పి. మాణిక్‌ రెడ్డి
సెల్‌:9440064276

Spread the love