ఈ ప్లాస్టిక్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది అభివృద్ధి చెందిన దేశాలే ‘పర్యావరణ సంక్షోభానికి కారకులూ వాళ్లే. అంటే పెట్టుబడిదారీ విధానమే దీనికి కారణం. ఎందుకంటే మితిమీరిన పారిశ్రామిక సరుకుల ఉత్పత్తి ద్వారా అత్యధిక లాభాలు సంపాదించడమే వారి లక్ష్యం. లాభాలు కోసం వారు ఎంతకైనా తెగిస్తారు. అవసరాల కోసం కాక లాభాల కోసమే ఉత్పత్తి చేస్తారు’ అని మార్క్స్ ఏనాడో చెప్పారు. అయితే ప్రజల్లో చైతన్యం రావాలి. కాలుష్య కారక విధానాలను ప్రతిఘటించాలి. ప్రతి ఒక్కరూ పూనుకుంటే కాలుష్యాన్ని నివారించవచ్చు. భద్రమైన భూమినిభావితరానికి అందించవచ్చు.
పిల్లల గురించి ఆలోచించటమంటే… వారికెంత ఆస్తులు కూడబెట్టి ఇస్తున్నామో అని లెక్కేసుకోవడమేనా! మన తరువాతి తరానికి ఎలాంటి భవిష్యత్తును అందిస్తున్నామో, ఎలాంటి భూమిని కానుకగా ఇస్తున్నామో, ఎంత స్వచ్ఛమైన వాతావరణాన్ని కానుక చేశాము! ఇప్పుడన్నా ఓ క్షణం ఆలోచన చేస్తున్నామా! ‘మెండైన బ్రాహ్మణుడు మెట్టభూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే’ అని అన్నమయ్య అన్నట్టు. నేలపైన, పుట్‌పాత్‌పైన జీవితం కొనసాగించే పేదకూ, అద్దాల అంతస్తుల్లో పెరిగే వాడికీ ఇదొక్కటే భూమి. ఆవరణమూ ఇదే. మన భావితరానికి దీన్నెలా అందిస్తున్నాము. భద్రంగా ఉందానేలా, నీరూ, గాలీ! ఎంత భయంకరంగా ఈ భూమిని, ఆవరణాన్ని మార్చేసామో వివరాలు తెలుసుకుంటే మనకు మనమే వణికిపోతాము. టీవీల్లో, సెల్లుల్లో సుందరమైన దృశ్యాలను, స్వచ్ఛమైన నీలపురంగులోని నీటి ప్రవాహాలను, రంగు రంగుల పూల అందాలను, హాయిగా గాలి ఊయల ఊపుతున్న చిత్రాలను చూసి మన ఆవరణమంతా ఎంత స్వచ్ఛంగా ఉందోనని భ్రమపడుతున్న మనకు పర్యావరణ అధ్యయన నివేదిక భయం గొల్పుతుంది.
ఇటీవలనే జూన్ 5 పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఈసారి ప్లాస్టిక్ కాలుష్యాన్ని గురించి, దాని నిరోధించడం ఎలాగనో చర్చించారు. ”బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్” అనే నినాదాన్నీ ఇచ్చారు. 150 దేశాలకు పైగా ఈ పిలుపునిచ్చాయి. ఎందుకంటే ”ఇందు కలడందు లేడను సందేహంబు’ లేకుండా ప్లాస్టిక్ ఎందెందు వెదికినా అందందు కలదని తేల్చి చెప్పారు పరిశోధకులు. సూక్ష్మమైన ప్లాస్టిక్ పదార్థాలు మన ఊపిరితిత్తుల్లోను, కిడ్నీల్లోను, రక్తంలోనూ, తల్లిపాలల్లోనూ ఉన్నట్టు సైంటిస్టులు కనుగొని వెల్లడించారు. అంతేకాదు, మనం తినే తిండిలో, తాగే నీటిలో, ముఖ్యంగా బాటిల్ నీళ్లల్లో, పీల్చే గాలిలోనూ సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థం విస్తరించిందని తేల్చేశారు. నదులు, సముద్రాలు కాలుష్యంతో నిండిపోయాయని, ఇది జీవావరణానికి పెనుముప్పుగా మారనుందని వారు హెచ్చరించారు. గత యాభైయేండ్ల క్రితం ప్లాస్టిక్ వాడకం ఇంతలా లేదు. మా చిన్నతనంలోనయితే ప్లాస్టిక్ వస్తువులను చాలా అరుదుగా వాడేవాళ్లము. ఇప్పుడు ప్లాస్టిక్ విప్లవమే వచ్చింది. ఏ వస్తువు చూసినా ప్లాస్టికే. గుడ్డసంచుల అలవాటే పోయింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 430 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో మూడింట రెండు వంతులు వ్యర్థాలుగా మారుతున్నాయి. ఈ వ్యర్థాలన్నీ సముద్రాలలోకి, మానవ ఆహార గొలుసులోకి ప్రవేశిస్తున్నాయని, 2060 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాలు మూడురెట్లు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం 80లక్షల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. మనమిప్పుడు వైజాగ్ సముద్రతీరంలో నిలబడి సముద్ర అలలను చూస్తూవుంటే గవ్వలు, ఆల్చిప్పలు, శంఖాలు తీరానికి వచ్చి ఇసుకతిన్నెల్లో మెరవవు, ఇప్పుడన్నీ ప్లాస్టిక్ బ్యాగులు, కవర్లు దర్శనమిస్తాయి. సముద్రాల్లో, నదుల్లో ఉండే జీవాలన్నీ కలుషితమైపోతున్నాయి. జీవావరణానికి పెద్ద ముప్పు వీటివల్ల కలుగుతోంది.
ప్లాస్టిక్ కాలుష్యంతో ‘ప్లాస్టికోసిన్’ అనే వ్యాధి వస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ వ్యాధిని మొదట పక్షుల్లో కనుగొన్నారు. దీనివల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మితిమీరిన ప్లాస్టిక్ వాడకంతో భూమి, గాలి, నీరు, పర్యావరణం కలుషితమై విషవాయువులు వ్యాపించడంలో ఉష్ణోగ్రత పెరిగి గ్లోబల్ వార్మింగ్ జరిగి ధృవాల వద్ద మంచు పర్వతాలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో కొన్ని దీవులే కనుమరుగువుతున్నాయి. అనేకమైన జీవజాతులు అంతరించాయి. మానవ మనుగడకు పెద్ద ముప్పు పొంచివున్నది. చర్మవ్యాధులు, ఊపిరి తిత్తుల క్యాన్సర్, జీర్ణకోశవ్యాధులు విపరీతంగా ప్రబలే ప్రమాదముంది.
అయితే ప్లాస్టిక్ ఉత్పత్తిని, వాడకాన్ని తగ్గించుకోవాలి. ఇందుకు రీసైక్లింగ్ పెరగాలి. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న దాంట్లో కేవలం 9శాతం మాత్రమే రీసైక్లింగ్ జరుగుతోంది. మిగతాది వ్యర్థంగా మిగులుతోంది. ఒక అరటిపండు తొక్క భూమిలో కలిసిపోవటానికి 27రోజులు పడుతుంది. కానీ ఒక ప్లాస్టిక్ బ్యాగు భూమిలో కలిసిపోవటానికి వందలయేండ్లు పండుతుంది. ఈ ప్లాస్టిక్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నది అభివృద్ధి చెందిన దేశాలే. ‘పర్యావరణ సంక్షోభానికి కారకులూ వాళ్లే. అంటే పెట్టుబడిదారీ విధానమే దీనికి కారణం. ఎందుకంటే మితిమీరిన పారిశ్రామిక సరుకుల ఉత్పత్తి ద్వారా అత్యధిక లాభాలు సంపాదించడమే వారి లక్ష్యం. లాభాలు కోసం వారు ఎంతకైనా తెగిస్తారు. అవసరాల కోసం కాక లాభాల కోసమే ఉత్పత్తి చేస్తారు’ అని మార్క్స్ ఏనాడో చెప్పారు. అయితే ప్రజల్లో చైతన్యం రావాలి. కాలుష్య కారక విధానాలను ప్రతిఘటించాలి. ప్రతి ఒక్కరూ పూనుకుంటే కాలుష్యాన్ని నివారించవచ్చు. భద్రమైన భూమిని భావితరానికి అందించవచ్చు.