సెం’గోల’

”సింగోల్‌ ప్రతిష్టించినప్పటి నుండి దేశంలో పరిస్థితులు అల్లకల్లోలంగా తయారయ్యాయి! మహిళా రైజర్లు చేస్తున్న పోరాటానికి అంతర్జాతీయ రైజర్ల సంఘం మద్దతు ప్రకటించింది. అంటే అంతర్జాతీయంగా మన దేశ పరువు పోయింది. మరో విషయం ఏమిటంటే, పెద్దాయన నల్లధనాన్ని అరికట్టడానికి ప్రవేశపెట్టిన రెండువేల రూపాయల నోటును ఆర్‌బిఐ వారు రద్దు చేశారు. అటు నల్లధనం బయటకు రాలేదు! రెండు వేల నోటులోని చిప్‌ పనిచేయనందునే నల్లధనం బయటకురాలేదని, మన వేదాల్లోని టెక్నాలజీలో ఏదో లోపం ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయట.
సాయంత్రం ఆరున్నర కావస్తోంది! కాని భర్త ఇంకా రాలేదు. వాణి గేటు వద్ద నిల్చుని ఎదురు చూస్తోంది. భర్త రాలేదు. కాని ఆడుకోవటానికి బయటకి వెళ్ళిన నానిగాడు వచ్చేశాడు.
”ఏంటి మమ్మీ నాన్న ఇంకా రాలేదా?” అడిగాడు నాని. ”అవునా! రోజూ ఈపాటికే వచ్చేవారు! ఈ రోజు బాగా లేటయ్యింది! నీవుమొహం కడుక్కో! తినటానికి ఏదైనా పెడతాను” అంటూ కొడుకును పంపి తానూ ఇంట్లోకి వెళ్ళింది. వాని లోపలికి వెళ్ళగానే గేటు వద్ద చప్పుడైంది. వాణి, నానీ ఇద్దరూ బయటకి వచ్చారు.
ఆటోలో నుండి ఏదో తీస్తున్నాడు డ్రైవర్‌! ”మెల్లిగా తీయి! అది ఎంతో విలువైంది! జాగ్రత్త” అంటున్నాడు సురేష్‌. పొడుగ్గా ఉన్న సన్నటి డబ్బాను జాగ్రత్తగా బయటకు తీసి సురేష్‌ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు డ్రైవర్‌.
ఆ డబ్బాను కళ్ళకద్దుకుంటూ తీసుకెళ్ళి దేవుడి గదిలో పెట్టాడు సురేష్‌. వాణి, నానీ ఆశ్చర్యంగా అనుసరించారు.
”ఏంటది?” ఒకేసారి అడిగారు తల్లీ కొడుకులు.
”అది బింగోల్‌!” గొప్పగా చెప్పాడు సురేష్‌.
”బింగోలా?” అంటేఏమిటీ? ”మళ్ళీ అడిగారు తల్లీ కొడుకులు.
”మొన్న పార్లమెంటులో మా పెద్దాయన, స్వాములు వెంటరాగా తీసుకెళ్ళి ప్రతిష్టించి దేశ గౌరవాన్ని ప్రపంచంలో ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాడు. అదేంటో తెలుసా?” ఛాతి గర్వంతో ఉప్పొంగు తుండగా ప్రశ్నించాడు సురేష్‌. వాణీ ఆశ్చర్యంగా చూస్తోంది!
”నాకు తెలుసు! అది సెంగోల్‌!” అన్నాడు నాని గట్టిగా. ”చూశావా నా కొడుకు తెలివితేటలు! వాడికి అన్నీ నా తెలివి తేటలే అబ్బాయి” మరింత గర్వంగా అన్నాడు సురేష్‌. సురేష్‌ గర్వపడుతున్న కొద్దీ ఛాతి ఉప్పొంగుతూనే ఉంది. దాంతో షర్ట్‌ గుండీ ఒకటి తెగిపోయింది.
”నాన్న ఛాతి 56 ఇంచుల దాకా పెరిగినట్లుంది” అన్నాడు నానిగాడు ఆశ్చర్యంగా.
”నోర్మురు! 56 ఇంచుల ఛాతి మా పెద్దాయనకు తప్ప ప్రపంచంలో మరెవ్వరికీ ఉండటానికి వీల్లేదు. ఆయన భక్తుడిని కాబట్టి నాకు ఓ నాలుగించులు తక్కువే ఉంటుంది” అన్నాడు సురేష్‌.
చాలించండి మీ వెధవ ఛాతి గోల. 56 ఇంచుల ఛాతి పెట్టుకుని మీ పెద్దాయన అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా వాడు రోడ్లేస్తుంటే ఆపలేకపోతున్నాడు. 52 ఇంచుల ఛాతి పెట్టుకుని మీరేమో రాత్రిపూట కరెంటు లేకపోతే గేటుకూడా దాటరు అంది వాని విసురుగా.
సురేష్‌ ఏదో చెప్పబోయాడు.
”అది సరేగాని, ఇంట్లో తెచ్చిన డబ్బా సంగతి ఏమిటి? ఆ డబ్బాలో ఏముంది.” ప్రశ్నించింది వాణి.
”ఇందాక చెప్పాను కదా! పార్లమెంటులో ‘సెంగోల్‌” అని ఒక రాజదండాన్ని పెద్దాయన ప్రతిష్టించాడు కదా! ఆ సెంగోల్‌ తయారు చేసిన తమిళనాడు మఠం దగ్గర నుండే దీన్ని తెప్పించాను. దీనిపేరు ”చింగోల్‌” అంటె చిన్న సింగోల్‌ అన్న మాట!” అన్నాడు సురేష్‌ మళ్ళీ గర్వపడుతూ. ఈ సారి షర్టు యొక్క రెండో గుండీ కూడా ఫట్‌ మని తెగిపోయింది.
”చిన్న సెంగోల్‌ను, చింగోల్‌ అంటారా. మరి ఇక్కడ చిన్న పార్లమెంటు లేదు కదా? ఇక్కడికెందుకు తెచ్చారు? అనుమానంగా అడిగింది వాణి.
”మన ఇంట్లో ప్రతిష్టించటానికి రేపు దివ్యమైన ముహూర్తం ఉంది! అందువల్ల రేపే మన ఇంట్లో చింగోల్‌ను ప్రతిష్టించాలి. తమిళనాడు నుండి ఒక అయ్యగారు కూడా వస్తారు. శాస్త్రోక్తంగా పూజలు, పునస్కారాలు జరిపి, ఈ బింగోల్‌ను మన ఇంట్లో ప్రతిష్టించిన తర్వాత నేను ఆ గౌరవనీయ చింగోల్‌కు సష్టాంగ నమస్కారాలు చేస్తాను. దాంతో అధికార మార్పిడి పూర్తి అవుతుంది!” అన్నాడు సురేష్‌ ఎంతో ఉత్సాహంగా.
”రేపు ముహూర్తాలు ఏవీ లేనట్టు గుర్తు. కానీ మీరేమో మంచి ముహూర్తం అంటున్నారు! ఎలాగబ్బా!” అంటూ ఆలోచనలో పడింది వాణీ.
”నాకు తెలుసు మమ్మీ! రేపు వచ్చే తేదీనే వీరసావర్కర్‌ తనకు క్షమాభిక్ష పెట్టి అండమాన్‌ జైలు నుండి విడుదల చేస్తే, తాను స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన బోనని, బ్రిటిష్‌ వాడికి పత్రం రాసిన రోజు. అందుకే నాన్న దాన్ని గొప్ప ముహూర్తం అన్నాడేమో?” అన్నాడు నానిగాడు.
వాణి కిలకిలా నవ్వింది. ”చూశారా మీ అబ్బాయి! అన్నీ మీ తెలివితేటలే!” అన్నది.
సురేష్‌కి షర్టు ఒక్కసారిగా వదులుగా అయిపోయింది! మళ్ళీ కొత్తగా అధికార మార్పిడి అంటున్నారేమిటీ! కొంపతీసి మీ పేరున ఉన్న ఈ ఇల్లు నా పేరిట రాస్తారా ఏమిటి?” అన్నది వాణి నవ్వుతూ.
”ఆడవాళ్ళు అధికారానికి, అధికార కార్యక్రమాలకు అనర్హులు. అందుకే పార్లమెంటు ప్రారంభోత్సవానికి ముర్మును పిలవలేదు. అలాంటిది ఈ ఇంటిని నీ పేరిట ఎట్లా రాస్తాననుకున్నావు? ఈ ఇల్లు కొన్న తర్వాత శాస్త్రోక్తంగా అధికార మార్పిడి జరగలేదు కదా! అందుకే ఈ ఏర్పాటు!” అన్నాడు సురేష్‌.
”ఇల్లు కొని పదేళ్ళు అవుతుంది! చక్కగా సంసారం చేసుకుంటున్నాము. మన అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా నానిగాడు కూడా ఉన్నాడు కదా! ఇప్పుడీ చింగోల్‌ గొడవ ఏమిటండీ? కొంపతీసి ఇల్లు ఎవరికైనా డబుల్‌ రిజిస్ట్రేషన్‌ అయ్యిందా ఏమిటి?” అన్నది ఆందోళనగా వాణి.
”లేదు! రిజిస్ట్రేషన్‌ సమస్యలేవీ లేవు! పెద్దాయన చేశాడు కదా! నేనూ నా స్థాయిలో చేయాలని నిర్ణయించు కున్నాను” అన్నాడు సురేష్‌.
”బాగుంది మీ వరస! పెద్దాయనకు అధికారం ఉంది. ఏదైనా చేస్తాడు. ఆయన 6లక్షల రూపాయల రేబాన్‌ కళ్ళద్దాలు పెట్టుకుంటాడు. మీరు వెయ్యి రూపాయల కళ్ళద్దాలు కూడా పెట్టుకునేందుకు మీ జీతం సహకరించదు! పెద్దాయనతో మీరు పోల్చుకోకండి” అనునయంగా చెప్పింది వాణి.
”లేదు! బింగోల్‌ ప్రతిష్టించాల్సిందే!” పట్టుపట్టాడు సురేష్‌.
”పెద్దాయన్ను అనుసరించాలనే తాపత్రయంలో మీరు సింగోల్‌ యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకోవటం లేదు!” అన్నది వాణి.
ఏమిటన్నట్లు చూశాడు సురేష్‌.
”సింగోల్‌ ప్రతిష్టించినప్పటి నుండి దేశంలో పరిస్థితులు అల్లకల్లోలంగా తయారయ్యాయి! మహిళా రైజర్లు చేస్తున్న పోరాటానికి అంతర్జాతీయ రైజర్ల సంఘం మద్దతు ప్రకటించింది. అంటే అంతర్జాతీయంగా మన దేశ పరువు పోయింది. మరో విషయం ఏమిటంటే, పెద్దాయన నల్లధనాన్ని అరికట్టడానికి ప్రవేశపెట్టిన రెండువేల రూపాయల నోటును ఆర్‌బిఐ వారు రద్దు చేశారు. అటు నల్లధనం బయటకు రాలేదు! రెండు వేల నోటులోని చిప్‌ పనిచేయనందునే నల్లధనం బయటకురాలేదని, మన వేదాల్లోని టెక్నాలజీలో ఏదో లోపం ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయట. పెద్దాయన తెచ్చిన రెండువేల నోటుని ఆఫ్టరాల్‌ ఆర్‌బిఐ తీసేయటమంటే పెద్దాయన పరువే పోయినట్లుందని, అమెరికా కూడా అనుకుంటున్నదంట! అన్నింటికి మించి సింగోల్‌ వచ్చిన తర్వాతనే ఒడిసా ఘోర రైలు ప్రమాదం జరిగిందని, సెంగోల్‌ మన దేశానికి అచ్చిరాదని అనుకుంటున్నారంట! అందుకే మన ఇంట్లో బింగోల్‌ వద్దండీ… అంటూ ప్రాధేయపడింది వాణి.
– ఉషాకిరణ్‌

Spread the love