రైతులకు ఎలాంటి కష్టమూ రానివ్వం

– జిల్లా భూములను గోదావరి జలాలతో తడుపుతాం
– రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ..కిసాన్‌ కాంగ్రెస్‌ సమ్మేళనంలో మంత్రి తుమ్మల
– ప్రజా సేవ చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి
– కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి
నవతెలంగాణ-ఖమ్మం
రాష్ట్రంలోని రైతులెవరికీ కష్టం రానివ్వబోమని, అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్‌ పాలన ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం నగరంలోని కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయంలో కిసాన్‌ కాంగ్రెస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందరోజుల పాలనలో ఎంతో చేశామని, ఎన్నికల అనంతరం అభివృద్ధిని నిర్విరామంగా కొనసాగిస్తామని అన్నారు. రైతు దిగాలుగా ఉండకూడదని బీమా సదుపాయం కల్పించామని, తడిసిన ధాన్యాన్ని కొని అండగా నిలుస్తామని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల తర్వాత అధిక ప్రాధాన్యత ఇచ్చి..అన్ని రకాలుగా ఆదుకుంటామని అన్నారు. సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందజేస్తామని, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మాదిరిగా లోపాలు జరగకుండా పర్యవేక్షిస్తామని తెలిపారు. పామాయిల్‌ పంటను ప్రోత్సహించి.. అధిక లాభాలు పొందేలా చూస్తామన్నారు. వైరా, లంకా సాగర్‌ ప్రాజెక్టులను గోదావరి జలాలతో నింపుదామని, జిల్లా సాగుభూములు అన్నింటిని తడుపుతామని అన్నారు. సమయం తక్కువగా ఉంది మిత్రులారా.. అంతా గ్రామ గ్రామాన ముమ్మర ప్రచారం చేసి, రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. కాంగ్రెస్‌ లోక్‌ సభ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవ కోసమే వచ్చానని, జిల్లా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎంపీగా పోటీ చేస్తున్నానని, అందరూ ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, రాజ్యసభ సభ్యురాలి పర్యవేక్షణలో పనిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్‌ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, టీపీసీసీ నేత మద్ది శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య, కాంగ్రెస్‌ నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love