‘అప్రకటిత’ ఎమర్జెన్సీపై ఐక్యపోరాటం

ప్రజాస్వామ్యంలో పొత్తులు సర్దుబాట్లు అపరాధమో,అవమానమో కాదు. కాకుంటే భావసారూప్యత ప్రజాస్వామ్య ప్రయోజనాలు ఉమ్మడి ప్రమాదంపై అవగాహన ఉండాలి. ఆ మాటకొస్తే మోడీ ప్రభుత్వం కూడా పొత్తులు లేకుండా పోటీ చేసి ఏర్పడిందా? ఒంటరిగా మెజార్టీ ఉండొచ్చు గాని ఎన్నికలు కలిసే పోరాడింది కదా! గుజరాత్‌ యూపీ వంటివాటిని మినహాయిస్తే మరెక్కడా బీజేపీ కేవలం తన బలంతోనే గెలిచింది లేదు. ఫిరాయింపులు మిశ్రమ కూటములతోనే పాలిస్తున్నది. పరోక్షంగానూ ఒత్తిళ్లతో, ప్రలోభాలతో, బెదిరింపులతో కొన్నిపార్టీలను లోబర్చుకున్నది. ఈ అక్రమ పొత్తులకన్నా సూటిగా, రాజకీయంగా అవగాహనకు రావడం రాజ్యాంగ బద్దం. రెండు కారణాల వల్ల ఈ సమావేశాలు లౌకిక పక్షాల అవగాహన త్వరితంగా పూర్తి కావలసి ఉంది. లోక్‌సభకు ఎన్నికలు ముందుగా రావచ్చని బీజేపీ కావాలనే సంకేతాలిస్తున్నది. నిజంగా వచ్చేట్టయితే సిద్ధం కావలసి ఉంటుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముందే అవగాహన ఉందన్న సంకేతాలు స్పష్టం చేస్తేనే ఫలితాల తర్వాత కలసి వ్యవహరించే చట్టబద్ద అనుకూలత ఉంటుంది. ఎందుకంటే పూర్తి మెజార్టీ గల పార్టీ లేదా ఎన్నికలు ముందు ఏర్పడిన కూటమికి మొదటి అవకాశం, ఎన్నికల తర్వాత ఏర్పడినా పూర్తి మెజార్టీ గల కూటమి ఈ క్రమంలో అవకాశం ఇవ్వాలని గతంలో కొన్ని స్థూలమైన సూచనలు వచ్చాయి.
పాట్నాలో జయప్రదంగా ముగిసిన 17 ప్రతిపక్షాల శిఖరాగ్ర సమావేశం దేశ రాజకీయాల్లో అందులోనూ లోక్‌సభ ఎన్నికల ముంగిట్లో కీలక ఘటన అని చెప్పొచ్చు. దీని కొనసాగింపుగా సిమ్లాలో తదుపరి సమావేశం జరపాలని కూడా హాజరైన నేతలు నిర్ణయించారు. అంటే ఈ ప్రక్రియను కొనసాగించాలని కూడా వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. 450 నియోజకవర్గాలలో బీజేపీకి వ్యతిరేకంగా ఒకే అభ్యర్థిని ప్రతిపక్షాల తరపున నిలబెట్టాలని భావిస్తున్నట్టు సమావేశానికి ముందు వార్తలు వచ్చాయి. వివిధ రాష్ట్రాలలో పోటీలు ఎలా ఉంటాయనే అంశాన్ని వచ్చే సమావేశంలో చర్చించాలని కూడా అంగీకారానికి వచ్చాయి. బీజేపీ తర్వాత పెద్దపార్టీగా ఉన్న కాంగ్రెస్‌ నుంచి రాష్ట్రాలను పాలించే ప్రాంతీయ పార్టీల వరకూ ఈ సమావేశానికి హాజరైనాయి. ముగ్గురు ముఖ్యమంత్రులు స్వయంగా పాల్గొనగా కాంగ్రెస్‌ సీపీఐ(ఎం) అగ్రనేతలు హాజరవడంతో దేశంలో దాదాపు గణనీయమైన భూభాగానికి రాజకీయ బలానికి ప్రాతినిధ్యం లభించినట్లయింది. అలా అని హడావుడిగా ఏదో ఒక ప్రకటన చేసి ప్రచారంలో పెట్టడం గాక హాజరైన పార్టీలు తమ తమ అభిప్రాయాలు సూటిగా చెప్పడం ఆచరణయోగ్యం కాని అభిప్రాయాలను ముందే తోసిపుచ్చడం మంచి విషయమే. ఉదాహరణకు కాంగ్రెస్‌ పెద్దన్న పాత్ర వహించాలనే కొందరిమాట లేదంటే ఎక్కడ ఎవరు బలంగా ఉంటే వారి మాట అందరూ వినాలనే వాదన ఇక్కడ రాలేదు. బీజేపీ కాంగ్రెస్‌లను ఒకేగాట కట్టే ధోరణి కూడా కనిపించలేదు. అదే సమయంలో కాంగ్రెస్‌ పట్ల తమకున్న అభ్యంతరాలనూ మిగిలిన పార్టీలు దాచిపెట్టుకోలేదు. ఏది ఏమైనా మతతత్వ రాజకీయాలు రాష్ట్రాలపై దాడి జాతీయ రాజ్యాంగ సంస్థల దుర్వినియోగంతో విపక్షాలపై దాడి, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ వంటి అంశాలు కీలకమనే అవగాహన అక్కడ ద్యోతకమవడం హర్షనీయం.
బీహార్‌ ఉద్యమం-ఎమర్జెన్సీ
ఇప్పటి సమావేశాన్ని కాస్సేపు పక్కనపెట్టి గత చరిత్రలోకి తొంగిచూస్తే బీహార్‌ రాజధాని పాట్నా లేదా పాతకాలపు పాటలీపుత్ర ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటాన్ని గుర్తు చేస్తుంది. యాభైఏళ్ల కిందట జయప్రకాశ్‌ నారాయణ్‌ నాయకత్వంలో ఇక్కడే ప్రతిపక్షాల ఐక్యపోరాటం మొదలవడం, అది విస్తరించినకొద్ది ప్రతిస్పందనగా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం ప్రజాస్వామ్య చరిత్రలో ఒక పీడకల. పౌరహక్కులు కాలరాసి, ప్రభుత్వాలను కూలదోసి పత్రికలపై సెన్సార్‌షిప్‌ విధించి ప్రతిపక్ష నాయకులను ఖైదుచేసిన ఆ రోజులు ఎన్నటినీ మర్చిపోకూడనివి. అందుకు వ్యతిరేకంగా జయప్రకాశ్‌ నాయకత్వంలోనే ప్రతిపక్షాలు ఏకమై జనతాపార్టీగా ఏర్పడ్డాయి. అయితే అందులో చోటు సంపాదించిన నాటి జనసంఫ్‌ు మతతత్వ పోకడలు జనతా ప్రభుత్వ విచ్చిన్నానికి దారితీశాయి. ఆ జనసంఘమే బీజేపీగా అవతరించి సర్వ ప్రతిపక్షాల ఐక్యత మంత్రంతో పెరుగుతూ 1990లో వచ్చిన విపి సింగ్‌ నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని కూలదోసింది. అప్పుడు కూడా అద్వానీ రథయాత్రను బీహార్‌లోనే అడ్డుకోవడం యాదృచ్చికం కాదు. ఈ క్రమం 1992 అయోధ్య, బాబ్రీ విధ్వంసం వరకూ నడిచి దేశ రాజకీయాలలో మతతత్వం పరాకాష్టకు చేర్చింది. 1996లో ఏర్పడిన యునైటెడ్‌ ఫ్రంట్‌ కూటమిని కూడా బీజేపీ కాంగ్రెస్‌ కూలదోశాయి. 1996 నుంచి 2004 వరకూ వాజ్‌పేయి ప్రభుత్వం పాలన సాగడానికి టీడీపీ, జేడీయూ వంటి పార్టీల ఫిరాయింపు కారణమైంది. 2004లో వామపక్షాల మద్దతుతో యూపీఏ-1 ఏర్పడినా అమెరికా అణుఒప్పందానికి వ్యతిరేకంగా అవి వ్యతిరేకించాక ఫిరాయింపుల సహాయంతో 2013 దాకా పాలన సాగించింది. కాని 1991లో మొదలైన సరళీకరణ విధానాలు ఒకవైపు, బీజేపీ రగిలించిన మత రాజకీయాలు మరోవైపు దేశ రాజకీయ దృశ్యాన్ని కకావికలు చేశాయి. 2014 నుంచి పాలనలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం దీన్ని పరాకాష్టకు చేర్చింది. ఆయన పాలనలో మతతత్వం, నిరంకుశత్వం కలయికలో ఈ ప్రభుత్వ పాలన అప్రకటిత ఎమర్జెన్సీగా పేరు తెచ్చుకుంది. అప్పటికంటే దారుణంగా పత్రికల పీకనొక్కడం, స్వేచ్ఛను హరించడం మతశక్తుల విజృంభణ అమెరికాకు దాసోహమనడం, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టడం ఒకటేమిటి ఫాసిస్టు తరహా పోకడలతో సంఫ్‌ు పరివార్‌ అనబడే ఆరెస్సెస్‌ కూటమి రెచ్చిపోతున్నది. సుప్రీం కోర్టుతో సహా దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలూ ఒత్తిడికి లోనవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను నామకార్థంగా మార్చి మోడీ ప్రధాని కార్యాలయమే ఏకైక శాసన కేంద్రంగా మారింది. ఈ పరిస్థితుల కారణంగానే లౌకిక ప్రతిపక్షాలు మళ్లీ ఒకతాటిమీదకు రావలసిన అగత్యమేర్పడింది. మొత్తానికి పాట్నా మరోసారి ప్రతిపక్ష ఐక్యతకు కేంద్రమైంది. విశేషమేమంటే ఈ యాభై ఏళ్లలోనూ భాగస్వాములుగా తప్ప నేరుగా కాంగ్రెస్‌, బీజేపీలు ఇక్కడ దాదాపు అధికారంలోకి రాలేకపోయాయి.
వివిధ పార్టీల సంకేతాలు
బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా ఉండాలని సమావేశానికి హాజరైన సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాలలో పరిస్థితులను బట్టి చర్చలు జరగాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ అన్నారు. ఢిల్లీ ఆర్డినెన్సును కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తేనే దాంతో తాము ప్రతిపక్ష వేదికలో ఉంటామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు. ఈ విధంగా షరతులు పెట్టడం సరికాదనే అభిప్రాయం కాంగ్రెస్‌ వ్యక్తం చేసింది. బెంగాల్‌లో కాంగ్రెస్‌ సీపీఐ(ఎం)తో పొత్తుపెట్టుకోకుండా ఉంటేనే తాము పాలుపంచుకుంటామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ షరతుపెట్టారు. అయితే మళ్లీ బీజేపీ గెలిస్తే ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉండదని ఆమె అన్నారు. తాము బీజేపీకి వ్యతిరేకం తప్ప కాంగ్రెస్‌ వ్యతిరేకులుగా పరిగణించరాదని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్‌యాదవ్‌ వెల్లడించారు. బీజేపీతో ఒకసారి కూడా కలవని ఆర్జేడీ వ్యవస్థాపక నేత లాలూయాదవ్‌ ఈ సమావేశంలో ఒక ఆకర్షణ అయితే వారితో కలసి చేతులు కాల్చుకున్న నితిష్‌ కుమార్‌ ఆథిథేయ పాత్ర పోషించారు. సీపీఐ డి రాజా కూడా అదే సందేశమిచ్చారు. శివసేన నాయకులూ దేశం ముందున్న ప్రమాదాన్ని గుర్తుచేశారు. ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా బీజేపీ నిరంకుశత్వాన్ని ఓడించాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించడం పెద్ద మలుపు. సిమ్లా సమావేశంలో ఇది మరింత ముందుకు సాగి మరింత స్పష్టమైన కార్యాచరణకు దారితీస్తుందని ఆశించవచ్చు.
గతంలో బీజేపీతో చేతులు కలిపి ఈ పరిస్థితికి దోహదం చేసిన కొన్ని పార్టీలూ ఇప్పుడు ఇందులో పాల్గొనగా టీడీపీ, బీజేడీ వంటిపార్టీలు ఇప్పటికీ కళ్లు తెరవని స్థితి. ఇక ఏపీని పాలించే వైసీపీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి విధేయపక్షంగా వత్తాసునిస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయ విధానాలు కీలకమంటున్నారు గనక బీఎస్‌పీతో సహా వీరందరికీ ఆహ్వానాలు పంపలేదు. గతంలో బెంగాల్‌, బీహార్‌ యూపీలతో పాటు ప్రతిపక్ష కూటమికి ఒక ముఖ్య కూడలిగా ఉమ్మడి ఏపీ ఉండిన పరిస్థితి ఇప్పుడు లేదు. బీజేపీపై తీవ్రంగా విమర్శలు కార్యక్రమాలు చేసిన బీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ వ్యూహమేమిటో అస్పష్టం. ఈ ఐక్యవేదికలు, కూటములు ప్రయోజనం లేదని కేటీఆర్‌ ప్రకటించారు.
బీజేపీ అక్కసు
ఇక ఈ సమావేశాన్ని బీజేపీ జీర్ణం చేసుకోలేకపోవడమే గాక వేయిరకాల దాడిచేసింది. పాట్నా గోడలను వ్యతిరేక పోస్టర్లతో కార్టూన్లతో నింపేసింది. మిమ్మల్ని అరెస్టు చేసిన కాంగ్రెస్‌తో కలుస్తారా? అని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ప్రతిపక్షాలతో సమావేశానికి హాజరవడం ద్వారా కాంగ్రెస్‌ తను గెలవలేనని ఒప్పుకుందని అతితెలివితో వాదించింది. ఒక విధంగా ఇది మీరు సింగిల్‌గా రావాలని సవాలు చేసే జగన్‌ ఎత్తుగడను తలపిస్తుంది. ప్రజాస్వామ్యంలో పొత్తులు సర్దుబాట్లు అపరాధమో, అవమానమో కాదు. కాకుంటే భావసారూప్యత ప్రజాస్వామ్య ప్రయోజనాలు ఉమ్మడి ప్రమాదంపై అవగాహన ఉండాలి. ఆ మాటకొస్తే మోడీ ప్రభుత్వం కూడా పొత్తులు లేకుండా పోటీ చేసి ఏర్పడిందా? ఒంటరిగా మెజార్టీ ఉండొచ్చు గాని ఎన్నికలు కలిసే పోరాడింది కదా! గుజరాత్‌ యూపీ వంటివాటిని మినహాయిస్తే మరెక్కడా బీజేపీ కేవలం తన బలంతోనే గెలిచింది లేదు. ఫిరాయింపులు మిశ్రమ కూటములతోనే పాలిస్తున్నది. పరోక్షంగానూ ఒత్తిళ్లతో, ప్రలోభాలతో, బెదిరింపులతో కొన్నిపార్టీలను లోబర్చుకున్నది. ఈ అక్రమ పొత్తులకన్నా సూటిగా, రాజకీయంగా అవగాహనకు రావడం రాజ్యాంగ బద్దం.
రేపటి పోరాటానికి సిద్ధంగా…
రెండు కారణాల వల్ల ఈ సమావేశాలు లౌకిక పక్షాల అవగాహన త్వరితంగా పూర్తి కావలసి ఉంది. లోక్‌సభకు ఎన్నికలు ముందుగా రావచ్చని బీజేపీ కావాలనే సంకేతాలిస్తున్నది. నిజంగా వచ్చేట్టయితే సిద్ధం కావలసి ఉంటుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముందే అవగాహన ఉందన్న సంకేతాలు స్పష్టం చేస్తేనే ఫలితాల తర్వాత కలసి వ్యవహరించే చట్టబద్ద అనుకూలత ఉంటుంది. ఎందుకంటే పూర్తి మెజార్టీ గల పార్టీ లేదా ఎన్నికలు ముందు ఏర్పడిన కూటమికి మొదటి అవకాశం, ఎన్నికల తర్వాత ఏర్పడినా పూర్తి మెజార్టీ గల కూటమి ఈ క్రమంలో అవకాశం ఇవ్వాలని గతంలో కొన్ని స్థూలమైన సూచనలు వచ్చాయి. సీపీఐ(ఎం) ఎప్పుడూ చెబుతున్నట్టు భిన్నమైన పరిస్థితులు రాజకీయ శక్తులు ఉన్న ఈ దేశంలో ఎన్నికల ముందే సంపూర్ణమైన ఏకీకృత అవగాహన రావడం, కాబోయే ప్రధాని ఎవరో నిర్ణయించుకోవడం జరగని పని. గతంలో జరగలేదు కూడా. అది ఎన్నికల అనంతర (పోస్ట్‌పోల్‌) ప్రక్రియగానే వుంటుంది. అయితే ఇలాంటి ముందస్తు చర్చలు ఉమ్మడి అవగాహన ఆ క్రమాన్ని సులభతరం చేస్తాయి. రేపు రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగపరంగానూ ఒక సానుకూల వాతావరణం కల్పిస్తాయి. అంతకుమించి లౌకిక ప్రజాస్వామ్య రక్షణ కోసం ఐక్యంగా పోరాడాలనే చైతన్యాన్ని పెంచుతాయి. అవకాశవాద శక్తులను బీజేపీకి అనుబంధశక్తులుగా వ్యవహరిస్తున్న వారిని ప్రజల ముందు నిలబెడతాయి. ఒకే దేశం, ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే మోడీ అనే ఏకపక్ష నిరంకుశత్వాన్ని ఓడించే కర్తవ్యానికి ప్రజలను సిద్ధం చేస్తాయి. ఈ ఐక్యతా కృషిని అపహాస్యం చేసే వారి కుటిల ప్రచారాలను బేఖాతరు చేస్తూ ఈ కర్తవ్యాన్ని జయప్రదం చేసేట్టయితే అది దేశ చరిత్రలో మరో చారిత్రిక మలుపుగా నిలిచిపోతుంది.
తెలకపల్లి రవి 

Spread the love