ప్రశంస

సాధారణంగా కవులు, కళాకారులు తమ సృజనకు గుర్తుగా ప్రశంసలు ఆశిస్తారు. మనం కొట్టే చప్పట్లే వారికి దుప్పట్లు. వారిలోని కళను మెచ్చుకుంటూ చప్పట్లు కొడితే చాలు ఆనందంతో పొంగిపోతారు. తమలోని సృజనాత్మకతకు మరింత పదును పెడతారు. వీరనే కాదు వయసుతో సంబంధం లేకుండా ప్రతి మనిషికీ ప్రశంస ఒక ఉత్తేజమే. పసి పిల్లలు కొత్త పని ఏదో చేసి తల్లిదండ్రుల వైపు చూస్తారు. ‘చాలా బాగా చేశావు బంగారం’ అంటే చాలు ప్రపంచాన్నే జయించినట్టు సంబరపడతారు. పసి పిల్లలే కాదు పెద్దలు సైతం తాము చేస్తున్న శ్రమకు ప్రశంసలు కోరుకోవడం సహజం. ప్రశంస ఎవరిలోనైనా కొండత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనేది నిజం.
ప్రశంస అనేది రెట్టించిన ఉత్సాహాన్నిస్తుంది. నూతన ఉత్తేజాన్నిస్తుంది. ఇంకా ఇంకా సాధించాలనే తపనను మనలో పుట్టిస్తుంది. ఓ చిన్నపాటి ప్రశంసలో ఇంతటి శక్తి దాగుంది మరి. చేసిన పని, సాధించిన విజయం గొప్పదైనా కాకపోయినా ఒక చిన్న మెచ్చుకోలు వెయ్యి ఏనుగుల బలం. అందుకే ప్రశంసకు అంత ప్రాధాన్యం.
సాధారణంగా కవులు, కళాకారులు తమ సృజనకు గుర్తుగా ప్రశంసలు ఆశిస్తారు. మనం కొట్టే చప్పట్లే వారికి దుప్పట్లు. వారిలోని కళను మెచ్చుకుంటూ చప్పట్లు కొడితే చాలు ఆనందంతో పొంగిపోతారు. తమలోని సృజనాత్మకతకు మరింత పదును పెడతారు. వీరనే కాదు వయసుతో సంబంధం లేకుండా ప్రతి మనిషికీ ప్రశంస ఒక ఉత్తేజమే. పసి పిల్లలు కొత్త పని ఏదో చేసి తల్లిదండ్రుల వైపు చూస్తారు. ‘చాలా బాగా చేశావు బంగారం’ అంటే చాలు ప్రపంచాన్నే జయించినట్టు సంబరపడతారు. పసి పిల్లలే కాదు పెద్దలు సైతం తాము చేస్తున్న శ్రమకు ప్రశంసలు కోరుకోవడం సహజం. ప్రశంస ఎవరిలోనైనా కొండత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనేది నిజం.
స్నేహితులో, బంధువులో, సహోద్యోగులో ఏమైనా మంచి పని చేస్తే ప్రశంసిస్తూనే ఉంటాం. అయితే ఇంట్లో వారిని మాత్రం లెక్కే చేయం. ‘మా కోసం ఎంతో శ్రమిస్తున్నావ్‌’ అనండి ఆమె ఆనందానికి అవధులుండవు. కానీ మన సమాజంలో భార్యను, అమ్మను ప్రశంసించే సంప్రదాయమే లేదు. మన అమ్మే కదా, నా భార్యే కదా అనే భావమే దీనికి కారణం. కానీ ప్రశంస ఎవరికైనా ఆనందాన్నే ఇస్తుంది.
ఇక ప్రశంసలు రకరకాలు. ఒక వ్యక్తిలోని నైపుణ్యాన్ని గుర్తించి ప్రశంసించడం. ఇలాంటి ప్రశంస వారు ముందుకు దూసుకుపోయేందుకు తోడ్పడుతుంది. ఆ వ్యక్తిని మరింత శక్తివంతంగా నిలబెడుతుంది. చేసిన పనిలో అంత సృజన లేకున్నా ‘బాగానే చేశావు, మరింత శ్రమిస్తే ఇంకా బాగా చేసేవారు’ అని ప్రశంసించడం. ఇది వారిని ప్రోత్సహించేందుకు చేసే ప్రశంస. ఇలాంటి ప్రశంస ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. చేసే పని పట్ల ఆసక్తి తగ్గకుండా, కుంగిపోకుండా ఇంకా బాగా చేయాలనే తపనను పుట్టిస్తుంది. ఇలాంటి ప్రశంసలు చాలా అవసరం.
విషయం లేకున్నా ‘బ్రహ్మాండంగా చేశారు, మిమ్మల్ని మించిన వారు లేరు’ అంటూ ముంచెత్తేవారూ ఉంటారు. ఇలాంటివి ప్రమాదం. ‘ఏ మాటల వెనుక ఎవరి ప్రయోజనం దాగి వుందో తెలుసుకోలేనంత కాలం మనుషులు మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటారు’ అన్నారు ఓ మహనీయుడు. కాబట్టి ఇలాంటి ప్రశంసల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడే ప్రశంసకూ పొగడ్తకు మధ్య ఉన్న తేడానూ అర్థం చేసుకోవాలి. ప్రశంస అంటే మనం చేసిన పనిని మెచ్చుకోవడం. పొగడ్త అంటే ఏమీ లేకున్నా ఆకాశానికెత్తడం. ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ప్రశంసించే వారిలో తొంభ్బై శాతం మంది పై మూడింటినే ఎంపిక చేసుకుంటారు. ఇక మిగిలిన పది శాతం మంది ఉంటారు. అదేంటో ఎదుటి వ్యక్తిని ప్రశంసించడానికి వీరి మనసు అస్సలు ఒప్పుకోదు. వారి పట్ల కోపమో, అసూయో, తమలోని ఆత్మన్యూనతా భావమో ప్రశంసించేందుకు అడ్డుపడుతుంటాయి. వాటన్నింటినీ ఒక్కసారి పక్కన పెట్టి ‘అభినందనలు’ అనే ఒక్క మాట అనండి. మీకు తృప్తి, వారికి ఆనందం. అందుకే ప్రశంసిద్దాం. వారు సాధించినది చిన్న విజయమైనా ప్రశంసిద్దాం. చిన్న మాటే కదా మనకు పోయేదేముంది! అది వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది అంతే కాదా! మరో విషయం ప్రశంసలకు పొంగిపోకుండా, పొగడ్తలకు లొంగిపోకుండా, విమర్శలకు కుంగిపోకుండా మనలోని నైపుణ్యానికి పదును పెడుతూ ముందుకు సాగిపోదాం.

Spread the love