మీడియా ఓ మీడియా

సోషల్‌ మీడియాతో ఎన్ని అనుకూలతలు ఉన్నాయో అన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. ఎక్కడో దూరంగా ఉన్న వారితో మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం కానీ ఇంట్లో మన పక్కనే ఉన్న వారిని మర్చిపోతున్నాం. ఫేస్‌బుక్‌, యూటూబ్‌, వాట్సాప్‌, ట్విట్టర్లకు బానిసలై కుటుంబానికే దూరమవుతున్నాం. మన వారితో నాణ్యమైన సమయం గడపలేకపోతున్నాం. ఇలా సామాజిక, భావోద్వేగ సంబంధాలకు సోషల్‌ మీడియా ఒక ముఖ్యమైన అవరోధంగా మారింది. ఫేక్‌ వార్తల ప్రచారం కూడా ఎక్కువే. వాటినే నిజం అనుకుని షేర్లు చేస్తున్న వారు కోకొల్లలు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఒకప్పుడు దూరదర్శన్‌లో వచ్చే వార్తలు వింటే తప్ప ప్రపంచంలో ఏం జరిగిందో తెలిసేది కాదు. తర్వాత కాలంలో ఎన్నో వార్తా ఛానల్స్‌ వచ్చి మనల్ని ప్రపంచానికి కాస్త దగ్గర చేశాయి. ఇక సోషల్‌ మీడియా రంగ ప్రవేశంతో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకుంటున్నాం. అందుకే ఇప్పుడు ఇది మన దైనందిన జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తుల మధ్య సంబంధాలను సులభతరం చేసిన గొప్ప సాధనంగా ఆవిర్భవించింది. అరచేతిలోనే విశ్వాన్ని చూపిస్తున్నది. ఓ విధంగా ఒంటరి జీవితాలకు ఓదార్పుగా మారింది. ఇలా ప్రపంచవ్యాప్త బంధాలకు సోషల్‌ మీడియా గణనీయంగా దోహదపడుతున్నది. అందుకే ప్రతి ఒక్కరూ డిజిటల్‌ ప్రపంచానికి కనెక్ట్‌ అవ్వడం అనివార్యమయింది.
ముఖ్యంగా కరోనా కాలంలో ఇంటికే పరిమితమైన మనకు సోషల్‌ మీడియా మరింత దగ్గరయింది. కొంతమంది దీని ద్వారా జీవనోపాధి సైతం పొందారు, పొందుతున్నారు. తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నారు. అలాగే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కూడా సోషల్‌ మీడియా కొంత మేర దోహదపడుతున్నది. ఇక విద్యార్థులకైతే కొత్త నైపుణ్యాల అభ్యాసాలకు సరికొత్త వేదికలను సృష్టిస్తున్నది. యూటూబ్‌ ఛానల్స్‌ ద్వారా ఎంతో మంది కళాకారులు తమ కళలను ప్రపంచంతో పంచుకోగలుగుతున్నారు. ఇలా మన సృజనాత్మకతను, గుర్తింపును మెరుగుపరచడానికి సోషల్‌ మీడియా ఒక అద్భుతమైన సాధనం అని చెప్పడంలో సందేహమే లేదు.
అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. సోషల్‌ మీడియాతో ఎన్ని అనుకూలతలు ఉన్నాయో అన్ని ప్రతికూలతలూ ఉన్నాయి. ఎక్కడో దూరంగా ఉన్న వారితో మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం కానీ ఇంట్లో మన పక్కనే ఉన్న వారిని మర్చిపోతున్నాం. ఫేస్‌బుక్‌, యూటూబ్‌, వాట్సాప్‌, ట్విట్టర్లకు బానిసలై కుటుంబానికే దూరమవుతున్నాం. మన వారితో నాణ్యమైన సమయం గడపలేకపోతున్నాం. ఇలా సామాజిక, భావోద్వేగ సంబంధాలకు సోషల్‌ మీడియా ఒక ముఖ్యమైన అవరోధంగా మారింది. ఫేక్‌ వార్తల ప్రచారం కూడా ఎక్కువే. వాటినే నిజం అనుకుని షేర్లు చేస్తున్న వారు కోకొల్లలు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఈ మధ్య కాలంలో సైబర్‌ బెదిరింపులు ఎక్కువయ్యాయి. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బెదిరిస్తున్నారు. నేడు ఉన్మాదుల చేతుల్లో సోషల్‌ మీడియా ఓ ఆయుధంగా మారింది. ఇది మరింత ప్రమాదం. ఓ పెద్ద ట్రోలింగ్‌ ముఠాను సృష్టించి ప్రజలపై విషం చిమ్ముతున్నారు. నిజాలు మాట్లాడేవారి గొంతు నొక్కుతున్నారు. జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను అసభ్య పదజాలంతో దూషిస్తూ మానసికంగా వేధిస్తున్నారు. వీరిని అడ్డుకోకుంటే ప్రజాస్వామ్యానికే విఘాతం.
సోషల్‌ మీడియాను ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు మానసిక వ్యాధులకు గురవుతున్నారని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇది యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. సోమరితనాన్ని పెంచుతున్నది. సహజ ప్రపంచానికి వారిని దూరం చేస్తున్నది. మొత్తానికి మనపై మనకు స్వీయ నియంత్రణ లేకుండా చేస్తున్నది. పసి పిల్లలు సైతం దీనికి బానిసలైపోతున్నారు. పరిమితి దాటితే ఏదైనా ప్రమాదమే. అందుకే దేనికైనా ఓ పరిమితి అవసరం. సోషల్‌ మీడియా వాడకాన్ని మనకు మనమే నియంత్రించుకోవాలి. ఆ సమయాన్ని మన ఇష్టమైన వ్యాపాకాల కోసం కేటాయించుకోవాలి. అప్పుడే సోషల్‌ మీడియా వ్యసనం నుండి బయటపడగలం.

Spread the love