మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు

కండబలం కొండ ఫలం… / కబళించే దుండగీడు… / మానధనం, ప్రాణధనం / దోచుకునే దొంగవాడు… / తరిమి తరిమి కొట్టరా… / తగిన శాస్తి చేయరా… / ఎవడు వాడు ఎచటి వాడు… / ఇటు వచ్చిన తెల్లవాడు…
అనే శ్రీశ్రీ గీతం వినగానే మనకు గుర్తొచ్చేది మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు. సామ్రాజ్య వాదుల అణచివేతను ధిక్కరించిన వాడు. తెల్లవారి వెన్నుల్లో వణుకు పుట్టించిన వాడు. దోచుకుంటున్న దొరలపై యుద్ధం ప్రకటించినవాడు. మన్యంలో మార్పు కోసం విప్లవమనే అగ్గిని రాజేసినవాడు. దేశ స్వాతంత్య్రం కొరకు, అడవి బిడ్డల హక్కుల కొరకు, గిరి పుత్రుల బతుకు బాగు కొరకు ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించిన వాడు. 27 ఏండ్లకే తన జీవితాన్ని దేశానికి ధారపోసిన తెలుగు వాడు. జూలై 4న ఆయన జయంతి. ఇది ఆయన శత వర్థంతి ఏడాది. ఈ సందర్భంగా అల్లూరి జీవిత విశేషాలు ఈ వారం కవర్‌ స్టోరీగా చదువుకుందాం.
రామరాజు మన్యంలో అడుగు పెట్టిన తొలి నాళ్ళలోనే కోయ దొరల దగ్గర విలు విద్య నేర్చుకున్నాడు. ఆ తర్వాత బ్రిటిష్‌ వారి దాడి తీవ్రతరం కావడంతో విల్లంబులతో సైన్యం ఏర్పాటు చేశాడు. అయితే, తప్పులు చేస్తున్న కింది స్థాయి ఉద్యోగులను రామరాజు మందలించి వదిలివేశాడు తప్ప ఎవరినీ చంపలేదు. చిత్రహింసలు పెట్టలేదు. ఇది ఆయన నిబద్ధత, నిజాయతీకి నిదర్శనం.
మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు తెలుగు వారందరికీ నిరంతర స్ఫూర్తిప్రదాతగా నిలిచిపోయాడు. తెల్లవారిపై పోరాడటానికి గిరిజనులను సేనగా కదిలించిన రాజు జీవిత విశేషాలు, రాజకీయ అభిప్రాయాలు, పోరాట వ్యూహాలు ఎప్పటికీ ఆసక్తి గొల్పుతూనే వుంటాయి. అందుకే ఆయనపై ప్రొఫెసర్‌ అట్లూరి మురళి వెలువరించిన పరిశోధనా వ్యాసం తెలుగు అనువాదాన్ని అందిస్తున్నాం. ఈ పుస్తకం చిన్నదైనా రాజుకు సంబంధించిన పరిణామాలను పరిశీలించడంతో పాటు అందుకు ఉపయోగపడే ఆధారాలు, ఆకరాలను సమగ్రంగా తెలియజేస్తుంది.

మధ్యాహ్నం 2 గంటలయ్యిందేమో, మన్యం ఆడువుల్లో బూట్లు చప్పుడు.. వో చెట్టుకు అతన్ని కట్టేసారు. ఏవో మాటలు వినపడుతున్నాయి. ఇంతలో తుపాకీ కాల్పులు. పిట్టలన్నీ చెట్లపై నుంచి ఎగిరిపోయాయి. అతను వందేమాతరం అని నినదిస్తున్నాడు. రక్తం గుండె నుండి ధారగా కారుతోంది. అయన స్వరం నీరసపడిపోయింది. అతన్ని ఎక్కడికో మోసుకు పోయారు. రుజువు కోసం ఓ ఫోటో తీయించారు. ఆ వార్త టెలిగ్రామ్‌ ద్వారా మద్రాస్‌ ప్రెసిడెన్సీ కి, తరువాత ఇంగ్లేండ్‌ కు చేరింది. అప్పుడు రాణీ గారు కొంచెం షాంపెయిన్‌ చప్పరించి, సేద తీరేరు. ఆయనే విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు.
అల్లూరిపై హఠాత్‌ ప్రేమ వెనుక…
సంఫ్‌పరివార్‌కు సహజసిద్ధంగా అబ్బిన, బతకనేర్చిన పద్ధతి ప్రకారం అల్లూరి సీతారామరాజు వారసత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. చరిత్రను వక్రీకరించటంలోనూ, అబద్ధాలు సృష్టించటంలోనూ, బ్రిటిష్‌ దమన నీతికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు సాగించిన పోరాటానికి మతతత్వ రంగులు రుద్దటంలో తలమునకలయి ఉన్నారు. అతనికి ఉన్నతకుల గుర్తింపును ఇవ్వడమే కాకుండా, ‘హిందూ రుషి’గా, ‘మతం వల్లసాధించిన శక్తితో జ్ఞానసంపన్నుడైన సన్యాసి’గా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి రామరాజు పొడవైన ఎర్రటి ఖద్దర్‌ చొక్కా, నిక్కరు వేసుకుని గిరిజనులు నివసిస్తున్న ఏజెన్సీలలో తిరుగుతుండేవాడు. వైద్య మూలికలు పంచుతూ ఉండేవాడని డని కొన్ని పరిశోధనల్లో తేలింది. అతని నిరాడంబర జీవనవిధానం, ఇతరులకు సహాయం చేసే స్వభావం గిరిజన ప్రజల నుండి గౌరవ మర్యాదలను పొందాయి. అనేక మంది స్వాతంత్య్ర పోరాట యోధులు, 20వ శతాబ్దం తొలిదశకాలలో ప్రజలను సమీకరించటానికి మతభావనలను, చిహ్నాలను వాడుకున్నారు. స్కూల్లో రామరాజు క్లాస్‌మేట్‌ అయిన అన్నపూర్ణయ్య ‘రామరాజు అయితే ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చేవాడు కానీ పాలవంటి అతని ఆధ్యాత్మికతలో చక్కెర లాంటి దేశభక్తి కచ్చితంగా మిళితమై ఉండేది’ అన్నాడు. ఏమైనా దీని అర్థం రామరాజు మతతత్వవాది కాదు. ఇతర మతాల పట్ల వివక్షత చూపలేదు. అతను నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను, కుల వివక్షతలను వ్యతిరేకించాడు. రాజు తల్లి సనాతన ధర్మాన్ని పాటించేవారని, నిమ్న కులాల వ్యక్తులను తమ ఇంట్లోకి రానిచ్చేవారు కాదని కొందరు అంటారు. ఇటువంటి వాతావరణంలో పెరిగిన రాజు ఆ సనాతన విశ్వాసాలను అనుసరించలేదు. పైగా దీనికి విరుద్ధంగా వివక్షతల అమలుకు వ్యతిరేకిగా ఉన్నాడు. గిరిజన ప్రజలతో బాగా కలిసిపోయేవాడు, వారి ఇళ్ళల్లో బస చేసేవాడు, వారితో కలిసి భోజనం చేసేవాడు, వారిలో ఒకరిగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా వారి సామజిక, ఆర్థిక సమస్యల పట్ల సానుభూతితో ఉండేవాడు. అలాంటి రామరాజును ‘హిందూ మత నాయకుడు’గా చూపాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఆయన వారసత్వానికి జరుగుతున్న ఘోర అపచారం. ఆయన విశాల మానవతా ప్రపంచ దృక్పథాన్ని తిరస్కరించడం తప్ప ఇది మరొకటి కాదు. ప్రస్తుతం మైనార్టీలపై జరుగుతున్న దాడులు, ప్రజలు అనుసరించే మత విశ్వాసాల ఆధారంగా బుద్ధిపూర్వకంగా వారి మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నం, ఎవరు ఏదుస్తులు వేసుకోవాలో, ఏమి తినాలో లాంటివన్నీ రామరాజు దేని కోసం నిలబడ్డాడో దానికి విరుద్ధం. పైన చెప్పిన ఈ కారణాలతో అల్లూరి సీతారామరాజును మతతత్వ శక్తులు సొంతం చేసుకునే మాట అటుంచి, ఆయనను గురించి మాట్లాడే అర్హత కూడా వారికి లేదు. రామరాజు ప్రజల మనిషి. ముఖ్యంగా ఆదివాసీలు, అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన వీరుడు. బ్రిటీష్‌ వారి దోపిడిపై పోరాటానికి ప్రజలను ఐక్యపరిచిన యోధుడు. ఆ త్యాగధనుడి వారసత్వంగానే నేడు ఆదివాసీ పోరాటాలు సాగుతున్నాయి.
అమాయకులూ అసహాయులైన అడవి బిడ్డలనే సైన్యంగా సమీకరించాడు. ఆంగ్లేయ ప్రభుత్వాన్ని ధిక్కరించి.. ఉత్తేజ ప్రదాతగా శాశ్వతంగా నిలిచిపోయిన తెలుగు విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు. సమరశీలతలో, సాహసంలో తన కాలం కన్నా ముందున్న వాడు. అహింసా జపాన్ని అధిగమించి ఆయుధాలు చేబూని మన్యంలో విప్లవం రగిలించిన వాడు. భారతీయులకు నాగరికత నేర్పామని గొప్పలు పోయే తెల్ల దొరల అమానుషానికి బలైన అమరజ్యోతి. ఆదివాసుల అడవులూ, కొండలూ, గనులూ కార్పొరేట్లకు కట్టబెడుతున్న నేటి సరళీకరణ యుగంలో ఆయన అడుగుజాడలు అనుసరణీయాలు.. స్మరణీయాలు. ఆనాటికి ప్రపంచంలో అజేయమైన సైనిక శక్తిగా ఉండి… రవి అస్తమించని బ్రిటిష్‌ పాలకులను గడగడలాడించిన విప్లవ జ్యోతి. ఆదివాసి ప్రజల రాజకీయ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వీర కిశోరం. ఏజెన్సీ ప్రాంత గిరిజనుల మౌలిక సమస్యలను, పరిష్కారాలను ఎజెండాగా చర్చనీయాంశం చేయడంలో జయప్రదమైన పోరాటయోధుడు. తెలుగు ప్రజలందరికి నిరంతరం స్ఫూర్తి ప్రదాత.
దౌర్జన్యాలను చూసి చలించిపోయాడు
1897 జూలై 4 తేదీన జన్మించాడు అల్లూరి సీతారామరాజు. 1924లో (మే 7న) బ్రిటిష్‌ వారి తూటాలకు బలై వీరమరణం పొందాడు. అప్పుడు ఆయన వయసు కేవలం 27 ఏండ్ల మాత్రమే. అల్లూరి వెంకట రామరాజు, నారాయణమ్మ దంపతుల రెండవ సంతానం రామరాజు. ఈయనకు అక్క సీత, తమ్ముడు సత్యనారాయణ రాజు ఉన్నారు. సీతా రామరాజు తండ్రి స్వాతంత్య్ర ప్రియుడు, బ్రిటిష్‌ వ్యతిరేకి. రాజమండ్రి వచ్చిన బిపిన్‌ చంద్రపాల్‌ ప్రసంగం, వందేమాతరం ఉద్యమం, తండ్రి స్వతంత్ర భావాలు రామరాజును ఎంతగానో ప్రభావితం చేశాయి. ‘విదేశీ చదువులూ ఒక చదువులేనా!’ అంటూ విద్యను మధ్యలోనే వదిలేసాడు. దేశ పర్యటన చేసి జాతీయోద్యమ నాయకులను కలుసుకోవడంతోపాటు, విప్లవకారులతో రహస్య సమావేశంలో కూడా పాల్గొన్నాడు. తర్వాత మన్యం ప్రాంతం చేరుకున్నాడు. అక్కడ మన్యం ప్రజలపై బ్రిటిష్‌ అధికారుల దోపిడీ, దౌర్జన్యాలను చూసి చలించిపోయాడు. బ్రిటిష్‌ అటవీ చట్టాలు, రిజర్వ్‌ ఫారెస్ట్‌ పేరుతో అడవి తల్లి నుండి అడవి బిడ్డలను వేరు చేసి వేధింపులు మొదలు పెట్టింది ప్రభుత్వం. కోయ ప్రజల కష్టాలు అధికమయ్యాయి. అయిదేండ్లపాటు కోయ ప్రజల మధ్య సంచరిస్తూ, సమస్యలపై పోరాడుతూ వారి విశ్వాసాన్ని పూర్తిగా చూరగొని ఒక ఆశాజ్యోతిగా కన్పించసాగాడు.
పీడనకు వ్యతిరేకంగా
గిరిపుత్రులు తాము కోల్పోయిన భూములను తిరిగి దున్నుకోమని చెప్పాడు రామరాజు. రిజర్వ్‌ ఫారెస్ట్‌ అటవీ ఉత్పత్తులు సేకరించుకోవడం జన్మహక్కు అని వారిని చైతన్య పరిచాడు. పోలీసుల జోక్యం అవసరం రాకుండానే గిరిజన సంప్రదాయ పద్ధతులలో పంచాయతి కోర్టులలోనే ప్రజల వివాదాలు పరిష్కారం కాసాగాయి. గ్రామాల మీదబడి ఫారెస్ట్‌ పోలీసులు లూటీ చేయడం, శిస్తుల పేరుతో రెవెన్యూ వారు పీడించడానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైంది. మద్యపానం మాన్పించడానికి ప్రచారం చేసాడు. చింతపల్లి ఘాట్‌ రోడ్‌ నిర్మాణ పనులు చేయించడానికి తీసుకెళ్లి కోయ ప్రజల శ్రమను దారుణంగా దోచుకుంటున్న అధికారుల నుండి కాపాడి కూలీ ఇప్పించాడు. విప్లవ ప్రభావిత ప్రాంతమంతటా ప్రజలు పెద్ద సంఖ్యలో తాగుడు మానేశారు. ప్రభుత్వ కోర్టులను, పోలీస్‌ స్టేషన్లను బహిష్కరించారు. సీతారామరాజు మాటే మన్యంలో వేదంలా చెల్లుబాటవసాగింది. దీంతో అధికారులు, మన్యం పై యుద్ధం ప్రకటించారు. రామరాజును అరెస్ట్‌ చేసి తర్వాత విడుదల చేశారు.
తన యుద్ధం దొరల పైనే
రామరాజు మన్యంలో అడుగు పెట్టిన తొలి నాళ్ళలోనే కోయ దొరల దగ్గర విలు విద్య నేర్చుకున్నాడు. ఆ తర్వాత బ్రిటిష్‌ వారి దాడి తీవ్రతరం కావడంతో విల్లంబులతో సైన్యం ఏర్పాటు చేశాడు. అయితే, తప్పులు చేస్తున్న కింది స్థాయి ఉద్యోగులను రామరాజు మందలించి వదిలివేశాడు తప్ప ఎవరినీ చంపలేదు. చిత్రహింసలు పెట్టలేదు. ఇది ఆయన నిబద్ధత, నిజాయతీకి నిదర్శనం. తన యుద్ధం దొరల పైన మాత్రమేనని ప్రకటించాడు. ప్రత్యేక గుర్రాల రవాణా, వైర్‌ లెస్‌ సెట్లను సమకూర్చుకోవడం ద్వారా అడవుల్లో గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందిన ప్రత్యేక మలబార్‌ పోలీసులను తీసుకొచ్చింది. బ్రిటిష్‌ ప్రభుత్వం, ధైర్య సాహసాలకు మారు పేరైన రామరాజు సమర్థవంతమైన గూఢచార వ్యవస్థతో పటిష్టమైన గెరిల్లా వ్యూహాలు అమలు జరిపాడు. ఇంత చక్కటి ప్రణాళిక, వ్యూహలు ఉన్నప్పటికి మొదటి ప్రపంచ యుద్ధంలో ఆరి తేరిన సైనికాధికారులు, వారి ఆయుధాలు, ప్రత్యేక శిక్షణ ఉన్న దళాలతో మన్యానికి గట్టి దెబ్బలు తగిలాయి. మారిన ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టడానికి ఆయుధాలు సమకూర్చు కోవాలని విప్లవకారుల్లో ఆత్మసైర్యం దెబ్బ తినకుండా చూడాలని రామరాజు భావించాడు. అందుకు తగ్గట్టు ఆయుధ శిక్షణ ఇప్పించాడు. రంపచోడవరం రాజవొమ్మంగి, కృష్ణదేవి పేట, చింతపల్లి, అడ్డతీగల, నర్సీ పట్నం తదితర ప్రాంత పోలీస్‌ స్టేషన్లను కొల్లగొట్టడానికి తుపాకులు, మందుగుండు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కూడా స్థానిక పోలీసు సిబ్బందిని ఏమీ చేయకుండా వదిలేశారు. ప్రజలను పీడించవద్దని హెచ్చరించి వదిలి పెట్టారు.
ఏమాత్రం వెనకడుగేయక
గంటం దొర, మల్లు దొర, ఎండు పదాలు, అగ్గిరాజు లాంటి మహా వీరులు రామరాజు విప్లవోద్యమంలో దళాలకు నాయకత్వం వహించారు. దోపిడీని మౌనంగా భరించడం తప్ప ఎదురు చెప్పలేని అడవి బిడ్డలు అల్లూరి విప్లవ సైన్యంలో సమరశంఖం పూరించారు. కవర్డ్‌, హైటర్‌ వంటి నరహంతక అధికార్లను తిరుగుబాటులో భాగంగా చంపివేసింది అల్లూరి సైన్యం. మేజర్‌ గుడాల్‌ అనే క్రూర సైనికాధికారిని, సైనిక బలగాలను, ఫిరంగులను మన్యం గడ్డపై మోహరించింది ప్రభుత్వం. అయినాసరే ఆదివాసీ సైన్యం ఏమాత్రం వెనకడుగేయక వీరోచితంగా దారి పొడువునా గుండెనెత్తురులు తర్పణం చేస్తూ ముందుకు సాగింది. అశేష త్యాగాలు చేసింది. అంతిమంగా 1924 జనవరి 27న రూథర్‌ఫను మన్యం అధికారిగా కేటాయించింది ప్రభుత్వం. అస్సాం రైఫిల్స్‌ దళాలను, గూర్కా దళాలను నర్సీపట్నానికి రప్పించింది. విప్లవకారులను గిరిజన ప్రజలు తమ గుండెల్లో దాచుకున్నారు. అల్లూరి సీతారామరాజును పట్టి ఇచ్చిన వారికి లేదా ఆచూకీ తెలిపిన వారికి పదివేల రూపాయల బహుమతి. ఆయన అనుచరుల ఆచూకీ తెలిపిన వారికి అయిదువేల రూపాయలు ఇస్తామని వారి తలలకు వెల నిర్ణయించారు.
రామరాజు జాడకోసం…
విప్లవకారులు గ్రామాలకు దూరంగా గుట్టల్లో, కొండల్లో తల దాచుకుంటూ గెరిల్లా యుద్ధం కొనసాగించారు. బ్రిటిష్‌ సైనికులు గిరిజన గ్రామాలకు గ్రామాలు తగులబెట్టి బూడిద చేశారు. రామరాజు ఎక్కడున్నాడో చెప్పమని చిత్రహింసలు పెట్టారు. పురుషుల ముందే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. విప్లవకారులను పంపిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లు లక్ష్యంగా మారాయి. రంపకొండల్లోని ప్రతి ఇల్లు తనిఖీలకు గురైంది. గిరిజన గ్రామస్తుల వలే కాకుండా గిరిజనేతర గ్రామ పెద్దలు, మద్దతుదార్లు, మున్సిప్లతో కూడిన ధనవంతులు గోడమీద పిల్లి వాటంగా వ్యవహరించారు. విప్లవకారులు పైచేయిగా ఉన్నప్పుడు ఉద్యమానికి సహాయమందించిన వీరు… పోలీసుల అణిచివేత నేపథ్యంలో ఒకవేళ తిరుగు బాటు విఫలమైతే సురక్షితంగా ఉండేందుకు గోడ రెండవ వైపుకు దూకారు. గ్రామ మున్సిఫు విప్లవ కారులను పట్టుకొచ్చి అప్పగించిన ఘటనలు, ప్రముఖ నేతల అరెస్టులకు దారితీసిన సమాచారాన్ని అందించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి.
ఆంగ్లేయుల తొత్తులనే పేరుతో
రామరాజు ఆదేశాలకు విరుద్ధంగా ఆంగ్లేయుల తొత్తులనే పేరుతో స్వదేశీయులను హతమార్చే ఆత్మహత్యా సదృశ్యమైన విధానాన్ని అమలుచేశాడు అగ్గిరాజు. దాంతో గంటం దొర, అగ్గిరాజుల మధ్య సదవగాహన కరువైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పర్లాచిమిడి ప్రాంతం నుంచి రామరాజు ఇక్కడకు చేరుకున్నాడు. ఈలోగా విప్లవకారుల వద్ద ఆయుధాలు, మందుగుండు అయిపోయింది. విప్లవోద్యమంలో వీరోచితంగా పోరాడిన ప్రముఖ నాయకులు గంటం దొర, ఎండు పడాలు కూడా వీరమరణం పొందారు. మల్లుదొర బ్రిటిష్‌ వారికి దొరికిపోవడంతో అండమాన్‌ జైలుకు పంపారు. మద్దేరు నది వద్ద జరిగిన పోరాటంలో అగ్గిరాజు అరెస్ట్‌ అయ్యాడు. 1924 మే 6న రామరాజు ఒక కొండ దగ్గర మకాం వున్నాడు. దాహం తీర్చుకోవడానికి కొండ దిగి సెలయేరు దగ్గరకు వచ్చాడు. సెలయేరు ఆవలి ఒడ్డున ఉన్న పోలీసులకు నీళ్లు తేవడానికి వచ్చినవారు రామరాజును చూశారు. ఇంకేముంది! అక్కడున్న సైన్యానికి సమాచారం అందింది! రామరాజును సెలయేరు వద్ద చుట్టు ముట్టి బంధించారు. మేజర్‌ గుడాల్‌ మకాం వద్ద రామరాజుకు, గుడాలకు వాదప్రతివాదాలు జరిగాయి. తమ దేశానికి, మన్య ప్రాంతానికి బ్రిటిష్‌ పరిపాలన వలనే దుర్భర పరిస్థితి ఏర్పడిందంటూ గుడాల్లో కరచాలనం చేయడానికి సైతం నిరాకరించాడు రామరాజు.
చావడానికైనా సిద్ధం
నిజానికి ఆరోజు రామరాజును చెట్టుకు కట్టివేసి మేజర్‌ గుడాల్‌ కాల్పులకు ఆదేశించాడు. కాల్చడానికి ముందు రామరాజునుద్దేశించి ‘నిన్ను చంపాలని నిర్ణయించుకున్నాం. నీవు చెప్పుకొనేది ఏమైనా ఉందా?’ అని మేజర్‌ ప్రశ్నించాడు. అప్పుడు రామరాజు ”నన్ను న్యాయ విచారణకు కోర్టుకు హాజరు పరచాలి. మీరు అందుకు సిద్ధంగా లేకపోతే… నా మాతృభూమి కోసం నేను చావడానికైనా సిద్ధంగా ఉన్నాను” ప్రకటించాడు. అప్పుడు చెట్టుకు చేతులు విరిచి కట్టి ముఖాన్ని కప్పివేశారు. రామరాజు గుండెలపై గురి చూసి కాల్చి చంపాడు మేజర్‌. కాని తర్వాత బ్రిటిష్‌ అధికారులు రామరాజు పారిపోతుంటే వెనుక నుంచి కాల్చి చంపారని కట్టుకథను ప్రచారంలో పెట్టారు. అయితే రామరాజు ఘోర హత్యను కళ్ళారా చూసిన కొయ్యూరు గ్రామ వాసులు దీన్ని ఖండించారు. రామరాజును కట్టివేసిన చెట్టును సైతం గుర్తు లేకుండా కాల్చి బూడిద చేసి ఏటిలో కలిపారని వారు తెలిపారు. రామరాజు మృతదేహాన్ని మరునాడు (మే 8, 1924) దహనం చేయడానికి ముందు కృష్ణదేవి పేటలో ఫోటో తీయించారు. తర్వాత లభ్యమైన ఈ ఫోటో చూసిన వారికెవరికైనా… బ్రిటిష్‌ వారు నర్సీపట్నం డాక్టరు చేత రామరాజు శరీరం వెనుక వైపు తుపాకీ కాల్పులున్నాయని తప్పుడు రిపోర్టు రాయించారని అర్థమౌతుంది. రామరాజు ధైర్యసాహసాలు, దేశభక్తి, గెరిల్లా యుద్ధ నైపుణ్యం, మానవత్వం, వ్యక్తిగత జీవితంలో నిజాయతీ, క్రమశిక్షణ, తను నమ్మిన మార్గాన్ని ఆచరించడంలో నిబద్ధత, ప్రజల కార్యాచరణ పట్ల ఆయకున్న విశ్వాసం, నిరంతరం ఉత్తేజాన్నిస్తాయి. అడవిబిడ్డలు రామరాజును పూర్తిగా విశ్వసించి ఆయన వెంట నడవడానికి ఇవే ప్రధాన కారణమయ్యాయి.
నాడూ నేడూ అదే నిర్బంధం
నేడు రామరాజు, కొమరం భీమ్‌, రాంజీ గోండు, సోయం గంగులు, గంటం దొర, ఎండు పడాల్‌, కొమురం సూరు, బిర్సా మూండా, సమ్మక్క, సారక్క, లాంటి ఎందరో ఆదివాసీ పోరాటయోధుల త్యాగధనుల త్యాగానికే పాలకులు తూట్లు పొడిచి ఆదివాసీల ఉనికినే లేకుండా చేస్తున్నారు. సెజ్‌లు, భూ సేకరణలు, భారీ విధ్వంస ప్రాజెక్టులు, మైనింగ్‌ పేరుతో గిరిజన చట్టాల అతిక్రమణను నాటి బ్రిటిష్‌ పాలకులకు ఏమాత్రం తీసి పోని విధంగా నేటి ప్రధాని మోడీ, రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు వ్యవహరిస్తున్నారు. పోడు భూముల సాగుదారులను భూముల నుండి వెళ్ళగొట్టడం, దాడులు, దౌర్జన్యాలు, నిర్బంధం మళ్ళీ నాటి పరిస్థితులనే తలపిస్తున్నాయి. ‘అభివృద్ధి’ పేర లక్షల ఎకరాల అడవిని ధ్వంసం చేయడానికి బహుళ జాతి, కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టి పాలకులే పర్యావరణానికి తీవ్రమైన హాని చేస్తున్నారు. అల్లూరి పోరాట త్యాగాల స్ఫూర్తితో ఆదివాసీ హక్కుల కోసం, ఉనికి కోసం పోరాటం కొనసాగించడమే అల్లూరికి మనం ఇవ్వదగిన నిజమైన నివాళి.
– బండారు రవికుమార్‌,
9121080160 

Spread the love