కర్కోట కాశ్మిర కళ ప్రపంచం

కాశ్మీరలోయ అశోకుడి కాలం నుండీ భారతీయ, సింధు సంస్కృతిలోని భాగమే. ఇక్కడి చరిత్ర తెలుసుకోవాలంటే, కల్హనుడు క్రీ.శ. 1148 లో రాసిన రాజ తరంగిణి అనే గ్రంథం చదవాలి. ఇదే ఇక్కడి చరిత్ర గురించి చెప్పే పాఠాలకు ముఖ్య ఆధారం.
‘కర్కోటకుడు’ అనే మాటకి తెలుగులో రాయి లాంటి మనసున్నవాడు అని. నిర్ధాక్షిణ్యుడు అని అర్ధం చెప్పడానికి ఉపయోగిస్తారు. నిజానికి ‘కార్కోటకులు’ అనే వారు ఒక కాశ్మీర రాజ వంశీయులు. వారు క్రీ.శ. 625 నుండి 855 వరకు కాశ్మీర్‌ను పాలించారు. వారిలో క్రీ.శ. 724 నుండి 750 వరకూ పాలించిన లలితాదిత్యుడు ముఖ్యుడు. రాజ తరంగిణి అనే ఒక గ్రంథం ప్రకారం లలితాదిత్యుడు తన సైనిక దళాలతో దాడి చేసి ఉత్తర భారతంలో చాలా భాగం చేజిక్కించుకోవడమే కాక, బంగాళాఖాతం వరకూ దాడులు చేశాడు (బంగాళాఖాతం అంటే మన తెలుగు ప్రాంతాలు వస్తాయి కదా). ఈ దాడులు రాజుల మధ్య జరిగే యుద్ధాలు అనే కన్నా, దౌర్జన్యం, లూటీ చేయడంలో మిన్నగా చెప్పవచ్చు అని రాజ తరంగిణి వివరించింది. అలా దాడి చేసి ఈ లలితాదిత్యుడు వెలకట్టలేనంత బంగారం, వెండి, ఇత్తడి వంటి ధనాన్ని వస్తు రూపంలో తీసుకుపోయాడు. ఇతని కాలంలో ఎంతో ధనం వెచ్చించి కట్టిన మార్తాండ, లేదా సూర్య మందిరం కాశ్మీర కళా ప్రపంచంలో మైలురాయి అయింది.
కాశ్మీరలోయ అశోకుడి కాలం నుండీ భారతీయ, సింధు సంస్కృతిలోని భాగమే. ఇక్కడి చరిత్ర తెలుసుకోవాలంటే, కల్హనుడు క్రీ.శ. 1148 లో రాసిన రాజ తరంగిణి అనే గ్రంథం చదవాలి. ఇదే ఇక్కడి చరిత్ర గురించి చెప్పే ముఖ్య ఆధారం.
ఇతను తన కాలం గురించి వివరంగా రాశాడు. కానీ పూర్వ కాల చరిత్ర గురించి రాసేటప్పుడు కొంత ప్రాంతీయ కథలు, కథానాయకుల వివరాలతో కలిపి రాయడంతో అంత స్పష్టత వుండదు. కల్హనుడు అక్కడి కట్టడాలు, నిర్మాణాలు అన్నీ వివరించాడు. కాశ్మీరలోయ ప్రాంతం క్రీ.పూ. 3వ శతాబ్దంలోని మౌర్యుల సామ్రాజ్యంలోని భాగమే. అశోకుడు శ్రీనగర్‌ అనే కాశ్మీర రాజధానిని పాండ్రేధన్‌ అనే ప్రాంతం దగ్గర, ప్రస్తుతం వున్న ఆధునిక శ్రీనగర్‌కి దక్షిణాన నిర్మించాడు. ఆ తరువాత పాలించిన కుషానులు నిర్మించిన పట్టణాలు కణిస్కపుర (ఈ నాటి కనిస్‌పూర్‌). హువిష్కపురా (ఈనాటి ఉస్కూర్‌) కనిష్కుడు క్రీ.శ. 2వ శతాబ్దంలో కాశ్మీర్‌లో 4వ బౌద్ధ సంఘ సంఘటితం జరిపించాడు. ఉస్కూర్‌ బౌద్ధ ప్రాముఖ్య స్థలంగా చాలా శతాబ్దాల వరకూ గుర్తించబడింది.
కార్కోటకుల పూర్వ కాలం: శ్రీనగర్‌కి దగ్గరిలోని హరవాన్‌ అనే ప్రదేశంలో కుషానులు కట్టించిన బౌద్ధ ఆరామాలు చాలాకాలం బౌద్ద భిక్కులకు నివాస స్థలాలైనాయి. ఆపై అక్కడ మిగిలినవి కొద్ది శిధిలాలే అయినా కాశ్మీర కళా పద్ధతులు, నిర్మాణాలను వివరిస్తాయి. ఇక్కడి చైత్య గృహం, మహారాష్ట్రలోని కొండవీటి చైత్య గృహాన్ని పోలి వుంటుంది. నేలపై పరచిన మట్టి పలకలు ఒక విచ్చిన్న తామర పూవులాగా అమర్చారు. మధ్యన వున్న రంధ్రం ఆధారంగా బహుశా ఒకనాడు బౌద్ధ స్థూపం అక్కడ నిలిచి వుండవచ్చు. వరుస హంసలు, మౌర్యుల పద్ధతిని, ఆపై కూర్చున్న మానవాకృతులు – కుషానుల పద్ధతిని, వాటి మధ్య రాసినట్టు చెక్కిన ఖరోష్టి లిపి కూడా కుషానుల తరువాత వచ్చిన వారి సామంతుల పద్ధతి, హంసల మధ్య చెక్కిన ఆకు పూల డిజైన్లు గుప్త రాజుల పద్ధతిని తెలుపు తుంది. అంటే ఈ రాజుల ప్రభావాలు కూడా ఈ కట్టడంలో కనిపిస్తుదంటే ఈ కట్టడం క్రీ.శ. 5వ శతాబ్దపు ఆఖరి దశ లేదా ఆ పై శతాబ్దపు కట్టడం అయి వుండాలి. గుప్తుల కాలం క్రీ.శ. 5వ శతాబ్దం కదా!
క్రీ.శ. 5 లేదా 6 శతాబ్దాలలలో కాశ్మీర్‌లోని కొన్ని రాతి శిల్పాలూ దొరికాయి. బిజ్‌ బెహరా అనే స్థలంలో కార్తికేయ శిల్పం దొరికింది. ఇందులో ఒక అనుభవం వున్న పనితనం కనిపిస్తుంది. ఇరాన్‌ వారి శిల్పకళ పద్ధతిలో చెవులకు పక్కన దొప్పల లాంటి ఆభరణం చెక్కబడింది. నడుముకి ఖడ్గం, పట్టీ, దానిపై చెక్కిన ముత్యాల నగలు హూణ సంప్రదాయాన్ని తెలియజేస్తుంది. హూణుల నాణేలపై ఇలాంటి ముత్యాల నగలు కనిపిస్తాయి. అలాగే వస్త్రం చెక్కిన మడతల పద్ధతిలో ఆగేయ ప్రాంతం, గాంధార – కుషాన శిల్ప కళ పద్ధతి కనిపిస్తుంది. ఈ శిల్పం శ్రీ ప్రతాప్‌సింగ్‌ మ్యూజియం, శ్రీనగర్‌లో భద్రపరచబడింది. అలాగే క్రీ.శ. 5,6 శతాబ్దాలకు చెందినదే ఒక లోహపు బుద్దుడి శిల్పం దొరికింది. ఇది అభయముద్రలో దర్శనమిస్తుంది. ఇదీ ఆ ప్రతాపసింగ్‌ మ్యూజియంలోనే భద్రపరచబడింది.
కార్కోటకులు : వీరి రాజ్యాన్ని దుర్లభవర్ధన (క్రీ.శ. 625 నుండీ క్రీ.శ.661), మరియు రెండవ ప్రతాపాదిత్య (క్రీ.శ.661 నుండి 711) స్థాపించారు. కానీ తరువాత వచ్చిన లలితాదిత్య కాలంలోనే శాశ్వతంగా నిలిచే రాతి కట్టడాలు, లోహ శిల్పాలు చేయబడ్డాయి. లలితాదిత్యుడు కట్టించిన మార్తాండ మందిరం ప్రసిద్ధి చెందింది. ఇది సూర్యుడి మందిరం. దీర్ఘ చతురస్త్రాకారంలో కట్టించిన ఈ మందిరానికి పెద్ద గోడలు, అందమైన మందిరం, పశ్చిమ దిక్కున మరి రెండు చిన్న మందిరాలు కట్టబడ్డాయి. అలాగే వాకిలిలో 84 చిన్న మందిరాలు, వాటిలో సూర్యుడి కథలు, విగ్రహాలు చెక్కబడ్డాయి. కానీ ఇప్పుడు అవి ఏవీ లేవు. క్రీ.శ. 8వ శతాబ్దపు మందిర శిథిలాలు మటుకే మిగిలాయి. వివరాలన్నీ రాజ తరంగిణిలోనే దొరికాయి. క్రీ.శ. 6వ శతాబ్దంలో అక్కడ ఒక మందిరం కట్టబడితే దానిని లలితాదిత్యుడు మళ్లీ పెద్ద మందిరంగా మార్చి కట్టించాడు. అలెగ్జాండర్‌ కునింగమ అని బ్రిటీషరు రాసిన ప్రకారం కాశ్మీర్‌ మందిరాలు గ్రీకు మరియు రోమనుల మందిర నిర్మాణ పద్ధతిలో వున్నాయి. పురాతనం నుండీ వస్తున్న చెక్క మందిరాల రీతిలోనే ఆ పై కట్టిన రాతి మందిరాలూ కట్టబడ్డాయి. క్రీ.శ. 8వ శతాబ్దంలో ఇక్కడ బౌద్ధం చాలా ప్రబలింది. పరిహాసపుర అనే పట్టణం అక్కడి ముఖ్య పట్టణం అయింది. రాజ తరంగిణి ప్రకారం అది బౌద్ధానికి ప్రధాన పట్టణం. ఆ పట్టణం అతి వైభవంగా కట్టబడింది. అది ఇంద్రలోకాన్ని తలదన్నేటంతటి అందమైన పట్టణమట. అక్కడి లలితాదిత్యుడు నిర్మించిన మందిరాలలోని విగ్రహలు చెప్పుకోదగ్గవి. రాజ తరంగిణి ప్రకారం ముక్తేశ్వర విష్ణు విగ్రహం 84,000 తులాల బంగారం, సుమారు 5 టన్నులతో చేయబడింది. పరిహాస కేశవ విష్ణువిగ్రహం 21 టన్నుల వెండితో చేయబడింది. బృహద్‌ బుద్ధ విగ్రహం 300 టన్నుల రాగితో చేయబడింది. ఇవన్నీ లలితాదిత్యుడు నిలువ చేసుకున్న ధనంతోనే చేయబడ్డాయి. ఇప్పుడు ఈ విగ్రహాలేవీ ఇక్కడ లేవు. కానీ లదాక్‌లో ఆల్చీ అనే ప్రదేశంలో ఒక చిత్రపటం దొరికింది. అందులో ఈ విగ్రహాలు చిత్రించబడ్డాయి. ఇవి 30 నుండి 40 మీటర్ల మధ్య పొడవుతో వుండేవి. ఇంత పెద్ద శిల్పాలు మళ్లీ నలందలో, మహారాష్ట్రలోని కన్హేరీలోనూ, ఆఫ్ఘన్‌లోని బామియాన్‌లోనూ కనిపించాయి. లలితాదిత్యుడి మంత్రి, చంకుణ కూడా ఒక పెద్ద బౌద్ధ స్థూప నిర్మాణం చేశాడు. పరిహాసపురంలో లలితాదిత్యుడి మందిరం, చంకుణ నిర్మించిన స్థూపం కవల పిల్లల్లా నిలుచుని వుండేవట.
పాండ్రేధన్‌లో కార్కోటకుల కాలంలోనే ఒక హైందవ మందిరం క్రీ.శ. 8,9 శతాబ్దాలలో కట్టబడింది. అది చిన్నది, సామాన్య గుడిసె ఆకారంలో కట్టబడింది. ఇదీ పాత కాలంలో చెక్కతో నిర్మించే నిర్మాణ పద్ధతిలోనే కట్టబడింది. దానిపై కప్పు ఏటవాలుగా వుండి మంచు పడితే జారి పడిపోయేటట్టు నిర్మించబడింది. మరి హిమాలయాల్లోని చలికాలం మంచు రోజులు కదా! ఈ మందిరాన్ని ఒక నీటి తటాకం మధ్య కట్టారు. మందిరం కింద వైపున, ద్వార బంధానికి ఏనుగుల వరుసల వంటి శిల్పాలు తప్ప మరే అలంకారమూ లేదు. మందిర ద్వార బంధానికి పై భాగాన లకులీశుడి శిల్పం చెక్కబడింది. ఇది లలాటబింబ స్థానంలో వుంది. ఆ స్థానంలో ఏ గుర్తు చెక్కబడితే ఆ మందిరం ఆ రూపానికి అంకితం అని అర్ధం చేసుకోవాలి. లకులీశుడి శిల్పం అక్కడ వుందంటే అది శైవమందిరం. ఆనాటికి కాశ్మీరంలో పాశుపతశైవం ప్రబలి వుండవచ్చు.
పాండ్రేధన్‌లో కొన్ని వేరు వేరు స్థలాల్లో కొన్ని విడి శిల్పాలు దొరికాయి. ఇవీ క్రీ.శ. 8వ శతాబ్దపు ఆఖరిదశ లేదా క్రీ.శ. 9 వ శతాబ్దపు మొదటి దశగా గుర్తించారు. ఒక శిల్పం ఇంద్రాణి, ఇంద్రుడి దేవేరిది. ఆమె చేతిలో వజ్ర ఆయుధం, వెనుక ఏనుగు వుండడం వలన అలా గుర్తించడం అయింది. ఈమె వస్త్రం ఇరానీ వారి డిజైనులో వుంది. క్రీ.శ. 2వ శతాబ్దపు గాంధార శైలిలో వస్త్రం మడతలు చెక్కబడ్డాయి. నిలుచున్న భంగిమ క్రీ.శ. 5వ శతాబ్దపు గుప్తుల కాలం నాటి శిల్పం గుర్తుకు తెస్తుంది. బహుశా ఇక్కడ వేరు వేరు పరంపర శిల్పులు వచ్చి మందిర నిర్మాణాలలో, శిల్పం తయారీలో పాల్గొని వుండవచ్చు.
ఉత్పల రాజవంశీయులు : క్రీ.శ. 855 నుండి 939 వరకూ కాశ్మీర్‌ రాజ్యాన్ని ఉత్పల వంశీయులు పాలించారు. క్రీ.శ. 855 – 883 వరకూ పాలించిన అవంతి వర్మన్‌ అవంతిపురాన్ని తన ముఖ్య పట్టణంగా నిర్మించి ఈ రాజ్య వంశ స్థాపన చేశాడు. అదే ఈనాటి వంతిపూర్‌. అవంతిపురాలో ఇతను అవంతీశ్వరుడి మందిరమూ, అవంతి స్వామి అనే విష్ణు మందిరమూ నిర్మించాడు. ఇవి లలితాదిత్యుడు కట్టిన మార్తాండ మందిర నిర్మాణ పద్ధతిలో కట్టినా, పరిమాణంలో చిన్నవి. ఈ అవంతిపురాలో రెండు నల్లరాతి శిల్పాలూ దొరికాయి. వాటిని శ్రీ ప్రతాప మ్యూజియం, శ్రీనగర్‌లో భద్రపరిచారు. ఒక శిల్పం చతుర్ముఖ విష్ణు. మరొకటి చతుర్ముఖ బ్రహ్మ. విష్ణురూపం మధ్య ముఖం కాగా, రెండు వైపులా వరాహం, సింహం ముఖాలు, వెనుక వైపు ఒక రాక్షస ముఖం వుంటాయి. ఇవి వరాహ, నరసింహ అవతారాలు కాదు. ఇవి పంచరాత్ర వైష్ణవ సంప్రదాయంలో కొలిచే వ్యూహాలు. సింహం – సంకర్షణ, వరాహం – ప్రద్యుమ్నుడు, రాక్షస ముఖం – అనిరుద్దుడు, మానవ శిరస్సు – వాసుదేవుడు. ప్రతీ వ్యూహమూ రెండు కార్యాలలో నిమగమై వుంటుంది. జ్ఞానము, వీర్య, తేజస్సు వీటి గుణాలు. కాశ్మీరులో పంచరాత్ర వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన చతుర్ముఖ విష్ణురూపాలు చాలా వున్నాయి. అవంతిపురాలో దొరికిన ఈ చతుర్ముఖ విష్ణు చక్కటి నునుపైన శిల్పం, పశ్చిమ మధ్య ఆసియాకి చెందిన శిల్పాల ముఖరీతి కనిపిస్తుంది. ఇక్కడ దొరికిన మరో శిల్పం చతుర్ముఖ బ్రహ్మ. ఈ శిల్పం ఏ అలంకరణ లేకుండా ఒక సాధురూపంలో వుంటుంది.
ఆపై రాజ్యాలు చేసిన లోహార రాజ వంశీయుల కాలం క్రీ.శ. 10 నుండి 14వ శతాబ్దం వరకు. వారి కాలంలోని 12వ శతాబ్దానికి చెందిన చతుర్ముఖ విష్ణు రూపం, శంఖం, పద్మం చేత బట్టి వుండగా, ఆయన ఆయుధాలు మానవాకారంలో గదాదేవి, చక్ర పురుషుడిగా చెక్కబడ్డారు.
-డా||యమ్‌.బాలామణి,
8106713356

Spread the love