ఎల్లోరా ఒక‌ శిల్పా ప్రదర్శన శాల….

అజంతా, ఎల్లోరా అంటూ రెండు కళా స్థావరాలను మనం కలిపి కవల పిల్లల పేర్లలా పలుకుతుంటాం. ఈ రెండు ప్రదేశాలు పక్కపక్కన వుండే కారణం తప్ప, మిగిలిన అన్ని విషయాల్లో ఎంతో వ్యత్యాసం వుంది ఈ రెంటి మధ్య. అజంతా క్రీ.శ. 5వ శతాబ్దానికి కట్టడాలు పూర్తి అయితే, ఎల్లోరా క్రీ.శ. 8వ శతాబ్దపు నిర్మాణం. అజంతా బౌద్ధ నిర్మాణ గుహలైతే, ఎల్లోరా హైందవ ప్రాముఖ్య గుహలు.
ఎల్లోరా పూర్తి పేరు ఎల్లూరు పురం. మహరాష్ట్రలోని ఈ ప్రాంతంలో ఇలవల అనే అసురుడు పరిపాలించాడనీ, అతని పేరు మీద ఈ ప్రాంతం ఇలవాలపురంగా పిలువబడేదనీ, అగస్త్య మహర్హి చేత అతను వధించబడ్డాడనీ ఒక కథ. ఈ ఎల్లోరా గుహలు అగ్పిపర్వతాల లావా వలన ఏర్పడిన దక్కని కొండిపాంతమే. ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన మూడు మత నిర్మాణాలు కనిపిస్తాయి. ఏది ముందు, ఏది వెనుక అని చూసేకంటే, క్రీ.శ. 6,7,8 శతాబ్దాలలో ఇవి ముందు వెనుకలగా కట్టబడ్డాయి. ఇక్కడ త్రైకూటకులు, వాకాటకులు, కలచూరులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, చివరగా యాదవులు… వీరందరూ తమ తమ గుర్తుగా గుహలు చెక్కించారు. క్రీ.శ. 8వ శతాబ్దంలో రాష్ట్రకూటులు కట్టించిన 16 వ నంబరు గుహ ఇక్కడ చెప్పుకోదగ్గ నిర్మాణం. ఇది శివుడి కైలాస పర్వతంలా చూపించాలని ఒకే పెద్ద కొండని తొలచి కట్టినదే కైలాసనాథ్‌ మందిరం. ఆ కొండని పై నుంచీ కిందకి చెక్కుతూ అన్ని లక్షణాలతో చెక్కిన గొప్ప నిర్మాణం, ఆశ్చర్యపరిచే శిల్పకళ. ఇంతకుముందు శతాబ్దాలలో కొండ తొలిచి మందిర నిర్మాణాలు చాలా చోట్ల జరిగాయి. కానీ దీని ప్రత్యేకత వేరు.
ఈ 16వ గుహ నిర్మాణం, గుహ తొలిచి నిర్మించిన మందిర కళలలో పరాకాష్ఠనందుకుంది. ఇక్కడ గుడి నిర్మాణంలా స్వతంత్రంగా నిలుస్తున్న మందిరం మధ్యన నిలిపి, అదే కొండ నుంచి నంది మంటపం, ముఖ్యద్వారం, చుట్టూతా మరికొన్ని మందిరాలు, మరియు కొండని గూడులా తొలిచి అందులో శిల్పాలు చెక్కబడ్డాయి. ఒకే కొండని తొలిచి మందిరాలు, శిల్పాల ఆవరణగా నిర్మించబడింది. బయట నుండి చూస్తే ఇది మొత్తం కొండలాగే కనిపిస్తుంది కానీ మరే నిర్మాణమూ బయటకు కనిపించదు.
క్రీ.శ.735 – 757 వరకు పాలించిన రాష్ఠ్ర కూట రాజు దంతిదుర్గ చేసిన ఆలోచనే ఇది. అయినా ఈ మందిరం పూర్తి చేయించింది ఒకటవ కృష్ణ, క్రీ.శ.757 – 773 వరకు పాలించిన రాష్ట్ర కూటరాజు. ఈ మందిరానికి ప్రవేశించటానికి పెద్ద ద్వారం మధ్యలో చెక్కి, ఆ ద్వారం ఎడమ పక్క గోడపై శైవ పురాణానికి సంబంధించిన శిల్పాలు, కుడి పక్క విష్ణు పురాణ కథలు చెక్కబడి ఒక ప్రదర్శన శాలలా కనిపిస్తుంది. ఆ ద్వారం ఒక రాతి పరదాలా నిలిచి మనని లోపలికి పంపుతున్నట్టుగా అనిపిస్తుంది. లోపలికి వెళితే మధ్యన ముఖ్య మందిరమూ, మూడు పక్కలా మరికొన్ని మందిరాలు చెక్కబడ్డాయి. ముఖ్యమందిరం శైవ మందిరం, దాని చుట్టూ ప్రదక్షిణా పథం, పెద్ద ఏనుగుల శిల్పాలు చెక్కి వుంటాయి. మందిరం బయట వైపు కూడా పెద్ద పెద్ద శిల్పాలు చెక్కబడి గొప్ప ప్రదర్శన శాలలా కనిపిస్తుంది. ఈ మందిర నిర్మాణంలో దక్షిణాది మందిరాల నిర్మాణ పద్ధతులు ఎక్కువగా కనిపిస్తాయి. శిల్పాలలో కన్పించే పొడవైన శరీర కవళిక, ఆభరణాలు, ముఖం చెక్కిన తీరు, కొనతేలిన కిరీటం, ఇవన్నీ దక్షిణ పద్ధతి శిల్పాలను గుర్తుతెస్తాయి. కళాచరిత్రకారుల ఒక ఆలోచన ప్రకారం ఈ మందిరం పల్లవులు కట్టించిన కంచీపురంలోని కైలాస నాథమందిరం నుంచి పద్ధతులూ, శైలీ తీసుకోబడ్డాయనీను. రాష్ట్రకూటులు పశ్చిమ లేదా బదామి చాళుక్యులపై విజయం సాధించి సుమారు క్రీ.శ. 750 నుండి 973 వరకూ రాజ్యం చేశారు. అందువలన చాళుక్యుల శైలి కూడా ఇక్కడ వచ్చి వుండవచ్చు. కాకపోతే ఆ ముందరి నిర్మాణాల కంటే ఈ మందిరం చాలా పెద్ద ఎత్తున చెక్కబడింది.
ఇక్కడ చెక్కిన శివపురాణ కథలు, కంచీపురం కైలాసనాథ మందిరం, ముంబయి వద్ద వున్న ఎలిఫంటా గుహలలో చూసినవే అయినా ఇక్కడ వివరంగా, మరింత పెద్దగా మరిన్ని కథలు చేర్చి ఒక పెద్ద ప్రదర్శన శాలలాగా కనిపిస్తాయి. ఇక్కడి నంది మంటపానికి తూర్పుగా చెక్కిన అంధకాసుర వథ చేస్తున్న శివుడి శిల్పం పది చేతులతో, ఏనుగు రూపంలోని అంధకాసురుడిని చంపి ఏనుగు చర్మం ఒక చేతపట్టి, మరో చేత్తో పార్వతిని అనురాగంతో దగ్గరికి తీసుకుని పట్టుకుని, క్రోధం, అనురాగం రెండు భావాలూ చూపిస్తున్న శివుడి శిల్పం ఇది. పక్కనే సప్తమాతృకలు చిన్న రూపాలుగా చెక్కబడ్డాయి. ఈ అంధకాసురుడనే రాక్షసుడి రక్తం కింద పడితే అనర్ధమనీ, దేవతలు తమ శక్తిని శివుడికి సాయంగా పంపుతారు. ఈ సప్తమాతృకలు చెక్కి వుంటే అది అంధకాసుర వథ చేస్తున్న శివుడి కథ అని కూడా అర్ధం చేసుకోవాలి.
ఇక్కడి మరో గొప్ప శిల్పం ఎన్నో చేతులతో చెక్కబడ్డ దశకంఠుడు కైలాస పర్వతాన్ని కదల్చడానికి ప్రయత్నించే శిల్పం. ఈ కథ మనం ఎలిఫంటా గురించి మాట్లాడినప్పుడూ మాట్లాడుకున్నాం. రావణాసురుడు కైలాస పర్వతాన్ని తనదారికి అడ్డు తొలగించడానికి ఎత్తబోతే, శివుడితో పచ్చీస్‌ ఆడుతున్న పార్వతి భయపడి శివుడికి దగ్గరగా చేరుతుంది. శివుడు కాలి బొటనవేలితో కిందకి నొక్కితే, అర్ధమైన రావణుడు అష్టకం పాడతాడు. కథ ఇదే ఇక్కడ కూడాను. కానీ ఇక్కడ చెక్కిన పద్ధతి మరింత రసభరితంగా వుంటుంది. మండపానికి దక్షిణ భాగంలో చెక్కిన ఈ శిల్పం గోడలోపలకి కథ జరుగుతున్నట్టు ఒక నాటక పక్కీలో వుంటుంది. పార్వతి భయంతో జరిగినట్టు, మరో చెలికత్తె స్త్రీ శిల్పం భయంతో లోపలికి పరిగెడుతున్నట్టు వుండగా, నిర్భయంగా భీభత్సంగా కైలాసం ఎత్తుతున్న రావణుడు ఆ శిల్పం అంతా ఆక్రమించి కనిపిస్తాడు.
ఎల్లోరాలో దుర్గాదేవి రూపం చెప్పుకోదగినది. ఎనిమిది చేతులతో, సింహంపై రెండు కాళ్లూ ఒకే వైపుకి పెట్టి కూర్చుని, మనిషి ఆకారంలో రెండు కొమ్ములతో గద ఎత్తి వున్న మహిషాసురుడి పై బాణం ఎక్కుపెట్టి కనిపిస్తుంది. ఈ గుహలలో మకరంపై గంగ, తాబేలుపై యమున శిల్పాలు చాలా చోట్ల కనిపిస్తాయి. అలాగే రావణానుగ్రహ శివుడి శిల్పం, మహిషాసురమర్దిని – దుర్గ శిల్పాలు మరిన్ని గుహలలో ఇక్కడ కనిపించినా, కైలాస మందిర గుహలోని చెక్కడాల అందం నిపుణత వేరు. గంగ యమున శిల్పాలు ఎన్నో చోట్ల చెక్కడంలోని అర్ధం హిమాలయాలు, కైలాస పర్వతం ఇది అని మనకు సూచించడమే. నాట్యం చేస్తున్న నటరాజ శివుడి కాళ్లలో ఎముక లేనంతగా కదులుతున్నట్టు అందమైన భంగిమలో శిల్పం చెక్కబడింది.

OLYMPUS DIGITAL CAMERA

29వ గుహని ‘ధూమరలేన’ గుహ అని కూడా అంటారు. ఇదీ శైవ ప్రాముఖ్య గుహ. ఈ గుహలో ఒక జలపాతం పడుతూ వుంటుంది. ఆ నీటి ధార శివుడి కనుబొమ్మల మీద నుంచి కింద పడుతున్నట్టు చూపిస్తూ శివుడి శిల్పం చెక్కబడింది. ఈ గుహలోని శిల్పాలని చాలా పెద్దవిగా చెక్కినా, కాలి చేతి వేళ్లు చెక్కిన ప్రమాణం చిన్నవిగా కనిపిస్తాయి.
21వ గుహ రామేశ్వర గుహ. ఇది కలచూరీలు క్రీ.శ. 6వ శతాబ్దంలో నిర్మించినది. ఇది కూడా అందమైన శిల్పాలతో, దర్శనీయ గుహగా పేరుపడింది. పార్వతి శివుడి కోసం తపస్సు చేస్తున్న శిల్పం, శివపార్వతుల కళ్యాణం, శివపార్వతులు విరామంగా కూర్చోనున్న శిల్పం, నాట్యశివ నటరాజ శిల్పం, దుర్గ వంటి కొన్ని అందమైన శిల్పాలతో పాటు గుహకు అటూ ఇటూ గంగ యమున శిల్పాలు, గుహ అంతా చక్కటి డిజైన్లతో నిండి వుంటుంది.
ఈ విధంగా గుహలలో పెద్దపెద్ద శిల్పాలే కాదు, 16వ నెంబరు గుహ, ఏదైతే కైలాస నాథ మందిరంగా చెక్కబడిన మందిరమూ, గుహ అని రెండు పేర్లతో పిలవదగ్గ గుహ ఏదైతే వుందో అక్కడ మరో అద్భుత శిల్పకళ వుంది. అక్కడ గంగ, యమున, సరస్వతి తో పాటు ఇంద్ర, అగ్ని, వాయు, సూర్య, ఉష వంటి నవగ్రహాలలోని రూపాలు, గణేశ, అర్ధనారీశ్వర, అన్నపూర్ణ, దుర్గతో పాటూ హరిహర రూపం; వీటితో పాటు, దశావతారాలు, కృష్ణుడివి 12 బాల్యకథలు, నంది మండపంలో శివుడికి ఎదురుగా ఉత్తర గోడపై మహాభారతం, దక్షిణ గోడపై రామాయణం కథలు చెక్కబడి వున్నాయి. ఎన్నో పురాణాలు ఇతిహాసాలు చూపే ప్రదర్శనా మందిరంలా నిల్చున్న అద్భుత గుహ ఇది.
బౌద్దగుహలు : ఇక్కడ బౌద్ధ, జైన గుహల మందిరాలు కూడా శ్రద్ధతో చెక్కబడ్డాయి. హిందూ, జైన, బౌద్ధ శిల్పాలు చెక్కిన తీరులో పోలికలు కనిపిస్తాయి. బౌద్ధ గుహలలో 2,3 అంతస్తులున్న గుహలు అజంతా గుహలని గుర్తు తెస్తాయి. ఇక్కడి గుహలలోనూ విహారాలు, ప్రార్థనా మందిరాలు, బౌద్ధ భిక్కులు నివసించే గదులు, వంటగదులు కనిపిస్తాయి. బోధిసత్వడు, భిక్కులు, గౌతమ బుద్ధ శిల్పాలతో పాటు వెనుకగా బుద్దుడి విగ్రహం చెక్కిన గుహలూ వున్నాయి. 10వ నంబరు గుహని విశ్వకర్మ గుహ అనీ, లేదా వడ్రంగి గుహ అని కూడా అంటారు. ఇక్కడి రాతి స్తంభాలకు చెక్కవంటి నగిషీ ఇవ్వబడింది. పదవ గుహలోని వ్యాఖ్యాన ముద్రలోని బుద్దుడు వెనుక చెక్కిన బోధివృక్షం అజంతా గుహలని గుర్తు తెస్తుంది. గోడలపై మైత్రేయ, తార, అవలోకితేశ్వర, మంజుశ్రీ శిల్పాలు, నాగరాణి, వాద్యకారుల శిల్పాలు కనిపిస్తాయి.
జైన గుహలు : 9,10, 5 వ నెంబరు గుహలు జైన గుహలు, దిగంబర జైన సంబంధ గుహలు. ఇది బౌద్ధ, హిందూ గుహలకంటే చిన్నవి, తరువాత చెక్కబడినవి. 13 వ నంబరు గుహ జైనంలోనే చెక్కిన ఇంధ్ర సభ గుహ. 6వ నెంబరు గుహ పేరు జగన్నాధ సభ. ఈ 13వ నెంబరు గుహ చాలాకాలం వరకూ నిర్మాణం జరుగుతూనే వుండేదట. ఢిల్లీ సల్తనత్‌ యొక్క ఆక్రమణ సమయంలో ఆగిపోయిందట. ఈ జైన గుహలు సుమారు క్రీ.శ. 9, 10 శతాబ్దాల గుహలు. ఇక్కడి శిల్పాలలో 24 జైన గురువులు, దేవతలు, యక్ష, యక్షిణులు, భక్తులు, పార్శ్వనాథ, బాహుబలి, సరస్వతి, గోముఖ, అంబిక, చక్రేశ్వరి, పద్మావతి, క్షేత్రపాల, హనుమాన్‌ శిల్పాలు కనిపిస్తాయి. ఇంద్రసభ గుహల పైన కప్పులోనూ శిల్పాలు చెక్కడాలు కనిపిస్తాయి.
– డా||యమ్‌.బాలామణి, 8106713356

Spread the love