కల్తీ లేని కథలు

ఎటువంటి సమస్య ఉద్భవించినా పరిష్కరించుకోగలిగే తెగువ ఉండాలి. అందుకోసం సరైన మానసిక సమర్థత కావాలి. ఈ లక్షణాలు బలంగా వినిపిస్తాయి వంజారి రోహిణి కథల్లో. కవయిత్రిగా, రచయిత్రిగా పాఠక లోకానికి సుపరిచితమైన రోహిణి ఇటీవలే తన తొలి కథల పుస్తకాన్ని ‘నల్ల సూరీడు’ పేరుతో తీసుకువచ్చారు. కథలు నిజాయితీ, మానవత్వం, సాదాసీదాతనం నిండుకుని ఉదాత్తమైన రూపాన్ని సంతరించున్నాయి అని చెప్పవచ్చు. ”నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్లు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి, ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను.” అంటూ ప్రకటించారు రచయిత్రి. తన జీవితంలో తాను ఎదుర్కొన్న, చూసిన సంఘటనలను కథా వస్తువులుగా మార్చగలిగారు. ఊహా లోకానికి దగ్గరగా రాసే కథలకోసం అధివాస్తవిక ప్రపంచాన్ని సష్టించాల్సి వస్తుంది. చుట్టూ ఉన్న సమాజంలో నుంచే కథా వస్తువులు తీసుకోవడంతో రచయిత్రికి అధివాస్తవిక ప్రపంచాన్ని సష్టించే అవసరం పడలేదు. ఎక్కడా అనవసరమైన అలంకారాలతో కథల్లో సాగదీత కనబడదు. చెప్పాల్సిన అంశాన్ని ఎంతో సున్నితంగా, పాఠకులకు హత్తుకునేలా చెప్పడంలో సఫలమయ్యారు. కథలను ఎంతో సున్నితంగా స్పశించారు అంటే పాత్రలు ఏవైనా బేలగా ఉంటాయేమో అనుకుంటే అది పొరపాటే అవుతుంది. రోహిణి కథలలోని స్త్రీలు ఎటువంటి కష్టనష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా నిలదొక్కుకునే ధీరలు. అలాగే మానవ సంబంధాలకు అత్యంత విలువను ఇచ్చే కథలుగా తీర్చిదిద్దారు రచయిత్రి. ఆమె ఇప్పటిదాకా 70కి పైగా కథలు రాయగా, 65 కథలు వివిధ ప్రముఖ పత్రికలలో ముద్రితమయ్యాయి. వాటిలో నుంచి 21కథలను ఎంపిక చేసి నల్ల సూరీడు పుస్తకంగా వెలువరించారు. పుస్తకంలో చోటు సంపాదించుకున్న ప్రతి కథా పాఠకులను ఏదో ఒక కోణంలో ఆలోచింపజేస్తుంది. తోటి వారితో ప్రేమ పూర్వకంగా మెలగడాన్ని నేర్పుతాయి. బాహ్య రూపంతో మనుషుల గుణగణాలను అంచనా వేయకూడదని బోధిస్తాయి. మనిషి పొడ గిట్టకుండా మన చుట్టూ వలయాలు గీసుకుని మన బతుకుల్ని మనమే బందీలుగా మార్చేసుకున్న వైనాన్ని చక్కటి కథగా మలిచి మన నైతికతను నిలదీస్తారు ఆమె. భావావేశం, శగార వర్ణనలతో, నేల విడిచి సాము చేసే కథలను తాను కథలు రాయలేనని పుస్తకంలోని ముందు మాటలోనే ప్రకటించారు రోహిణి. అలాగే కథను ఫలానా విధంగానే రాయాలి అనే సూత్రాలు ఏమీ లేవని కూడా స్పష్టం చేసారు.
– నస్రీన్‌ ఖాన్‌
[email protected]

Spread the love