ముసలి తనానికి దసలి రైక

బాల్యం, యవ్వనం నడి వయసు దాటిన తర్వాత వృద్ధాప్యం వస్తుంది. ఏ కార్యాలైనా ఆ మూడు దశల్లోనే పూర్తి చేసుకోవాలి అనే రివాజు చలామణిలో వుంది. దసలి రైక అంటే పట్టు జాకెట్టు అన్నట్టు. అడవిలో చెట్ల మీద అల్లుకుంటది దసలి సన్నపు తీగలు. దీనితో నేత నేసి కుట్టిందే దసలి రైక. రైక అంటే రవిక. అందుకే ‘ముసలి తనానికి దసలి రైక’ నీ కెందుకు అంటరు. ఆ పట్టు రైక చాలా విలువ కలది, వృద్ధాప్యంలో నీకెందుకు అనే అర్థంలో వాడుతరు. వృద్ధుల మీద చాలా సామెతలు వుంటయి. ‘ముసలిది గంజికి ఏడిస్తే, ముసలోడు ఇంకేదో చివరన జ వచ్చేదానికి ఏడిచినట్టు’ అంటరు. ముసలమ్మ గంజికి అంటే తినే ఆహారం కోసం ఎదురు చూస్తే, ముసలాయన రకం వేరే అనే అర్ధంలో ఈ సామెతను వాడుతరు. వృద్ధాప్యం పూర్తిగా నిండిన తర్వాత బాల్యం లెక్కనే వుంటది వ్యవహారం. వృద్ధులను చిన్న పిల్లల లెక్కనే అరుసుకోవాల్సి వుంటది. అందుకే ‘పిల్లలు లేని ఇంట్ల ముసలోడు అంబాడినట్టు’ అంటరు. వృద్ధుల మీద ఇంక జోక్‌ కూడా వున్నది. భార్య లేనోల్లను పెళ్లి గురించి అడిగితే ‘నాకు ఇప్పుడెవలు ఇస్తరు పిల్లను’ అంటరు కానీ నాకెందుకు ఈ ముసలితనానికి పెళ్లి అని అనరు.
పడుసుతనం వేరు, ముసలి తనం వేరు. పడుసు అంటే యవ్వనం. ఈ వయసులో ఆలోచనలు, ఆవేశాలు కొంచెం కొట్టవచ్చేటట్టు కన్పిస్తయి. అందుకే వీల్లను ‘తంతె రాయి పదహారు వచ్చలు అయ్యే వయసు’ అంటరు. అంటే ఏదైనా రాయికి కాలు తాకితే దానిని పోట్రవుతు తాకుడు అంటరు. ఆ రాయి పగులతది కాని కాలి వేలు కాదని అర్ధం. అందుకే యవ్వనాన్ని ‘పడుసు పెడుసు’ అంటరు. అందుకే యువతరం ఆ వయసులోనే నేర్చుకోవాల్సింది, తెల్సికోవాల్సింది తెల్సికుంటరు.

– అన్నవరం దేవేందర్‌, 9440763479

Spread the love