సుంకర గోపాల్‌ కవిత ‘డిలీట్‌’

– డిలీట్‌

ఈ పాదాలు నావే
అడుగులు మాత్రం
రాజ్యం వేయమంటోంది
ఈ కళ్ళు నావే
చూపూలు మాత్రం
రాజ్యమే నిర్థేశిస్తుంది
నాలుగు అంగుళాల నాలుక మీద
రాజ్యమే రుచి ముద్రలు వేస్తోంది

గుండ్రంగా ఉన్న భూమిని
బల్ల పరుపుగా వాక్యం చేయమంటోంది
చేతులకు పసుపు, కుంకాలు పూసుకుని

దేశపు పటం మీద
పది వేళ్లను ముద్రించమంటోంది

రెండూ గడ్డే తింటున్నప్పుడు
రెండూ తెల్లని పాలే ఇస్తున్నప్పుడు
పిడకల్ని మండించే నిప్పు,
తోడు నిలబడే గాలికి లేని
ఈ రాతియుగపు ఆలోచన
హృదయం లేని మనిషిగా,
ఒకే ఒక జంతువును
కీర్తించడానికి, మొక్కడానికి
మీకేందుకు ప్రభువా!

నేనేం పాఠం చదవాలో,
ఏ బొమ్మ గీయాలో
నిర్ణయించడానికి
సిలబస్‌
మీ మేనిఫెస్టో కాదు,
పార్టీ ముసాయిదా పత్రం కాదు
అసలు ముందు
తొలగించాల్సిన
మొట్ట మొదటి అధ్యాయం నువ్వే
సుంకర గోపాల్‌ రాసిన ‘డిలీట్‌’ నేటి సామాజిక స్థితిగతులను ప్రతిబింబించే కవిత. ఈ కవిత ప్రజాసాహితీలో అచ్చయింది. గోపాల్‌ రాజకీయ కవి అని చెప్పడానికి ఈ కవితో చక్కటి ఉదాహరణ. ఈ మధ్యకాలంలో రాసిన మరికొన్ని కవితల్లో కూడా ఆ మార్క్‌ కనిపిస్తుంది.
శీర్షిక పెట్టేటప్పుడు ఎన్నో ఆలోచనలు చేస్తుంటాడు కవి. ప్రారంభ వాక్యాల్లోంచి శీర్షిక పెడతాడు. ముగింపు వాక్యాల నుంచి ఓ పదాన్ని శీర్షిక పెడతాడు. కవిత పూర్తి అర్థాన్ని స్ఫురించేలా కవితతో సంబంధం లేని ఒక పదం పెడతాడు. ఇక్కడ గోపాల్‌ కూడా కవిత అర్థాన్ని స్ఫురించేలా శీర్షిక పెట్టాడు. ఇంకో అడుగు ముందుకేసి ఆంగ్ల పదాన్ని శీర్షిక పెట్టాడు. ఆంగ్ల పదాన్ని శీర్షిక పెట్టేటప్పుడు కొంతమందితో పేచి ఉంటుంది. తెలుగు భాషలో చక్కటి పదజాలం ఉంది కదా! ఆ పదాల నుంచి వాడుకోవచ్చు కదా అని. వారి వారి కాలమాన, స్థలమాన పరిస్థితుల్లోంచి చూసినప్పుడు వారు చెప్పింది వాస్తవం అనిపిస్తుంది. కానీ ఒక విషయానికి సంబంధించిన తీవ్రతను అందరిలోకి చేరవేయడానికి ఒక జన వ్యవహార ఇతర భాషాపదమైన పర్లేదేమో అనిపిస్తుంది. గోపాల్‌ ‘డిలీట్‌’ శీర్షిక కూడా అలాంటిదే. విషయ తీవ్రతను నేరుగా పాఠకుల్లోకి ఇంజక్ట్‌ చేసేలా ఉంది. ఇలాంటి సందర్భాల్లో భాషను మినహాయించుకోవడంలో తప్పు లేదనిపిస్తుంది.
కవిత ప్రారంభ వాక్యాల్లోనే నిలబడ్డ నేలమీద తనవికాని పరిస్థితుల్లో మనిషి ఎలా బతుకుతున్నాడో, కలలను చిధ్రం చేసుకుంటూ మనసుకి ఎంత గాయం చేసుకుంటున్నాడో తెలియజేస్తూ గోపాల్‌ బొమ్మ కట్టాడు. మనిషి నడక దగ్గర నుండి, వేషం, భాష దగ్గర నుండి, తినే తిండి వరకు అన్నింటి మీద ఆంక్షలు ఎలా వెలువెత్తుతున్నాయో తెలుపుతూ ”ఈ పాదాలు నావే అడుగులు మాత్రం రాజ్యం వేయమంటుంది” అంటూ వాక్యాల వెనక నిరసన గళాన్ని జెండాలా ఎత్తాడు.
ఎదుటి వ్యక్తుల్ని బానిసలుగా చేసే ఏ అధికారమైనా, ఏ రాజ్యమైనా తను చెప్పిందే నిజమని భ్రమల్లోకి తోసేస్తుంది. ప్రజలను మూఢులుగా చేయడానికైనా, నిరక్షరాస్యులను చేయడానికైనా వెనుకాడదు.
శాసించే స్థాయికి వెళ్లి స్వేచ్ఛకిక చరమగీతం పాడుతుంది. అందుకే గోపాల్‌ మదాంధకార రాజ్యం ఎంతకైనా తెగిస్తుందని చెప్పడానికి ”గుండ్రంగా ఉన్న భూమిని బల్లపరుపుగా వాక్యం చేయమంటుంది” అనే వాక్యాలు రాసుంటాడు.
మూడవ స్టాంజా అంతా జంతు వివక్షను గురించి మాట్లాడుతుంది. సామరస్యత కొరవడిన తనాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది. స్వేచ్ఛ లేకుండా చేసే విధానాన్ని దుయ్యబడుతుంది. జంతువులన్నీ సమానమే అన్న ఇంగితాన్ని కలిగిస్తుంది. కవి ఇందులో వ్యంగ్యంగా ”ఒకే ఒక జంతువును కీర్తించడానికి, మొక్కడానికి మీకెందుకు ప్రభువా!” అంటూ సంధించిన ప్రశ్నను గమనిస్తే అది కొంతమందికి మేల్కొలుపు పాటలా కనపిస్తుంది.
ఇక చివరి స్టాంజాలో ప్రస్తుత విద్యా విధానంలోని సిలబస్‌ మార్పులను గూర్చిన విషయాలు చర్చకు వచ్చాయి. మనుషులు తెలివి మీరటం వల్ల రాజ్యానికి ఒరిగే ప్రయోజనం లేదు. అప్పుడు రాజ్యం కొన్నింటిని ఎజెండాగా చేసుకుని అందరికీ వాటిని రుద్దాలనే తాపత్రయ పడుతుంది. జనాల్ని అమాయకులను చేస్తూ అసలు చరిత్రను వక్రీకరించడం కొత్త విషయం ఏమీ కాదు. ఇది తరతరాల తంతే. రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడేవారు ఏ సిలబస్‌ చదవాలో ప్రణాళిక తయారు చేయడానికి ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఏ మార్గంలో నడవాలో చెప్పడానికి ఎంతో మంది మార్గదర్శకులు ఉన్నారు. మేధావులను, మార్గదర్శకులను పక్కకు పెట్టి ఒక వ్యక్తికి నచ్చినట్టుగానో, ఇష్టం వచ్చినట్టుగానో సిలబస్‌ రూపొందించడం సరైన విధానం కాదు కదా! ప్రస్తుతం కొంతమంది స్వప్రయోజనాల కోసం చేస్తున్న పనుల్ని ఏకరువు పెడుతూ, అర్థం చేయిస్తూ పరిపరి విధాల ఆలోచనలను కలిగించేలా కవితా వాక్యాలు రాసి ”సిలబస్‌/ మీ మేనిఫెస్టో కాదు/ పార్టీ ముసాయిదా పత్రం కాదు” అంటూ డార్విన్‌ సిద్ధాంతం తొలగించడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గోపాల్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు.
ముగింపులో సహజత్వంతో కూడిన బలమైన వాక్యాలు రాశాడు. సిలబస్‌ మార్పులంటూ, ఆ మార్పులు, ఈ మార్పులు అంటూ గారడీలు చేస్తున్న వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేశాడు. తొలగించాల్సింది నిన్నే అంటూ స్పష్టంగా రాబోయే రోజుల్లోని కార్యాచరణ ప్రకటిస్తూ ఈ కవి ”డిలీట్‌” అంటూ కవిత రూపంలో ”కొత్త సిలబస్‌” కు నాంది పలికాడు.
– తండా హరీష్‌
8978439551

Spread the love