ఆ వీడియోల స్టోరీకి డైరెక్టర్ కుమారస్వామే: డీకే శివకుమార్

నవతెలంగాణ – బెంగళూరు: హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (జనతాదళ్‌ బహిష్కృత)కు సంబంధించిన అశ్లీల వీడియోల వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  తోసిపుచ్చారు. ఆ దృశ్యాలు వైరల్ కావడం వెనక ఉన్నది ప్రజ్వల్ బాబాయ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామే అని ఆరోపించారు. ఆయన బ్లాక్‌మెయిలింగ్ కింగ్ అని, ఈ మొత్తం స్టోరీకి డైరెక్టర్, ప్రొడ్యూసర్, ప్రధాన పాత్రధారి ఆయనే అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ పెన్‌డ్రైవ్ వ్యవహారం గురించి కుమారస్వామికి మొత్తం తెలుసు. దీనిపై కొందరు ఇప్పటికే మాట్లాడుతున్నారు. కుమారస్వామి నా రాజీనామా అడుగుతున్నారు. వక్కళిగల నాయకత్వం కోసం పోటీ ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన కోరుకున్నట్టుగా నన్ను రాజీనామా చేయనివ్వండి’’ అని ఎద్దేవా చేశారు. ‘‘రాజకీయంగా ఒకరి తర్వాత ఒకరిని తొక్కేయడం ఆయన పని. ఆయన బ్లాక్‌మెయిలింగ్ కింగ్. అధికారులు, రాజకీయ నాయకులతో సహా అందరినీ బెదిరిస్తుంటాడు. ఆయన పని ఆయన్ను చేసుకోనివ్వండి. సమయం వస్తుంది.. అప్పుడు అన్నింటినీ అసెంబ్లీలో చర్చిద్దాం’’ అని అన్నారు.

Spread the love