ధైర్యంగా అడిగే స్వేచ్ఛనివ్వాలి

– పిల్లలకు నేర్పించాల్సిన లక్షణాలు

షేరింగ్‌ – కేరింగ్‌ : నాది, నేను అని కాకుండా తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడం, పనిచేయడం, పంచుకోవడం.
త్వరగా లేవాలి, త్వరగా పడుకోవాలి : ఇప్పటి పిల్లలు అర్ధరాత్రి వరకు మేలుకొని, తెల్లవారుజామున త్వరగా నిద్ర లేవలేకపోతున్నారు. దీని వల్ల బద్దకం వస్తుంది. 10 లోపు నిద్రపోవాలి. ఉదయం ఐదు గంటలకు లేవాలి. దీని వల్ల చాలా సమయం మిగులుతుంది. అన్ని పనులకు సమయాన్ని కేటాయించొచ్చు. కొత్తవి ఏమైనా నేర్చుకోవచ్చు.
ఫోకస్‌ : రోజూ చేసే పనుల మీద శ్రద్ద వుండాలి. ఏదో చెయ్యాలి కాబట్టి చేద్దాంలే అని కాకుండా ఏ పనైనా శద్దగా చేయమని చెప్పాలి.
ఎస్‌, నో, ప్లీజ్‌, థాంక్యూ, సారీ : ఈ ఐదు పదాలు సందర్భానుసారంగా ఉపయోగించడం నేర్పించాలి. ముఖ్యంగా ఇష్టంలేని పనులకి కాదు, వద్దు అని చెప్పడం, ఎవరినైనా ఏదైనా అడిగేటప్పుడు రిక్వెస్టింగ్‌గా అడగడం, ఎవరిదగ్గరైనా ఏదైనా తీసుకున్నప్పుడు థాంక్యూ చెప్పడం, ఎవరినైనా నొప్పించినప్పుడు సారీ చెప్పడం ఇవి పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి.
మనీ మేనేజ్‌మెంట్‌ : ఏ వస్తువైనా అడగకముందే కొనివ్వడం చేయకూడదు. వారికి కొనిచ్చే ప్రతి వస్తువుని వారే డబ్బులిచ్చి కొనుక్కునేలా చేయాలి. అప్పుడే వారికి ఏ వస్తువు ఎంత ఖరీదో తెలుస్తుంది. వారు ఉపయోగించే వస్తువుల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుస్తుంది. డబ్బు విలువ తెలస్తుంది.
ధైర్యంగా, బాధ్యతగా వుండడం : ఏ పని చేసినా బాధ్యతగా చేయాలి. తప్పు చేసినా, మంచి పని చేసినా ధైర్యంగా చెప్పగలగాలి.
ప్రస్తుత రోజుల్లో పిల్లల్ని పెంచడం ప్రతి తల్లిదండ్రికి పెద్ద టాస్క్‌. అది ఒక్కరినైనా, ఇద్దరినైనా, పది మంది పిల్లలున్నా సరే. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగానే వుంటారు.
ఒకటి నుండి ఐదేళ్ల పిల్లలు ఏ విషయాన్నైనా చాలా తొందరగా నేర్చుకుంటారు. అందులోనూ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని బాగా గమనిస్తారు. వారినే అనుకరిస్తారు, అనుసరిస్తారు కూడా. అప్పటికప్పుడే కాకపోయినా తర్వాతి రోజుల్లో ఈ విషయం కచ్చితంగా స్పష్టమవుతుంది.
పిల్లలకి ప్రశ్నించడం నేర్పించాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పిల్లలకి ఎక్కువగా వుంటుంది. ఆ ఆసక్తి కొద్దీ ఏవేవో ప్రశ్నలు అడుగుతుంటారు. వాటికి సమాధానాలు చెప్పలేక చాలా మంది కోప్పడడం చేస్తుంటాం. అలా కోప్పడడం వల్ల ఏం అడగాలన్నా పిల్లలు భయపడుతుంటారు. అలా కాకుండా పిల్లలకి ఏదైనా ధైర్యంగా అడిగే స్వేచ్ఛనివ్వాలి. ఏం అడిగితే ఏమవుతుందో, కోప్పడతారేమో అనే అనుమానం, భయపడే పరిస్థితి వారికి రానివ్వకూడదు.
పిల్లలు చాలా తెలివి గలవాళ్లు. తమకి ఏం కావాలో వాళ్లకి బాగా తెలుసు. వాళ్లకి కావలసినవి పెద్దవాళ్లనుండి ఎలా ఇప్పించుకోవడంలో వాళ్లకి వాళ్లే సాటి. దానికోసం అరిచి గోల చేయడం, ఏడవడం చేస్తుంటారు. పిల్లలు చేసే గొడవ భరించలేకో, ఏడుపు ఆపేస్తారనో చాలామంది పిల్లలు అడిగింది ఇచ్చేస్తుంటారు. ఈ కిటుకు కనిపెట్టిన పిల్లలు ప్రతిసారీ ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తుంటారు. అందుకే ఒకసారి వద్దని చెప్పిన విషయానికి కట్టుబడి వుండాలి. పిల్లలు ఏడుస్తున్నారని, అల్లరి ఆపేస్తారని వద్దన్న విషయాన్ని మళ్లీ ఒప్పుకోకూడదు. ఒక్కసారి ఒప్పుకున్నామా… పిల్లలకు అలుసైపోవడం ఖాయం. ప్రతిసారీ అదే అస్త్రాన్ని యధేచ్ఛగా రిపీట్‌ చేస్తుంటారు.
పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు కోప్పడడం సాధారణం. అలా కోప్పడ్డప్పుడు వెంటనే కొంతమంది పిల్లలు ”నేనంటే అమ్మానాన్నలకు, ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. అందుకే నేనేం చేసినా తప్పుపడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు” అనుకుంటారు. అందుకే ఎందుకు కోప్పడుతున్నారో పిల్లలకి తెలిసేలా చేయాలి. ”నువ్వు ఈ పని చేశావు, అది మంచిది కాదు, అందుకే వద్దంటున్నా. నేను కోప్పడుతున్నది నిన్ను కాదు, నువ్వు చేసిన పనిని” అని స్పష్టంగా చెప్పాలి. పిల్లల ప్రవర్తనని వ్యతిరేకించాలి కానీ పిల్లల్ని కాదు. ఆ విషయాన్ని వారికి అర్ధమయ్యేలా చెప్పాలి.
కొన్ని సార్లు పిల్లలు చేసే పనులు పెద్దవాళ్లకి చాలా కోపం, చిరాకు తెప్పిస్తాయి. ఆ కోపంలో పిల్లల మీద గట్టిగా అరవడం, కోప్పడం, కొన్నిసార్లు కొట్టడం కూడా చేస్తుంటాం. మనలో చాలా మంది పిల్లల్ని కొట్టిన తర్వాత తొందరపడి ఎందుకు కొట్టామా అని బాధపడడం, ఏడవడం కూడా చేస్తుంటాం. అలా కాకుండా పిల్లలు కోపం తెప్పించే పని చేసినప్పుడు వారికి తెలిసే విధంగా ఓ ఐదు నిమిషాలు ఆ ప్రదేశం నుండి పక్కకు తప్పుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు అమ్మకో, నాన్నకో కోపం వచ్చిందని తెలుస్తుంది. పెద్ద వాళ్లకు కూడా ఆ కోపం తగ్గి ఎందుకు పిల్లలు ఇలా చేశారా, ఎలా వాళ్లకు నచ్చచెప్పాలా అని ఆలోచించే అవకాశం వుంటుంది.
– బి.మల్లేశ్వరి

Spread the love