పైపై మెరుపులు…!

నిత్యం యుద్ధానికి
అద్దం పట్టే ఉస్మానియా
తన తనువంతా
సప్త వర్ణాల
సింగిడి రంగులతో
సింగారించుకున్నది

కొత్త పెళ్ళి కూతురులా
మెరిసిపోతున్నది
అలవోకగా చూస్తే చాలు
చూపరుల మదిని చూరగొంటున్నది

కానీ కనిపించేదంతా
నిజం కాదు అవి
పైపై మెరుపుల
వెలుగులు మాత్రమే

ఒక్కసారి ఉస్మానియా
విద్యార్థి హదయాలను
తట్టి చూస్తే తెలుస్తుంది
మది మాటున దాగిన
కన్నీటి రోదనలు

కన్న వాళ్ళను
ఉన్న ఊరిని వదిలి
ఉన్నత విద్యకై
ఉస్మానియాకు వస్తే
పేదింటి బిడ్డలకు
పెద్ద చదువులు
భారంగా మారాయి

అడ్మిషన్‌ మొదలుకొని
ఆకరి పరీక్ష వరకు
అడుగడుగున
మోయలేనంత
ఫీజుల మోత

పేరుకు ప్రభుత్వ
విశ్వవిద్యాలయంఅయినా
పీజీ, పి.హెచ్‌ డి ఫీజులను
ఆకాశానికి ఎత్తేశారు

ఇదేంటని ప్రశ్నిస్తే
బదులివ్వడం మాని
బెదిరింపులకు దికుతున్నరు
బలవంతంగా బందించేందుకు
పోలీసు బలగాలను
దింపుతున్నరు

విద్యార్థుల
ఉజ్వల భవిష్యత్తుకు
మార్గం చూపాల్సిన విశ్వవిద్యాలయ
ఉన్న అధికారులు
పాలకుల పంచన చేరి
పదవులను కాపాడుకోవడం కోసం
పాకులాడుతున్నరు తప్ప
వాళ్ళ పనితీరు
ఇంకెన్నడు మారునో…!
– ఎనుపోతుల వెంకటేష్‌, 9573318401

Spread the love