కొందరి మనుషులను చూస్తే కదులరు మెదులరు. చురుకుదనం తక్కువ. రెండు మూడుసార్లు చెప్పితే గానీ చెయ్యాల్సిన పనులు చెయ్యరు. మాట్లాడినా నడిచినా ఏం చేసినా స్లో కనిపిస్తది. వీళ్లను ‘మన్ను తిన్న పాము లెక్క వున్నవేందిర’ అంటరు. నిజానికి పాముల్లో చురుకుదనం ఎక్కువ. మన అలికిడికే అందకుండ పోతయి. కానీ మన్ను తిన్న పాము నిద్రపోయినట్టు నిదానంగ పోతది. ఆహారం ఏం దొరకనప్పుడు పాము మన్ను తింటదేమో తెల్వది కానీ కొందరిని చూస్తే ‘మంజరగున్న లెక్కనే వున్నడు’ అంటరు. ఇదీ పైన చెప్పుకున్న పాము లెక్కనే. ఇలాంటి పాములనే మంజరగున్న అని పిలుస్తరు.
కొందరు ఇట్ల వుంటే మరి కొందరిని చూస్తే వీడు ‘బర్రున పిత్తడు బల్లున మాట్లాడడు’ అంటరు. అంటే ముచ్చట్ల మధ్యన వున్న వ్యవహారంలో ఎక్కడైనా కొందరిని చూస్తే టకటక అభిప్రాయం వ్యక్తం చెయ్యరు. ఊ అనరు, ఊహూ అనరు. సప్పుడు చెయ్యక ఉంటరు. కనీసం ఫలానా విషయానికి తన అభిప్రాయం ముఖ కవళికల ద్వారా కూడా ఇప్పరు. మౌనంగ వుంటరు. వీల్లను ఇలా బర్రున… సప్పుడు చెయ్యరు, బలబల గలగల మాట్లాడరు అంటరు. ఇట్లనే మరికొందరిని చూస్తే ‘ఆవులిస్తే పేగులు లెక్కపెడుతరు’ అంటరు. అంటే ఇసొంటోల్లు మస్తు ఉషారుగాల్లు. నాలుగు నిమిషాలు మాట్లాడితే చాలు సంగతి అంత చెప్పేస్తరు. అవతలి వ్యక్తి సైకాలజీ అంతా పసిగట్టేస్తరు. కొందరిని చూస్తే ‘నారు ముచ్చులోడు’ అంటరు. వీల్లు కూడా ఎక్కువ మాట్లాడరు. ఎక్కువ నవ్వరు ఎవలితోని లొల్లి కూడా పెట్టుకోరు. కానీ వాల్ల శత్రువులకు ఎక్కడ కొండి పెట్టాలనో అక్కన్నే పెడుతరు. ఏదన్న పంచాయితీ అయితే సప్పుడు చెయ్యరు. ఏమనరు కానీ తర్వాత ఎక్కన్నో తిరకాసు పెడుతరు. ఇటువంటి వాల్లు ‘నారు ముచ్చులోల్లు’ అంటరు. ఇంకొందరు ‘కడుపుల ఏం దాసుకోరు ఉన్నదున్నట్టు కక్కుతరు’ అంటరు. వీల్లకు మర్మం వ్యూహం వుండది. మాట్లాడె చెప్పుతరు. కొందరు ఏం మాట్లాడరు. వాల్లను ‘నోట్లె నాలిక లేనోడు’ అంటరు. మన చుట్టూ వుండే మనుషుల్లో ఇన్ని రకాలు.
– అన్నవరం దేవేందర్, 9440763479