నిరంతర బాలగేయం మానేరు స్రవంతి ‘ఎనగంటి మల్లేశం’

వృత్తిరీత్యా గణిత శాస్త్ర బోధకులైన మల్లేశం విద్యార్ధి దశా, దిశా మార్చేది ఉపాధ్యాయుడేనని ప్రగాఢంగా నమ్మి ఆ దిశగా తన పనులు, రచనలు చేస్తున్నారు.బాల సాహితీవేత్తగా మల్లేశం అచ్చువేసిన పుస్తకాలు మూడు. అవి ‘పాఠశాల సందర్భోచిత గేయాలు, బాల మువ్వలు, బాలల గేయ రామాయణము’. మల్లేశం తొలి కృతి ‘పాఠశాల సందర్భోచిత గేయాలు’ ఎస్‌.సి.ఈ.ఆర్‌.టి. వారి బహుమతిని గెలుచుకుంది. మన సంస్కృతిలో భాగంగా జరుపుకునే అన్ని పండుగలకు గేయాలను రాశారు కవి ఈ పుస్తకంలో. వాటిలో ‘సరస్వతీ ప్రార్ధన’ మొదలుకొని ఉపాధ్యాయుని పదవీ విరమణోత్సవం వరకు ఉండడం విశేషం.
ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. నిరంతర బాలగేయాల స్రవంతి. సామాజిక.. సాంస్కృతిక… మానవీయ అంశాలు వస్తువులుగా బడి పిల్లలకు పాటల తాయిలాలు అందించిన బాల సాహిత్యకారుడు… కవి… ఎనగంటి మల్లేశం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ మండలం గొలపల్లిలో ఎనగంటి మల్లేశం 5 ఫిబ్రవరి, 1958 న పుట్టారు. శ్రీమతి ఎనగంటి లక్ష్మి – శ్రీ వెంకటయ్య వీరి తల్లిదండ్రులు.
1998 నుండి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న మల్లేశం పదవ తరగతిలోనే తన సాహిత్య వ్యాసంగాన్ని మొదలుపెట్టారు. పిల్లల్లో జ్ఞానబీజాలను నాటేందుకు, అజ్ఞాన తిమిరాలను తరిమేందుకు తన గేయాలను సాధనాలుగా మలచిన మల్లేశం బాలల కోసం ముచ్చటగా మూడు పుస్తకాలను ప్రచురించారు. ఇవేకాక వివిధ పత్రికలు, సంచికల్లో వీరి గేయాలు, కవితలు అచ్చయ్యాయి. కేవలం రచయతగా రచనలు చేయడం, ఉపాధ్యాయునిగా పాఠాలు బోధించడమే కాదు, పిల్లలను పుస్తక పఠనం వైపుకు నడిపించడం, వాళ్లతో రచనలు చేయిండం, పాటలు పాడించడం వంటివి ఈయనకు తెలిసిన పనులు.
వృత్తిరీత్యా గణిత శాస్త్ర బోధకులైన మల్లేశం విద్యార్ధి దశా, దిశా మార్చేది ఉపాధ్యాయుడేనని ప్రగాఢంగా నమ్మి ఆ దిశగా తన పనులు, రచనలు చేస్తున్నారు.
బాల సాహితీవేత్తగా మల్లేశం అచ్చువేసిన పుస్తకాలు మూడు. అవి ‘పాఠశాల సందర్భోచిత గేయాలు, బాల మువ్వలు, బాలల గేయ రామాయణము’. మల్లేశం తొలి కృతి ‘పాఠశాల సందర్భోచిత గేయాలు’ ఎస్‌.సి.ఈ.ఆర్‌.టి. వారి బహుమతిని గెలుచుకుంది. మన సంస్కృతిలో భాగంగా జరుపుకునే అన్ని పండుగలకు గేయాలను రాశారు కవి ఈ పుస్తకంలో. వాటిలో ‘సరస్వతీ ప్రార్ధన’ మొదలుకొని ఉపాధ్యాయుని పదవీ విరమణోత్సవం వరకు ఉండడం విశేషం. ఇంకా ఇందులో ‘చందువుల పండుగ, తల్లిదండ్రుల దినోత్సవం, అక్షరాస్యతా దినోత్సవం, గాంధీ జయింతి, జాతీయ సమైఖ్యతా దినోత్సవం, అమరుల సంస్మరణోత్సవం, వైజ్ఞానిక దినోత్సవం వంటివి అనేకం చూడొచ్చు. ‘ఉదయించే సూర్యుడు జగతికి వెలుగు/ ఉపాధ్యాయుడు జాతి ప్రగతికి వెలుగు’ వంటివి ఇందులోని గేయపంక్తులు.
‘బాల మువ్వలు’ చిన్నారి బుజ్జి పాపాయిల కోసం మల్లేశం రాసిన ‘బాల’ గేయాల సంపుటి. డా||నలిమెల భాస్కర్‌ అన్నట్టు… ‘పాఠశాల విద్యార్ధులకు పనికొచ్చే చాలా అంశాలు ఇందులో వున్నాయి. ”చక్కటి బడి మా బడి/ చదువుల ఒడి మా బడి/ ఆటపాటల మా బడి/ ఆనందాల మా బడి”, ”కన్నతల్లిని మరవద్దు/ తల్లి భాషను విడవద్దు”, ”పరిసరాల పరిశుభ్రం/ పాటించాలి ప్రతినిత్యం/ నీది నాది అనకుండా/ పాటుపడాలి అందరికోసం” వంటి చక్కని గేయ పంక్తులు ఇందులో మనం చూడవచ్చు. ఈ పుస్తకం బాల సాహిత్యం పరిషత్‌ వారి ప్రశంసా పత్రాన్ని అందుకుంది. విశ్వనాధ రామాయణ కల్పవృక్షం రాస్తూ ‘మరల ఇదేలనన్న’ అంటూ తాను రామాయణం మళ్లీ ఎందుకు రాశారో తెలిపారు. కవి మల్లేశం కూడా పిల్లల కోసం ‘బాలల గేయ రామాయణం’ రాశారు. నిజానికి రామకథ ఎవరు రాసినా అది నిత్య నూతనమే. ”బాలల్లారా బాలల్లారా/ భవితవ్యానికి దివ్వెల్లారా/ ఇతి హాసాలు, పురాణాలు మన/ భారతదేశపు మణిహారాలు’ అంటూ చెప్పిన కవి ‘కథ చదివిన, విన్నవారికి శాంతి సౌఖ్యాలు సమకూరతాయని అంటారు. గేయం, పద్యంపై పట్టున్న ఎనగంటి మల్లేశం చక్కని మాత్రా చంధస్సులో రామాయణాన్ని కూర్చారు. కేవలం కథయే కాక కథనం కూడా గేయంలో విలక్షణంగా ఒదగడం ఈయన రచనాశైలికి నిదర్శనం. ‘అన్నా/ రావణ అన్యాయమిది/ సీతను తెచ్చి నీతి తప్పివివి/ దూతను చంపుట పాపము కదా?’ వంటివి అందుకు ఉదాహరణ. కరీంనగర్‌ ఉపాధ్యాయ రచయితల సంఘం ఉపాధ్యక్షులుగా వున్న ఎనగంటి మల్లేశం బాలల కోసం మరిన్ని చక్కని రచనలు చేయాలని కోరుతూ… జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love