అస‌దుద్దీన్ ఓవైసీ నేరుగా బీజేపీతో కలిసి ప‌నిచేస్తున్నారు : ప్రియాంక గాంధీ

నవతెలంగాణ-హైదరాబాద్ : లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బీజేపీ, ఎంఐఎం బంధంపై కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. యూపీలోని రాయ్‌బ‌రేలిలో ప్రియాంక గురువారం విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ నేరుగా బీజేపీతో కలిసి ప‌నిచేస్తున్నార‌ని ఆరోపించారు. ఇత‌ర పార్టీల‌ను డిఫెన్స్‌లో ప‌డేసేందుకు బీజేపీ ఎక్క‌డ కోరుకుంటే అక్క‌డ కాషాయ పార్టీకి మేలు చేసేందుకు అస‌దుద్దీన్ రంగంలోకి దిగుతార‌ని అన్నారు. కాగా అంత‌కుముందు రాయ్‌బ‌రేలిలో ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ప్రియాంక మాట్లాడుతూ ఐదు కిలోల ఉచిత రేష‌న్‌తో ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ‌వ‌ని అన్నారు. ఐదు కిలోల బియ్యం, గోధుమ‌ల‌తో మీ భ‌విష్య‌త్ మెరుగుప‌డ‌దు..రేష‌న్‌తో మీరు ఆత్మ‌నిర్భ‌ర్ కాలేర‌ని వ్యాఖ్యానించారు. మీకు ఉద్యోగం కావాలా..ఐదు కిలోల రేష‌న్ కావాలా అంటే మీరు క‌చ్చితంగా ఉపాధినే కోరుకుంటార‌ని ఆమె పేర్కొన్నారు. ఉపాధి ల‌భిస్తేనే మీరు స్వ‌యంగా ఎదిగే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. మీరు ఒక‌రిపై ఆధార‌ప‌డేలా విధానాలు రూపొందిస్తున్న రాజ‌కీయ పార్టీ గురించి అర్ధం చేసుకోవాల‌ని అన్నారు. అలాంటి పార్టీ సిద్ధాంతం స‌రైంది కాద‌ని కాషాయ పార్టీపై ప్రియాంక గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. పేద‌లు స్వ‌యం స‌మృద్ధి సాధించేలా వారికి ఉపాధి అవ‌కాశాల‌ను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆమె పేర్కొన్నారు.

Spread the love