‘గుండ్ల రాజు’ కోమటిచెరువు కొత్త అల

రాజు రాసిన బాల గేయాలు కూడా బాలలకు నచ్చేవిగానే కాక వాళ్లు మెచ్చేవిగా వుంటాయి. తనకు తారసపడ్డ ప్రతి అంశాన్ని గేయంగా మలిచాడు రాజు. ‘అమ్మ పాటను ఆలకిస్తిని/ నాన్న ఎదపై ఆడుకొంటిని’ అనే బాలబాలికలు ఈయన గేయాల్లో మనకు కనిపిస్తారు. ఇంకా ‘నెమలికి పింఛం అందమురా/ కోయిల రాగం అందమురా చిలుకకు పలుకులు అం దమురా/ నింగికి చంద్రుడు అందమురా/ చెట్టుకు పువ్వులు అందంరా/ మట్టికి వాసన అందంరా’ అని రాస్తాడు. కాయగూరల గురించి, పండు ఫలాల గురించి, వాటి ఉపయోగం గురించి పిల్లలకు తెలిసేలా రాస్తాడు రాజు తన బాల గేయాల్లో. మాతృభాష తెలుగు పైన మమకారంతో రచనలు చేసిన కవి రాజు తెలుగు గురించి కూడా చక్కని గేయం రాశాడు.
సిద్ధిపేట బాలసాహిత్యాకాశంలో కొత్త తార గుండ్ల రాజు. రాజు కవి, రచయిత, బాలసాహితీవేత్త, ఉపాధ్యాయుడు, కార్యకర్త. ముఖ్యంగా ఇటీవల బాలవికాసం కోసం పనిచేసిన వారిలో తొలి వరుసలో నిలుస్తాడు రాజు. ఆగస్టు 6, 1971న సిద్ధిపేటలో జన్మించాడు. తల్లిదండ్రులు శ్రీమతి గుండ్ల సోమవ్వ, శ్రీ వెంకటేశం.
ఎం.ఎ. తెలుగు చదివిన రాజు వృత్తిరీత్యా తెలుగు పండితులుగా పనిచేస్తున్నాడు. రచనావ్యాసంగం ప్రారంభించిన దశాబ్దికాలంలోనే పదికి పైగా రచనలు చేశారు. కొన్నింటిని ముద్రించారు. బాలవికాస కార్యకర్తగా పిల్లల కోసం పనిచేస్తూ వారితో రచనలు చేయించి వాటిని పుస్తకాలుగా ప్రచురించాడు. పద్దెనిమిది మంది బడిపిల్లలు రాసిన కవితలను ‘బాలల కవితా మకరందం’ పేరుతో తన సంపాదకత్వంలో ప్రచురించారు. ఈ సంకలనానికి 2018లో డా|| చింతోజు బ్రహ్మయ్య- బాలమణి బాల వికాస పురస్కారం, 2019లో సుగుణ సాహితీ సమితి పురస్కారాలు అందుకున్నాడు.
రాజు మార్గదర్శకంలో చిరంజీవి కావ్య రాసిన శతకం ‘కావ్యమాల’ శతకంగా వచ్చింది. దీనికి ఈయనే సంపాదకులు. చిరంజీవి కావ్య శతకం రాజు మార్గదర్శనానికే కాక, విద్యార్థుల సంపుటిలో మంచి పేరును సంపాదించుకుంది.
రచయితగా, కవిగా రాజు పది రచనలు చేయగా వాటిలో మూడు రచనలు అచ్చయ్యాయి. వాటిలో ‘నీలికంఠ పదాలు’, ‘సూక్తి సుధ’, శతకంతో పాటు ‘పసిడి పలుకులు’ బాల గేయాలు వున్నాయి. ‘సూక్తి పద్యాలు’, ‘హృదయవీణ (ఖండ కావ్యం)’, గేయవీణ (గేయసంపుటి)’, మణిపూసలు, కవితా సంపుటి త్వరలో రానున్నాయి.
రాజు స్వయంగా పురస్కారాలు అందుకోవడమే కాక ఆయన శిష్యురాలు కూడా జాతీయ స్థాయిలో అవార్దులు అందుకోవడం విశేషం. కావ్యమాలకు చింతోజు పురస్కారంతో పాటు ప్రకాశం జిల్లా స్వర్ణ సాహితీ పురస్కారం లభించింది. రాజు స్వయంగా జాగృతి పురస్కారం, కృషి కవితా పురస్కారం, లయన్స్‌ క్లబ్‌ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.
పదాలు, పద్యాలు, గేయాలు బాలల కోసం రాసిన రాజు, పిల్లలకు హత్తుకునేలా ప్రతి విషయాన్ని చెబుతాడు. నీలకంఠ పదాల్లో ‘మతము మానవసేవ/ సతము మాధవ సేవ/ ధన్యమునకే త్రోవ/ ఓ నీలకంఠ’, ‘చిన్న పాలల నవ్వు/ పరిమళించ గరువ్వు/ సంతసముకది దవ్వు/ ఓ నీలకంఠ’.
‘సూక్తిసుధ’ శతకంలోనూ – నీతి, జీవనరీతి, వైజ్ఞానికాంశాల వంటివి అనేకం పిల్లలకు అర్థమయ్యే రీతిలో రాశారు రాజు. ‘అంతరిక్షమందు నలరారు గ్రహముల/ శోధనమ్ము చేసి చూసినాడు/ సైన్సు ప్రగతి వలన సర్వము సమకూరు/ సుకవి రాజు పలుకు సుధలు జిలుకు’, ‘ఓర్పులేని మనుజుడొంటరి వాడగు/ నోర్చుకున్న వాడు నోడి పోడు’, ‘తల్లిదండ్రి గురువు ధరిత్రిలోన మువ్వురు/ ధర్మవిధులు తెలిపి దారి చూప’ అంటారు.
రాజు రాసిన బాల గేయాలు కూడా బాలలకు నచ్చేవిగానే కాక వాళ్లు మెచ్చేవిగా వుంటాయి. తనకు తారసపడ్డ ప్రతి అంశాన్ని గేయంగా మలిచాడు రాజు. ‘అమ్మ పాటను ఆలకిస్తిని/ నాన్న ఎదపై ఆడుకొంటిని’ అనే బాలబాలికలు ఈయన గేయాల్లో మనకు కనిపిస్తారు. ఇంకా ‘నెమలికి పింఛం అందమురా/ కోయిల రాగం అందమురా చిలుకకు పలుకులు అం దమురా/ నింగికి చంద్రుడు అందమురా/ చెట్టుకు పువ్వులు అందంరా/ మట్టికి వాసన అందంరా’ అని రాస్తాడు. కాయగూరల గురించి, పండు ఫలాల గురించి, వాటి ఉపయోగం గురించి పిల్లలకు తెలిసేలా రాస్తాడు రాజు తన బాల గేయాల్లో. మాతృభాష తెలుగు పైన మమకారంతో రచనలు చేసిన కవి రాజు తెలుగు గురించి కూడా చక్కని గేయం రాశాడు. ‘శ్రీకారమై భువికి చేరిందిరా/ మాతృభాషగా మనసు దోచిందిరా/ మనిషి మనిషి తట్టి లేపిందిరా/ మమతానురాగాలు పంచిందిరా’ అంటూనే ఇంకా ‘ఆడిందిరా తెలుగు… పాడిందిరా తెలుగు… వెలిగిందిరా తెలుగు… వెలుగు లీనిందిరా తెలుగు’ అంటూ కీర్తిస్తాడు.
పద్యాన్ని, గేయాన్ని, వచనాన్ని బాల సాహిత్యాన్ని బాలల సాహితోద్యమాన్ని సమానంగా నిర్వహిస్తున్న సిద్ధిపేట కోమటి చెరువు కొత్త బాలసాహిత్యపు అల గుండ్లరాజు.- డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love