శారీరక అవసరాలు, నీతి సూత్రాల మధ్య నలిగిపోతున్న ఆధునిక స్త్రీ కథ నాతి చరామి

స్త్రీ జీవితాలను, జీవన అనుభవాలను, అవసరాలను ప్రధాన అంశాలుగా తీసుకుని ఎన్నో సినిమాలు వచ్చాయి. కాని మన దేశంలో స్త్రీ శారీరిక అవసరాలను కండిషనింగ్‌ చేస్తున్న సమాజం గురించి సినిమా ద్వారా చర్చించడానికి ఆసక్తి చూపిన దర్శకులు చాలా కొద్దిమందే. కారణం, ఇది చాలా సున్నితమైన విషయం అవడం. ఈ విషయంపై స్త్రీ ఆలోచనలను నిజాయితీగా వ్యక్తీకరించేటప్పుడు ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా ఆ పాత్ర ద్వారా స్త్రీ వ్యక్తిత్వమే మారిపోయి ఆమె కేవలం సెక్స్‌ మానియాక్‌గా ప్రేక్షకుల దష్టిలో నిలిచిపోతుంది. కొన్ని సినిమాలు ఈ విషయాన్ని ప్రస్తావించినా, ఆ పాత్రలు ప్రేక్షకుల సానుభూతిని, అభిమానాన్ని సమాన స్థాయిలో సంపాదించలేకపోయాయి. సెక్స్‌ అనే విషయం పట్ల ముఖ్యంగా స్త్రీకి సంబంధించినప్పుడు అది ఒక అవసరంగా కాక బాధ్యతగా మాత్రమే అంగీకరించే సంస్కతి మన సమాజంలో నాటుకుపోయింది. ఇదే సమాజం పురుషుని విషయంలో సెక్స్‌ ఒక అత్యవసరమైన విషయంగా అంగీకరిస్తుంది. అందుకే భార్య చనిపోయిన భర్తకు వెంటనే మరో వివాహం చేసుకునే అవకాశం కల్పించింది. భార్య సంసార సుఖానికి పనికి రాకపోతే ఆ భర్తకు మరో వివాహం చేసుకునే వెసలుబాటుని ఈ సమాజం ఇచ్చింది. వేశ్యా వ్యవ్యస్థను ఈ విషయంగానే సమాజం బతికించుకుంటూ వస్తుంది. పురుషుని జీవితంలో సెక్స్‌ను ఓ అతి పెద్ద అవసరంగా, సహజమైన ప్రక్రియగా భావించే సమాజం, అదే శారీరిక సుఖాన్ని స్త్రీ విషయానికి వస్తే ఓ భాద్యతగా, నైతికతకు చిహ్నంగా ఉంచి ఆమెపై ఎన్నో అంక్షలను విధించింది.
నైతికత అనే విషయాన్ని కాసేపు ప్రక్కన పెట్టి స్త్రీ విషయంలో కూడా ఇదే ఉదార భావాన్ని చూపే పరిస్థితులు సమాజంలో లేకపోవడం వెనుక ఉన్న రాజకీయం గురించి మాట్లాడుకోవలసిన అవసరం ఇప్పటికన్నా ఉంది. ఈ సంభాషణను ప్రస్తావించకుండా జెండర్‌ సెన్సిటివిటి గురించి పూర్తిగా చర్చించలేం. ఇది నిజంగా చాలా సున్నితంగానూ లోతుగాను చర్చించవలసిన విషయం. ఇది విచ్చలవడితనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో చేయవలసిన చర్చ కాదు. స్త్రీ పరంగా ఎన్నో మానసిక సమస్యలు, రోగాలు, స్త్రీ స్వభావాలలోని మార్పుల గురించి అర్ధం చేసుకుని కొన్ని సంస్కరణలు దిశగా సమాజాన్ని నడిపించడానికి జరపవలసిన చర్చ. అప్పటికీ అణచబడిన శారీరిక అవసరాలు స్త్రీ మెదళ్ళపై పని చేసే విధానం, వారిలో ఎన్ని మానసిక రుగ్మతలకు కారణమవుతుందో ఫ్రాయిడ్‌ లాంటి మానసిక విశ్లేషకులు చెప్పే ప్రయత్నం చేసారు. చలం లాంటి రచయితలు తెలుగులో ఈ విషయం పై పెద్ద చర్చలనే లేవనెత్తారు. అయినా ఇటువంటి విషయాలపై గంభీరమైన చర్చలు మన సమాజంలో ఎప్పుడూ జరగవు. స్త్రీ శారీరక అవసరాలు, కోరికల విష యానికి వస్తే చాలా అసహ్యంగానూ, చులకనగానూ స్త్రీలను ప్రస్తావించే పురుషులే అధికం. ముఖ్యం గా ఈ విషయంగా స్త్రీని ఉప యోగిం చుకునే పరిస్థితులే సమాజంలో ఎక్కువగా ఉన్నాయి. కాని స్త్రీ అవసరాల పట్ల ఓ పాజిటీవ్‌ దక్పధంతో చర్చ జరపాలనే ఉద్దేశంతో చాలా బోల్డ్‌ గానూ సున్నితంగానూ ఎక్కడా స్త్రీ వ్యక్తిత్వాన్ని కించ పరచకుండా, ఆమెను చులకన చేయకుండా కన్నడ భాషలో వచ్చిన సినిమా ”నాతిచరామి”2018 లో వచ్చిన ఈ సినిమాకు దర్శకత్వం వహించింది మన్సోరే. తి హరిరన్‌, సంచారి విజరు, శరణ్య, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఐదు జాతీయ పురస్కారాలు లభిం చాయి. గౌరీ అనే ఓ స్త్రీ భర్త ఆక్సిడేంట్‌ లో మరణిస్తాడు. ప్రేమించి వివాహం చేసుకున్న భర్త మరణం ఆమెను కగదీస్తుంది. ఆ భర్త జ్ఞాపకాలను ఆమె దూరం చేసుకోలేకపోతుంది. అతనికి సంబంధించిన ప్రతి చిన్న వస్తువును కూడా తన ఇంట్లో అదేస్థానంలో ఉంచి అతనున్న ట్టుగానే జీవిస్తూ ఉంటుంది. ప్రతి రోజూ అతని కిష్టమైన పూలను అతని ఫోటో దగ్గర పెట్టడం ఏ సందర్భంలోనూ ఆమె మరచిపోదు. అతని స్థానంలో మరెవ్వరినీ దగ్గరకు రానివ్వలేకపోతుంది. పోయిన భర్తపై ఆమె చూపే ఈ శ్రద్ధ వల్ల ఆమె జీవితంలో ముందుకు సాగలేకపోతుందని శ్రేయోభిలాషులు ఆమె గురించి అనుకుంటూ ఉంటారు. గౌరి తల్లిదండ్రులు ఆమెకు మళ్ళీ వివాహం చేయాలనుకుం టారు. కాని ఆమెను వివాహం చేసుకోవాలనుకునే బంధువు ఆమె ఆర్ధిక స్టేటస్‌ను, ఉద్యోగాన్ని కోరుకుంటున్నాడని, గౌరికి అర్ధం అవుతుంది. అందుకే తాను వివాహం చేసుకోనని తల్లిదండ్రులతో చెబుతుంది. రెండో వివాహం విషయంలో స్త్రీ కుండే ఆప్షన్స్‌ ఎంత తక్కువో ఆమెకు తెలుసు. ఓ ఉన్నతమైన ఉద్యోగంలో ఉంటూ, అదే స్థాయి జీవితాన్ని, ఆలోచనలను పంచుకోగల వ్యక్తి స్త్రీకి రెండో భర్తగా రావడం సాధారణంగా చాలా మంది స్త్రీల జీవితాలలో జరగదు. వివాహం అనే బంధం కోసం తనకే మాత్రం సరిపోని వ్యక్తితో జీవించడానికి గౌరి సిద్దపడదు. ఇక ఆమె ఉద్యోగం చేసే చోట ఆమె ఒంటరితనాన్ని ఉపయోగిం చుకుని ఆమెకు శారీరికంగా దగ్గరవ్వాలని చూసే వ్యక్తులు చాలా మంది ఉంటారు. తననో శరీరంగా మాత్రమే చూడాలనుకునే ఆ మగవారికి ఎదురు తిరిగి వారిలోని ద్వంద్వ బుద్దిని బైటపెట్టి వారికి బుద్ది చెపుతుంది గౌరి. కాని ఆమె శరీరం తోడు కోరుకుంటూ ఉంటుంది. శరీరం కోరే కోరికల కారణంగా చాలా అలజడికి ఆమె గురవుతూ ఉంటుంది. తల్లిదండ్రులు చూపే వారిని వారి స్వార్ధాన్ని గ్రహిస్తూ పెండ్లి చేసుకుని జీవితంలోని ఆహ్వానించడానికి ఆమె సిద్ధంగా ఉండదు. అలా అని తన శరీరాన్ని ఆకలితో చూసే వ్యక్తులకు లొంగిపోవ డానికి ఆమె ఇష్టపడదు. కాని ఆమె శరీరం ఓ తోడు కోసం కలవరిస్తూ ఉంటుంది. ఈ బాధ తప్పించుకోవడానికి ఆమె స్నేహితులు ఆమెకో డేటింగ్‌ యాప్‌ చూపించి, దాని ద్వారా తన బాధ తీర్చుకొమ్మని చెబుతారు. గౌరి ఓ వ్యక్తిని ఆన్‌లైన్‌లో ఈ యాప్‌ ద్వారా పరిచయం చేసుకుని అతన్ని ఇంటికి ఆహ్వానిస్తుంది కూడా. కాని అలా వచ్చిన అతను గౌరి జీవిస్తున్న విధానాన్ని గమనించి ఆమె భర్తను ఇంతగా తన స్మతులలో ఉంచుకుని మరో వ్యక్తిని కోరుకోవడం వెనుక సెక్స్‌ కన్నా మించిన మరో అవసరం ఉందని, తాను ఆమెకు ఆ కాసేపు కూడా భర్తగా మారలేనని చెప్పి వెళ్ళిపోతాడు. శారీరిక కోరకలని నియంత్రించుకోలేని తన అశక్తత, భర్తను మరచిపోవడానికి ఇష్టపడని తన ప్రేమ వీటి మధ్య నలిగిపోతున్న గౌరి సైక్రియాటిస్టుని సంప్రదిస్తుంది. సమాజం నియంత్రించలేని అవసరాల మధ్య మనిషి నిత్యం పోరాడుతూనే ఉంటాడని అతనితో జరిపిన సంభాషణతో ఆమె అర్ధం చేసుకుంటుంది. తన అవసరాలు, సమాజం విధించే నైతిక సూత్రాల మధ్య సంయమనం కుదుర్చుకోవడం కోసం మనిషి చేసే కషి ఎంత ఒత్తిడికి గురి చేస్తుదో అర్ధం అయిన తరువాత తాను ఈ ఒత్తిడిని, నీతికి కట్టుబడి ఉంటూ, తన స్వాతంత్య్రం, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎలా జయించాలో ఆమెకు అర్ధం కాదు. ఇదే సమయంలో ఆమెకు సురష్‌ అనే ఓ ఇంజనీర్‌తో పరిచయమవుతుంది. ఇతను వివాహితుడు. జీవితంలో పైకి రావాలని కలలుకనే ఓ సగటు మానవుడు. విధి లేని పరిస్థితులలో ఓ పల్లెటూరి పిల్లను వివాహం చేసుకున్నానని నిత్యం కుమిలిపోతూ సమాజంలో ఆర్ధికంగా, సామాజికంగా ఓ మెట్టు ఎదగాలని నిరంతరం అర్ధం కాని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. సురేష్‌ భార్య, భర్త దగ్గర ప్రేమ దొరకక, భర్త తనను కనీసం మనిషిగా గుర్తించకపోవడంతో తీవ్రమైన ఒంటరితనంలో జీవిస్తూ ఉంటుంది. భార్య మనసు అర్ధం చేసుకోలేని సురేష్‌ ఆమెలోని నిరాశను గుర్తించక, తన జీవితంలోని చీకటికి ఆమే కారణం అని ఆమెపై కోపాన్ని చూపుతూ ఉంటాడు. తన అవసరాలు తీర్చుకోవడానికి ఆమెను ఓ వస్తువులా ఉపయోగించుకుంటూ ఉంటాడు.
కాని పరస్త్రీ పొందు కోసం జంతువులా సురేష్‌ ఆశపడక పోవడం గౌరిని ఆకర్షిస్తుంది. అతనిలోని ఆ మంచితనాన్ని ఆమె ఇష్టపడుతుంది. భార్య దగ్గర అతను ప్రదర్శించే కఠినత్వం బైట అతను చూపకపోవడం కారణంగా గౌరి సురేష్‌లో మరో మనిషిని చూస్తుంది. అతన్ని ఇష్టపడుతుంది. తన శారీరక కోరిక తీర్చమని నిసిగ్గుగా అడుగుతుంది. ఓ స్త్రీ దగ్గర నుంచి ఈ ప్రతిపాదన రావడంతో దిమ్మతిరిగుతాడు సురేష్‌. ఇలాంటి కోరికను మనసులో పెట్టుకుని స్నేహం ముసుగు వేసుకుని జీవించే మనుషులను అంగీకరించినట్లు తనను సురేష్‌ అంగీకరించలేక పోవడం వెనుక అతని హిపోక్రసిని గౌరి ఎత్తి చూపుతుంది. గౌరి ప్రస్తావన విని సురేష్‌ ఆమెకు దూరం అవుతాడు. కాని ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి ఓ ఇష్టం, గౌరవం ఉంటాయి. గౌరితో పరిచయం అతనిలో ఎప్పుడో చనిపోయిన సున్నితత్వాన్ని, ప్రేమను బైటకు తీసుకువస్తే సురేష్‌ తో పరిచయం గౌరిలో తాను తన జీవితంలో గతం నుండి బైట పడాలనే అవసరాన్ని గుర్తించేలా చేస్తుంది. ఓ రాత్రి ఇద్దరూ కలిసి గడిపుతారు.
గౌరితో ఓ రాత్రి గడిపడానికి ఆమె ఇంటికి వెళ్ళిన సురేష్‌, తన భార్యకీ గౌరికి ఉన్న ఒకే రకమైన ఇష్టాలను గుర్తిస్తాడు. గౌరి తన ఇంటిని అలంకరించుకునే తీరులోనే తన భార్య కూడా ఉండే ప్రయత్నం చేస్తుందని, కాని తాను చూపే నిర్లక్ష్యం చేసే అవమానాల వల్ల ఆమె అన్నిటిని వదులుకుని ఓ బండరాయిలా జీవిస్తుందని అతనికి అర్ధమవుతుంది. గౌరి భర్తను ప్రేమించినట్లే తన భార్య కూడా తనను ప్రేమిస్తుందని, ఆమెను అవమానించి తాను ఆమెను ప్రెమరాహిత్యంలోకి నెట్టి పడేస్తున్నానని అతనికి అర్ధం అవుతుంది. ఆ అనుభవం తరువాత అతను తిరిగి తన భార్యను చేరుకుంటాడు. తన కన్నీళ్ళతో ఆమె క్షమను సంపాదిస్తాడు. గౌరి తాను భర్త జ్ఞాపకాలను మదిలో దాచుకుని జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకుంటుంది. భర్త జ్ఞాపకాలు గతం అని, తన వర్తమానాన్ని, భవిష్యత్తును తాను నిర్మించు కోవడానికి కషి చేయాలని అర్ధం చేసుకుని ఆ రకంగా జీవించడానికి సిద్ధపడుతుంది. గతించిన భర్తను ఓ జ్ఞాపకంగా మాత్రమే మిగుల్చుకోవడానికి సురేష్‌తో ఆమె పొందిన అనుభవం ఆమెని సిద్ధపరుస్తుంది. గౌరి, సురేష్‌ల కలయిక వారికి వారి వారి జీవితాలలో ముందుకు సాగడానికి సహాయపడుతుంది. ఈ సంబంధాన్ని వారు కొనసాగిస్తారని దర్శకులు చెప్పరు. కాని ఒక చోట ఇరుక్కుపోయిన వారి జీవితాలు ముందుకు సాగడానికి ఈ అనుభవం వారిని సిద్ధపరిచింది అన్న దిశగా సినిమాను ఆయన ముగించారు. ఈ సినిమా ద్వారా దర్శకులు చర్చకు తీసుకువచ్చిన విషయాలను, ఏ మాత్రం ప్రెజిడీస్‌ లేకుండా గమనించవలసిన అవసరం ప్రేక్షకులది. స్త్రీకి శారీరిక అవసరాలు ఉంటాయి. అవి ఆమెను కలవర పెడుతూ ఉంటాయి. వాటిపై నియంత్రణ పురుషున్ని బాధించినట్లే స్త్రీని బాధిస్తూ ఉంటుంది అన్నది ప్రధానంగా పరిగణలోకి తీసుకోవలసిన విషయం. వివాహేతర సంబంధాలు గురించి చర్చించేటప్పుడు కొంత సున్నితంగా ఆలొచించ వలసిన అవసరం ఉంటుందనే విషయాన్ని అంగీకరించవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా శారీరిక అవసరాల దిశగా నైతికత పేరుతో సమాజం స్త్రీ పైనే ఎంతో భారాన్ని ఉంచడం వెనుక రాజకీయాన్ని అర్ధం చేసుకునే క్రమంలో ఈ సినిమాను చూడాలి. భర్త మరణించిన స్త్రీ మరో పురుషునితో సంబంధం పెట్టుకోవలసిందేనా, స్త్రీ తన కోరికల కోసం పక్క దారులు తొక్కవలసిం దేనా, ఏం మరో వివాహం చేసుకోవచ్చుగా లాంటి ప్రశ్నలను వేసే ముందు వితంతువుని భార్యగా స్వీకరించే క్రమంలో ఆమెని సెకెండ్‌ హాండ్గా మాత్రమే చూస్తూ ఆ వివాహం ద్వారా తాము ఇచ్చేదానికన్నా పొందే లాభాన్ని లెక్కలు వేసుకుంటూ ఆమెను వివాహం చేసుకోవాలనుకునే పురుషుల నైజాన్ని ప్రశ్నించవలసిన అవసరం కూడా ఈ సినిమా కల్పిస్తుంది. ఓ పురుషునితో జీవించిన స్త్రీని, ఓ స్త్రీతో సంబంధం ఉండిన పురుషుడిని ఒకే దష్టితో చూడలేని సమాజం కల్పించే ఒత్తిడి కారణంగా ఎక్కువగా స్త్రీ నష్టపోతుందనే సత్యాన్ని కూడా ఈ సినిమా ప్రస్తావిస్తుంది. ఈ సినిమా లో గౌరి ఎన్నుకున్న మార్గం అందరి స్త్రీలకు నిస్సందేహంగా వర్తించదు. వర్తించకూడదు కూడా. కాని ఆమె ఎన్నుకున్న మార్గం వెనుక సమాజంలో స్త్రీ అవసరాలను తక్కువ దష్టితో చూసే పురుషాధిక్య భావజాలం ఉంది. నైతికత అనే విషయం కారణంగా తీవ్రమైన ఒత్తిడిని అనుభవించవలసిన స్త్రీల జీవన సత్యం ఉంది. ”నాతిచరామి” ఈ విషయాలన్నిటినీ చర్చించే అవసరాన్ని కల్పించిన సినిమా. ఈ సినిమాకు సంభషణలే చాలా బలం. ముఖ్యంగా సైక్రియాటిస్టుతో గౌరి జరిపే సంభాషణలు సమాజం, మనిషి మధ్య జరిగే సంఘర్షణలోని ఎన్నో పార్శ్వాలను స్పష్టపరుస్తాయి. అందరికీ ఈ సినిమా నచ్చకపోవచ్చు కాని ఎవరూ ఆలోచించడానికి ఇష్టపడని, ధైర్యం చేయనై కొన్ని విషయాల పట్ల మనలో అలజడికి మాత్రం కారణం అవగల సినిమాగా దీన్ని ప్రస్తావించుకోవాలి.
– పి.జ్యోతి,
9885384740

Spread the love