అభ్య‌ర్థు‌ల గెలుపు..నాయ‌కుల‌కు స‌వాల్‌..!

– అభ్యర్థుల విజయానికి చెమటోడుస్తున్న నాయకులు
– ఎంపీ స్థానం దక్కించుకునేందుకు వ్యూహాలు
– క్షణం తీరికలేకుండా ప్రచారంలో నిమగం
– ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు
ఆదిలాబాద్‌ లోక్‌సభ అభ్యర్థుల గెలుపు..ఆయ పార్టీలకే కాదు..అందులోని కీలక నాయకులకు సవాల్‌గా మారింది. అభ్యర్థులు ఎవరున్నా..వారిని గెలిపించే బాధ్యతలు మాత్రం వీరు తీసుకోవడం ఆసక్తి రేపుతోంది. ఇందుకు ఆయా పార్టీల అధిష్టానాలు సైతం ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులకే గెలుపు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అభ్యర్థుల మాదిరిగా ప్రచారపర్వంలో వారు నిమగమైన తీరు చూస్తుంటే ఓ దశలో ఎన్నికల్లో వారే పోటీ చేస్తున్నారా..? అనే రీతిలో కనిపించడం ఇందుకు నిదర్శనకంగా కనిపిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల తరపున ప్రచారానికి ఆయా పార్టీల అగ్రనేతలు రావడం ప్రచారపర్వాన్ని హీటెక్కించగా.. ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులు క్షణం తీరికలేకుండా అభ్యర్థుల గెలుపునకు చమటోడుస్తుండటం ఆసక్తి రేపుతోంది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సదరు నాయకులు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారపర్వంలోనే నిమగం కావడం ఆసక్తి రేపుతోంది. వివిధ సంఘాలు, సామాజికవర్గాల వారిని కూడగట్టడం.. విజయానికి అవసరమైన వ్యూహాలు రూపొందిస్తుండటం ఆసక్తికరంగా మారుతోంది.

నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ లోక్‌సభ సమరానికి సమయం దగ్గర పడింది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండగా.. పోలింగ్‌కు ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. ఈ క్రమంలో సమయం లేదు మిత్రమా అనే రీతిలో అభ్యర్థులు, ఆయా పార్టీలకు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు అందరూ జనాల్లోనే ఉండటం ఆసక్తి రేపుతోంది. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారపర్వంలోనే ఉంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సీటును ఎలాగైనా దక్కించుకొని పాగా వేయాలని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. సిట్టింగ్‌ సీటును నిలుపుకోవాలని బీజేపీ అనుకుంటోంది. ఈ సీటులో విజయం సాధించడం ద్వారా పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ భావించడం ఆసక్తికరంగా మారింది. మూడు ప్రధాన పార్టీలు ఎవరికి వారు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పార్లమెంటుకు వెళ్లాలనే కుతూహలంతో పోటీ పడుతున్న అభ్యర్థులు ఎన్నికల్లో శ్రమించడం సహజం. కానీ వీరిని గెలిపించేందుకు ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు కష్టపడుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఓ వైపు ఎండలు మండిపోతున్నా ..అస్వస్థతకు గురవుతున్నా లెక్క చేయకుండా ప్రజల్లోకి వెళ్లి ప్రచారంలో నిమగం కావడం ఆసక్తికరంగా మారింది. మరోపక్క అభ్యర్థి గెలిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుందనే ఉద్దేశంతో ద్వితీయ శ్రేణి నాయకులు, ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
విజయమే లక్ష్యంగా ప్రణాళికలు..!
ఈ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు నువ్వా- నేనా అనే రీతిలో పోటాపోటీగా ప్రచారం చేపడుతున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆత్రం సుగుణను గెలిపేందుకు ఆ పార్టీ కీలక నేతలు ఆహర్నిశలు శ్రమిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క అభ్యర్థి గెలుపు బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. కొన్ని రోజులుగా లోక్‌సభ పరిధిలోనే ఉంటూ ఊరూరా ప్రచారం చేపడుతున్నారు. మంత్రితో పాటు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఇటీవల పార్టీలో చేరిన ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు వారి నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ విజయానికి దోహదం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి ఆత్రం సక్కు పోటీలో నిలవగా.. ఈయన గెలుపు కోసం మాజీ మంత్రి, పార్టీ ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్‌జాదవ్‌, కోవ లక్ష్మీతో పాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన కీలక నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లోక్‌సభ పరిధిలో ప్రచారం నిర్వహిస్తూ అభ్యర్థి విజయం కోసం కృషిచేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ మంత్రి గోడం నగేష్‌ బరిలో నిలవగా.. ఈయన విజయం కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పాయల్‌శంకర్‌, రామారావుపటేల్‌, పాల్వాయి హరీష్‌బాబు శ్రమిస్తున్నారు. వీరితో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు సైతం ప్రచారపర్వంలో నిమగం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా అభ్యర్థి విజయమే లక్ష్యంగా ఆయా పార్టీల కీలక నేతలు, ముఖ్య కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ వర్గాల మద్ధతు కూడగడుతూ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

Spread the love