మత వైశామ్యాలు రెచ్చగొడుతున్న మోడీ

– బీజేపీకి ఓటు వేస్తే హక్కులు కోల్పోయినట్టే
– ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
– తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని భరోసా
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
మూడో సారి ప్రధాని అవుతానన్న ఆశలు పోయి ఓటమి భయంతో ప్రధాని మోడీ దేశంలో మత వైశమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమావేశానికి కాంగ్రెస్‌ తెలంగాణ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ తో కలిసి హాజరయ్యారు. పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థి ఆత్రం సుగుణ విజయానికి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్‌ శ్రేణులకు దశా దిశా నిర్దేశం చేశారు. ఈనెల 13న పోలింగ్‌ జరగడానికి కేవలం నాలుగు రోజులు ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా పోల్‌ మేనేజెమెంట్‌ నిర్వహించాలని సూచనలు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మార్చాలని కుట్ర చేస్తున్న బీజేపీకి ఓటు వేస్తే మన హక్కులు పోతాయన్నారు. ప్రజాస్వామ్య భారత రాజ్యాంగ పరిరక్షణకు దేశ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరముందన్నారు. నియంతృత్వంతో రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న మోడీ ఒకవైపు, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడి దేశంలో లౌకికవాదాన్ని నిలబెట్టాలని ప్రజల కోసం పోరాటం చేస్తున్న రాహుల్‌ గాంధీ మరో వైపు ఈ ఎన్నికల సంగ్రామంలో నిలబడ్డారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేస్తున్న మోడీకి గట్టి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు వేర్వేరు కాదని ఈ రెండు పార్టీలు ఒకటేనని మరోసారి ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో రుజువైందన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే అవుతుందన్నారు. పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక ప్రజా వ్యతిరేక చట్టాలకు బీఆర్‌ఎస్‌ ఎంపీలు మద్దతి ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఒకరికొకరు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. దేశ సంపదను సంపన్నులకు వ్యాపారులకు దోచిపెట్టి బీజేపీ పార్టీ, రాష్ట్ర సంపదను దోపిడీ చేసిన బిఆర్‌ఎస్‌ పార్టీలు ఈ పార్లమెంటు ఎన్నికల్లో చేతులు కలిపి మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతు భరోసా రాకుండా ఆ పార్టీలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఓబిసి కులగణన ద్వారా దేశ సంపద రాజ్యాధికారంలో జనాభా దమాషా ప్రకారం వారికి వాటా లభిస్తుందని రాహుల్‌గాంధీ బీజేపీ పాలకులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో కుల గణన మొదలుపెట్టామని కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో కూడా కులగణన కచ్చితంగా చేపట్టి జనాభా దామాష ప్రకారంగా హక్కులు, సంపద కల్పిస్తామని వెల్లడించారు.
బీఆర్‌ఎస్‌ మోసం చేసింది
పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాగు నీళ్లు ఇవ్వకుండా ఆదిలాబాద్‌ ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ప్రాణహితను విస్మరించి కాళేశ్వరం నిర్మించి ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలకు కష్టాలను చూపించిందని వివరించారు. ఎన్నికల తర్వాత ప్రాణహితను కచ్చితంగా నిర్మిస్తామని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఇక్కడ వివిధ సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ హయాంలోనే నిర్మించామని గుర్తుచేశారు. ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో భూములపై ఆదివాసి గిరిజనులకు ఉన్న హక్కులను ధరణి ద్వారా గత పాలకులు చిన్నాభిన్నం చేశారన్నారు. ట్రైబల్‌, నాన్‌ ట్రైబల్‌ ప్రజల భూ సమస్యలను పరిగణలోకి తీసుకొని వారికి త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఐటీడీఏలను బలోపేతం చేస్తూ వందశాతం నిధులు ఇచ్చి పూర్వవైభవం తీసుకువస్తామన్నారు.
రైతులు ఆందోళన చెందకూడదు
అకాల వర్షం, గాలి దూమారం కారణంగా నష్టపోయిన రైతులను కచ్చితంగా ఆదుకుంటామని, పంట నష్టం అంచనా వేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. ఎన్నికల తర్వాత పరిహారం ఇస్తామన్నారు. అకాల వర్షంతో కల్లాల వద్ద, ఐకెపి కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తామని వెల్లడించారు. ప్రశ్నించే గొంతుక ఆత్రం సుగుణను గెలిపించుకుంటే అమాయక ఆదివాసీ గిరిజన ప్రజల గళాన్ని పార్లమెంటులో వినిపిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్క, నిర్మల్‌ డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలచారి, ఆయా నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు పాల్గొన్నారు.

Spread the love