అకాల వర్షం..రైతులకు తీవ్ర నష్టం

– 1000 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో మామిడికి నష్టం
– ఆదుకోవాలని రైతుల విజ్ఞప్తి
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
కడుపునిండా అన్నం పెట్టే రైతన్నకు అటు ప్రభుత్వం కానీ ఇటు వాతావరణం కానీ సహకరించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఆరుగాలం కష్టపడి పంట పండించినప్పటికీ పెట్టుబడి వెళ్తుందో లేదో అని ఆందోళనకు గురవుతున్న రైతన్నకు మంగళవారం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారు.
అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం
జిల్లాలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి అపార నష్టం చోటుచేసుకుంది. జిల్లాలోని 15 మండలాల్లో యాసంగి పంట నష్టపోవడమే కాకుండా, ఉద్యానవన పంటైన మామిడి కూడా పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు. అనేకచోట్ల ఇండ్లపై రేకులు లేచిపోవడంతో పాటు పంట నష్టం కూడా భారీగానే జరిగింది.
1000 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో మామిడి
మంగళవారం కురిసిన భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 200 మంది రైతులకు 1000 ఎకరాలకు పైగా యాసంగి వరి తో పాటు ఉద్యానవన పంటలైన మామిడి 250 ఎకరాల్లో నష్టపోయినట్లు గుర్తించారు. అయితే పూర్తి లెక్కింపు అయ్యేసరికి ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇటు ప్రభుత్వాలు అటు వాతావరణం సహకరించకపోవడంతో రైతు పరిస్థితి వడకత్తెరలో పోక చెక్కల తయారైంది. అధికారులు పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించి పంట నష్టం గురించి తెలుసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆదుకోవాలని రైతుల విజ్జప్తి
చేతికి అందిన పంట వర్షం పాలు కావడంతో రైతులు తమ మొర ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాక బాధపడుతున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో యాసంగి సాగు కొంత తక్కువ అని చెప్పవచ్చు. అది కూడా ఇప్పుడు వర్షార్పనం కావడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి: ఉగేందర్‌, రైతు
మంగళవారం కురిసిన అకాల వర్షంతో వరి పంట మొత్తం వర్షార్పణమయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోవడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి తలెత్తింది. ప్రభుత్వం ఆదుకొని పంటకు నష్టపరిహారం చెల్లించాలి.

పంటను కొనుగోలు చేయాలి: మేకర్తి మాధవ్‌, బూరుగూడ రైతు
ఎన్నో ఆశలతో కష్టపడి పంట పండిస్తున్నాం. ప్రస్తుతం కోతకు వచ్చింది. చేతికి వచ్చిందని అనుకున్న పంట వర్షంతో నష్టపోవాల్సి వచ్చింది. గింజ ముక్కిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం పంటను కొనుగోలు చేయాలి.

Spread the love