వ్యక్తిగా ప్రయత్నించు.. ప్రకృతి పరిమళించు..!

– అటవీ ప్రాంత ప్రజలకు అవగాహన కార్యక్రమాలు
– అగ్ని ప్రమాదాల నివారణ చర్యలు
నవతెలంగాణ-జైపూర్‌
అడవులు అభివృద్ధి చెందాలంటే విరివిరిగా చెట్లు నాటాలి. సహజ సిద్ధమైన అడవులను పరిరక్షించాలంటే అడవుల్లో అగ్ని ప్రమాదాలను నివారించాలి.. అగ్ని ప్రమాదాల నుండి అడవులను రక్షించుకోవడం కోసం వ్యక్తిగా ప్రయత్నిస్తే ప్రకృతి పరిమళాలను ఆస్వాధించవచ్చునని అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. వేసవి కాలంలో ఏర్పడే అగ్ని ప్రమాదాల నుంచి అడవులను రక్షించుకోవడం కోసం తమ వంతు ప్రయత్నంగా గ్రామీణులకు అవగాహణ కల్పిస్తున్నారు. శాఖ పరంగా రక్షిత అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరుగకుండా చర్యలు చేపడుతూ అగ్ని ప్రమాదాల నివారించడం కోసం అటవీ సరిహద్దు గ్రామాల వారిని అప్రమత్తం చేస్తున్నారు. గత రెండు నెలలుగా ఉమ్మడి జైపూర్‌ మండలంలో పాటు కోటపల్లి, చెన్నూర్‌ మండలాల పరిధిలో అవగాహణ కార్యక్రమాలు చేపడుతున్న అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు బీడీ, సిగరేట్‌ తాగి నిర్లక్ష్యంగా అటవీ ప్రాంతాల్లో పడవేయవద్దని హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా పశుకాపరులు, బాటసారులు ఈ విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రక్షిత అటవీ ప్రాంతంలో గల డీ గ్రేడ్‌ ఫారెస్ట్‌ ఏరియా (అటవీ పోరంబోకు భూములు) గుర్తించి అటవీ అభివృద్ధి సంస్థ అడవులను పెంచడం కోసం ప్లాంటేషన్లు ఏర్పాట్లు చేస్తుండగా అదే సమయంలో సహజసిద్ధంగా లభించిన అడవులను కాపాడుకోవడంపై మంచిర్యాల రేజ్‌ అధికారులు దృష్టి సారించారు. మంచిర్యాల రేంజ్‌ అటవీ అభివృద్ధి సంస్థకు చెందిన ప్లాంటేషన్‌ మేనేజర్‌ గోగు సురేష్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మండల పరిధిలో గల సరిహద్దు అటవీ ప్రాంత గ్రామాల వారితో సమావేశాలు ఏర్పాటు చేస్తూ అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. అదేవిధంగా సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం మధ్యాహ్న భోజనంకు సంబంధించి పేట్లు పంపిణీ చేయడం, కుర్చీలు, బెంచీలు పంపిణీ చేస్తూ గ్రామీణులకు దగ్గరవుతున్నారు.

అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నాం: గోగు సురేష్‌, టీఎస్‌డీసీ ప్లాంటేషన్‌ మేనేజర్‌
ఎండా కాలంలో ఏర్పడే అగ్ని ప్రమాదాలను నివారించడం కోసం ప్లాంటేషన్లలో రాత్రింబళ్లు సిబ్బందితో కలిసి గస్తీ తిరుగుతున్నాం. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు అడవుల్లోకి వ్యాప్తి చెందకుండా ప్లాంటేషన్ల చుట్టు ఫైర్‌ ప్రొటెక్షణ చేపట్టడం జరుగుతుంది. రక్షిత అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న వాహణదారులు, బాటసారులు, పశుకాపరులు జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నాం. ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే తమకు సమాచారం అందించాలని గ్రామీణులను కోరుతున్నాం. ఈ విషయంలో గ్రామీణులకు అవగాహణ కల్పిస్తూ అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అడవుల ప్రాముఖ్యతను వివరించడం జరుగుతుంది.

Spread the love