కేసీఆర్​ వల్లే పచ్చదనం పెరిగింది: ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

నవతెలంగాణ నిర్మల్: రాష్ట్రంలో అడ‌వుల ర‌క్షణ‌, వ‌న్యప్రాణుల సంర‌క్షణ, ప‌చ్చద‌నం పెంపునకు కేసీఆర్ ప్రభుత్వం విశేష‌ కృషి చేస్తుంద‌ని మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ‌లో భాగంగా హ‌రిత‌హారం కార్యక్రమాన్ని చేప‌ట్టి మొక్కలు నాటుతున్నామ‌ని, ఇప్పటికే ల‌క్ష్యాన్ని అధిగ‌మించామ‌ని, ఇది నిరంత‌ర ప్రక్రియ‌గా కొన‌సాగుతుంద‌ని ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ప్రతీ గ్రామ‌పంచాయ‌తీ, మున్సిపాలిటీల‌లో న‌ర్సరీల‌ను ఏర్పాటు చేసి మొక్కల‌ను పెంచుతున్నామ‌న్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని చించోలి-బీ స‌మీపంలోని గండిరామ‌న్న హ‌రిత‌వ‌నంలో నూతనంగా ఏర్పాటు చేసిన జంగల్‌ సఫారీని మంత్రి ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సఫారీ వాహనాన్ని స్వయంగా 5 కిలోమీట‌ర్లు న‌డిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేప‌ట్టిన అడ‌వుల సంర‌క్షణ చ‌ర్యల వ‌ల్ల వ‌న్యప్రాణుల సంఖ్య పెర‌గింద‌ని, మ‌హారాష్ట్రలోని త‌డోబా టైగ‌ర్ రిజ‌ర్వ్ నుంచి క‌వ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్ జోన్‌కు పులులు వ‌ల‌స వ‌చ్చి ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయ‌ని తెలిపారు.
పార్కులో అడ్వెంచర్‌ కార్యక్రమాలతో పాటు పిల్లలు, పెద్దలందరికీ ఆహ్లాదం, వినోదం కలిగించేలా ఏర్పాట్లు చేశామ‌ని వెల్లడించారు. హరితవనంలో కోతుల సంరక్షణ, పునరావాస కేంద్రం, మూషిక జింకల పార్కు, చైన్ లింక్, ఎకో హట్స్, సైక్లింగ్, వాచ్ ట‌వ‌ర్స్ చిన్న పిల్లల ఆట స్థ‌లం లాంటి సౌక‌ర్యాల‌ను సంద‌ర్శకుల కోసం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామ‌ని పేర్కొన్నారు. పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామ‌ని తెలిపారు. అనంత‌రం తెలంగాణ ద‌శాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 19న నిర్వహించ‌నున్న హ‌రితోత్సవ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.

Spread the love