‘ప్రజాగాయకుడా .. జోహార్లు’ -వెన్నెల సత్యం

ఈ వారం కోసం ఏ కవితను పరిశీలనలోకి తీసుకోవాలి అని ఆలోచిస్తుంటే డా.ఎస్‌.రఘు రాసిన వ్యాసం ‘శ్రామికుల ఆత్మగీతం, విప్లవోద్యమ మాతృగీతం-సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో’ కంటబడింది.ఆ వ్యాసం నన్ను ఏకబిగిన చదివించింది. వెంటనే నా ఆలోచన గద్దర్‌ మీద రాసిన ‘నివాళి’ కవితలపైకి మళ్ళింది. శ్రీరామోజు హరగోపాల్‌ రాసిన ‘ఒఖ్ఖడే గద్దర్‌’, దేశరాజు రవికుమార్‌ రాసిన ‘అతడొక అడవి’, వనపట్ల సుబ్బయ్య రాసిన ‘విప్లవసూర్యుడు’, సూర్యవంశీ రాసిన ‘గద్దర్‌ అంటే వేయి సంవత్సరాలు మోగే పాట’, జాబేర్‌ పాషా రాసిన ‘గగనం చేరిన యుద్ధనౌక’, వెన్నెల సత్యం రాసిన ‘ప్రజాగాయకుడా జోహార్లు’ లాంటి కవితలను వివిధ మాధ్యమాల్లో,పత్రికల్లో చదివాను. వారి వారి శైలికి అనుగుణంగా ఆ కవితలు రాశారు. ఈ సందర్భంలో చాలా మంది కవులు గద్దర్‌కు నివాళిగా ఎన్నో కవితలు రాసుంటారు. నా పరిశీలనలోని కవితలు మాత్రమే ఇక్కడ రికార్డు చేస్తున్నాను. వెన్నెల సత్యం రాసిన ‘ప్రజా గాయకుడా జోహార్లు’ అనే కవితను పరిశీలిద్దాం.
గద్దర్‌ గురించి తెలియని వారెవరు లేరు. పరిచయం అక్కర్లేని ‘ప్రజా యుద్ధనౌక’ తను. పాటతో ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన ఘనుడు. ఎన్నో పాటలు రాశారు. ఏ వస్తువునయినా పాటగా మలచటం గద్దర్‌ కే చెల్లింది. అతి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా రాయటం ఆయన ప్రత్యేకత. అందుకు కారణం పాటనే ఊపిరిగా చేసుకుని జీవించటం కావచ్చు. అనుభవం కావచ్చు. వారి ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా’ పాట తెలంగాణ ఉద్యమంలో ఎంత కీలకపాత్ర పోషించిందో అందరికి తెలుసు. అయితే ప్రతి ప్రజాగాయకుడికి కొన్ని ‘ఎaఅఅవతీఱరఎర’ ఉంటాయి. అంతకు ముందుగా ఆలోచిస్తే ప్రతి మనిషికి కొన్ని ఊతచేష్టలు ఉంటాయి. అవి చేస్తేనే వారు మాట్లాడగలరు. పాడగలరు. తాపీ ధర్మారావు ఊతపదాలకు సంబంధించిన విషయాలను చెబుతూ కొన్ని ఉదాహరణలిచ్చారు. బటన్‌ లాగితేనే ఒక వ్యక్తి ఉపన్యాసం ఇవ్వగలుగుతాడు, ముక్కు తడిమితేనే ఒక వ్యక్తి మాట్లాడగలుగుతాడని, ఈ విషయాలన్ని నేను చిన్నప్పుడు చదువుకున్న పాఠ్యాంశం లోని విషయాలు. గద్దర్‌ పాడినప్పుడు ఆ పాట లయకు అనుగుణంగా కాలు కదులుతుంది. చేతిలోని గుడ్డ పసిబిడ్డ అవతారమెత్తుతుంది. గోరటి వెంకన్న పాట పాడినప్పుడు రెండు, మూడు లైన్లు పాట ప్రశాంతంగా సాగుతుంది. ఆ తర్వాత పాటలో మమేకమవుతూనే ఎగిరు దుంకులతో శివమూగిపోతాడు. ఇవన్నీ వాళ్ళు గుర్తింపబడటంలో కీలక సాధనాలు. ఒకసారి చూస్తే ఇట్టే ఆకట్టుకొని చెరిపి వేయలేని జీవితకాల ముద్రలు.
‘వెన్నెల సత్యం’ ఈ కవితలో గద్దర్‌ అనగానే గుర్తొచ్చే గోశి, గొంగడి, చేతికర్ర, కాలిగజ్జెలను గుర్తుచేసుకుంటూ కవితను నడిపించాడు. దాదాపుగా ప్రతి కవి కవితను పరిశీలిస్తే పైన మాట్లాడుకున్నట్టుగా గద్దర్‌ ఉపయోగించిన వస్తువులను, పాటను తప్పనిసరి చేస్తూ రాయటం చూడొచ్చు. అంతలా అందరిలో లీనమయ్యాడు గద్దర్‌.
కవి పెట్టిన శీర్షిక నినాదాన్ని తలపించినా, ఎప్పుడూ వాడుకలో ఉన్నదయినా ఈ సందర్భానికి సరిపోయింది. సంఘటనాత్మక కవితలు రాసినప్పుడు శీర్షికలోనే విషయాన్ని కొంత ఓపెన్‌ చేయటం మంచిది.
ఈ కవి ఆ విషయంలో ఒకడుగు ముందుకేశాడు. ఎత్తుగడలో కొన్ని సందర్భాల్లో కవిత్వం చేయటం కుదరదు. సాధారణ వాక్యాలతో కవిత మొదలువుతుంది. కానీ ఈ కవి ప్రతీకలను వాడుకొని కవితలోకి తీసుకెళ్ళాడు. ఆ వ్యక్తినుండి దూరం జరగకుండా అతనితో, అతని చుట్టు ఉన్న వాటినే తీసుకోవటంతో కవిత పై స్థాయికి వెళ్ళింది.
కాలం కాలిగజ్జెగా మోగిందనటం, కోయిలే రాగాలను తాగిందనటంలో అభివ్యక్తిలో సాంద్రత కనబడుతుంది.
రెండవ, మూడవ స్టాంజాలలో కవితనుండి దూరం జరగకుండా, శిల్పాన్ని చెదరనీయకుండా, అనవసర టర్న్స్‌ తీసుకోకుండా గద్దర్‌ ఉపయోగించే చేతికర్రను, గొంగడిని, ఎర్రని రుమాలును జోడించి వాక్యాలు రాయటంతో కవిత ఇంకాస్త పాఠకుడి లోపలికి సూటిగా వెళ్ళేలా ఉంది. కవి ఇక్కడ సహజమైన ధోరణిలో ముందుగా కూర్చుకున్న ‘రా మెటీరియల్‌’ ఏదైతే ఉందో దాన్ని కవిత్వం చేశాడు. అందుకే ఎక్కడా గతి తప్పలేదు.
కొంత మంది కవులు ఈ విషయంలో వెనుకబడి ఉన్నారు. పాతతరం కవులు ఆ రోజుల్లో చెలామణి అవుతున్న పదజాలాన్ని, వాళ్ళు చదువుకున్న గ్రాంథిక భాషా పాండిత్యాన్ని కవిత్వంలో ప్రయోగిస్తే అదే ధోరణిలో వర్తమాన కవులు వ్యవహారికంలో చదువుకొని కూడా ఆ ప్రయోగాలే చేస్తున్నారు. గ్రాంథికం రాయటం తప్పుకాదు. కవిత్వంలో వాడుకోవటం తప్పుకాదు. సరిగ్గా సరిపోతుందా లేదా అన్నదే వాదన. కాలంతో పాటు భాషలో స్థానికత, జీవన స్థితిగతులు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి విషయాలను గమనిస్తే ఏ కవయినా ఇంకాస్త ముందుకెళ్ళగలడని చిన్న ఆలోచన.
మూడవ స్టాంజాలోని చివరి రెండు లైన్లలో, ముగింపు స్టాంజాలో గద్దర్‌ ఉద్యమాలలో కీలకపాత్ర వహించిన తీరును కవిత్వం చేశాడు. పాటను ఎలా ఆయుధం చేసుకున్నాడో గుర్తు చేశాడు. శరీరంలో బుల్లెట్‌ ఉన్న క్రియాశీల ఉద్యమాలనుండి వెనక్కి మరలకుండా, వయసు పై బడినా తాను ముందుకు నడుస్తూ ఇంకా ఉద్యమాన్ని రగిలిస్తున్న తీరును తెలియజేశాడు. మొదటి రెండు స్టాంజాలలో తన వేషధారణను, ఆహార్యాన్ని చూపించిన కవి చివరి స్టాంజాలలో ప్రజాస్వామిక ఉద్యమాలలో గద్దర్‌ పోషించిన పాత్రను చేర్చడంతో
కవితా సమన్వయాన్ని సాధించాడు. ముగింపు వాక్యాల్లో గద్దర్‌ మార్గదర్శనం చేసిన బాటలో అడుగులు పడాల్సిన అవసరం ఉందని ‘అతడో దిక్సూచి’ అని కితాబిచ్చాడు. గద్దర్‌ కు నివాళిగా రాసిన కవితల్లో ఇదొక మేలిరకం కవిత.
గద్దర్‌ చివరగా తన మరణాన్ని గురించి ఊహించుకుని ముందే రాసుకున్న పాట ఎంతో ఆర్థ్రంగా ఉంది. ముందు తరం వారి బాధ్యతను గుర్తుచేసేదిగా ఉంది. ‘ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరోనని’ రాసిన వాక్యం మాత్రం హృదయాన్ని మెలిపెడుతుంది. ఈ పాటలోని వాక్యాలన్ని ఇప్పటి వర్తమానాన్ని సూచించేవి. కొన్ని వందల పేజీల సారాంశానికి శీర్షికలవి.
ప్రజా గాయకుడా.. జోహార్లు

కాలం నీ కాలి
గజ్జెగా మోగింది
కోయిల నీ గొంతులో
రాగాలు తాగింది

నీ భుజాన గొంగడి
తాడిత పీడితుల
విముక్తి కేతనమైంది
నీ చేతిలో ఒడుపుగా
రెపరెపలాడిన అరుణపతాకం
తిరుగుబాటు చేతనమైంది

నీ చేతికర్ర
పెత్తందార్ల గుండెలో దిగిన
ములుగర్రగా నిలిచింది
ప్రతి అక్షరం ప్రజాపక్షమై
ప్రతి పదం అయుధమై
జనం పాటగా గెలిచింది!!

గుండెలో తుపాకీ గుండు
నీ ఆయువుపై యుద్ధం చేస్తున్నా
ప్రజా యుద్ధనౌకగా కదిలావు
ఎత్తిన నీ పిడికిలితో
తెలంగాణ ఉద్యమానికి దిక్సూచివై
మా హృదయాల్లో మిగిలావు
-వెన్నెల సత్యం
– తండా హరీష్‌, 8978439551

Spread the love