అదొక ప్రభుత్వ ఉన్నత పాఠశాల. తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ‘అల్లూరి సీతారామరాజు’ అనే పాఠాన్ని బోధిస్తున్నాడు తెలుగు మాష్టారు. పిల్లలంతా పాఠంలో లీనమై వింటున్నారు. పాఠం పూర్తి కావచ్చింది. ఇంతలో పాఠశాల బంట్రోతు ప్రకటన రిజిష్టరు తీసుకొని వచ్చాడు. చదివి వినిపించాడు మాష్టారు. అది ‘అల్లూరి సీతారామరాజు’ వ్యాస రచన పోటీ గురించి. ఒక్కసారిగా పిల్లలంతా కేరింతలు కొట్టారు. పాఠం చెప్పడం పూర్తి చేసి.. ”మీరు నేర్చుకున్న పాఠమేనని సంబర పడకండి. వ్యాసం రాయాలంటే ఒక పద్ధతి ఉంటుంది” అంటూ వ్యాసం ఎలా రాయాలో వివరించాడు మాష్టారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు వ్యాసరచన పోటీ ప్రారంభంవుతుంది. ఒక గంట సమయమే కనుక చాలా జాగ్రత్తగా రాయండి. నాకు తెలిసిన మరో విషయం ఏమిటంటే.. ప్రతీ పాఠశాల నుండి ప్రథమంగా, ద్వితీయంగా వచ్చిన విద్యార్థులకు మన జిల్లా విద్యాశాఖాధికారి అయిన విద్యాసాగర్ గారు తన కార్యాలయంలో తిరిగి ‘సామాన్య జ్ఞాన సంపద’ మీద పోటీ పెడతారు. అందులో అధికంగా మార్కులు వచ్చిన ముగ్గురు విద్యార్థులకు దూరదర్శన్ లోని రామగిరి ఛానెల్ నిర్వహించబోయే ‘రామాయణం’ క్విజ్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. ‘రామబంధు’ అనే సంస్థ లక్ష రూపాయలు నగదు బహుమతి ఇస్తుంది. కనుక ముందుగా వ్యాస రచన పోటీ కోసం బాగా తయారవ్వండి” అంటూండగా చివరి బడిగంట మోగింది.
హరి, గిరి ఇద్దరు తొమ్మిదవ తరగతిలో ప్రథమ ర్యాంకు కోసం పోటీ పడే మిత్రులు. గిరి ఎంత ప్రయత్నించినా హరి సాధించిన మార్కులను అధిగమించ లేక పోతున్నాడు. రెండు, మూడు మార్కుల తేడాతో వెనుక పడిపోతున్నాడు. హరితో పైకి మిత్రుడిగా నటిస్తూ.. మనసులో అసూయ పడేవాడు. కనీసం ఈ వ్యాసరచన పోటీలో అయినా హరిని ఓడించాలని మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నాడు గిరి.
వ్యాసరచన పోటీ ముగిసింది. మరునాడు ఉదయం ప్రార్థన, ప్రతిజ్ఞ అనంతరం ప్రధానోపాధ్యాయుని సూచన మేరకు తెలుగు మాష్టారు విద్యార్థుల ముందుకు వచ్చాడు. వ్యాసరచన పోటీలో ప్రథముడిగా నిలిచిన హరి వ్యాసం చదివి వినిపించాడు. విద్యార్థుల కరతాళధ్వనులు మిన్నంటాయి. పాఠంలో లేని ఎన్నో కొత్త విషయాలు హరి వ్యాసంలో రాయడం వారిని అబ్బుర పర్చింది. గిరి లోలోన మరింత అసూయ పెంచుకున్నాడు. అతనికి ద్వితీయ బహుమతి రావడం ‘గుడ్డిలో మెల్ల’లా కాస్త ఉపశమనం పొందాడు. తన ప్రతాపం జిల్లా కేంద్రంలో చూపించాలనుకున్నాడు.
ఆరోజు రానే వచ్చింది. జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి ఇరువది మంది విద్యార్థులు విద్యాశాఖాధికారి కార్యాలయానికి వచ్చారు. హాల్లో అందరినీ సమావేశ పర్చి.. ఇది దూరదర్శన్‌లో రాబోయే కార్యక్రమానికి నమూనా! అంటూ నియమ నిబంధనలు వివరించాడు కార్యాలయ పర్యవేక్షణాధికారి. ఇంతలో విద్యాసాగర్ గారు స్వయంగా తయారు చేసిన ప్రశ్నావళితో హాల్లోకి వచ్చాడు.
సరిగ్గా పదకొండు గంటలకు పోటీ ఆరంభమయ్యింది. హరి తడబడకుండా అందరికంటే ముందు సమాధానాలు చెబుతుంటే గిరితో బాటు అంతా కొయ్యబారి పోయారు. హరి ప్రథముడిగా నిలిచాడు. తరువాత వరుసగా నిలిచిన వారిలో గిరి, వాసు వున్నారు. విద్యాసాగర్ క్విజ్‌లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశాడు. ‘రామాయణం’ క్విజ్ లో పాల్గొనడానికి అర్హత సాధించిన ముగ్గురినీ ప్రత్యేకంగా అభినందిస్తూ.. ఒక్కొక్కరికి రామాయణ గ్రంథం బహుమతిగా యిచ్చాడు.
గిరికి అమితానందం కలిగింది. దానిని మూడు సార్లు చదివాడు. వివిధ ఘట్టాలను మననం చేసుకున్నాడు. ఈసారి హరిని, వాసును ఓడించి లక్ష రూపాయలు సొంతం చేసుకుంటానని మనసులో ప్రతిన బూనాడు.
ఆనాటి దూరదర్శన్ కార్యక్రమంలో ప్రకటనల అనంతరం క్విజ్ కార్యక్రమం ఆరంభమయ్యింది. విద్యార్థుల తల్లిదండ్రులతోబాటు ప్రేక్షకులు ఉత్కంఠంగా చూస్తున్నారు. గిరికి, వాసుకు డబ్బు మీద ధ్యాసే గాని జవాబులు చెప్పడంలో తడబడ్డారు. హరి మౌనమునిలా సమాధానాలు చెబుతూ.. ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసాడు. లక్ష రూపాయల నగదు బహుమతి గెల్చుకున్నాడు.
ఆనాటి కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన విద్యాసాగర్ గారి చేతుల మీదుగా బహుమతి అందజేయాలని రామబంధు సంస్థ అధ్యక్షులు విజ్ఞప్తి చేసాడు. విద్యాసాగర్ గారు హరికి బహుమతి అందజేసి తాను చేసిన కృషిని తెలియజేయాల్సిందిగా కోరాడు. హరి లిప్తకాలం ఆలోచించి పెదవి విప్పాడు.
”నాకు మాఊరి గ్రంథాలయమంటే ప్రాణం. నేను ఎక్కువగా అందులోనే వివిధ గ్రంథాలు చదువుతూ సమయం సద్వినియోగం చేసుకుంటాను. వ్యాసరచనలో కేవలం మా పాఠ్యభాగమే కాకుండా.. ఈనాటి కార్యక్రమంలో నాకు బహుమతిగా వచ్చిన రామాయణమే గాకుండా.. వివిధ రచయితలు రచించిన గ్రంథాలను గ్రంథాలయంలో చదివాను. అందుకే ఈ బహుమతి గెలుచుకోగలిగానని నా నమ్మకం. అయితే నాదొక విన్నపం. బాలల కోసం కథల పుస్తకాలు మా గ్రంథాలయంలో ఎక్కువగా లేవు. నా బహుమతితో మరిన్ని బాలల కథల పుస్తకాలు తెప్పించమని మన జిల్లా విద్యాశాఖాధికారి గారిని కోరుకుంటున్నాను” అంటూ రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కారం చేస్తూ.. తన బహుమతిని తిరిగి విద్యాసాగర్ గారికి అందజేశాడు. ప్రేక్షకుల చప్పట్లు మిన్నంటాయి.
– చెన్నూరి సుదర్శన్, 94405 58748