మిడత సాయం

ఒక అడవిలో కుందేలు, జింక, దుప్పి మూడింటికి బాగా స్నేహం కుదిరింది. రోజు ఆహారం సంపాదించుకుని కలిసి కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవి. తమకు దొరికిన ఆహారాన్ని కలసి పంచుకుని తినేవి. ఒక రోజు అడవిలో కూరగాయల సంత జరుగుతోందని తెలియడంతో మూడు సంతకు బయలుదేరాయి. అటుగా వెళుతున్న నక్కకి హుషారుగా వెళుతున్న కుందేలు జింక, దుప్పి కనిపించాయి. ఎప్పటి నుండో ఒకేసారి వాటి మాంసం తినాలనే కోరికను తీర్చుకోవాలని అనుకున్న నక్క, వాటిని ఎలాగైనా మచ్చిక చేసుకోవాలని పథకం వేసింది. వాటితో మంచిగా మాటలు కలిపి తన ఇంటికి తీసు కెళ్ళాలనుకుంది నక్క. అనుకున్న వెంటనే వాటితో ”ఏమిటో విశేషం! ముగ్గురు కలిసి ఎక్కడికో బయలుదేరినట్టున్నారు” అంటూ మాటలు కలిపింది. నక్కను చూడగానే భయపడ్డాయి కుందేలు, జింక, దుప్పి. అది గమనించిన నక్క ”అరే మీరు భయపడవలసిన పని లేదు. మీరనుకున్నట్టు ఇప్పుడు నేను మాంసాహారిని కాను. మీలాగే శాఖాహారిని. మా అమ్మ ఓ ఏడాది పాటు మాంసం ముట్ట కూడదని వ్రతం చేస్తోంది. ఇపుడు నేను కూడా మీ మిత్రుడినే” అని నమ్మబలికింది నక్క. ఆ మాటకి ఊపిరి పీల్చుకున్న దుప్పి ”ఏమి లేదు మిత్రమా! కూరగాయల సంతకు వెళుతున్నాం” అంది.
”అవునా? సరే మీకు అభ్యంతరం లేకపోతే నేనూ వస్తాను” అని ఇంకా నమ్మబలికింది నక్క. ”ఇందులో మాకు అభ్యంతరం ఏముంది. నువ్వు కూరగాయల సంతకు వస్తానంటే. పైగా శాఖాహారిని అంటున్నావు. అందరం కలిసి నచ్చిన కూరగాయలు తీసుకుందాం” చెప్పుకొచ్చింది జింక.
”సరే! వెళ్ళే దారిలో మా ఇంటికి వెళ్ళి నా ఆతిధ్యాన్ని స్వీకరించాలి మరి. తాజాగా పచ్చి గడ్డి, చిరుధాన్యాలు తిని, క్యారెట్‌ రసం తాగి సంతకు వెళ్దాం. మీకు అభ్యంతరం లేదంటేనే సుమా” అమాయకత్వాన్ని నటిస్తూ అన్నది నక్క.
”నీవు ఇంత అభిమానంతో చెపుతుంటే కాదంటామా అలాగే మిత్రమా. ఎలాగో సంతలో ఆలస్యం అవుతుంది. కాస్త కడుపుకి తిన్నట్టు ఉంటుంది” అంది కుందేలు. అన్నీ కలిసి నక్క ఇంటికి వెళ్ళాయి. ఇదంతా గమనించిన ఓ మిడత, నక్క ఏదో జిత్తులమారి పన్నాగం పన్నిందని వాటిని అనుసరించి, నక్క ఇంటి అటక పై వాలి చూడ సాగింది.
ఇంటిలోకి వచ్చిన మూడు జంతువులతో ”తలుపు వేసి వస్తాను మిత్రులారా! ఎవరైనా మీరు భుజించేది చూస్తే దిష్టి తగులుతుంది” అంటూ తలుపు వేసింది. నక్క నుండి ఏదో ప్రమాదం వాటిల్లుతోంది గ్రహించిన మిడత వెంటనే కుందేలు, జింక, దుప్పి చెవిలో తప్పించుకనే ఉపాయం చెప్పింది. నక్క ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూడింటిని ఆరగించడానికి సిద్ధపడింది. ఇంతలో హఠాత్తుగా జింక, దుప్పి కింద పడి గిలగిల కొట్టుకోవడం మొదలు పెట్టాయి. వెంటనే కుందేలు ”అయ్యయ్యో! నక్క మిత్రమా ఈ రెండింటికి మూర్ఛవ్యాధి ఉంది. నువ్వు తొందరగా రెండు ఇనుప చువ్వలు తెచ్చి వాటి చేతిలో పెడితే కాని అవి బతకవు” అని కంగారుగా అంది.
ఏం జరుగుతుందో అర్థం గాని నక్కకు మూర్ఛ వ్యాధితో చనిపోయిన వీటిని తింటే తనకు ఆ వ్యాధి వస్తుందని భయపడి కుందేలు చెప్పినట్టుగానే రెండు ఇనుప చువ్వలు తెచ్చి జింక, దుప్పి చేతిలో పెట్టగానే అవి గబుక్కున లేచి ఆ ఇనుప చువ్వలతో నక్క తలపై బాదాయి. కుందేలు వెంటనే తలుపు తీసి సిద్దంగా ఉంది. తలపై బాదడంతో ”చచ్చానురా దేవుడో” అంటూ నక్క గట్టిగా మూలుగుతూ కుప్ప కూలింది.
నక్క కింద పడగానే మూడు జంతువులు బయటకొచ్చి తలుపు వేసి గడియ పెట్టాయి. తమని అనుసరిస్తూ వస్తున్న మిడతకు ఆ జిత్తులమారి నక్క నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు తెలిపాయి.
అక్కడ నుండి సంతకు వెళ్ళి తమకు కావల్సిన కూరగాయలు తీసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్లిపోయాయి కుందేలు, జింక, దుప్పి.
నమ్మించి మోసం చేయాలనుకున్న తనకి తగిన శాస్తి జరిగిందని ఇంకెప్పుడూ ఎవరిని మోసం చేయకూడదని కష్టపడి, నిజాయితిగా ఆహారం సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది నక్క.
తనలా మోసం చేసే వారొకరుంటే, ఉపాయంతో సాయం చేసే మిడతలాంటి వారొకరుంటారని గ్రహించింది నక్క. అప్పటినుండి కష్టపడి పనిచేసుకుని ఆహారం సంపాదించుకుంటూ బుద్దిగా మెలగ సాగింది.
– కయ్యూరు బాలసుబ్రమణ్యం, 9441791239

Spread the love