ఇందూరు బాలల కవి మందారం

– డా|| కాసర్ల నరేష్‌ రావు
ఇందూరు ఖిల్లా నుంచి కవి, రచయిత, పద్యకవి, వ్యాఖ్యాత, నాటకకర్త, పరిశోధకుడు, బాల సాహితీవేత్త, బాల వికాస కార్యకర్తగా పనిచేస్తున్న ఉపాధ్యాయ కవి డా|| కాసర్ల నరేశ్‌ రావు. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం గడ్కోలు గ్రామంలో 28 జూన్‌, 1972 పుట్టాడు. తల్లితండ్రులు శ్రీమతి కృష్ణాబాయి, శ్రీ భక్తప్రహ్లాదరావు. తెలుగు సాహిత్యంలో ఎం.ఎ., ఎంఫిల్‌., పిహెచ్‌.డి పూర్తిచేసిన నరేశ్‌ తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కల్లోల ప్రాంతంలో కవిగా కన్ను తెరిచిన నరేశ్‌ ఇంటర్మీడియట్‌ విద్యార్థిగా తన తొలికవితను ‘ప్రపంచ శాంతి’ పేరుతో 1990లో రాశారు. డిగ్రీ విద్యార్థిగా ఆనాటి నిజామాబాద్‌ ప్రసిద్ధ పత్రికలు పొద్దు, కేకలు, సిరివెన్నెలలో నరేశ్‌ రచనలు అచ్చయ్యాయి. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఫిల్‌ కోసం ‘శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు-స్త్రీ’ అంశంపై పరిశోధన చేశారు. మధురై కామరాజ్‌ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌.డి కోసం ‘నిజామాబాద్‌ జిల్లా వచన కవితా వికాసం-వస్తువు, శిల్పం’ పేర ప్రామాణిక పరిశోధన చేశారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, గుండారంలో తెలుగు ఉపాధ్యాయునిగా బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూనే తన మిత్రులు, సంస్థలతో కలిసి బాలల కోసం నిర్వహించిన కార్యశాలల్లో నరేశ్‌ మమేకమై నిలిచారు. తెలంగాణ పాఠ్యపుస్తక రచయితల్లో ఈయన ఒకరు..
కవిగా పద్యం, గేయం, వచన కవిత్వాలను సమానంగా ప్రేమించి రాసే కాసర్ల ‘గుండె గాయాలు’, ‘కాలస్సర్శ’, ‘కాల గ్రంథం’ మికీ కవితా సంపుటాలు వెలువరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరితో పాటు ముందు వరుసలో నిలిచి కవిత్వానికి ‘కాగడా’ పట్టారు. కరోనా సమయంలోని యిక్కట్లును, పరిస్థితులను అనుభవించిన వారు కదా! ఆనాటి లాక్‌డౌన్‌ మొదలు సామాన్యుల బతుకుల బ్రేక్‌డౌన్‌ వరకు ‘కట్టడి’ పేర తెలచ్చిన కవితా సంపుటిలో చూపించారు. నరేశ్‌కు పద్యం, వచనం రెండు కండ్లు. ‘వానచుక్క శతకం’ పేరుతో పద్యాలతో చక్కని శతకం రాశారు. ‘రుబాయి రాగాలు’ త్వరలో రానుంది.
సంపాదకులుగా, సంకలనకర్తగా ఈ బాల వికాసకార్యకర్త చేసిన పని పెద్దదే. పిల్లల కోసం 2004 నుండి 2008 వరకు వెలువడిన ‘ఇందూరు బాల’ పత్రికకు సంపాదకత్వం వహించారు. దీనితో పాటు 2010లో వచ్చిన తెలంగాణ ఉద్యమ పత్రిక ‘క్యాలి’కి కూడా సంపాదకులుగా వ్యవహరించారు. సర్వశిక్షా అభియాన్‌ వారు తెచ్చిన అరవై పుస్తకాల సంపాదకవర్గంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ కవిత ‘కలాల కవాతు’ తెచ్చారు. విద్యార్థులతో కలిసి పని చేస్తూ, చేయిస్తున్న కాసర్ల సుద్దులం విద్యార్థుల కవితా సంకలనం ‘బాల లేఖిని’, ‘గుండారం గువ్వలు’ పుస్తకాలు తెచ్చారు. వివిధ సంస్థలతో సన్నిహత సంబంధాలున్న నరేశ్‌ సాగర్‌ కళామందిర్‌, ఉపాధ్యక్షులుగా, పద్య భారతి, ప్రధాన కార్యదర్శిగా, హరిదా రచయితల సంఘం, ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ రచయితల సంఘం, రాష్ట్ర కార్యదర్శిగా, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థకు సలహాదారులుగా ఉన్నారు.
బాల సాహితీవేత్తగా 2003లో ‘చదువుల పండుగ’ ఆడియో క్యాసెట్‌ తెచ్చారు నరేశ్‌. యిందులో ఎనమిది పాటలు, ఒక నాటిక ఉన్నాయి. బుడిమి, సుద్దులం పాఠశాలల విద్యార్థులతో 2004 నుండి రేడియో కార్యక్రమాలు చేశారు. గేయ రచనలోనూ చేయి తిరిగిన కాసర్ల ‘బాల తరంగాలు’ పేరుతో బాలల కోసం లలిత గేయ సంపుటి తెచ్చారు. ‘జై విజ్ఞాన్‌’ పేరుతో బాలల నాటికల సంపుటి 2003లో ప్రచురించారు. మరో గేయ సంపుటి ‘బాలలం… మేము బాలలం’ సిద్ధంగా ఉంది. జై విజ్ఞాన్‌ బాలల నాటికలన్నీ ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి. వివిధ పాఠశాలల వార్శికోత్సవాలల్లో ప్రర్శింపబడ్డాయి. వివిధ అంశాలు, వైజ్ఞానిక విషయాలను నాటికలుగా మలచిన నరేశ్‌ ప్రదర్శనకు ఉపయోగకరంగా భాషను, ఘట్టాలను తీర్చిదిద్దారు. బాల గేయాల్లో బాలల హృదయాలను గురించి రాస్తూ… ‘నిర్మల హృదయాలలోన/ నిండివున్న ప్రేమలు/ మర్మాలే యెరుగమండి/ మా మనసులు కోమలం/ ఆటపాటల లోన/ అలుపులేని గెలుపులం/ మాట మర్యాదలోన/ ఆప్యాయపు పిలుపులం/ చదువూ సంధ్యల లోన/ మేమెప్పుడు ప్రథములం/ ఆశయాల సాధనకై/ ముందుకెళ్ళు పదములం/ క్రమశిక్షణ బాటలోన/ కదిలేటి సైనికులం/ ‘శ్రమ’ ఫలితమె నమ్ముకున్న/ తిరుగులేని సాధకులం’ అంటూనే పిల్లలు ‘మానవతా గీతానికి / గొంతు కలుపు కోరసులం’ అంటూ చెబుతారు. నరేష్‌ వృత్తిరీత్యా ఉపాధ్యయుడు. బుడి గుడి కేంద్రంగా బాలలతో పనిచేస్తున్నాడు. అందుకే ఆయనకు బడి నాలుగు గోడలు, కాంపౌండ్‌ వాలున్న భవంతిలా కాకా ‘కోవెలరా పాఠశాల/ దేవతరా విద్యంటే/ శ్రద్ధగా సేవిస్తే/ సిద్ధించును ఘనఫలము’ అని రాయించింది. ఇంకా ‘పలకమీది రాతలతో/ పనియేమి అనుకోకు’ మని, ‘పుస్తకాలనే చూసి/ పులులుగా భావించకు’ మని సుద్ధి చెబుతాడు ఈ కవి పంతులయ్య. యింకా ‘చేయిచేయి కలప’మని, ‘పాఠశా జీవితం పచ్చని జ్ఞాపకం’ అని తలచిన డా||కాసర్ల పిల్లల కోసం చేయాల్సినంత చేస్తున్నా రాయాల్సినంత రాయడంలేదని నా భావన. మల్లొచ్చే యేటికి నరేశ్‌ బాల సాహిత్యాకాశంలో కథల చుక్కల సంపుటాలు. గేయాల తోక చుక్కలను మెరిపించాలని జయహో!

– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love