నూతిలో మనిషి

గోల మరీ ఎక్కువైతే గగ్గోలు అనే కదా అంటారు. అక్కడంతా గోల గోలగా గగ్గోలుగా వుంది. దీనిక్కారణం ఊరిజనం అంతా అక్కడే వుండడం. ఊళ్లో అనేక బోరు బావులున్నా ఉన్నదొక్కటే వ్యవసాయపు బావి. ఆ కాలం నుంచీ ఈ కాలం దాకా అంటే తాతల కాలం నుంచి మనవళ్ల కాలం దాకా బతికున్న బావి. బావి పక్క నుంచి వెళ్లే వాళ్లకు గలగలమని జల గీతం వినిపిస్తుంది బావి. అలాంటి బావి చుట్టూ చేరారు ఊరిజనం.
పెద్దల్ని కేకెయ్యండి రా అనరిచాడో ‘పెద్ద కాని’ పెద్ద వయసాయన. ఊరి పెద్దలు ముగ్గుర్ని పిల్చుకు రావడానికి వయసోళంతా లగెత్తారులే అనరిచిందో ‘పెద్ద కాని’ పెద్ద వయసామె. బావి చుట్టూ ఉన్న జనం ఒకళ్లనొకళ్లు వెనక్కు లాగసాగారు తాము ముందుకు వెళ్లడానికి. ఏం జరుగుతున్నదో కళ్లారా చూడ్డానికి.
ఆగమేఘాలు ఎత్తులో వుండటాన ఎక్కలేక ఆగమాగంగా పరుగెత్తుకు వచ్చారు ఊరి పెద్దలు ముగ్గురయ్యలు మూలపుటయ్యలు. అందరూ పక్కకు జరగండిరా పెద్ద మనుషులు వచ్చేశారు, ఏదో ఒకటి చెయ్యకపోరు. ఊరిదీ, ఊళ్లో జనానిదీ భారం వాళ్లమీదే ఉన్నది అన్నాడొకడు జనం మధ్య నుంచి కనిపించకుండా వినిపిస్తూ. పెద్దాయన్ని అలా నిలబెట్టారేంరా కుర్చీ వేయించండి అన్నారొకరు. కుర్చీ రానే వచ్చింది. ఊరి పెద్దల్లో పెద్దాయన కుర్చీలో కూర్చున్నాడు. మామూలుగానే ఎప్పట్లా కాలు మీద కాలు వేసుకోకుండా దర్జా దాచిపెట్టుకుంటూ. మిగతా ఇద్దరు పెద్దలు పెద్దాయన వైపు కోపంగా, కుర్చీ వైపు ఆశగా చూస్తూ నిలబడ్డారు.
బావి గట్టు మీద నిలబడ్డవారు హా… అని హాహా అని, హాహ్హాహ్హా అని అరుస్తున్నారు. అటు కొట్టుకుపోతున్నాడని ఒక గొంతు, ఇటు కొట్టుకు వస్తున్నాడని మరో గొంతు తమ్ము తాము చింపుకున్నాయి. తాతల కాలం నాటి బావిలో మునుగుతూ తేలుతూ అరుస్తున్నాడో మనిషి. రక్షించండిరో, కాపాడండిరో అంటూ చేతులు జోడిస్తున్నాడు. ఊరి జనం చోద్యం చూస్తూ నిలబడ్డారు కానీ ఒక్కరూ ‘పాన్‌ ఇండియా హీరోలు’ కాలేకపోయారు. వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకోసాగేరు.
వీడు కాలు జారి పడ్డాడా? ఎవడైనా వీడ్ని బావిలో పడదోశాడా? అసలు వీడు చచ్చిపోదామని దూకేశాడా? అందరూ ప్రశ్నలు వేసేవారే కాని జవాబులు ఎవరి దగ్గరా లేవు. వీడు మన ఊరివాడేనా, పొరుగూరి వాడా అని అనుమానం వచ్చింది కొందరికి. ఏ ఊరి వాడైతేనేం మనందరిలాగానే ఓ ముఖం దాంట్లో ఓ ముక్కూ, నీళ్లు మింగే నోరూ వున్నవాడు కనుక మనిషే కాబట్టి, వాణ్ణి బయటకు తీయాలి కదా అనుకున్నారు. పైకి ఆ మాట ఎవరూ అనలేదు కాని ‘పిల్ల మేల్‌ కాకి’ ఒకడు కచ్చితంగా వాడు మన ఊరి వాడే నాకు బాగా తెల్సు. వాణ్ణి కాపాడాల్సిన బాధ్యత మన ఊరి పెద్దలదే. ముఖ్యంగా కుర్చీలో కూచున్న పెద్దాయనదే అనేశాడు.
కుర్చీలో తాపీగా కూర్చున్న పెద్దాయన ఉలిక్కిపడ్డాడు. వీడ్ని పైకి తీయించాలా వద్దా. అసలు వీడెవడు మనవాడేనా లేక నిలబడ్డ ఇద్దరు పెద్దల్లో ఒకడివైపు వాడైతే కాదు కదా అని డవుటు పడ్డాడు. వాడెవడైనా సరే మేమెవరం రిస్కు తీసుకోలేం, తీసుకోం. తమరే సాహసం చెయ్యాలి అన్నాడు పెద్దాయన కాని పెద్ద వయసాయన. చూస్తావేం దొరా. ఆ మెళ్లో గొలుసూ, చేతులకు ఉంగరాలు, బ్రాసులెట్టూ తీసిచ్చి బావిలో దూకి పెద్దరికం నిలబెట్టుకో అంది పెద్దకాని పెద్దవయసామె.
అబ్బో ఇవన్నీ ఇచ్చి పోతే అన్నీ దొబ్బేద్దామనే. ఊరికి పెద్దరికం చేసి కష్టపడి సంపాదించుకున్నవి అనుకున్న పెద్ద పెద్దాయన, అసలు వాడు బావిలో ఎందుకు పడ్డాడో కనుక్కోండి రా ముందు అన్నాడు. అర్థమయింది… మీ వాడు అవునా కాదా అనే డవుటు వద్దు. వాడు మీ వాడే, అలస్యం చెయ్యకండి, కుర్చీలోంచి లేచి ఎగిరి దూకండి. వాడ్ని కాపాడండి అనరిచారు కుర్చీ లేని పెద్దలిద్దరూ. ఆహా… నేను లేచీ లేవంగానే కుర్చీలో కూచుందామనా. గోతికాడ నక్కల్లా నిలబడ్డారు అనుకున్న పెద్ద మనిషి వాడంతట వాడు దూకి చావాలనుకుంటే మనం కాపాడ్డం మహాపాపం. చావడం వాడి ప్రాథమిక హక్కు. దాన్ని కాదనలేం అన్నాడు పెద్దాయన. అదేమిటి అలాగనకండి. వాడెవడో గుర్తుపట్టారు జనం. వాడు ఈ ఊరివాడే మన ఊరి ఓటరే అన్నాడొకడు. రక్షించండి అంటూ చేతులెత్తి దండం పెడుతున్నాడు కూడా అన్నాడు ఇంకొకడు. దారినపొయ్యే దానయ్యలందరినీ రక్షించే తీరిక లేదు నాకు. వాడి మతం ఏమిటి? కులం ఏమిటి? అన్నింటికీ మించి వాడి పేరు ఓటర్ల జాబితాలో వుందా లేదా అన్నవి ముఖ్యం. నాకు ఓటు వేసిన వాడిదే నా బాధ్యత అన్నాడు పెద్దాయన కుర్చీలోంచి కదలకుండా.
బావి గట్టు మీద నిలబడ్డ జనం హా అని హాహా అని హహ్హహ్హ అని అరుస్తూనే వున్నారు. కుర్చీలేని పెద్దల్లో ఒకడు గట్టు చివరికంటా వెళ్లి నీళ్లల్లోకి చూస్తూ… ఒరేరు, నువ్వు రాముడి భక్తుడివైతే రాముడ్ని తలచుకో, హనుమంతుడ్ని పంపిస్తాడు. నిన్ను పైకి రప్పిస్తాడు అని పెద్దగా అరిచాడు. పెద్దల్లో మరొకడు కూడా గట్టు చివరిదాకా వెళ్లి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహా నాయకుల్ని తల్చుకో. వాళ్ల వారసులమైన మమ్మల్ని ఊరి పెద్దలుగా ఎన్నుకుంటామని మొక్కుకో. అద్భుతం జరిగి తీరుతుంది తెల్సుకో. అన్ని మతాలూ మావే, అన్ని కులాలూ మావే. నువ్వు మా వాడివే గనక అయివుంటే నీకు చావు లేదు. రమ్మన్నా రాదు అని పెద్దగా అరిచాడు.
ఊరిజనం చోద్యం చూస్తూ నిలబడ్డారు. ఊరి పెద్దల్లో ఒకడు కుర్చీ వదల్లేదు. మిగిలిన ఇద్దరు కుర్చీ మీది నుంచి దృష్టి మరల్చకుండా నిలబడి వున్నారు. చస్తున్నానురో! చస్తున్నానురో! అని నీళ్లల్లో మునకేస్తున్నవాడు అరుస్తున్నాడు. ఊళ్లో నుంచి ఒకడు కాగితాల కట్ట పట్టుకుని కుర్చీలో కూర్చున్న పెద్దాయన దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు. దొరా వీడి పేరు ఓటర్ల జాబితాలో వుంది కానీ వీడు చచ్చినట్లు నమోదై వుంది అన్నాడు.
అంటే వీడు బతికినా ఓటెయ్యలేడన్న మాట అన్నాడు పెద్దాయన. ఓటు వెయ్యని కాడికి వీడుంటేనేం పోతేనేం అన్నారిద్దరు పెద్దలూ.
‘చస్తున్నానురో’ అని అరుస్తున్నవాడు అరవడం మానేశాడు.
– చింతపట్ల సుదర్శన్‌
9299809212

Spread the love