నమ్మితే నమ్మండి

జనం గుంపులు గుంపులుగా పరుగెత్తసాగారు గ్రామం నడిమధ్యన వున్న మర్రిచెట్టు వైపు. ఏమైందర్రా ఎందుకాపరుగులు అనడిగింది మూలనున్న ముసలమ్మ. పెద్దాయన వచ్చాడంట. ఊళ్లో జనాలందరినీ రమ్మన్నాడంట అన్నాడో కుర్రసన్నాసి ఆగకుండా అరుస్తూ.
ఈసారి ఏం తీసుకువచ్చాడో పెద్దాయన క్రితం సారి వచ్చినప్పుడు ఏమిచ్చాడు? అప్పుడే అయిదేళ్లయిందా అని గొణుక్కుంటూ కర్రసాయంతో చెట్టు కిందకి తనూ బయలుదేరింది ముసలమ్మ.
మర్రిచెట్టు చుట్టూ ఉన్న అరుగు మీద ఎప్పటిలాగే ముసిముసి నవ్వులు వొలకబోస్తూ నిలబడి వున్నాడు పెద్దాయన. చుట్టూ చేరిన జనాన్ని వరసలు పెట్టి ఆప్యాయత గుమ్మరిస్తూ పలకరించసాగాడు. ఊరిజనమంతా చెట్టుకిందికి చేరారని గ్రహించాక చేతులు జోడించి అందరికీ నమస్కరించాడు.
పదేళ్లకిందట మొట్టమొదటి సారి మీ ఊరొచ్చాను కదా అన్నాడు. అవునవును. సరిగ్గా పదేళ్లకిందట ఈ చెట్టు కిందికి మీరు, మీ కోసం మేమూ వచ్చాం అన్నాడొకడు ముందు వరుసలో వున్నవాడు.
అచ్ఛా! కరెక్టుగా చెప్పావే! అప్పుడు నేను మీకందరికీ ఏమిచ్చానో గుర్తుందా అనడిగాడు పెద్దగా పెద్దాయన. గుర్తుంది గుర్తుంది అనరిచారు కొందరు. చెప్పుకోండి చూద్దాం అన్నాడు పెద్దాయన. గుబురు మీసాలు, నెరసిన గడ్డం వున్న ఓ వయోవృద్ధుడు అడుగు ముందుకు వేసి మాటల మూటలిచ్చారు. పదేళ్ల కిందట ఇంటికో మూటంటూ పంచారు అన్నాడు. మామూలు మూటలు కావవి. మాటల మూటలు అందరికీ అందాయి కదా. ఇళ్లకి వెళ్లి మూటలు విప్పి మాటలతో కష్టాలన్నీ పోగొట్టుకున్నారు కదా అన్నాడు పెద్దాయన కనుబొమ్మలు ఎగుడు దిగుడుగా ఎగరేస్తూ.
కష్టాలు పోగొట్టుకుందామనే మీరిచ్చిన మాటల మూటలు ఇళ్లకి తీసుకుపోయేం సామీ. మాటలు విప్పి చూద్దుము గదా ఒక్కమాటా లేదు. అన్నీ గాల్లో ఎగిరిపోయేయి. ఎగిరాం దూకాం అందుకుందామని. ఎంతో ప్రయత్నించాం కానీ ఒక్క మాటా మాకు అందలేదు. మాటలు ‘హుష్‌ కాకి’ అయిపోయి, మూట కట్టిన గోచీ గుడ్డలు మాత్రం మిగిలేయి అనరిచాడొక యువకుడు.
అర్రెర్రె ఎంతపనయింది. ఎన్నెన్ని తీపి మాటలు మూటకట్టిచ్చాను. మూటలు జాగ్రత్తగా విప్పడంలో ఏదో పొరపాటు జరిగి వుంటుంది. పోనీండి అది పదేళ్ల కిందటి పాత ముచ్చట. అయిదేళ్ల కింద మళ్లీ వచ్చానే అప్పుడేమిచ్చాను చెప్పుకోండి చూద్దాం అన్నాడు పెద్దాయన.
అప్పటికి కర్ర తాటించుకుంటూ మర్రి చెట్టు దగ్గరికి చేరుకున్న ముసలమ్మ గెలల కొద్దీ అరటి పళ్లు. అబ్బ ఎన్ని పండ్లో అందరికీ ఇచ్చావుగదా నాయనా అంది.
నోటి పళ్లు ఊడిపోయినా అరటి పళ్లు గుర్తుపెట్టుకున్నావు అవ్వా! ఏ వెలగపండో అయితే మీ గొంతులకి అడ్డం పడుతుందని మీరంతా చులాగ్గా హాయిగా అనాయాసంగా తినేస్తారని మాగిన అరటిపళ్లు అందరికీ ఇచ్చాను కదా. అవి తిన్నాక మీ కష్టాలు అడ్రసు లేకుండా పోలేదూ అన్నాడు పెద్దాయన.
పోయేయి పోయేయి అడ్రసు లేకుండా పోయినవి మా కష్టాలు కాదు మీరిచ్చిన అరటిపండ్లు అన్నాడో యాంగ్రీ యంగ్‌ మాన్‌. అదేంటోరు తియ్యటి అరటిపండ్లు, తేలిగ్గా, పండ్లు లేని ముసలమ్మ కూడా ఆవురావురుమని చప్పరించేస్తారని ఇచ్చాను కదా అన్నాడు పెద్దాయన.
ఇచ్చారిచ్చారు. అరటిపండ్ల తొక్క తీసి చేతిలో పెట్టారు. పండు మీకైతే తొక్క మాకయింది అనరిచారు ముందు వరుసలో వున్నవాళ్లు ఒక్క కంఠంతో.
అయ్యో! అట్నా! ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. చుచ్చుచ్చు… తొక్కలతో, తొక్కలో కష్టాలు పోలేదన్న మాట. ఈసారి అలాంటిలాంటి వస్తువు కావు ఇవ్వబోయేది. మీరంతా నా కన్నబిడ్డలు. పదేళ్లయినా మాటల మూటలు ఇచ్చినా అరటిపండ్ల తొక్కలు ఇచ్చినా మీ కష్టాలు తీరలేదు కనుక ఇంటికో దీపం ఇస్తున్నానన్నాడు పెద్దాయన.
వత్తిలేని దీపం నూనెలేని దీపం వెలగని దీపం ఇచ్చి మళ్లీ అయిదేళ్లకి వస్తారా దొరా అనడిగాడు ఓ ముసలాయన, ముందు వరుసకు చేరుకున్నాయన. అప్పుడు మాటల మూటలు, తర్వాత అరటి తొక్కలు ఇప్పుడు దీపాలా వద్దు వద్దు అని కేకలు పెట్టారు జనం.
ఇవి మామూలు దీపాలు కావోరు! నూనె అక్కర్లా, వత్తి అవసరంలా. కొబ్బరి పీచుతోటో, పిడికెడు బూడిదతోటో గట్టిగా రాస్తే దీపంలోంచి భూతం బయటికి వస్తుంది. మీరు ఏది అడిగితే అదిస్తుంది. ఇక మీకు కష్టాలుండనే వుండవు. మళ్లీ అయిదేళ్లకు నేను వస్తాను కదా అప్పుడు మీరే చెప్తారు అన్నాడు పెద్దాయన.
ఇంటికో దీపం పంచాడు పెద్దాయన. ఈ మాయా దీపాన్ని నేను వెళ్లిపోయాక మీమీ ఇళ్లల్లో బాగా తోమి బయటకు వచ్చిన భూతాన్ని మీకేం కావాలో కోరుకోండి అంటూ వెళ్లిపోయాడు పెద్దాయన. పెద్దాయన వెంట వచ్చిన చిన్నాయన ఊళ్లో వాళ్లకు దీపంలో భూతాన్ని ఏయే పథకాలు అమలు చెయ్యాలో అడగవచ్చునని వాటి జాబితా చెప్పాడు. పెండ్లీ పెటాకులు, కొసరేస్తా చూస్కో, అప్పిస్తా కాస్కో, కొల్లేట్లో కొంప, అందరి బంధువయా, అనారోగ్యం అదో సౌఖ్యం, దొంగోడికి మంగళహారతి, ఇల్లెక్కి భాగోతం, పచ్చనాకు పసరు, పిండికొద్దీ రొట్టె పథకాల్లో ఏదో ఒకటి కోరుకోవచ్చని చెప్పాడు.
పదేళ్ల కిందట మాటల మూటలు, ఐదేళ్ల కింద అరటి తొక్కల పంపకం ఇప్పుడీ దీపం భూతం. గతంలో జరిగిన పొరపాటు ఇక జరగదు అనుకున్న జనం దీపాలను ఇళ్లకు తీసుకుపోయారు. ఎవరికి వారు తమకు ఏ పథకం అమలు కావాలో నిర్ణయించుకుని దీపాన్ని రాకారు. అందరికీ భూతం ప్రత్యక్షం అయింది. పెద్దాయన వరం ఇచ్చాడు కానీ భూతం వరమీయలేకపోయింది.
దీపంలో వున్నది అరేబియా భూతం కదా, దానికి తెలుగే కాదు భారతీయ భాషలేవీ రావు, తాతల కాలం నాటి ‘భూతం భాష’ వచ్చిన వాడు ఆ ఊళ్లోనే కాదు, ఈ భూమ్మీదే లేడు.

– చింతపట్ల సుదర్శన్‌
9299809212

Spread the love