ఉద్యమ కళగా మారుతున్న జానపద కళ

పనీపాటల్లో అలసిపోయిన పల్లె ప్రజానీకానికి రసవత్తరంగా సాగే కొందరి ప్రదర్శనలు అమితంగా ఆకర్షించేవి. ప్రకృతిని, విశ్వాన్ని అధ్యయనం చేయడం, తమదైన ప్రజానుభవంతో పోల్చిచూసుకోవడం, రాబోయే పరిణామాలు తెలియజెప్పడం, రకరకాల ప్రాంతాలు సందర్శించి అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడి విషయాలు అక్కడ తెలపడంతో ఈ జానపద కళాకారులు తమకు తెలియకుండానే ప్రజలకు బోధకులయ్యారు. క్రాంతి దర్శకులయ్యారు. ప్రజలు మేలుకోరుతూ పద్యాలు, పదాలు, పాటలు కథలు అల్లుతూ పాడడం, తిరగడం, ఆడడం వారికి నిత్యకృత్యమై అదే జీవనోపాధిగా, జానపద కళగా, వృత్తిగా మారింది.
‘జాతి జీవనాళిక జానపద గీతిక’
– శ్రీశ్రీ
‘జానపదమే మా ప్రాణ పదము
పల్లె లోన వున్నదే పాడినాము నిజము’ – పాట
జనపథం నుండే జానపదం పుట్టింది. జనపథం అంటే పల్లె. పల్లెలు వున్నాయి కానీ పల్లె జీవనం అంతరిస్తున్నది. ఆ ఆప్యాయతలు, పలకరింపులు, మమతానురాగాలు, అనుబంధాలు, ప్రేమలు, సహకారాలు, ముచ్చట్లు మురిపాలు అన్నీ కనుమరుగై పోతున్నాయి. మనిషిలో మనిషితనం లోపిస్తున్నది. మనిషి పరాయీకరణై పోతున్నాడు (ఎలియనేట్‌). దేశం నుండి, సమాజం నుండి, కుటుంబం నుండి చివరకు తన నుండి తాను వేరై పోతున్నాడు. ‘మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. మచ్చుకైనా కానరాడు’ – అందెశ్రీ పాట వింటున్నాం.
ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఎ.ఐ) కృత్రిమ మేదస్సు విస్పోటనంతో ముప్పెరగొంటున్న డిజిటల్‌ యుగంలో ఆధునిక ప్రపంచం పరుగెడుతున్నది. ఈ నేపథ్యంలో జానపద కళల అస్థిత్వం మాటేమిటి? వాటికి పునాదిగా నిలిచే పల్లెసీమల ఉనికి మాటేమిటి? – ఇవన్నీ మనముందుకు తోసుకువస్తున్న చర్చనీయాంశాలు.
జానపద కళలు అంతరించిపోకుండా, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ప్రతి ఏడాది ఆగస్టు 22 ను ‘ప్రపంచ జానపద కళల దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. జానపద కళలు మానవ జీవన స్వభావం నుండే పుట్టాయన్న విషయాన్ని మనం మరువరాదు. ‘మానవ పరిణామ క్రమంలో పశువు నుండి మనిషిని వేరు చేసిందే కళ’ అని ఏగెంల్స్‌ మహనీయుడు ఏనాడో చెప్పాడు.
ఆదిమ మానవ సమాజం నుండి పరిశీలించినప్పుడు (లక్షల సంవత్సరాల క్రితం) మూడు గుణాలు అంతర్లీనంగా ప్రతి మనిషి జీవితంతో పెనవేసుకు పోయినట్లు అర్థమవుతున్నది.
1. కేరింగ్‌ : మనిషిని మనిషి పట్టించుకోవడం. ఆహారం కోసం జంతువుల్ని వేటాడే క్రమంలో తోటివారు ఎవరు గాయపడినా సానుభూతి చూపడం, ఉపశమన సపర్యలు చేయడం, రక్షించడం ఓ మానవ లక్షణంగా పరిణమించింది. పశుపక్ష్యాదుల్లో కూడా ఈ లక్షణం ఉన్నట్లు మనం గమనించవచ్చు.
2. షేరింగ్‌ : మనిషి తనకు కలిగిన కష్టసుఖాలను ఇతరులతో పంచుకోవడం. తన అనుభవాలను, అనుభూతులను రసాత్మకంగా వ్యక్తీకరించడం. భాషలేని ఆ రోజుల్లో తాను ఏ జంతువును చూసింది, వర్ణించడం, దానితో ఎలా పోరాడిందీ అరుపులతో, భంగిమలతో అభినయిస్తూ తెలిపేవాడు. చిత్రాలుగా బొమ్మలు గీసేవాడు. ఆఫ్రికా గుహల్లో ఆ కుడ్య చిత్రాలు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి.
3. రేరింగ్‌ : పెంపకం, పిల్లల్ని సాకడం. ఈ లక్షణమూ మనకు జంతువుల నుండి సంక్రమించినా, ఆ తర్వాత మనిషికి లభించిన తెలివితేటలతో అన్నీ అభివృద్ధి చేసుకున్నాడు. ఉదాహరణకు మర్కట కిశోర న్యాయం అంటే తల్లి కోతి ఏ చెట్టు నుండి ఏ చెట్టుకు దూకినా పిల్ల కోతి తల్లి కడుపును గట్టిగా పట్టుకునే వుంటుంది. ఆ పట్టుకోవడంలో తల్లికి మించిన బాధ్యత పిల్లకే ఎక్కువగా వుంటుంది. అలా పెంపకంలో పిల్లలు కుటుంబంతో, పెద్దలతో పెనవేసుకుపోతారు.
భాష పుట్టుక, సంగీతం రాగాలాపనతో వృద్ధి అయ్యాక, పనీపాటలతో జీవితం కలిసిపోయింది. పనీ – పాట, పనితో పాట, పని లేకున్నా పాట, కష్టజీవుల ఆటా మాటా పాటా అన్నీ జీవితంలో మమేకం అయిపోయాయి. దేనినీ వేరు చేయలేం. విడిగా చూడలేం.
పుట్టుక – పెళ్లి – చావు… అన్నీ ఘటనల్లో, వేడుకల్లో, క్రతువుల్లో ఆనందాలు, సంతోషాలు, సుఖదు:ఖాలు అనివార్యంగా కళారూపాలుగా వ్యక్తీకరణ అయ్యేవి. లిపి లేదు. అంతా మౌఖిక సాహిత్యమే. వినడం, అనడం (పాడడం, చెప్పడం) తోనే భాష వృద్ధి అయింది. ఈ వినడం, అనడం మధ్యలో మనిషికి తెలియకుండానే తన సృజనశీల (తనదైన ప్రత్యేకత) ఆసువుగా వృద్ధి అయింది. ఈ సృజనశీల ప్రాంతం ప్రాంతానికీ, వ్యక్తి వ్యక్తికీ వేర్వేరుగా వుంటుంది. ఇదే కళలో మార్మికత, ఆకర్షణ. అందుకే జానపద కళలు, చెట్లు, పూలు, అరణ్యాలు విరబూసినట్టు ఎక్కడబడితే అక్కడ జనపదులు ఉన్న చోట్లల్లా విరబూశాయి. యుగయుగాలుగా, తరతరాలుగా మానవజాతితో పాటు పరిఢవిల్లాయి. వర్థిల్లాయి, వృద్ధి అయ్యాయి.
వేట, అటవీ ఫల సేకరణ, పశుపోషణ, వ్యవసాయం, స్థిరనివాసం, మిగులు ఉత్పత్తి, ఈ పరిణామం అంతటిలోనూ ఓ పక్కన జీవన పోరాటం సమిష్టిగా సాగిస్తూనే, మరో పక్క మిగులు సమయాన్ని రాత్రివేళ్లల్లో సమిష్టిగా ఆనందించడం కూడా మనిషి నేర్చుకున్నాడు. పల్లెజీవనం సమిష్టి ఉత్పత్తి సంబంధాలతో మిళితమై పోయింది.
పనీపాటల్లో అలసిపోయిన పల్లె ప్రజానీకానికి రసవత్తరంగా సాగే కొందరి ప్రదర్శనలు అమితంగా ఆకర్షించేవి. ప్రకృతిని, విశ్వాన్ని అధ్యయనం చేయడం, తమదైన ప్రజానుభవంతో పోల్చిచూసుకోవడం, రాబోయే పరిణామాలు తెలియజెప్పడం, రకరకాల ప్రాంతాలు సందర్శించి అక్కడి విషయాలు ఇక్కడ, ఇక్కడి విషయాలు అక్కడ తెలపడంతో ఈ జానపద కళాకారులు తమకు తెలియకుండానే ప్రజలకు బోధకులయ్యారు. క్రాంతి దర్శకులయ్యారు. ప్రజలు మేలుకోరుతూ పద్యాలు, పదాలు, పాటలు కథలు అల్లుతూ పాడడం, తిరగడం, ఆడడం వారికి నిత్యకృత్యమై అదే జీవనోపాధిగా, జానపద కళగా, వృత్తిగా మారింది.
రాజరిక, ఫ్యూడల్‌, భూస్వామ్య వ్యవస్థలో సంగీత, సాహిత్యాలతో కొన్ని కళలు మాత్రమే అంత:పుర ఆశ్రయాలకు నోచుకుంటే; ఈ జానపద కళలు అసంఖ్యాకంగా ప్రజానీకాన్ని అలరించేవి. ఆలోచింపజేసేవి. ఒక విధంగా విజ్ఞాన సంపదను రంగరించి ప్రజానీకానికి ధారపోసేవి. ప్రజల మేలు కోరాలనే సత్యనిష్ట వీరిలో, వీరి కళారూపాల్లో నిబిడీకృతమై, అణువణువు తొణికిసలాడేవి.
మన గ్రామాలను పరిశీలించుకుటే దాదాపు వందేళ్ల క్రితం పాఠశాలలే లేవు. అప్పుడు ప్రజలకు మరి విద్యాబోధన ఎలా జరిగేది? ఈ జానపద కళాకారుల వలనే లోక విజ్ఞానం లభించేది. జీవితంలో అల్లుకుపోయిన రామాయణ, మహాభారత ఇతిహాస కావ్యాలను రూపుకట్టి చూపించేవారు. ఆడించేవారు, పాడించేవారు. తోలుబొమ్మలాటలో ఆవిధంగా చూడబట్టే రాముడు ఇలా, రావణుడు అలా (పది తలలతో), హనుమంతుడు ఇలా అని దర్శనమిచ్చేవారు. అందుకే ‘తొభ్బై మైళ్లు నడిచి వెళ్లైనా తోలుబొమ్మలాట చూడాలి’ అనే సామెత పుట్టుకొచ్చింది. అప్పటికింకా సినిమాలు పుట్టలేదు. నాటకాలే వుండేవి. అవీ పౌరాణికం, జానపదం. ఇలా ఎన్నో, ఎన్నెన్నో జానపద కళారూపాలు ఉద్భవించాయి. వికసించాయి.
పారిశ్రామిక విప్లవంతో పెట్టుబడి దారీ ప్రపంచం అవతరించాక మనిషి స్వార్థజీవిగా మారడం, త్వరితగతిన పరిణమించింది. పైకి స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం అని నినదించినా, లోపల దోపిడి, లాభం పాతుకుపోయింది. డబ్బే దానికి ప్రధానమైంది. డబ్బు వలన, డబ్బు కొరకు, డబ్బు చేత నడిచే ధనస్వామ్య ప్రభుత్వంగా మారింది. ప్రజాస్వామ్యం గల్లంతయింది. మనిషి కన్నా మనిషి సృష్టించిన డబ్బుకే ప్రాధాన్యత సమకూరింది. కారల్‌ మార్క్స్‌ చెప్పినట్టు మనిషి కూడా మార్కెట్‌లో సరుకైపోయాడు.
అందుకే ఇప్పుడు మనిషిని మనిషిగా మేల్కొలపాలి. జానపద కళల మౌలిక సత్యం – కర్తవ్యం ఇది. చాలామంది ఇది గమనించకుండా పైపైన పాటలు పాడుతూ, చిందులేస్తూ అవే జానపద కళలు అని భ్రమిస్తున్నారు.
జానపద కళల మౌలిక కర్తవ్యం మనిషిని మనిషిగా మేల్కొలపడం. వ్యక్తివాదాన్ని కాకుండా సమిష్టి తత్వాన్ని ప్రోత్సహించడం, తోటి మనిషిని ద్వేషించకుండా మనిషిగా ప్రేమించడం, గౌరవించడం. అనుబంధం, ఆత్మీయతలను, నిష్కల్మషంగా, స్వచ్ఛంగా కళారూపాల్లో కురిపించడం, అంతిమంగా మానవ హక్కుల రక్షణకు పాటుపడడం అని గుర్తెరగాలి.
జానపద కళలు గతంలో ఇవన్నీ ఘనంగా చేశాయి. ప్రజల ఆదరణతో ఆ కళాకారులు అపర బ్రహ్మలుగా రాజ్యమేలారు. రామాయణం, మహాభారత ఇతిహాసాలతో పాటు ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ దోపిడీ, దౌర్జన్యాలను దునుమాడుతూ చారిత్రక జానపద వీర గాధలను సృష్టించారు, ఆలపించారు.
అయితే ప్రస్తుతం వున్న పెట్టుబడిదారీ వ్యవస్థ మన దేశంలో పాసిస్టు భావజాలంతో జతగట్టింది. మత విద్వేషంతో తోటి మానవులను హింసించడం, వధించడం; పద్ధతి ప్రకారం రాజ్యాంగస్ఫూర్తిని, విలువలను కాలరాయడం గమనిస్తూనే వున్నాం.
ప్రజల పక్షం వహించే జానపద కళల పట్ల ఈ పాలకులకు గౌరవం లేదు. యాచకుల స్థాయికి జానపద కళాకారులను దిగజార్చడం బాధాకరం. అనాగరికం. అందుకే అవి (జానపద కళలు) ఓ ధిక్కార స్వరంతో ప్రజాఉద్యమాల్లో మమేకం అవుతున్నాయి. ప్రజల మూగవేదనకు శ్రవ్య, దృశ్య రూపాలుగా మారుతున్నాయి. ఎక్కడ నిరసన పెల్లుబికుతుందో అక్కడ పాట అల్లుకుపోతున్నది. కాలి గజ్జెలు ఘుల్లుమంటున్నాయి. ఢిలీ కిసాన్‌ ఉద్యమాల్లో ఎందరో జానపద కళాకారులు తమ గళాలకు, కలాలకు పదునుపెడుతూ ఆ ప్రజా ఉద్యమాలను కూడా ఉర్రూతలూగించారు. ఈ విధంగా సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ ప్రపంచంలో జానపద కళ అనివార్యంగా ఉద్యమకళగా, ప్రజాకళగా పురుడుపోసుకుంటున్నది.
– కె.శాంతారావు, 9959745723

Spread the love