మా నాన్న మంచోడు!

నిజానికి వెంకయ్యది చాలా కష్టపడే స్వభావమే. రోజల్లా కూలి పనులకు వెళ్ళి వచ్చి చాలా అలసటకి గురవుతుంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చి వేడినిజానికి వెంకయ్యది చాలా కష్టపడే స్వభావమే. రోజల్లా కూలి పనులకు వెళ్ళి వచ్చి చాలా అలసటకి గురవుతుంటాడు. సాయంత్రం ఇంటికి వచ్చి వేడి నీళ్ళతో స్నానం చేసి విశ్రాంతి తీసుకొమ్మంటుంది భార్య సావిత్రి. కానీ వెంకయ్యకు స్నేహితులెక్కువ. సాయంత్రం అయ్యేసరికి మిత్రులతో కలిసి కల్లు తాగడానికి వెళ్లిపోతాడు. ఆ అలవాటు మానుకొమ్మని, డబ్బులు వృధా చేస్తే పిల్లలను ఎట్లా పెంచుతామని అతని భార్య ఎన్ని రకాలుగా చెప్పినా వినేవాడు కాదు. సావిత్రి పాపం ముగ్గురు పిల్లలున్నా తాను కూడా రకరకాల పనులు చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య చిన్న పాపకు ఆరోగ్యం బాగుండక పనులకు వెళ్ళలేక పోతున్నది. ఆ రోజు పనికి వెళ్ళే ముందు సాయంత్రం తాగి రావొద్దు అని ఎంత చెప్పినా వినకుండా ఆ రోజు కూడా వెంకయ్య బాగా తాగి వచ్చాడు. ఇంటికి డబ్బులేమీ తీసుకు రాలేదు.
సావిత్రికి బాగా కోపం వచ్చి బాగా తిట్టింది. పెద్దగా అరిచింది. మళ్ళీ మళ్ళీ తిట్టింది. రంకెలేసి తిట్టింది. వెంకన్నకు పౌరుషం పొడుచుకు వచ్చి వెళ్ళి ముడుచుకుని పడుకున్నాడు. గుర్రుపెట్టి మత్తుగా నిద్రపోయాడు..
ఉదయం బారెడు పొద్దెక్కాక లేచాడు. సావిత్రి టీ పెట్టి ఇవ్వలేదు. పిల్లలు నాన్నా అని దగ్గరకు రాలేదు. వెంకయ్య స్నానం చేసి కోపంగా ఇంట్లోనుంచి బయటకు వచ్చాడు. చాలా దూరం అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఊరి చివరి అడవికి చేరుకున్నాడు. రాత్రి కూడా ఏమీ తినలేదేమో బాగా ఆకలి వేస్తున్నది. నడిచి నడిచి అలసట వచ్చి ఒక చెట్టుకు వొరిగి కూర్చున్నాడు. ఒక కొమ్మ మీద పిచ్చుక ఎండు పుల్లలూ, గడ్డీ తెచ్చి గూడు కడ్తున్నది. ఒక్క గూటి కోసం వందలసార్లు అటూ ఇటూ ఎగుర్తూ వచ్చి గూడు కట్టడం ముచ్చటగా అనిపించింది. ఇంతలో మరో కొమ్మపై కోతి ఒకటి తన బిడ్డను వీపున మోస్తూ మరో కొమ్మ పైకి పాకి నేరేడు పళ్ళు తెచ్చి తినిపిస్తుండడం చూసాడు. ఆ ఎదురుగా కుక్క ఒకటి కనిపించింది. నిన్నో మొన్నో దానికి పిల్లలు పుట్టినట్టున్నాయి. తల్లి పై ఎక్కుతూ దూకుతూ ఆడుకుంటూ పాలు తాగుతున్నాయి. మరో చెట్టుపై కాకి ఒకటి తాను నోట కరుచుకుని తెచ్చిన ఆహారాన్ని తన పిల్లలకు పిల్లల అందించడం చూసాడు.
వెంకయ్య మెల్లగా లేచి ఏదో ఆలోచిస్తూ ఊర్లోకి నడవసాగాడు. ఇలా ఇల్లు చేరాడో లేదో పిల్లి ఒకటి తన పిల్లని నోట కరుచుకుని మరో చోటుకు మారుస్తూ ఎదురు వచ్చింది. అది బెదిరిపోకుండా తానే పక్కకు జరిగి దారి ఇచ్చాడు.
వెళ్ళి నులక మంచంపై కూర్చున్నాడు. సృష్టిలోని పక్షులు, జంతువులన్నీ తమ పిల్లలకు ఆహారం సమకూర్చడం, గూడు కట్టుకోవడం కోసం ఇన్ని పాట్లు పడ్తుంటే మనిషినై వుండి… పిల్లల తిండీ తిప్పలు, చదువులు, ఉద్యోగాలు ఇన్ని బాధ్యతలు ఉన్న నేను ఇలా తాగి వస్తే నా పిల్లలు ఎలా గొప్ప చదువులు చదువుకుంటారు అనిపించింది. ఇంకెప్పుడూ నేను కల్లు తాగ కూడదు అనుకున్నాడు. బడి నుంచి అప్పుడే వచ్చిన వెంకయ్య పిల్లలు ”నాన్నా ఇవ్వాళ త్వరగా ఇంటికి వచ్చావా?” అని సంతోషంగా దగ్గరకు వచ్చారు. పళ్ళెంలో భోజనం తెచ్చి వెంకయ్య చేతికి అందించింది సావిత్రి.
”రోజూ ఇలాగే త్వరగా రా నాన్నా” అన్నారు పిల్లలు.
”తప్పకుండా వస్తానురా” అన్నాడు వెంకయ్య.
”మా నాన్న మంచోడు” అంటూ వెంకయ్య చుట్టూ చేరారు పిల్లలు.
– సమ్మెట ఉమాదేవి, 9849406722

Spread the love