అవయవ దాత.. స్ఫూర్తి ప్రాదాత..

పాంచభౌతికమైన శరీరానికి ప్రాణం ఉన్నంత వరకే విలువ. ప్రాణం పోగానే అంత్యక్రియలు చేపట్టడం అనేది సర్వసాధారణం. ఆ పార్ధివ దేహం మట్టిలోనైనా కలిసి పోవాలి. కట్టెల్లో అయినా కాలిపోవాలి. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం.
కాల గమనంలో ఇలా మరణించిన వారందరూ జ్ఞాపకాల దొంతరల్లోంచి కనుమరుగైపోతారు. దానివల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు. అయితే కొందరు మరణిస్తే మాత్రం ఆ మరుక్షణమే జీవించడం మొదలెడతారు. భావి తరాల మదిలో చిరంజీవులై చెరగని ముద్ర వేస్తారు. అదే మరణానంతరం శాశ్వతంగా జీవితం కొనసాగించే అవయవదానం. విలువైన అవయవాలను మట్టిపాలు లేదా మంటలపాలు చేయకుండా దానం చేయడం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం అవయవదానంలోనే సాధ్యం.
మరణం తర్వాత కూడా మనం జీవించి ఉండగలిగే మహద్భాగ్యమే అవయవదానం
అవయవ దానం మరణించిన వారిని చిరస్మరణీయులను చేయడమే కాకుండా.. మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. అవయవ దానానికి అంగీకరించిన దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయవ లోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి, వారికి జీవితాన్ని కలిగించే విధానమే అవయవ దానం. ఈ దానం వల్ల జీవం పోసుకున్న వారిని చూడటం, ఊహించుకోవడం వల్ల- తమవారు ఇప్పటికీ ఆ రూపాల్లో ఉన్నారన్న సంతప్తి, సంతోషం ఆయా దాతల కుటుంబీకులు, బంధుమిత్రుల్లో ప్రతిఫలిస్తుంటుంది.
ఆధునిక వైద్యశాస్త్రం సాధించిన అద్భుతమైన మైలురాయి అవయవ మార్పిడి పద్ధతి ద్వారా ఎందరికో పునర్జన్మ లభిస్తుంది. వర్తమాన సమాజంలో మారుతున్న జీవన శైలి నేపథ్యంలో మానవాళి అనేకరకాలైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం వల్ల శరీరంలోని ప్రధాన అవయవాలు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. కొందరికైతే పుట్టుకతోనే గుండె జబ్బులు, అంధత్వం ఉంటున్నాయి. ఇటువంటి వారికి దాతల నుంచి సేకరించిన అవయవాలను పెట్టటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. మన దేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షలకు పైగా ప్రజలు వారి ముఖ్య అవయవాల వైఫల్యం కారణంగా మరణిస్తున్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. ఆధునిక వైద్యం ద్వారా ఓ వ్యక్తి శరీర భాగాలను ఇతరులకు అమరిస్తే వారి ప్రాణాన్ని, జీవితాన్ని నిలబెట్టే ఒక అద్భుతమైన అవకాశం దొరికింది.
మన దేశంలో రోజూ రోడ్డు ప్రమాదాల్లో వందల మంది చనిపోతున్నారు. బ్రెయిన్‌ డెడ్‌ అవుతున్న వారు, ఇతర కారణాలతో చనిపోతున్నవారు కూడా అనేకులు ఉంటున్నారు. అయితే వారు ఎలాగూ తిరిగి బతికే అవకాశాలు ఉండవు. కాబట్టి వారి అవయవాల్ని ఇతరులకు దానం చెయ్యడం ద్వారా మరెన్నో కుటుంబాలకు మేలు చేసినట్లు అవుతుంది. ఇంతకంటే గొప్పదానం ఏముంటుంది?
సాధారణంగా అవయవ దానం అనేది రెండు రకాలు. మరణం తర్వాత చేసే అవయవ దానం మొదటిది అయితే, సజీవ అవయవదానం రెండవది. ఒక వ్యక్తి అవసరమైన వారికి సహాయం చేయడానికి తన శరీరంలోని మూత్రపిండాలు, క్లోమం కొంత భాగాన్ని దానం చేయవచ్చు. అలాగే మరణించిన వ్యక్తి యొక్క గుండె, కాలేయం, కిడ్నీలు, పేగులు, ఊపిరితిత్తులు, పాంక్రియాస్‌ దానం చేయొచ్చు. కార్నియా, గుండె కవాటాలు, చర్మం, ఎముకలు తదితర అవయవాలను సహజ మరణం పొందిన వారి నుంచే స్వీకరిస్తారు. అలాగే బ్రెయిన్‌ డెత్‌ అయిన వ్యక్తి శరీర అవయవాలతో 8 మందికి ప్రాణం పోయొచ్చు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్‌, చిన్న పేగును మార్పిడి చేయవచ్చు. వీటితో పాటు చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను అవసరమైన రోగులకు దానం చేయవచ్చు. బ్రెయిన్‌డెడ్‌ అయినా, సాధారణ కారణాల వల్ల మరణించినా, వారు ముందుగానే ప్రభుత్వం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన జీవన్‌దాన్‌ ట్రస్ట్‌కు లిఖితపూర్వకంగా సంసిద్ధత వ్యక్తం చేయవలసి ఉంటుంది. అదే విధంగా ఎవరికైనా అవయవాలు కావాల్సి వస్తే.. ఇందులో పేరు నమోదు చేసుకోవాలి. వారికి ప్రాధాన్యత క్రమాన్ని బట్టి సేకరించిన అవయవాలను నిపుణుల పర్యవేక్షణలో వినియోగిస్తారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన అవయవాల ద్వారా గరిష్టంగా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడవచ్చు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన కణజాలం ద్వారా గరిష్టంగా యాభై మంది జీవన ప్రమాణాన్ని పొడిగించవచ్చు. అవయవ దానం అనేది ఎవరైనా చేయవచ్చు.
దీనికి సంబంధించి వయసుపై ఎలాంటి నిర్బంధమూ లేదు. నవజాత శిశువుల నుండి 90 ఏళ్ల వద్ధులకు వరకు అవయవదానాలు విజయవంతమయ్యాయి. అయితే 18 ఏళ్లలోపు వ్యక్తి మాత్రం తన అవయవాలను దానం చేయాలనుకుంటే, వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి.
దురదృష్టవశాత్తు ఈ అవయవదాన మార్పిడికి సంబంధించి అనేక అపోహాలు, అనుమానాల కారణంగా దాతల సంఖ్య తక్కువగా వుంటోంది. ముఖ్యంగా అవయవదానం మత విశ్వాసాలకు విరుద్ధం అనే ప్రచారం ఎక్కువగా ఉండటం వలన దాతలు ముందుకు రావడానికి సిద్ధపడలేదనే చెప్పవచ్చు. వాస్తవంగా చూస్తే నేడు ప్రపంచంలోని చాలా మతాలు ఆధునికతను అర్థం చేసుకుంటున్నాయి. ఒక ప్రాణాన్ని రక్షించడం కంటే మంచి పని మరొకటి లేదు. ప్రపంచంలోని ప్రతి మతం దానికి మద్దతు ఇస్తుంది. జీవిస్తున్నప్పుడు, మరణం తర్వాత అవయవ దానం చేయడాన్ని ఏ మతం నిషేదించలేదు. ఇతరుల పట్ల ప్రేమను, దాతృత్వాన్ని వ్యతిరేకించే మతాలేవీ ప్రపంచంలో ఎక్కడా లేవు. ఆధునిక శాస్త్ర పురోగతికి ఆటంకం కలిగించే నిబంధనలేవీ మతాలు విధించడం లేదు. ఇతరుల పట్ల ప్రేమను, దాతృత్వాన్ని వ్యతిరేకించే మతం అనేది మతమే కాదు. మొదట్లో రక్త దానం విషయంలో కూడా ఇలాంటి అపోహలు కొనసాగాయి. కాల గమనంలో ఈ రోజు రక్త దానం ఎందరో ప్రాణాలను నిలబెట్టే ప్రక్రియగా రూపాంతరం చెంది అప్రతిహాతంగా కొనసాగుతూ ఉంది. అలాగే సమాజంలో పూర్తి స్థాయిలో అందరికి అవయవ దానంపై అవగాహన కలిగించినప్పుడే, దాతలు ముందుకు వచ్చి ఎన్నో ప్రాణాలను నిలబెట్టగలుగుతారు. తరతరాలుగా నమ్ముతున్న సంప్రదాయాలు మరియు విశ్వాసాలు వల్లనే అవయవదానం విస్తతంగా జరగడం లేదు.
ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల జాబితాలో మన దేశం రెండవ స్థానంలో ఉన్నపటికీ.. మన దేశంలో కేవలం 0.1 % మంది మాత్రమే అవయవ దానం చేయడానికి నమోదు చేసుకున్నారు. అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంత లేదు. మన దేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల మంది దాకా అవయవాలు దొరక్క చనిపోతున్నారు. ఏటా లక్షన్నర మందికి కిడ్నీల అవసరం వస్తుంటే.. 5 వేల మంది మాత్రమే కిడ్నీ దాతలు లభిస్తున్నారు. దీనిని బట్టి చూస్తే అవయవ దాతల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉంది.
అవయవ దానం ద్వారా చనిపోయిన వారి అవయవాల్ని ఇతరులలో తమ వారిని చూసుకోవచ్చు. అయితే అవయవ దానం అనేది భావోద్వేగాలతో కూడుకున్నది కావడం వల్ల దీనిపై ప్రజలను ఒప్పించడం అనేది కష్టమవుతోంది.
మన దేశంలో బ్రెయిన్‌ డెడ్‌ కేసుల్ని తీసుకుంటే ఏటా వేల సంఖ్యలోనే వుంటాయి. అయితే తమ వారిని కోల్పోతున్నామనే ఆవేదనలో కన్నీరుమున్నీరయ్యే కుటుంబాలు, తమవారి అవయవాల్ని దానం చేయడానికి ముందుకు రాలేరు. దీనితో ప్రాణాలు నిలబెట్టగలిగే అనేక శరీరాలు మట్టిపాలు, మంటల పాలు అవుతున్నాయి. మరొక పక్క దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో బాధితులు అవయవాలు ఎవరు దానం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.
వేల సంఖ్యలో అవయవాలు అవసరంకాగా.. లభ్యమవుతున్నవి మాత్రం పదుల సంఖ్యలో కూడా లేకపోవడంతో చాలామంది బాధితులు మృత్యు ఒడిలోకి వెళ్ళిపోతున్నారు. విదేశాలతో పోల్చితే మన దేశంలో అవయవ దానం చాలా తక్కువగా జరుగుతోంది.
ఎంత అధికారమున్నా, ఎన్నెన్ని సంపదలు రాశి పోసినా, సమస్తాన్నీ గుట్టలుగా కుమ్మరించినా- పోయిన ప్రాణాన్ని తిరిగి తేవడం అసాధ్యం. అవయవ దానంతో ప్రాణం పోయగలిగే శక్తి కేవలం మనిషికే ఉందన్న స్ఫూర్తిమంత్రాన్ని నలుమూలలా విస్తృతపరచడం ఓ సామాజిక మహోద్యమంలా కొనసాగాల్సి ఉంది. అందుకే అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి.
ఇదివరకటితో పోల్చితే ఇప్పుడు అవయవదానం పట్ల అవగాహన పెరిగిందనే చెప్పవచ్చు. అయితే మన దేశంలో అవయవాల మార్పిడి చికిత్సలకు సంబంధించి భారత ప్రభుత్వం రెండు దశాబ్దాల క్రితమే చట్టం తెచ్చినా, అనంతర కాలంలో పలు మార్పులుచేర్పులు చేసినా, ఆశించినంత ఫలితం రావడం లేదు. ముఖ్యంగా మరణదశకు చేరిన వారి నుంచి అవయవాలు తీసి అవసరమైనవారికి అమర్చే పూర్తిస్థాయి సాంకేతికత మన దేశంలోని చాలా వైద్యశాలల్లో ఇప్పటికీ లేదు. దీనికితోడు- చికిత్స నిపుణుల కొరత, మధ్యదళారుల బెడద, వైద్య పత్రాల తారుమారు వంటి సమస్యలు చిరకాలంగా వెంటాడుతున్నాయి. దానం చేసిన అవయవాలకు పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసి భాగ్యవంతులకు కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ అందిస్తున్నాయనే ప్రచారం కూడా లేకపోలేదు.
దాతలు ముందుకొస్తున్నా ఇటువంటి అనేక సందేహాలు, అపోహలతో బాధితులు వెనక్కి తగ్గుతుండటం మరో సమస్యగా పరిణమించింది. మన దేశంలో తమిళనాడు రాష్ట్రం, ఇతర దేశాల్లో స్పెయిన్‌- దాతలు, బాధితులు పేర్ల నమోదు, చికిత్సలు, స్వచ్ఛంద సేవాకార్యక్రమాల్లో ముందుంటున్నాయి.
అవయవదానంలో మహిళలదే పైచేయి. జన్మనే కాదు పునర్జన్మను ప్రసాదించడంలోనూ మహిళలే ముందుంటున్నారు. భారత్‌లోని అవయవదాతల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా, అవయవదాతల్లో మహిళలే అగ్రస్థానంలో నిలుస్తుండటం విశేషం. భారత్‌లో ప్రతి 10 లక్షల జనాభాకు 0.58 మంది అవయవదాతలే అందుబాటులో ఉన్నారు. ఈ విషయంలో స్పెయిన్‌ 10 లక్షల జనాభాకు 36 మంది, క్రొయేషియా 10 లక్షల మందికి 32 మంది, అమెరికా 10 లక్షల మందికి 26 మంది అవయవదానంలో ముందంజలో ఉన్నాయి
అవయవదానంపైనా, అవయవ మార్పిడి చికిత్స విధానాలపైనా ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రజలకు కొంత అవగాహన ఏర్పడుతోంది. అయినా కూడా ఇంకా ఎన్నో అపోహలు, అనుమానాలు, భయాలు వారిని పీడిస్తూనే ఉన్నాయి. అవయవదానానికి ఏయే అవయవాలు పనికి వస్తాయో, ఎలాంటి పరిస్థితుల్లో దాతల నుంచి అవయవాలను సేకరిస్తారో కూడా నేటికి చాలామందికి తెలియదు.
అవగాహన పెంచేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సేవాసంస్థలు సాగిస్తున్న కృషి కొంతవరకే ఫలితమిస్తోంది. దీనిపై విస్తృత అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఆగస్టు 13 వతేదీన అవయవదాన దినోత్సవంగా ప్రకటించి, ఆ రోజు అవయవ దాన ప్రాధాన్యతను వివరిస్తున్నారు. అయితే సంవత్సరంలో ఒక రోజు కార్యక్రమాలు చేపట్టి చేతులు దులుపు కుంటే మాత్రం ఏ విధమైన ప్రయోజనాన్ని పొందలేం. సంవత్సరం పొడవునా అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే అవయవదానంపై ప్రజల్లో ఇంకా చైతన్యం పెరగాల్సిన అవసరం ఉంది. దేశంలో అవయవదాన మార్పిడిపై ప్రభుత్వాల కన్నా స్వచ్చంధ సంస్థలు, కొంత మంది అభ్యుదయవాదులు మాత్రమే అవయవాలను దానం చేసేందుకు ముందుకొస్తున్నారు. రాష్ట్రాల్లో జీవన్‌ధాన్‌ సంస్థలు ఉన్నా.. అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదనే చెప్పవచ్చు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో అవయవ దానం గురించి విశిష్ట ప్రచారం చేసి వందలాది మంది శరీర, అవయవదానం చేయడానికి ముందుకు రావడానికి విశాఖలోని సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ తొలుత దీన్ని సామాజిక కార్యక్రమంగా ప్రారంభించి ఉద్యమంగా మార్చింది. ఆ తరువాత అఖిల భారత శరీర, అవయవదాతల సంఘంగా ఏర్పడి దీని ఫలితాలు పేదలకు అందించడానికి ప్రయత్నిస్తోంది. అత్యధికంగా పేదలు అవయవదానం చేస్తుంటే.. ధనికులే లబ్ది పొందుతున్నారని, ఎక్కడా పేదలకు అవయవ మార్పిడి జరగడం లేదని ఈ విషయంలో, కేంద్ర ప్రభుత్వం అవయవదాన చట్టం 1996కు సవరణలు చేయాలని డిమాండ్‌ చేస్తోంది ఈ సంఘం. ఈ విషయంలో ట్రస్ట్‌ చైర్‌ పర్సన్‌ గూడూరు సీతామహాలక్ష్మి గారి కృషి ఎంతైనా అభినందనీయం. ఈ ట్రస్ట్‌ ప్రజల్లో అవయవదానంపై అపోహలు పోగొట్టడానికి నిరంతర కృషి జరుపుతోంది. అవయవ మార్పిడి అనేది చాలా ఖరీదైన వ్యవహారంగా మారడం వలన పేదలకు భారం లేకుండా దీన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కొనసాగించే విధంగా ఆధునిక వైద్య సాంకేతికతను అందించాలని, అవయవ మార్పిడిని ఆరోగ్యశ్రీ లో చేర్చాలనే డిమాండ్‌ ప్రజల నుంచి ఉంది. ఇంత కన్నా ముఖ్యంగా ప్రాథమిక విద్య నుంచి పీజీ స్థాయి వరకు అవయవ, శరీర దానాలపై పాఠ్యాంశాలు పెట్టాలి. దీనితో పాటు అవయవ దానం ప్రకటించిన వారికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందజేసే ప్రోత్సాహకాలు, పురస్కారాలు, గుర్తింపు గౌరవం ఇవ్వగలిగితే దాతత్వ విస్తరణ, ప్రేరణ కలిగి మరింత మంది అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. గతంలో అవయవ దానం అంటేనే చాలా మంది వెనకడుగు వేసేవారు. అయితే ప్రస్తుతం ఆ దృక్పథం కొంత వరకు మారింది. ప్రమాదాల్లో మరణించిన, లేదా తమ వారు బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారని తెలిసి పుట్టెడు దు:ఖంలో ఉన్నా.. సామాజిక బాధ్యతను గుర్తిస్తూ అవయవదానంతో కొంతమంది ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా అవయవాలను దానం చేసేందుకు సంబంధిత కుటుంబ సభ్యులు ముందుకు వస్తుండడంతో పలువురి జీవితాల్లో వెలుగులు వికసిస్తున్నాయి. మరెందరికో ప్రేరణ కలిగిస్తున్నాయి.

Spread the love