బొమ్మా! బొరుసా?

అవి నా కాలేజీ రోజులు. పట్టణంలో రెండు మంచి సినిమాలు నడుస్తూండేవి. ఒకటి ‘లేడి హెమిల్టన్‌’ లేదా ‘గాన్‌ విత్‌ ద విండ్‌’ సరిగా గుర్తు లేదు. మరొకటి ‘ఎ టెల్‌ ఆఫ్‌ ది టు సిటీస్‌’. ఓ అమ్మాయి ఫలాన సినిమా బాగుందని చెప్పేది. మరో అమ్మాయి మరో సినిమా గొప్పలను పేర్కొనేది. వీరిద్దరి వాగ్వివాదం రెండు గ్రూపులుగా మారి తమ మాటే గెలవాలని పట్టుబట్టసాగారు. తమ మాట నెగ్గక పోతే దాన్ని అవమానంగా భావించేవారు. అమ్మాయిలందరు తమ తమ మాటను నిలబెట్టుకోవాలని పట్టుబట్టారు. అదో సవాల్‌ గా మారింది.
ఇదంతా గమనించి నిర్మల అంది ”ఓ పనిజేయ్యండి. టాస్‌ వెయ్యండి”.
నిర్మల తన జేబులోంచి ఓ నాణెం తీసి ”చెప్పండి బొమ్మ ఎవరికి కావాలి… తోక ఎవరికి కావాలి?”
మా అందరికి ఓ నిమిషం నిర్మల ఐడియా వింతగా తోచింది. ఆ తర్వాత మాకనిపించింది… ఇలా చేయడం వల్ల మా రెండు గ్రూపుల మొండిపట్టు సడలి పోతోంది. ఎవరికెలాంటి అవమానం ఉండదు. ఒకరి ముందొకరికి తలవంపుగా కూడా ఉండదు. ఎవరు పందెం గెలుస్తారో వారి మాటే నెగ్గుతుంది. పందెం గెలవని వారి మాట కూడా అందరితో పాటే ఉండిపోతుంది. ఎవరు ఎవరి ముందు తల ఒగ్గేదేమి లేదు. అమ్మాయిలందరు సమ్మతం తెలిపారు.
నిర్మల ఒక నాణెం తన జేబులో నుంచి తీసి నేలపై గుండ్రంగా తిప్పింది. అమ్మాయిలందరు ఏ ఏ సినిమా చూడాలో నిర్ణయించుకొన్నారు.
ఓ సారి, అమ్మాయిలందరం పిక్‌నిక్‌ వెళ్లాలనుకున్నాం. ఈ నిర్ణయం రెప్పపాటులో జరిగిపోయింది. ఏ అమ్మాయి తన ఇంటి నుంచి ఆలు పరాఠాలు తీసుకొని రావాలి? ఎవరు గోబి పరాఠాలు? పూరి-ఛోలే ఎవరు తీసుకొస్తారో అలాగే పండ్లు, చారు ఎవరు సమకూరుస్తారో తెలిసిపోయింది. అసలు విషయం మనం ఎక్కడికెళ్లాలి? ఓఖ్ల వెళ్లాల… ఖుతుబ్‌ మినారా? మళ్లీ వాదోపవాదాలు మొదలైయ్యాయి. తను చెప్పే ప్రాంతానికే వెళ్లాలని అమ్మాయిలందరు పట్టు పట్టసాగారు. ఎక్కడికెళ్లితే బాగుంటుందన్న ఏకాభిప్రాయానికెవరు రావట్లేదు. నిర్మల మొదటి సారి ఏ సినిమా చూడాలన్న ఐడియా ఇచ్చిందో అదే మళ్లీ కొనసాగింది. నాకు బాగా గుర్తుంది. ఓ సారి మా కాలేజీ ప్రొఫెసర్‌ మిస్‌ వర్మ పెండ్లి జరిగింది. అమ్మాయిలందరం కలసి ఆమెకు ఓ బహుమతి ప్రదానం చేద్దామనుకున్నాం. అందరం కలసి తలా ఐదు రూపాయలు కూడబెట్టాం. కాని ఏం కొనాలి? గడియారమా… లేదా ఓ మంచి కలమా? కాని ఆ రోజు మాకు బాగా చర్చింకోవలసిన అవసరం కలగ లేదు. అందరి నోట్లోంచి ఒకేసారి ‘నిమ్మి స్టైల్‌’ అని వెలువడింది. హెడ్‌ వస్తే గడియారం తీసుకొందాం, టైల్‌ వస్తే పెన్‌ తీసుకొందాం. నిర్మల ను మేమందరం నిమ్మి అని పిలుస్తాం. ప్రతి నిర్ణయానికి ‘నిర్మల స్టైల్‌’ గా పేరు పడింది.
****
”నిర్మల నువ్వు అన్ని నిర్ణయాలు ఇలాగే తీసుకొంటావా?’ ఒక రోజు ఆమెని అడిగాను.
”అవును. అన్ని నిర్ణయాలు. ఈ రోజుదయం మా చిన్న తమ్ముడు పాలు తాగనన్నాడు. చారు కావాలన్నాడు. అమ్మ వాడిపై కోపగించసాగింది. నేను వాణ్ని టాస్‌ విషయం చెప్పి సముదాయించాను…”
”నువ్వు…నీ పెండ్లి విషయంలో కూడా ఇలాగే నిర్ణయించుకొంటావా!?”
”ఇలాగే చేస్తాను. మరింకెలా చేస్తాను… !?”
నేను ఆ రోజు నిర్మల మొహం వైపు చూశాను. నిర్మల ఎంత నాన్‌ సీరియస్‌ అమ్మాయి అని ఆలోచించసాగను. ఆమె తన జీవితంలో ఎన్ని కఠిన సందర్భాలొచ్చినా సులువుగా సాధించుకొంటుంది.
****
నిర్మల నాన్నగారు నిర్మల పెండ్లి కోసం ఓ అబ్బాయిని ఎన్నుకున్నారు.
”నువ్వు ఒక సారైనా అతనితో కలుస్తే బాగుండేది కదా” అని నేనడిగాను.
”కలసి ఏం చేస్తాను!”
”దూరం నుంచి కూడా చూడదలచుకోలేదా?”
”చూసి ఏం చేస్తాను?”
నాలో నాకు కాబోయే భర్త విషయంలో ఎన్నో ఊహలుండేవి. ఎన్నో కలలుండేవి. నా ఉద్దేశంలో పెండ్లీడుకొచ్చిన అమ్మాయిలందరి మనసులలో ఇలాటి కోరికలుంటాయి. కాని నిర్మల ఎలాంటి అమ్మాయని ఆశ్చర్యమేసింది. అసలు ఆమె అమ్మాయియే కాదు. లేదా యుక్త వయసులోకి ఇంకా రాలేదు. కాని నిర్మల అమ్మాయి. వయసులో కూడా ఉంది. మంచి సౌందర్యవతి. అలాంటి అమ్మాయి ఇలా ఎందుకిలా ప్రవర్తిస్తుందో నాకు అర్ధం కావటం లేదు.
నిర్మల అమ్మ నాకు కబురు పంపింది. ఆమెను పిన్ని అని పిలుస్తాను. నాతో అమె నిమ్మి పెండ్లి గురించి మాట్లాడింది. నాలో రగులుతున్న కోపతాపాలన్ని ఆమెపై కక్కేశాను.
”ఇదేమైనా పద్దతా పిన్ని. నిమ్మి కాలేజీ లో చదువుకున్న అమ్మాయి. అమెకు కూడా కొన్ని కలలుండి ఉంటాయి. ఎవరితోనైతే తన సమస్త జీవితం గడపాల్సుందో ఆ వ్యక్తిని మీరు ఒకసారైన ఆమెకు చూపించలేదు. అతని మొహాన్ని చూపించ లేదు! అక్షరజ్ఞానం లేని అమ్మాయిలా ఆమె నోరు మూసేసి పల్లకిలో కూర్చుండ బెట్టబోతున్నారు. మీ అమ్మాయి అమాయకురాలు”
నిర్మల అమ్మ నా మాటను కొట్టిపారేసింది. నా వీపు పై ప్రేమగా నిమురుతూ, ”బిడ్డా, నా కెలాంటి ఇబ్బంది గాని గత్యంతరం గాని లేదు!” అంది.
”నిర్మల నోరు తెరచి ఏది కోరినా, ఏం కోరినా నేను వాటన్నింటిని సమకూరుస్తాను. ఆమెకు ఈ సంబంధం ఇష్టం లేదంటే ఇంటికొచ్చిన మొగ పెండ్లివాళ్ల ఊరేగింపును కూడా తిప్పి పంపించేస్తాను. నాకు పెద్ద కులపోళ్లని గాని… పెద్దింటివాళ్లన్న గాని నా కెలాంటి ఆశా లేదు. కాని అమె నోరైతే ఇప్పని! ఆమె నోరే మెదుపదు? నిర్మల నీకు మంచి స్నేహితురాలు. నేను చెప్పినా ఆమె ఫొటో కూడా చూడదు.
పెండ్లికొడుకు ఫొటోను నువ్వైన ఆమెకో సారి చూపించమని నిన్ను వేడుకోవడానికే పిలిపించా”నని అంది.
”ఫొటోతో ఏమర్ధమవుతుది పిన్ని. ఫొటోలో నల్లవాళ్లు కూడా తెల్లగా, అందంగానే కనిపిస్తారు. ఎవరి హృదయం ఎలా ఉంటుందో ఫొటోలో కనిపించదుగా…”
”నేనెప్పుడు కాదన్నాను. నువ్వు చెప్పింది నేను ఒప్పుకొంటున్నాను. నిమ్మి అతనితో కలవాలనుకుంటే ఈ రోజే పిలిపిస్తాను.”
నిర్మల వాళ్ల అమ్మ చెప్పిందంతా వింటుందని నాకు నమ్మకం లేదు. నా కోపమంతా ఆమె పై నుంచి జారి నిర్మల పై పడింది. నేను నిర్మల గదిలోకెళ్లి ఆ ఫొటోను ఆమె ముందు విసిరాను.
”ఇగో చేసుకో నీ అదష్టానికి నిర్ణయం… ఇలాగే చేసుకోవాలని అనుకుంటే!” కోపంగా నిర్మల గదిలో కెళ్లి అన్నాను.
నిర్మల ఆ ఫొటో పై కనీసం తన దష్టిని సారించలేదు. తన తలగడ వైపున్న వెండి నాణేన్ని చేతితో పట్టుకొని, ”ఒక వేళ బొమ్మ వస్తే ఓకె. బొర్సు పడితే నో” అని, నిర్మల నేల పై తిప్పసాగింది. నాణేం నేల పై కొన్ని క్షణాలు గిరగిర తిరిగి అగిపోయింది. పై వైపు బొమ్మ ఉంది. నిర్మల కొన్ని క్షణాలు ఆ నాణెం వైపు చూసింది తేరపారి.
”చూడు నేనేం చెయ్యను. బొమ్మ వచ్చింది. స్వయంగానే ఐపోయింది.” చిరునవ్వుతో అంది.
ఈ నాణెం తీసి నిర్మల తలపై గట్టిగా కొట్టాలనుకొన్నాను.
‘వెళ్లు…వెళ్లి చచ్చిపో… ఒక వేళ అతడు మంచివాడు కాకపోతే జీవితాంతం అతని తలను పట్టుకొని యేడుస్తూండు… అలాగే రాజు తలను పట్టుకొని కూడా…” అని అందామనుకున్నాను. ఆ రోజులల్లో నాణెం పై కింగ్‌ ఎడ్వెర్డ్‌ బొమ్మ ఉండేది.
నిర్మల పెండ్లి అయిపోయింది. పెండ్లిలో మిస్టర్‌ కపూర్‌ను చూశాను. అతని మొహంలో నేను చూసిన శోభ ప్రభుత్వాధికారి కళ్ల లో ఉండే రువాబు కనిపించింది. ముక్కు మీద కోపం ఉన్నట్లుంది. కరుకు స్వభావం. నిర్దయుడులా కూడా కనిపించాడు.
****
నిర్మల, కపూర్‌ హానీమూన్‌ కోసం నైనితాల్‌ వెళ్లారని తెలిసింది. నైనితాల్‌ వెళ్లడానికి నిర్మల సూచించిందో లేక ఆమె భర్త చెప్పాడో! ఆ విషయం నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నిర్మల కశ్మీర్‌ చూడలేదు. ఎప్పుడైనా కశ్మీర్‌ గురించి మాట్లాడితే నిర్మల కండ్లలో హౌజ్‌ బోట్‌ తేలుతుండేది. హనీమూన్‌ కోసం నిర్మల కశ్మీర్‌ ఎందుకు వెళ్లలేదని, నైనితాల్‌ ఎందుకు వెళ్లిందని చాలా రోజులవరకు అనుకుంటుండేదాన్ని!
నిర్మల టాస్‌ వేసి ఉంటుంది. కశ్మీర్‌ హెడ్‌ వైపు పెట్టి నైనితాల్‌ టేల్‌ వైపు పెట్టిందేమో. టేల్‌ కనిపించిందేమోనని నా మనసుకు సమాధానం చెప్పుకున్నాను.
****
కొన్ని సంవత్సరాలు గడచిపోయాయి. నాకెప్పుడు నిర్మల ఉత్తరం రాయలేదు. నేను కూడా ఆమెకు రాయలేదు. ఓ రెండుసార్లు నిర్మల అమ్మతో కలవడం జరిగింది. కాని ఆమె సంతోషంగా లేదన్నట్లు నాకనిపించింది. నిర్మల తన తల్లిదండ్రులకు కూడా ఉత్తరం రాయలేదని తెలిసింది. నిర్మల అత్తవారింట్లో బాగానే ఉందని నిర్మల అమ్మ చెప్పింది. ఆమె ఉంటున్న ఇల్లు ఓ కోథిలా ఉందట. చాలా పెద్దగా విశాలంగా ఉందట. ఆమె భర్త మరో కారు కొన్నాడట. మరోసారి కలసినప్పుడు నిర్మల గర్భవతి అని చెప్పింది. రెండువారాల్లోపే ఆమె నిర్మలను దిల్లీకి తీసుకొస్తుందట.
యూనివర్సిటీకి వెళ్లే దారిలోనే నిర్మల (అమ్మగారి) ఇల్లు ఉంది. ఆమె ఇంటి దగ్గర్నుంచి వెళ్లుతూండగా ఓ కాలు నిర్మల ఇంటివైపుకు వెళ్లితే మరో కాలు యూనివర్సిటీ వైపు పడుతుండేది. సందిగ్దావస్థలో ఉండిపోయేదాన్ని. నిర్మలని కలవాలని మనసులో ఉండగా మరి ఈ తర్జనభర్జనలెందుకని కలతగా ఉండేది.
ఓ రోజు నిర్మల చిన్న తమ్ముడు నా వెనుకాల పరుగెత్తుకొంటూ వచ్చాడు. నిమ్మి అక్క మిమ్మల్ని పిలుస్తుందంటూ.
ఒక్క నిమిషంలో నిమ్మి ఇంటికెళ్లాను. నిమ్మి నన్ను చూసింది. మాట్లాడలేదు. కాని నా కండ్లలో ఉన్న కంప్లైంట్‌ను తన కండ్లతో తీక్షణంగా చూసింది. నా కండ్ల చూపులు వాలిపోయాయి. ఫిర్యాదు బరువును ఫిర్యాదుతో అవలీలగా దింపేయగలం. అందుకే నేను నిమ్మిని అడిగాను, ”నువ్వు సంవత్సరంలో ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. రోజు నా కాళ్లు నీ ఇంటి ముందునుంచే వెళ్లేవి. కాని నా కాళ్లను మరో వైపుకు మలుచుకునే దాన్ని”
నిమ్మి ఎలాంటి జవాబు ఇవ్వలేదు. నా ఫిర్యాదునును సహించింది.
నిర్మల నవ్వుతూ చెప్పింది, ”నీ సమస్యకు సమాధానం వెరీ సింపుల్‌. నా పద్ధతి బొమ్మా… బొరుసా… అమలు పరచకపోయావా? నువ్వు నన్ను మరచిపోయేదానివి. లేదా నేరుగా నాతో కలవడానికి వచ్చేదానివి”
గత్యంతరం లేక మేమిద్దరం చిరునవ్వులతో సరిపుచ్చుకున్నాం. కాని నిర్మల తల్లి మొహం పై ఎలాంటి సంతోషరేఖలు చోటు చేసుకోలేదు. ఆమె ఆందోళన పడుతూ నిర్మల ఆరోగ్యం బాగులేదని చెప్పింది. నిర్మలకు ప్రతి రాత్రి జ్వరం వస్తూంది. ఇలాంటి రోజుల్లో ఇలా జ్వరం రావడం మంచిది కాదు.
కొన్ని రోజుల తర్వాత నిర్మలకో అబ్బాయి పుట్టాడు. నిర్మల భర్తా చాల సంతోషంగా ఉన్నాడని తెలిసింది. అతడు తన మిత్రులకు రోజు విందు భోజనం ఇస్తున్నాడు. నిర్మల జ్వరం ఆమె ఎముకలలో చిక్కుకొనే ఉంది. రసపూరితమైన ఆమె శరీరం చిక్కి శల్యమైపోతూంది. మొహం పై పసుపుపచ్చదనం కొట్టొచ్చేలా కనిపిస్తుంది. డాక్టర్ల ప్రకారం, నిర్మల ఒక ఊపిరితిత్తిలో నీళ్లు వచ్చేశాయి. ఆపరేషన్‌ చేయల్సుంది. కాని ప్రసవంలో నిర్మల బాగా నీరసించిపోయింది. కాబట్టి మరి కొన్ని రోజులు అగవలసి ఉంది. ఆమె ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలని డాక్టర్‌ సలహ ఇచ్చాడు. నేను కొన్ని రోజులు రోజుకు రెండు సార్లు ఆ తర్వాత, రోజుకోసారి నిర్మల ఇంటికి వెళ్లుతూండేదాన్ని. కొన్ని సార్లు ఆమె కోసం పూలుతీసుకొని వెళ్లెదాన్ని. ఆమె కండ్లు తెరుచుకొని నా వైపు చూస్తుండేది. పూల వైపు కూడా. కాని ఆమె నోరెప్పుడు తెరవలేదు, నాలుకలో చలనం లేదులా! ఎందుకోగాని నిర్మల నాలుకపై ఏదో విషయం గట్టిగా మందంగా పరచుకొని ఉంది. నిర్మల ఛాతిలో అవ్యక్తమైన బరువు ఏదో చోటు చేసుకుంది. నిర్మల లంగ్స్‌లో ఏదో మాట గడ్డ కట్టుకొని ఉండిపోయింది?
ఓ రోజు నేను ఇంటికెళ్తానని లేస్తూండగా, ఆమె నా భుజం పట్టుకుంది.
”నాకో పని చేసి పెట్టగలవా?”
”చెప్పు”
”రేపు ఓ చిన్న కేక్‌ తీసుకో రాగలవా?”
”తప్పకుండా తీసుకొస్తాను”
నిర్మల కండ్లు ధన్యవాదాలతో చెమ్మగిల్లాయి. నాకేమీ అర్ధం కాలేదు. నిర్మలకు ఎలాంటి కొదువా లేదు. ఆమె నోట్లోంచి ఓ వస్తువు కావాలంటే వంద వస్తువులు ఆమె ముందుంటాయి! ఒక కేక్‌, చిన్న కేక్‌… నేను రాత్రంతా చిన్న కేక్‌ గురించే ఆలోచించసాగాను. ఇదెలాంటి కేక్‌. దాన్ని కొనడానికి నిర్మల దగ్గర డబ్బుల్లేవు…!?
నేను ఉదయం ఒక కేక్‌ కొన్నాను. కొన్ని పూలు కూడా. నిర్మల దగ్గరికెళ్లాను. ఆమె కండ్లు గది తలపుల వైపే అతికి పోయి ఉన్నాయి.
”నువ్వు ఎక్కడ మరచి పోతావని నాకు బెంగగా ఉంది.” నేను రాగానే ఆమె అంది.
మళ్లీ నాతో గది తలుపులు మాసేయి అని అంది. పెద్ద దిండ్ల సహాయంతో ఆమె మంచం పై కూర్చుంది. నేను ఒక కంబళి తీసుకొని ఆమె మోకాళ్లపై వేశాను. మరో కంబళి అందుకొని ఆమె వీపుపై నుంచి భుజాలపై వరకు కప్పాను.
”ఈ రోజు ఇరవై ఆరవ తారీకు”
”అవును జనవరి ఇరవై ఆరు”
”కేక్‌ ను ఒక ప్లేట్‌ లో పెట్టి నా కెదురుగా పెట్టు”
”నేనెన్నో కేకులను చుశాను. నీ కిష్టమైన ఫ్లేవర్‌ ఏమిటో నాకు తెలియదు. చాక్లేటా… వెనిలా…కొకొనటా…”
నువ్వు తెచ్చిందేమైనా అది చాలా అందంగా ఉంది. నీపై నాకు అధికారముంది కదా? ఎవరి స్నేహంపై హక్కు ఉంటుందో వారి డబ్బులపై కూడా హక్కు ఉంటుంది. అందుకే నీ డబ్బుల్ని ఖర్చు చేయించాను. నేను సంపాదించడం లేదు. కాబట్టి నా దగ్గర డబ్బులు లేవు”
నేను నిర్మల మొహం వైపు చూడసాగాను.
నిర్మల అంది, ”నేను మిష్టర్‌ కపూర్‌ డబ్బుల్ని ఖర్చు చేయగలను”
నేనలాంటి పదాలను ప్రశ్నల రూపంలో మార్చ లేను. కాని నా కండ్లు ఆ పని చేశాయి. నిర్మల నా కండ్ల వైపు చూసి అంది, ”ఈ రోజు జన్మ దినం”
”ఎవరిది?”
”అన్వర్‌ ది…”
నేను అన్వర్‌ ను చూసి ఉన్నాను. అతడు నిమ్మి స్నేహితుడు. నిమ్మి అతని పేరుతో ఓ రెండు సార్లు ఎగతాళి కూడా చేసింది. కాని అది జరిగి ఎన్నేండ్లో గడచి పోయాయి.
”నిమ్మి నువ్వు అన్వర్‌ను ప్రేమించే దానివా?”
”వాక్యాన్ని సరిగా ఉపయోగించు నువ్వు. నేనిప్పుడు చేయడం లేదులా మాట్లాడుతున్నావ్‌… కాని నువ్వు సరిగ్గానే చెప్పావు. నేనిప్పుడు అన్వర్‌ను ప్రేమించట్లేదు. నాకిప్పుడు అతనంటే అసహ్యంగా ఉంది…”
”నీ అసహ్యానికి ఇదో మంచి ఉదాహారణ” అంటూ కేక్‌ వైపు చూపుతూ నవ్యాను. నా దు:ఖం నా కండ్లలో ఉబికొచ్చింది.
”నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. రోజుకు పది సార్లైనా అతన్ని దూషిస్తుంటాను. అసహ్యించుకొంటుంటాను. భోజనం చేస్తున్నప్పుడల్లా ప్రతి అన్నం ముద్ద నోట్లో కెళ్లుతున్నప్పుడల్లా అతన్ని అసహ్యించుకొంటాను. ఉదయం… సూర్యోదయాన్ని చూస్తూ… రాత్రి వెలుగుతున్న చంద్రున్ని చూస్తూ అతన్ని అసహ్యించుకొంటాను. ఓ పువ్వును చూసి అసహ్యిస్తాను. నేను నా పిల్లవాడి మొహం వైపు చూసి అతన్ని అసహ్యిస్తాను…”
”నిమ్మి…నేను నీ ప్రేమను అర్ధం జేసుకోగలను…”
”నువ్వు ప్రేమను అర్ధం జేసుకోగలిగితే… మరి నువ్వు అసహ్యాన్ని ఎందుకు అర్ధం చేసుకోలేక పోతున్నావ్‌. ఈ భోజనం ఓ పరాయి వాడి కష్టార్జితం. అతడు తినపించొచ్చుగ. దుశ్చరిత్రుడు. సిగ్గులేని వాడు. ప్రతి వస్తువు కొనడానికి నేను పరాయి మొగవాడిని అడుగుతున్నాను. వాడు కొంచమైనా సంపాదిస్తూనే ఉన్నాడుగా. లజ్జ హీనుడు.”
”నిమ్మి… దేవుడికోసమైన…” ఆమె అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, నా రెండు చేతులను జోడించి ఆమెను వారించడానికి ప్రయత్నించాను.
”ప్రతి రోజు సూర్యడు ఆకాశాన్ని అధిరోహిస్తూన్నాడు. చంద్రుడు అధిరోహిస్తున్నాడు. నేను ఈ వెలుతురులలో అతడి మొహన్ని ఎందుకు చూడలేక పోతున్నాని ఆలోచిస్తున్నాను. ఎందుకు చూడలేక పోతున్నాను. ఈ నేల మీద అతడు బాగానే ఉన్నాడు. జీవించి ఉన్నాడు… సిగ్గు లేనోడు…
”నా పిల్లాడు… పరాయి మొగడికి చెందాడు. ఈ పిల్లాడు వాడి పిల్లాడయ్యేవాడు. అతడి స్వంత కొడుకు. వెధవ దురదృష్టవంతుదు. నన్ను కూడా జీవితాంతం దురదృష్టురాలిగా చేసి వదిలాడు. మరి ఆ పాటలు, ఆ కథలు? నీచుడు.
‘ఈ ఆకలి నా శరీరానికే కాదు, నా ఆత్మకు కూడా ఉంది’ అని అంటూండేవాడు. ఎప్పుడైతే నువ్వు నా వధువై నా పడకలో కూర్చుంటావో అప్పుడు గాలీబ్‌ గజళ్లు తప్పకుండా వినిపించాలి. నాకు కీట్స్‌ కవితలు వినిపించాలి. నాకు గోర్కీ కథలను తప్పకుండా వినిపించాలి… నీచుడు. ఏ ఆడది అతడి పక్కలో కూర్చొని అతడికి గోర్కీ కథలు వినిపిస్తుంది? నేను మరో/ పరాయి మొగాడి పక్కలో కూర్చుని గాలీబ్‌ గజళ్లు వినిపించగలనా? కశ్మీర్‌ వెళ్లి హౌజ్‌ బోట్‌లో నాతో ఎన్నో గాలీబ్‌ గజళ్లను విన్నాడు…”
నిమ్మి గుండెలో వరదలు కట్టలు తెంచుకొని ప్రవహించాయి. కండ్లు తడారిపోయాయి. ఆమె కండ్లలో ఓ నీటి చుక్క కూడా లేదు. ఆమె కన్నీళ్లన్నీ కలసి ఆమె ఊపితిత్తుల్లోకి వెళ్లిపోయాయి అని నా కనిపిస్తోంది.
డాక్టర్‌ ఆమె ఊపిరితిత్తుల్లో నీళ్లొచ్చాయన్నాడు. కాని అవి ఆమె కన్నీళ్ల నీళ్లు.
”రోజుకు డజనుల కొద్ది నా రంగులు మారుతుంటాయి. ఓ నిమిషం నా కనిపిస్తోంది నేనతడిని ప్రేమిస్తున్నాను. మరో నిమిషం ద్వేషిస్తున్నాను. మరో విధంగా చెప్పాలంటే ఓ నిమిషం మంచు నీళ్లలో ఉన్నట్లు, మరో నిమిషం సలసల మరుగుతూన్న నీళ్లలో నేనున్నట్లు అనిపిస్తోంది. ఇప్పుడు నేను ప్రతి రోజుదయం టాస్‌ వేసుకొంటుంటాను. బొమ్మా! బొరుసా? ఒకవేళ హెడ్‌ వస్తే అ రోజంతా అతని ప్రేమలో తడసిపోతాను. అతడి చిన్న చిన్న మాటలను నా గుండెలో అణిముత్యాల మాలలా జపిస్తుంటాను. టేల్‌ పడితే రోజంతా అతడిని తిట్టుతూ ఉంటాను. నూట ఒకటి పూసలున్న జపమాల తో దేవుడిని జపిస్తున్నట్లు.. మూర్ఖుడు… వెధవ… మతపు చిన్న ప్రహారీ గోడను కూడా దూకలేక పోయాడు… పిరికి… చాతకానివాడు…”
ఓ రోగిష్టి, గాయమైన శరీరంతో ఉన్న నిర్మల శిరసు పైకెత్తబడి ఉంది. ఉన్నతంగానే ఉంది. ద్వేషపూరితమైన రెండు అప్సరలు నిర్మల భుజాల దగ్గర నిలబడి ఉన్నట్లు నా కనిపించింది. వారిద్దరి తలలు వంచబడి ఉన్నాయి. నిర్మల కండ్లలో ఒక్క నీటిచుక్క కూడా లేదు. కాని ఆ రెండు అప్సరల కండ్లు ఆశ్రువుల తో నిండి ఉన్నాయి…
(ఈ కథ నేపథ్యం అమృత ప్రీతం అమితంగా ప్రేమించే ప్రముఖ ఉర్దూ షాయర్‌ (కవి) సాహిర్‌ లుధియాన్వి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వీరిద్దరు మూగ ప్రేమికులు. భగ ప్రేమికులు.)
– మొహ్మద్‌ అమ్జద్‌ అలీ,
00 966 507662638.
మూలం : అమృతా ప్రీతం

Spread the love