చిన్నకథ

ఉక్రోష్‌ ఉపన్యాసం అంటే ఉప్పెనలా ఉవ్వెత్తున తరలివచ్చే జనం. ఈ రోజు ఎందుకో…… నున్నని గచ్చుపై ఆవగింజల్లా జారుకున్నారు.
అది గ్రహించిన ఉక్రోష్‌ కు ఉక్రోషం వచ్చేసింది. రాదుమరి.. పైసా ఖర్చు లేకుండా… మాటల మాంత్రికుడై మనుషులను, వారి మనస్సులను ఇట్టే లోబర్చుకొని రాజకీయ నాయకుడై ఒక్కోమైలురాయి అధిగమిస్తూ… సి.యమ్‌ కుడి భుజమైపోయాడు.
జనమే ఊపిరిగా బ్రతికిన ఉక్రోష్‌…. వారు పలచబడేసరికి చెరువు బయట చిన్ని నీటిగుంటలో పడ్డ చేపలా ఎగిరెగిరి పడుతున్నాడు.
‘మళ్ళీ ఒక్కో మెట్టు కిందికి జారిపోతాను!’ అనే భయం అతని ఉక్రోషం లోంచి ఉబికేసింది.
అంతేకాదు ఇదంతా ప్రతిపక్షాల కుట్రలో భాగమేనేమో అనే అనుమానం కూడా ఎడ్రస్‌ వెతుక్కుంటూ వచ్చేసింది.
రావటమే తడవుగా ఫ్లాష్‌లో రాజుల కథలు గుర్తుకొచ్చేశాయి… పూర్వకాలంలో రాజులు మారువేషాల్లో వెళ్లి ప్రజలమధ్యలో తిరుగుతూ గుట్లు తెలుసుకున్నట్లుగా… తను అనుచరులను కొందర్ని ప్రతిపక్షాలలోకి, కొందరిని మైనార్టీ ప్రజల్లోకి కలిసిపోమని పంపించేస్తే సరి..! అని మనస్సులో అనుకున్నాడు.
ఆలోచన రావడమే ఆలస్యం ఆచరణలో పెట్టేసాడు.
ఆఖరుకి వేగులు తెచ్చిన వార్తద్వారా తను గ్రహించిందేమిటంటే…ఇది ప్రతిపక్షాల కుట్రకాదని ప్రజల్లో మార్పని…
దాని సారాంశమేమిటంటే.. ‘మన ప్రయాణం సాగుతూనే ఉండాలి. మరో మైలురాయి ఆహ్వానం పలికేదాకా..’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి…. మమ్మల్ని నిచ్చెనలా వాడుకున్నాడు. మాలోని మతవిధ్వేషాలను రగిలించి ఆయన పబ్బం గడుపుకున్నాడు. నిజంగా పేదల పక్షపాతి అయితే వచ్చి మా లాగానే గుడిసెల్లో ఉండమను… ఏసీ కార్లు… పెద్దబంగ్లాల్లో నివాసమెందుకో వారికి?
నిజంగా కుల, మత రహిత సమాజాన్ని సృష్టించాలి అనుకొంటే…. మీటింగుల్లో ఆ ప్రస్తావన తేకూడదు కదా! కులాలని అడ్డు పెట్టుకో కూడదు కదా! రాజకీయ నాయకులు వారి పబ్బం గడుపుకోటానికి కులాలు అడ్డు పెట్టుకుంటున్నారు.. ఎంత కాలం వీరి మాయమాటలలో పడతాం? ఓ రాజకీయ నాయకుడా… ఎప్పుడూ నువ్వు చెప్పేదే వేదం అనుకోకు. అలా ఐతే చివరికి నీకు మిగిలేది వేదనే. గుర్తుంచుకో…..నీ మాయ మాటలు మమ్మల్ని తాకితే… మేము టచ్‌ మీ నాట్‌ లమయ్యి ముడుచుకుంటాం… ఇంకా ప్రలోభ పెట్టాలని ముందుకొస్తే మాలో రగిలిన అగ్ని ముళ్ళై మిమ్మల్ని తాకుతుంది. నిజంగా మాకు మంచి చేయాలనుకుంటే బయోడేటా ఇచ్చే ప్రతి దగ్గరా కాస్ట్‌ (కులం), రెలిజియన్‌ కాలమ్స్‌ తీసేసేయాలి. అక్కడ ఆర్థిక పరిస్థితిని మాత్రమే దృష్టిలో ఉంచుకొనే రీతిలో… ఓ కాలమ్‌… ధనిక ….పేద అంతే అదీ కొంతకాలం మాత్రమే… తర్వాత తెలివికి పట్టం కట్టాలి. అప్పుడే దేశం అబివృద్ధి బాటలో నడుస్తుంది.
మరొక్క మాట…. మేం మీలాంటి రాజకీయ నాయకులకు ఓటు వేయం. అలాంటి చెత్త ఉపన్యాసాలు వినం. మందు, డబ్బుకి లోబడి…. మమ్మల్ని మేం పాతాళంలోకి నెట్టుకోలేం. మాకు నిజంగా సేవ చేసే నాయకులు దొరికినప్పుడే మేం ఓటు వేస్తాం. అలాంటి ఉత్తమ నాయకుని ఉపన్యాసాలకే మేం వస్తాం’ అని ప్రజలు అంటున్నారు అని ఉక్రోష్‌ పంపిన అనుచరులు అతనికి విషయం చెప్పి…
”అయ్యా ఇకమీదట మేం మీదగ్గర పని చేయదలుచుకోలేదు. వారు చేసే ఉద్యమంలో మేమూ భాగస్వాములం అవుదామనుకుంటున్నాం. శెలవు” అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు.

– ఘాలి లలిత ప్రవల్లిక, 9603274351

Spread the love