పిడికిలి

”అది కాదన్నా..! ప్రభుత్వం మనల్ని కాపాడవలసింది పోయి, మనల్ని అంతమొందించే పనులు చేస్తుంది. పైకి ఒకటి చెపుతూ లోపల ఒకటి చేస్తుంది. మన దేశ ప్రకృతి సంపదను ఫణంగా పెట్టి ఇలా దొడ్డి దారిన మనల్ని మన అడవి తల్లికి దూరం చేయాలని చూస్తున్నారు. మనతో పాటే మన గూడాలలో జీవించే అన్ని వృత్తుల సామాన్య జనం, నోరు లేని జీవరాశులు, పచ్చని చెట్లు ఇవన్నీ కూడా వారి దృష్టిలో ప్రాణులు కావు, మనవి జీవితాలు కావు అని వారి ఉద్దేశం” అని తన గుండెల నిండా ఉన్న ఆవేదన తన మాటల్లో ప్రతిధ్వనిస్తుండగా, ఆ మాటలు వింటున్న కొందరు యువకులు ఆలోచనలో పడ్డారు.
నాగరికతకు ఆనవాళ్ళు నల్లమల అడవులు. ఆకాశాన్ని తాకే తూర్పు కనుమలకు ప్రకృతి రమణీయతను అద్దుతున్నాయి. రమణీయ దృశ్యాలు, అపారమైన వన సంపదకు కనువిందు చేసే వన్యప్రాణులు నెలకొని వున్నాయి. శ్రీశైలం, సలేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలు, అడుగడుగునా లోయలు జలపాతాలు, దట్టమైన అరణ్యాలతో సుందర పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలుగా తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. తూర్పు కనుమలలో భాగంగా కృష్ణా, పెన్నా నదులకు మధ్యన ఉత్తర దక్షిణ దిశగా వందల కిలోమీటర్ల మేర దట్టమైన అడవులు వ్యాపించి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తేనె తుట్టెను కదిలించినట్టు నల్లమలలో యురేనియం తవ్వకాలకు అన్నీ అనుమతులు వచ్చేశాయి. ఆదివాసీలకు ఎంతో కొంత డబ్బు ఆశ చూపి అమాయకులైన నిరక్షరాశ్యులు, అడవి తల్లిని నమ్ముకొని అడవి తల్లి ఒడిలో దొరికే ఆకులు, పండ్లు అమ్ముకొని జీవించే అమాయకులను చుట్టూ పడి గిరిజన గూడాలను ఒక్క చోటుకి రప్పించారు లోకల్‌ లీడర్ల సహాయంతో గవర్నమెంట్‌ అధికారులు.
పెద్ద మీటింగ్‌ ఏర్పాటు చేసి, ఆదివాసీలను అమాంతంగా ఆడుకుంటున్నట్టుగా, రాత్రికి రాత్రే వారిని లక్షాధికారులను చేస్తున్నట్టుగా, వారి జీవితాలను వెలుగులోకి తెచ్చి బాగుచేస్తున్నట్లుగా ఊకదంపుడు ఉపన్యాసం ఇస్తున్నాడు లోకల్‌ ప్రజాప్రతినిధి ఒకరు. జిల్లా కలెక్టర్‌తో సహా పోలీస్‌ యంత్రాంగమంతా రాజకీయ నాయకులకు పహారా కాస్తున్నారు.
అప్పుడే బస్సు దిగి ఏమి జరుగుతుందో తెలియని అయోమయంలో భుజానికి బ్యాగు తగిలించుకొని మీటింగ్‌ దగ్గరికి వస్తున్నాడు సింగన్న గూడెం పెద్ద సమ్మయ్య కొడుకు సత్యం. ఉస్మానియా యూనివర్సిటీలో పి. జి. చదువుతున్నాడు. చుట్టూ పది కోయ గూడాలలో ఒకే ఒక్క ఉన్నత విద్యావంతుడు సత్యం. అది కూడా ఎవరో రెవెన్యూ అధికారి హాస్టల్లో చేర్పించడం మూలంగా సత్యం చదువులమ్మ ఒడిలోకి చేరాడు. పుట్టి పెరిగింది అడవి తల్లి పొత్తిళ్లలోనే కాబట్టి తన శాశ్వత చిరునామా ఆ అడవి తల్లేనని తన విశ్వాసం.
యురేనియం తవ్వకాల గురించి న్యూస్‌ పేపర్లో చదివిన సత్యం ఉన్న ఫలంగా ఊరికి వచ్చాడు. ఒకరి వెనుక ఒకరు నాయకులు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. అమాయక ప్రజలు గొర్రెల్లాగా చెవులు రిక్కించి వింటూ, వేదిక మీద ఉన్న లోకల్‌ లీడర్‌ చప్పట్లు కొట్టమని సైగ చేయగానే మూగజీవాలుగా చప్పట్లు కొడుతున్నారు. కుర్రకారు యువకులు ఈలలు వేస్తున్నారు. ఇదంతా చూస్తున్న సత్యంకు ఒళ్ళు జలదరిస్తుంది. నాయకుల మాటల మత్తులో పడి ఊహల్లో తెలిపోతున్నారందరు.
”రేపు మీరందరు మీ భూముల పాస్‌ పుస్తకాలు, మిగతా దస్తావేజులు తీసుకొని అన్ని గూడాల వాళ్ళు సింగన్న గూడెంకు వస్తే మీ కులపెద్ద సమ్మయ్య ముందే మీకు డబ్బులు ఇస్తాము” అని చెప్పి సమావేశం ముగించాడు సభాధ్యక్షుడు. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి లేచి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు.
దిగాలుగా ఇంటికి వెళ్ళిన సత్యం ”నాయినా మనం మన భూములను వాళ్ళకు ఇవ్వకూడదు, భూమి దస్తావేజులు ఇవ్వద్దు. ఇక్కడ బడా బాబులతో చేతులు కలిపి యురేనియం తవ్వకాలు జరపడానికి మనం ఒప్పుకోవద్దు” అన్నాడు సత్యం తండ్రితో. కానీ సమ్మయ్య కొడుకు మాటలను ఒప్పుకోక పోగా ”అధికారులకు ఎదురు తిరిగితే ప్రాణాలు తీస్తారు, అందరి లెక్కనే మనం కూడా గమ్మున ఉందాం” అన్నాడు సమ్మయ్య .
”అంతేరా అయ్యా..! నీకెందుకు ఈ లేనిపోని జగడాలు ఒగ్గేయ్యిరా..!” అంది సత్యం తల్లి.
ఏం చేయాలో తెలియక చిన్ననాటి నేస్తం సారయ్య ఇంటికి వెళ్ళాడు సత్యం. సారయ్య ఏడవ తరగతి వరుకు చదవగానే ఊర్లోనే ఉన్న మేనమామ బిడ్డతో పెళ్లి చేశారు సారయ్యకు. ఇప్పుడు పది సంవత్సరాల కూతురు కూడా ఉంది సారయ్యకు.
సత్యంను చూసిన సారయ్య భార్య ”రా.. అన్న గిట్ల కుసో.. అంత మచిగున్నరా..! పట్నంలకెల్లి ఎప్పుడస్తివి” అంటూ వాకిట్లో ఉన్న నులక మంచం వాల్చింది.
”పొద్దున్నే వచ్చిన చెల్లె” అంటూ మంచం మీద కూర్చొని సారయ్య కూతురును దగ్గరకు తీసుకొని ”నీ పేరెంటమ్మా..!”
అని అడిగాడు సత్యం.
”నా పేరు వనజ” అంది సత్యం ఒళ్ళో కూర్చొని.
”అవునా ఈ పేరు ఎవరు పెట్టారు నీకు అంటూ ముద్దు పెట్టుకున్నాడు సత్యం.
”నువ్వు ఊరికి వచ్చినప్పుడల్లా పాపను బడికి తొలియ్యిమని చెప్పితివిగదరా సత్యం అందుకే సర్కారు బడికి తొలుక పోయిన. అక్కడ పంతులమ్మ బుజ్జమ్మ పేరు అడిగింది. ‘బుజ్జమ్మ’ అని చెప్పిన. బుజ్జమ్మ అనేది పేరు కాదు, అలా ఇంటి దగ్గర పిలుచుకుంటారు, బడిలో అడ్మిషన్‌ రిజిస్టర్‌లో పేరు రాయాలని చెప్పింది. ”ఏమో పంతులమ్మా మీరే ఏదైనా పేరు రాయుండ్రి” అని చేప్పినరా.. సత్యం. అప్పుడు ఆ పంతులమ్మ ‘నీ కూతురు పేరు ఈ రోజు నుండి వనజ’ అని చెప్పి రిజిస్టర్‌ లో ఎక్కించింది. ఇంటి కాడ మాత్రం బుజ్జి అనే పిలుస్తున్నాము” అన్నాడు సారయ్య తలగోక్కుంటూ.
”ఆ మేడమ్‌ మంచి పేరే పెట్టిందిరా..!” అన్నాడు సత్యం వనజ తల నిమురుతూ .
”ఏం మంచి పేరో ఏమొరా..! మనం కొలిచే దేవుళ్ళు, మన కుల దైవాల పేరు పెట్టుకుంటే మంచిగుండునని మా అవ్వ ఒకటే మానాది వడ్డదిరా..” అన్నాడు నీరసంగా సారయ్య. ”ఒరే సారయ్య ఆ పేరు మనం నిత్యం కొలిచే దైవం పేరే లేరా..! వనజ అంటే ఆ అడవి తల్లి అంటే వనదేవత అని అర్ధం. మనల్ని వందల ఏండ్ల నుండి కాచి కాపాడుతున్న ఆ అడవి తల్లి పేరు” అంటూ పాపను ముద్దు పెట్టుకొని, ”నువ్వు వెళ్ళి పడుకొమ్మా.. రేపు బడికి పోవాలి కదా..!” అంటూ ఇంట్లకి పంపించాడు సత్యం.
”ఒరే సత్యం నాక్కూడా నిద్ర ముంచుకుస్తుందిరా..!” అన్నాడు సారయ్య ఒళ్ళు విరుస్తూ.
”ఒరే సారయ్య..! నీతో కొంచెం మాట్లాడాలని వచ్చాను” అన్నాడు సత్యం ఆకాశంలోకి చూస్తూ.
”ఏం మాట్లాడుతావురా..! పెండ్లి ఎప్పుడు చేసుకుంటావో అది చెప్పు మొదలు” అంటూ నవ్వాడు సారయ్య.
సత్యం నవ్వలేదు సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు.
”ఏందిరా ఏదో కొంపలు మునిగిపోయినట్టు అట్లా దిగులుగున్నవ్‌. రేపు భూమి కాయితాలు వాళ్ళకు ఇయ్యంగనే మనకు పైసలే పైసలు, ఇగ జూసుకో.. నా సామిరంగా మంచిగ నేను పెద్ద సైకిల్‌ మోటర్‌ కొనుక్కుంట..” అంటూ సత్యం భుజాలు పట్టుకొని అటూ ఇటూ ఊపుతూ పకపకా నవ్వుతున్నాడు సారయ్య.
”అదేరా నా భయం” అన్నాడు సత్యం అచేతనంగా.
”భయమెందుకురా బాబు..!” అన్నాడు సారయ్య నవ్వడం ఆపి.
”అవునురా..! సారయ్య మనం కూచున్న కొమ్మనే మన చేతనే నరికిస్తున్నాయి రాజకీయ రంగులు. పచ్చని అడవి తల్లిని పాడు చేసి, మన వనసంపదనంతా వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం కన్న తల్లి లాంటి అడవి తల్లి నుండి మనల్ని దూరం చేయడానికి కుట్ర చేస్తున్నారు” అన్నాడు తత్వం చెపుతున్నట్టుగా సత్యం.
”ఏందిరా..! సత్యం నీకు ఏమైందిరా..! అడవి అంటవు, తల్లి అంటవు నాకేమీ అర్ధంగాట్లేదురా ..! గదేందో ‘యురేనియం’ అట కదరా.. అది తవ్వుకుంటారట మనకేమి నష్టం. మన భూములకు మస్తు పైసలు ఇస్తున్నరు కదా..!” అన్నాడు అమాయకపు ఆనందంతో సారయ్య.
”ఒరే.. నాయనా..! నీకే కాదురా.. మన వాళ్లకెవరికి నా బాధ అర్ధం కావడం లేదు. వాళ్ళు తవ్వేది యురేనియమే అయినా అది మన పాలిట ఉరేనియం. రేపు అధికారులు మన గూడెంలోకి రాకముందే మనం మన పది గూడాల జనం ఇక్కడికి రాగానే ముందు వాళ్ళతో మాట్లాడాలి. నువ్వు నాకు తోడుగా ఉండి వాళ్ళను ఏకం చేయాలి” అన్నాడు ఆవేదనతో సత్యం.
”సరే లేరా..! నువ్వు సదువుకున్నోడివి, మన వాళ్ళకు ఏమి చెప్పుతవో చెప్పుదువు గానీ.. ఇప్పుడు సాన పొద్దు పోయింది. మొగులు మీద గోరుకొయ్య నడి నెత్తిమీడికి వచ్చింది. ఇంక పండుకో పోరా..!” అన్నాడు ఆవలింత తీస్తూ సారయ్య.
సత్యం ఇంటికి వెళ్ళి వాకిట్లో ఉన్న గడిమంచెను వాల్చుకొని అలా వరిగాడు పరధ్యానంగా. కానీ, నిద్ర పట్టడం లేదు, తల నిండా ఆలోచనలే. ‘రేపు ఏం జరుగుతుందో ఏమో! తరాలు మారినా మారని మా తల రాతలను మేమే మార్చుకోవాలి. ఎలాగైనా రేపు జరిగే దారుణాన్ని ఆపాలి. అయినా నా ఆయుధం నా చదువే కదా..! మరి నాకెందుకు భయం, నేను మా గ్రంథాలయంలో చదువుకున్న అంబేద్కర్‌ జీవిత చరిత్ర నాకు ఎంతో స్పూర్తినిచ్చింది. ‘బోధించు, సమీకరించు, పోరాడు’ నినాదంతోనే కదా అంబేద్కర్‌ ముందుకు వెళ్ళి మనకు ఇన్ని రాజ్యాంగ ఫలాలను అందించారు. నేను కూడా రేపు నా వాళ్ళ తరుపున పోరాడుతాను..’ అని ఆలోచిస్తుండగానే ఆకాశంలోని ఆ నెలరాజు పడమటికి వాలిపోయాడు. కోడి కుక్కురుకో.. అని కూసింది. పక్షులు కిల కిల రావాలు చేస్తున్నాయి. చెట్ల చిగురులను సుతారంగా స్పర్శిస్తూ సూర్యుడు లోకాన్ని చూస్తున్నాడు.
సత్యం ఆవేశానికి నిద్ర లేమి తోడు కాగా కళ్ళు చింత నిప్పుల్లా ఎర్రగా మారాయి. వేప పుల్లతో పళ్ళు తోముకొని ముఖం కడుక్కొని స్నానం చేసి రచ్చబండ దగ్గరికి చేరుకున్నాడు సత్యం. అప్పటికే చుట్టు పట్టు గూడాల జనం అక్కడికి చేరుకున్నారు. చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలి ముతక అందరూ అధికారులు ఎప్పుడు వస్తారా.. పైసలు ఎప్పుడు ఇస్తారా.. అని ఎదురు చూస్తున్నారు.
సత్యం జనం మధ్యలోకి వెళ్ళి నిలబడ్డాడు. అందరిని ఉద్దేశించి ”అందరూ ఒకసారి నా మాట వినండి..! రేపటి నుండి పక్షుల కిలకిల రావాలకు బదులు యంత్రాల హౌరు వినవలసి వస్తది. పచ్చని అడవంతా ఒక్కసారిగా పారిశ్రామిక వాడగా మారడానికి సిద్ధంగా ఉన్నది. మనమంతా నిలువునా దుమ్ము అపోతాం. పచ్చని అడవి తల్లి తెల్లగా మారిపోబోతుంది. ఊహకందని భయంకర దశ్యాలు కనబడుతాయి. నీరు కలుషితమౌతుంది” అని చెపుతున్న సత్యం మాటలు పూర్తి కాక ముందే ”గవన్నీ మాకు తెల్వదు, గాళ్లేదో తవ్వుకుంటే మనకెందుకువయ్యా..! మన భూములకు ఎంతో కొంత రేటు కట్టి ఇస్తనే ఉండిరి” అన్నాడు జనాల మధ్యలో నుండి ఒక నాడీడు సాంబయ్య.
”అది కాదన్నా..! ప్రభుత్వం మనల్ని కాపాడవలసింది పోయి, మనల్ని అంతమొందించే పనులు చేస్తుంది. పైకి ఒకటి చెపుతూ లోపల ఒకటి చేస్తుంది. మన దేశ ప్రకృతి సంపదను ఫణంగా పెట్టి ఇలా దొడ్డి దారిన మనల్ని మన అడవి తల్లికి దూరం చేయాలని చూస్తున్నారు. మనతో పాటే మన గూడాలలో జీవించే అన్ని వృత్తుల సామాన్య జనం, నోరు లేని జీవరాశులు, పచ్చని చెట్లు ఇవన్నీ కూడా వారి దృష్టిలో ప్రాణులు కావు, మనవి జీవితాలు కావు అని వారి ఉద్దేశం” అని తన గుండెల నిండా ఉన్న ఆవేదన తన మాటల్లో ప్రతిధ్వనిస్తుండగా, ఆ మాటలు వింటున్న కొందరు యువకులు ఆలోచనలో పడ్డారు. కొందరు వృద్దులు మాత్రం ”మనకు పెద్ద వాళ్ళతో లొల్లి ఎందుకు? వాళ్ళు పైసలున్న మారాజులు. వాళ్ళు తలుచుకుంటే కూలిచ్చి విషం తినిపిస్తరు. వాళ్ళ చేతులల్లా చచ్చుడు కంటే వాళ్ళ మాట విని వాళ్ళకు భూములు ఇచ్చుడే నయం” అంటున్నారు. సారయ్య కూతురు వనజ ఆ రోజు బడికి వెళ్ళకుండా గుంపుకు దూరంగా తల్లి ఒడిలో కూర్చొని అక్కడి పరిస్థితులను పరిశీలిస్తుంది.
”నా మాట వినండి. ఎన్ని రోజులని ఇట్లా చస్తూ బతుకుదాం. వనమంటేనే మనం. అలాంటి వనాన్ని మనకు కాకుండా చేస్తుంటే మనం ఎట్లా ఊరుకుందాం. ఎవ్వరూ కాగితాల మీద సంతకాలు పెట్టకండి..” అని అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాడు సత్యం.
”ఈ అడివి సర్కారుది కదా..! మనం ఇన్నాళ్ళూ పంట పండించుకున్నాం. ఇప్పుడు వాళ్ళు గుంజుకోకుండా ఇంకా పైసలిస్తామంటున్నారు. మంచిదే కదా..! నువ్వు అంతా చెడగొట్లమారి మాటలు చెప్పకు” అంటూ గుంపులోనుండి ఒక ఆడ గొంతు లేచింది.
”అమ్మా..! సర్కారు అంటే ప్రజలే..! మనం లేకుండా సర్కారు లేదు. మనం ఓటు వేసి గెలిపిస్తేనే సర్కారు. ఇక అడవి, భూమి, గాలి, నీరూ నిప్పు ఇవన్నీ మనకు ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదలు. ఈ అడవిని నమ్ముకొనే మనం జీవిస్తున్నాం. మన భూములు మాత్రమే అమ్ముతున్నాం అనుకోకండి. రేపు మన గూడెంలో నుండి మనల్ని తరిమేస్తారు.
ఇక అడవి మీద మనకు ఎలాంటి హక్కులు ఉండవు. ఆ తవ్వకాలు జరిగితే మన పచ్చని అడవి బీడుగా మారుతుంది. వర్షాలు పడక మాడిపోతాం” అంటూ జీరబోయిన గొంతుతో వేడుకున్నాడు సత్యం.
సత్యం మాటలు వింటున్న వనజకు బడిలో వాళ్ళ సోషల్‌ టీచర్‌ చెప్పిన ‘సహజ సంపదలు’ పాఠం గుర్తుకు వచ్చింది. శ్రద్దగా సత్యం మాటలు వింటూ ఆలోచిస్తుంది. అధికార యంత్రాంగం రానే వచ్చింది పోలీసు బలగాలతో .
కులపెద్ద సమ్మయ్యను పిలిచి ”ముందుగా నువ్వు ఈ కాగితాల మీద వేలిముద్ర వేయి” అంటూ కాగితాలు ముందు పెట్టారు.
”నేను పెట్టనయ్యా..! మావాడు ఏదో చెపుతుండు. మాకు ఇంత ప్రమాదం పొంచి ఉందని మీరు చెప్పకనే పోతిరి” అన్నాడు సమ్మయ్య చేతులు నలుపుకుంటూ.
ఏందిరా..! నిన్నటి దాకా సంతకాలు పెడతాం అన్నారు. ఇప్పుడు ఏమైందిరా.. !” అంటూ గుడ్లురిమి చూశాడు లోకల్‌ లీడర్‌.
”నాయిన మాత్రమే కాదు, ఇక్కడ ఎవ్వరూ భూములు అమ్మడానికి సిద్ధంగా లేరు. తవ్వకాలకు ఒప్పుకోం” అన్నాడు ఆవేశంగా సత్యం. యువకులందరు సత్యం మాటే మా మాట అన్నారు.
”సమ్మయ్య కొడుకువు నువ్వేనారా..! నీ పేరు సత్యం కదూ..! నువ్వు పట్నంలో చదువుకని పోయి అన్నలకు ఇన్ఫర్మర్‌ పని చేస్తూ వాళ్ళతోటి తిరుగుతున్నావట కదా..! ఏ దళంలో పని చేస్తున్నావురా..!” అంటూ తర్కాయించాడు కద్దరు బట్టలు వేసుకున్న నాయకుడు. అందరు నిర్ఘాంతపోయి చూస్తున్నారు.
”నేను దళంలో పని చేయడం ఏంటీ..! మీకు ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళను అన్నలు అంటారా..! వాళ్ళపై కేసులు పెడతారా..” ఎదురు జవాబు చెప్పాడు సత్యం ఉక్రోషంగా.
”అనుమానమే లేదు, వీడు పక్కా నక్సలైట్‌ నాయకుడే” అంటూ కద్దరు బట్టల సైగలు పసిగట్టిన పోలీసులు చుట్టు ముట్టారు. మిగతా యువకులు ముందుకు వచ్చి, ఇది అన్యాయం, మా సత్యం అన్న పట్నంలో చదువుకుంటున్నాడు. లేనిపోని కేసులు పెట్టకండి” అని ఆవేశంగా అన్నారు.
”అయితే మీరు కూడా వీని అనుచరులేనన్నమాట”అంటూ అందరిని చుట్టు ముట్టారు.
”ఈ విద్వంసాన్ని ఆపాల్సిన బాధ్యత మీకు కూడా వుంది. ఈ ప్రాంత పౌరులుగా మీరు మాకు న్యాయం చేయండి. అన్యాయంగా మీరు మానోరు మూయించాలని చూడకండి” అంటూ ఉక్రోషంగా ఉరిమాడు సత్యం.
సత్యం మాటలకు రోషంతో లాటిలు పైకి లేచాయి. అది చూసిన సత్యం తల్లిదండ్రులు పోలీసుల కళ్ళా వెళ్లా పడుతున్నారు. కద్దరు బట్టల కనుసన్నలలో ఉన్న పోలీసులు కనికరం చూపటం లేదు. తోపులాటలో సత్యం తల్లి అటు దూరంగా విసిరేయబడి తలకు గాయమై స్పృహ కోల్పోయింది. తండ్రికి దెబ్బలు తగిలి రక్తాలు ఓడుతున్నాయి.
ఆవేశంగా యువకులు ముందుకు ఉరికారు. అందరిపై లాఠీలు ఝళిపించారు. విచక్షణా రహితంగా లాఠీలు డ్యూటీ చేస్తున్నాయి. దెబ్బలకు తాళలేని యువకులు పెడబొబ్బలు పెడుతున్నారు. వారి తల్లిదండ్రులు మా పిల్లల్ని కొట్టొద్దని అడ్డు వస్తే వారి మీద కూడా లాఠీలు పడుతున్నాయి. రక్తాలు కారుతుంటే వృద్దులందరు దండాలు పెడుతున్నారు. అయినా వినకుండా చాలా విశ్వాసంగా కద్దరు బట్టలకు కావలికాస్తూ అమాయకులను కొడుతున్నారు.
సత్యం ఒంటి నిండా గాయాలే, బట్టలు రక్త సిక్తమైనాయి. తల పగిలి రక్తం ధారగా కారుతుంది. ఆ హింసాకాండను చూడలేని సమ్మయ్య ”మేం సంతకాలు పెడుతమయ్యా..! మీరు ఏమన్నా తవ్వుకోండ్రి, మా పోరగాండ్లను సంపి ఊరు కాష్టాల గడ్డ చెయ్యకుండ్రి..!” అంటూ గట్టిగా అరిచాడు. సమ్మయ్యతో అందరూ గొంతు కలిపారు.
ఆ గుంపులో సారయ్య కూడా ఉన్నాడు. శరీరమంతా రక్తాలు కారుతున్నాయి. వనజను దూరంగా ఉంచి సారయ్య భార్య సారయ్య దగ్గరకు పరుగు తీసింది. ”నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు మీరు సంతకాలు పెట్టొద్దు” అని అరుస్తున్నాడు సత్యం. అయినా అందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సంతకాలు పెట్టడానికి సిద్దపడ్డారు. అయినా ఆగకుండా సత్యం ఒంటి మీద లాఠీలు పని చేస్తూనే ఉన్నాయి.
గుంపులో అందరి మధ్యలో నుండి ముందుకు వచ్చింది వనజ. రెండు సంవత్సరాల క్రితం రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేసి వదిలేసిన ఫలకం ఉంది. దాని పక్కనే రాళ్ళ కుప్ప ఉంది, దానిపై పడేసి సత్యంను కొడుతున్నారు.
వనజ అందరినీ ఒక్కసారి పరిశీలనగా చూసింది. అందరిమీద లాఠీలు బలంగా పని చేస్తున్నాయి. చిన్న పిల్ల అని కూడా చూడకుండా ఒక లాఠీ వనజ మీదికి లేవగానే వనజ కిందికి వంగి అటు ఇటు చూస్తుండగానే వనజ చేతిలోకి ఒక కంకర రాయి చేరింది, ఆ రాయి చేతిలో గట్టిగా బిగుసుకొని ”ఈ అడవి నాది” అంటూ పిడికిలై లేచింది. ఒక్కసారిగా జనమంతా వనజ వైపు తిరిగారు. ఆశ్చర్యంగా అందరూ ఏడుపులు పెడబొబ్బలు ఆపి తదేకంగా వనజనే చూస్తున్నారు. బాధితులందరికి ఆమె అడవి తల్లిగా కనబడుతుంది. అందరిలో ఎక్కడా లేని తెగువ పుంజుకుంది. ఏదో అదృశ్య శక్తి వారి మధ్యలోకి వచ్చినట్లు అనుకోకుండా అందరి చేతుల్లోకి కంకర రాళ్ళు చేరి, అవి పిడికిళ్లుగా ఒక్కసారిగా పైకి లేచాయి.

– డా|| తాళ్ళపల్లి యాకమ్మ, 9704226681

Spread the love