”శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణి:” అని ఆర్యోక్తి. సంగీతానికి శిశువులు, జంతువులు, పాములు సైతం ఆనందిస్తాయి అని అర్థం. ఆ మాటకొస్తే ప్రకృతిలోని ప్రతి సవ్వడిలోనూ నిండి ఉన్నదంతా సంగీతమే. గాలి సవ్వడిలోనూ, జలపాతపు హోరులోను, ఆకుల కదలికలోనూ లయబద్ధమైన సంగీతం వినిపిస్తుంది. విశ్వవ్యాప్తంగా మనమందరం మాట్లాడుకునే భాష పేరే సంగీతం. ఇది ప్రణవ నాదమైనా ‘ఓంకారం’ నుంచి జనించిన అద్భుతం. రాగం, తానం, పల్లవుల సమాహారం సంగీతం. స,రి,గ,మ,ప,ద,ని సప్త స్వరాలు సంగీతానికి మూలం. స – షడ్యమం, రి- రిషభం, గ- గాంధారం, మ- మధ్యమం, ప-పంచమం, ద-దైవతం, ని-నిషాదం. ‘శృతిర్మాత లయ పిత:’ సంగీతానికి ‘శృతి’ తల్లి అయితే ‘లయ’ తండ్రి. సంగీతం విని పరవశించని మనసు ఉండదు, మనిషి ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో! మన:స్థితిని నియంత్రించడానికి సంగీతాన్ని మించిన సాధనం మరొకటి లేదు. మనసును ఉల్లాసపరిచేది సంగీతం, బాధలు మరిపించేది సంగీతం. ఇలా చెప్పుకుంటూ పోతే మనలోని ప్రతి భావన సంగీతం తోనే ముడిపడి ఉంది. సంగీత సాధన చేయడం వల్ల బుద్ధి వికసిస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఒత్తిడి తగ్గి సహనం అలవడుతుంది. అందుకే దీనిని ”మ్యూజిక్ థెరపీ’ పేరుతో వైద్య రంగంలో కూడా వాడతారు.
సంగీతంలోని ప్రతి రాగం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. సూర్యోదయ వేళలో వినిపించే ‘భూపాల రాగం’ నిద్రలేవగానే మనసుకు తెలియని ప్రశాంతతను ఇస్తుంది. సాయం సంధ్యకు చిహ్నంగా ‘హిందోళ రాగాన్ని’ చెప్పవచ్చు. మోహన, కళ్యాణి రాగాలు ఎప్పుడు విన్నా మనసుకు హాయిగా అనిపిస్తుంది. మనలోని బాధను, దు:ఖాన్ని సూచించేరాగం ‘శివరంజని’. భారతీయ సంగీతమైనా, పాశ్చాత్య సంగీతమైనా దేనికున్న ప్రాముఖ్యత దానిది. మన భారతదేశంలో ముఖ్యంగా వినిపించే సంగీతం హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలు. ఇవి పూర్తిగా శాస్త్రపరమైనవి. గురువుల దగ్గర సాధన చేస్తే మాత్రమే అభ్యసించగలిగిన సంగీతం.
రెండవది భావ ప్రధానమైనది. దీనినే ‘లలిత సంగీతం’ అంటారు. సున్నితమైన పదాలకు అందమైన రాగాలను జత చేసి, చక్కని భావవ్యక్తీకరణ చేసే సంగీతం లలిత సంగీతం. సినీ సంగీతం కూడా లలిత సంగీతం కోవకు చెందినదే. ఈ సంగీతాన్ని ఎవరైనా సులభంగా ఆస్వాదించగలరు. పాడుకునే ప్రయత్నమూ చేయగలరు. మూడవది జనుల గుండెల్లోంచి పుట్టిన ‘జానపదం’. ఇది పని నుంచి పుట్టిన పాట. ‘పనీ- పాట’ అన్నమాట జానపదాన్ని ఉద్దేశించి చెప్పినదే కావచ్చు. పనిచేసే పల్లె పడుచులు, శ్రామికులు తమ అలసటను మర్చిపోవడానికి పాడుకునే పాటలు జానపదాలు. దీనితోపాటు జాతిని జాగృతం చేసే పాటలు ‘విప్లవ గీతాలు’.
మనదేశంలో శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య సంగీత పోకడలు కూడా పెరిగి పాప్, రాక్, వెస్ట్రన్ మ్యూజిక్‌గా రూపాంతరం చెందాయి. నేటి యువతరం దీనిని క్రమంగా ఇష్టపడడం, వినడం, నేర్చుకోవడం మొదలు పెట్టింది. ఎవరు ఎలాంటి సంగీతాన్ని ఆస్వాదించినా, నేర్చుకున్నా దాని అంతిమ ఫలితం మానసిక ఉల్లాసమే. భారతీయ శాస్త్రీయ సంగీతంలో త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ఈ ముగ్గురిని త్రిమూర్తులుగా చెబుతారు. వీరి రచనలలో ఒకరిది ద్రాక్ష పాకం, ఇంకొకరిది కదలీపాకం, మరొకరిది నారికేళ పాకం అని అభివర్ణిస్తారు. త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలకు పరవశించేది ఒకరైతే, అన్నమయ్య పదములకు ముగ్ధులయ్యేది కొందరు. భక్త రామదాసు భజనలకు తన్మయత్వం పొందేది కొందరైతే, ముత్తుస్వామి దీక్షితులు గారి నవ వర్ణ కీర్తనలకు మురిసేది మరికొందరు. తమ రచనలు తామే స్వయంగా చేసుకొని, అరుదైన శైలిలో తమ ప్రతిభతో దానికి అద్భుత రాగాలను అందించి, గానం చేయగల పుంభావ సరస్వతీ మూర్తులను వాగ్గేయకారులుగా చెప్పవచ్చు. అట్టి కోవకు చెందిన వారే త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, పురంధర దాసు, సూరదాసు, రామదాసు, నారాయణ తీర్థులు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు మొదలైనవారు. వీరిని ఆదర్శంగా తీసుకొని నేటి వరకు ఎందరో గురువులు మన భారతీయ సంగీతానికి ప్రాణం పోస్తున్నారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు శ్రీపాద పినాకపాణి ఎందరో శిష్యులను తయారు చేశారు. వారి పరంపరను కొనసాగిస్తూ నేదునూరి కృష్ణమూర్తి, మంగళంపల్లి బాలమురళీకష్ణ తమదైన శైలిలో భారతీయ సంప్రదాయ సంగీతానికి ప్రాణం పోశారు.
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, బాలమురళీకష్ణ మన భారతీయ సంప్రదాయ సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఎంతో కృషి చేశారు. ఇలాంటి అద్భుత సంగీతం పండితుల దగ్గర నుండి పామరుడి వరకు చేరి అందరూ విని ఆనందించాలనే ఉద్దేశంతో రూపొందించబడినదే ఈ ‘అంతర్జాతీయ సంగీత దినోత్సవం’.
ఫ్రెంచ్ రాజకీయవేత్త ‘జాక్ లాంగ్’ఈ సంగీత దినోత్సవం అనే ఆలోచన రూపకర్త. ఈ సంగీత దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 1982 జూన్ 21న ఫ్రాన్స్‌లో జరుపుకున్నారు. సంగీతాన్ని ప్రోత్సహించడమే కాక ప్రతి ఒక్కరూ సంగీత వాయిద్యాలని ప్లే చేసి వినడం ద్వారా ఆరోజు పూర్తి ఆనందాన్ని అనుభవించి, ఒత్తిడిని తగ్గించుకొని రోజంతా ప్రశాంతంగా ఉండడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. సంగీత ఔత్సాహికులు అందరికీ ఉచిత సంగీతాన్ని అందించి, ప్రపంచవ్యాప్తంగా వీరి ప్రదర్శనలను పరిచయం చేయడం, ప్రతి దేశం తమ సంగీతం తమతోనే కాకుండా ప్రపంచ సంగీత ప్రియులందరితో పంచుకునే సదుద్దేశంతో ఈ ‘ప్రపంచ సంగీత దినోత్సవం’ ప్రారంభించారు. దీనికొక ఫారంను కూడా రూపొందించారు. ఇంత అద్భుతమైన సంగీతాన్ని మనమందరం ఆస్వాదిద్దాం. ఈ వేడుకను అందరం జరుపుకుందాం ప్రపంచ సంగీత ప్రియులందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.
(జూన్ 21 ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా)
– వందన ద్విభాష్యం, 7981941760