సంగీత కళ ప్రస్థానం – పోకడ

”స్వతో రంజయతి శ్రోత చిత్తం స స్స్వర ఉచ్యతే” (బహద్దేశి) శబ్ద్ధాన్ని కాలంతో మేళవించి వినసొంపుగ మార్చే విలక్షణమైన ప్రక్రియ. స్వయంగా రంజింప చేయు ధ్వని రూపం సంగీతం. ప్రకృతిలో సంగీతం మిళితమై మన జీవన గమనంలో భాగమైపోయింది. అందుకే సుప్రసిద్ధమైన చతుషష్టి కళలలో ఒకటిగా నిలిచిపోయింది సంగీతం.
భారతీయ సంగీతానికి మూలం సామవేదం అంటారు. సంగీతంలో కర్ణాటక, హిందుస్తానీ, వాగ్గేయకారుల భక్తి గీతాలు, జానపద గీతాలు, బుర్ర కథలు ఇలా ఎన్నో వున్నాయి. అనాదిగా ప్రజలు పాడుకునే జానపద సంగీతం, కర్ణాటక సంగీతం సంస్కృతీకరించబడి నేటి సినీ గీతాలుగా, లలిత గీతాలుగా కొత్త పోకడలతో సాగుతోంది.
అతి ప్రాచీన గ్రంథం అయిన భరతుని నాట్యశాస్త్రం సంగీతానికి అంకితమైన ఒక ప్రామాణిక గ్రంథం. అలాగే 13, 14 శతాబ్ధాలలో భారతీయ సంగీతం రెండు పద్ధతులుగా విభజింపబడింది.
అల్లావుద్దీన్‌ కాలంలో పారశీక కవి, సంగీత కోవిదుడైన అమీర్‌ ఖుస్రో తన దేశమందలి రాగాలను సమన్వయించి కొత్త రాగాలను సూచించాడు. పరకీయ ప్రభావంతో ప్రారంభమైన దేశపద్ధతి మొగల్‌ చక్రవర్తుల పాలనలో బాగా వ్యాపించింది. మన సంగీతంలో ఉత్తరాది, దక్షిణాది అనే రెండు పద్ధతులు ఏర్పడ్డాయి. క్రమేణా అదే మన భారతీయ సంగీతంగా రూపాంతరం చెందింది.
సంగీతానికి ఆధారం స్వరం. సంగీత త్రయంలో ఒకరైన సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారు స్వయంగా తమ కీర్తనంలో ‘కోలాహల సప్త స్వరముల గురుతే మోక్షమురా’ అని, ‘సరిగమపదని వర సప్తస్వర’ అని, శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే అని… పలు విధములుగా శ్లాఘించారు.
మన పూర్వీకులు సంగీతం గురించి పలువిధాల ప్రశంసించారు. చంటి బిడ్డకు, ఆవుదూడకు, నాగు పాముకు సైతం పాటంటే ఎంతో మక్కువ అని.. అదే ఒక ఆంగ్లేయుని అభిరుచి చూస్తే తన ఆలోచనలో సంగీతాన్నిthe rhythm of life అని వర్ణిస్తారు.
దేశకాల పరిస్థితులను బట్టి మానవుని బుద్ధి చాతుర్యంతో పాటు కూని రాగం ఎన్నో మార్పులను తెచ్చిన దాఖలాలు వున్నాయి. శ్రీ వెంకటమఖి, పురందరదాసుల వారు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు మొదలగువారు సంగీతానికి ఎంతో వన్నె తెచ్చారు.
సంగీతకళకు పునాది సప్తస్వరాలు. సప్తస్వరాలు ప్రకృతిలో ఒక అంతర్భాగం. అందుకే నెమలి కూతను షడ్జమముగ, వృషభధ్వనిని రిషభముగా, మేక శబ్ధమును గాంధారముగాను, క్రౌంచపక్షి పలుకును మధ్యమముగాను, వసంత ఋతువు నందలి కోకిల కూతను పంచమముగాను, గుర్రపు ధ్వనిని దైవతముగాను, ఏనుగు ఘీంకారమును నిషాదంగాను పోలుస్తారు.
నాటి నుండి నేటి వరకు నిష్ణాతులైన సంగీతజ్ఞులు ఎందరో ఎన్నో అద్భుతమైన రచనలు చేసి మనకు అందించారు. సంగీత కళ నవరసాల రూపుదాల్చి కతులు, కీర్తనలు, భజనలు, బావ, భక్తి, కార్మిక, కర్షక, జానపద గీతాలుగా రూపు దాల్చి మన భారతీయ సంగీతంలో భాగం అయ్యాయి.
సేద్యం చేయు వారికి పొలం పాటలు, రోకటితో ధాన్యము దంచు వారికి రోకటి పాటలు, ఓడ నడుపు వారికి ఓడ పాటలు, భక్తి ద్యానము చేయువారికి భక్తి పాటలు, సంగీత కళలో ప్రవేశం, అభిరుచి గల వారికి తగు శిక్షణ పద్ధతులుగా రచించబడిన రచనలు ఇలా ఎన్నెన్నో గాన యోగ్యమైన సంగీత కళలు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చాయి.
సంగీతానికి లయ ఆధారితమైతే ఆ కళ మరింత వినసొంపుగా శ్రవణారవిందంగా మారుతుంది. రాగ భావం తోడైతే గాత్ర ధర్మాన్ని బట్టి స్వరస్థాన శోభ రక్తి కడుతుంది. ఉదయించే సూర్యుని వలె భౌళి రాగ ఛాయ, అస్తమించే సూర్యుని వలె కల్యాణి రాగ ఛాయ, చల్లని చంద్రుని స్పర్శ వలె రేవతి, ఖామాస్‌ రాగ ఛాయలు ఇలా ఎన్నెన్నో రాగాలు మన నిత్య జీవితానికి, ప్రకృతికి సరితూగుతాయి.
కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య తమ రుతు గానంలో శరదృతువును వర్ణిస్తూ – ”తెల్ల చీర తెలివెల్గులన్‌ గల్గి సీతకు ముదము దాల్చు రుతు లతాంగి దైవతము పాడే” అన్నారు. ఋతువు కాలానికి సంబంధించినది. తెలుపు వర్ణాలకు చెందినది. దైవతం సంగీత శాస్త్ర పారిభాషిక పదంగా సంబోధిస్తారు.
రాళ్ళను సైతం నర్తింపచేయ గల శక్తి సంగీతానికి ఉంది అంటారు. శాస్త్ర బద్ధమైన ఆధారాలు కూడా ఎందరో మహనీయులు శోధించి ప్రయోగించటం జరిగింది. ఈ శోధన చేసిన వారిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, ఇంకా మంగళంపల్లి బాలమురళి కృష్ణ ప్రముఖులు.
రాగాలతో రోగాలను నియంత్రించడం వంటి పరిశోధనలు ఎన్నో జరిపించారు. అందుకే ఆసుపత్రి లో కూడా సంగీత ద్వని ని సూక్ష్మంగా పెట్టడం వల్ల రోగ గ్రస్తులలో ఉన్న మానసిక రుగ్మతలు, డిప్రెషన్‌ వంటివి దూరం అవ్వటం ఒక విశేషం.
సంగీత సుధాలాపనలో పాడి పశువులు ఎక్కువ పాలు ఇచ్చినట్లు, పైర్లు పుష్కలంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు నిరూపించారు. అందుకే శాస్త్ర ఆధారమైన సంగీతం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం అవ్వటం గర్వించతగ్గ విషయం. ఎందరో కళాకారులు మన ఈ లలిత కళని ఆధారంగా చేసుకొని తమ నిత్య జీవితంలో జీవనోపాధిగా పొందారు.
పూర్వపు చిత్ర తారాగణంలో పాటలు వింటే గానం చేసిన గాయనీ గాయకులు, సంగీతం సారధ్యం చేసినవారు, రచయితలు మన శాస్త్రీయ సంగీత ఆధారితమైన సాహిత్య మెళకువలను ఎంతగానో పోషించేవారు. అందుకే నాటికి యేనాటికి ఆ పాటలు ఎప్పుడు విన్నా సరికొత్తగా, సంతృప్తిగా అనిపిస్తాయి.
నేటి చిత్రాలలో కూడా అటువంటి శాస్త్రీయ ఆధారిత సాహిత్య పోకడలు కలిగిన పాటలు మనం గమనించవచ్చు. పాటకు శాస్త్ర బద్ధమైన సంగీతం ఆధారమైతే ఆ పాట ఎప్పటికీ చిరస్మణీయంగా నిలుస్తుంది.
సంగీతం ఏదోరకంగా ప్రతి మనిషి జీవితంలో సందర్భాను సారంగా సమ్మిళితమై సదా రంజిపచేస్తూనే ఉంది. అందుకే గానం మానవ వికాస యానానికి ఓ ప్రమాణం. అదే భారతీయ సంగీతకళా ప్రస్థానం. యావత్‌ ప్రపంచానికి గురుస్థానం. ప్రతి సంగీత కళాకారునికి స్వరాస్థానం.
– శ్రీమతి మూల్పూరు శ్రీవాణి, ఎం. ఏ., ఎం. ఫిల్‌. మ్యూజిక్‌. 

Spread the love