– ఆంక్షలు లేని రుణమాఫీ అమలయ్యేదాక వెంటబడతాం
– రేవంత్‌రెడ్డి సొంత ఊర్లో మాఫీ పూర్తయితే రాజీనామాకు సిద్ధం
– రుణమాఫీ కోసం కాంగ్రెస్ నాయకులను నిలదీయండి : చేవెళ్ల ధర్నాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– సీఎం రైతులను మోసం చేసిండు : జనగామలో మాజీమంత్రి హరీశ్
– రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బీఆర్‌ఎస్ ఆందోళనలు
నవతెలంగాణ-విలేకరులు
ఆంక్షలు లేకుండా ప్రతి రైతుకూ రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. రుణమాఫీ, ఆరు గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీలు అమలు అయ్యే వరకూ వెంటబడతామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఊరు కొండరెడ్డిపల్లిలోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, అయి ఉంటే తన రాజీనామాకు సిద్ధమని సీఎంకు కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ.. గురువారం బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలో నిర్వహించిన ధర్నాలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. మొదట రూ.49వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ తర్వాత 31వేలకు తగ్గించి.. ప్రస్తుతం రూ.7,500 కోట్లే చేశారని విమర్శించారు. 70లక్షల మంది అర్హులైన రైతులు ఉంటే.. 20 లక్షల మందికి కూడా రుణమాఫీ కాలేదన్నారు. ఇప్పటి వరకు రైతులకు రైతుభరోసా కూడా వేయలేదన్నారు. ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో పంటలు ప్రారంభమయ్యే దశలోనే రైతుబంధు పడేదని తెలిపారు. రుణమాఫీపై రైతులు అధికారులను కాకుండా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. ప్రజాస్వామికబద్ధంగా ప్రభుత్వంపై కొట్లాడుతామన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించినందుకే చేవెళ్ల చెల్లెమ్మ సబితమ్మను అవమానించిండని ఆరోపించారు. షాబాద్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయాక షాబాద్ కళ తప్పిందని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్ ప్రారంభించిన ప్రాజెక్టులను సీఎం రేవంత్‌రెడ్డి రద్దు చేశారని ఆరోపించారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఏమి తీసుకుని కాంగ్రెస్‌లో చేరారో చెప్పాలని, ఎమ్మెల్యేను ప్రజలు ప్రశ్నించాలన్నారు. బీఆర్‌ఎస్ అంటేనే భారత రైతు సమితి అని, రైతుల పక్షాన నిరంతరం పోరాడుతామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, ఎమ్మెల్సీ శంబీపూరి రాజు, శాసన మండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు.
సీఎం రైతులను మోసం చేసిండు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
జనగామ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. రాష్ట్ర రైతాంగానికి రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశాడని అన్నారు. ‘రేవంత్‌రెడ్డి.. ఏ ఊరికొస్తావో చెప్పు, ఏ మండలానికి వస్తావో చెప్పు, ఎక్కడైనా 100 శాతం రుణమాఫీ అయిందా లేదా అని అడుగుదాం’ అంటూ సవాల్ విసిరారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పూర్తి రుణమాఫీ కాలేదని ప్రకటించారని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 49 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉంది కానీ 22 లక్షల మంది రైతులకు మాత్రమే జరిగిందని ఒప్పుకున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.7,000 కోట్ల రుణమాఫీ జరిగిందని బ్యాంకర్ల సమావేశంలో ప్రకటించారని అన్నారు. ప్రజలు ఎవరి మాట నమ్మాలో తెలియక ఆందోళన చెందుతున్నారని అన్నారు. రైతులకు పూర్తి రుణమాఫీ చేసేదాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.తొర్రూరులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం మంచుకొండ వద్ద ప్రధాన రహదారిపై మాజీ మంత్రి పువ్వాడ అజరుకుమార్ బైటాయించి ఆందోళన చేపట్టారు. ముందుగా ఎన్‌టీఆర్ సర్కిల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్తుపల్లిలో అంబేద్కర్ విగ్రహం ఎదుట మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా చేరుకొని ధర్నా చేపట్టారు. మెదక్ జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్టాఫీస్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనం ఎదుట మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇచ్చోడ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మీ రైతులతో కలిసి ధర్నాలో పాల్గొని, అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్‌లో బీఆర్‌ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలోఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి ధర్నా నిర్వహించారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి, వేల్పూర్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.