Wednesday, June 3, 2026
E-PAPER
Homeక్రైమ్వాకింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన వాహనం..ఇద్దరు మృతి

వాకింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన వాహనం..ఇద్దరు మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : వాకింగ్ కోసం వెళ్లిన ఇద్దరు యువకులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన కడప జిల్లా మైదుకూరు మండలం లో బుధవారం తెల్లవారుజామున సంభవించింది. మైదుకూరు – బద్వేల్ జాతీయ రహదారిపై జీవి సత్రం గ్రామం సమీపంలో రోడ్డు పక్కన వాకింగ్ చేస్తున్న ముగ్గురు యువకులను ఒక గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో జీవి సత్రం గ్రామానికి చెందిన సుమంత్ (25), మదన్ గోపాల్ (25) అనే ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. ప్రమాద తీవ్రతకు సుమంత్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన మదన్ గోపాల్‌ను స్థానికులు మైదుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆయన కూడా కన్నుమూశారు.

ఈ ప్రమాదంలో విజయ్ అనే మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడైన విజయ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇద్దరు యువకుల మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. వాకింగ్‌కు వెళ్లిన యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జీవి సత్రం గ్రామంలో ఒకేసారి తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ప్రమాదానికి కారణమై ఆపకుండా వెళ్లిపోయిన సదరు గుర్తుతెలియని వాహనం కోసం సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గాలిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -