మేలుకొలుపు

– టచ్‌ మీ నాట్‌
”ఒరేరు బంటి లేవరా స్కూల్‌ కి టైం అవుతుంది. రాత్రంతా పడుకోకుండా సెల్లో గేమ్స్‌ ఆడతావు. తెల్లారి లేవటానికి మారం చేస్తావ్‌. ఈసారి ఎగ్జామ్స్‌లో మార్క్స్‌ తక్కువ రాని నీ పని చెప్తా!” అని కేకలు వేసింది భవాని.
”అబ్బా రోజు తెల్లారుగట్ల ఇదే సుప్రభాతం. ఏదో వాడి బాగోగులు నువ్వే చూసుకుంటున్నట్టు. నువ్వు రోజు తిట్టడం వాడు రోజు ఏడవటం” అంది బంటి వాళ్ళ బామ్మ కౌసల్య.
”మీరు వాడిని వెనకేసుకుని రాబట్టే వాడు మరీ గారాలుపోతున్నాడు. మీ దన్ను చూసుకొని వాడు అసలు మాటే వినటం లేదు” అని రుసరసలాడింది భవాని.
”ఎన్నో నోముల పంట వాడు. పెళ్లయిన 5 సంవత్సరాల వరకు నీకు పిల్లలు లేకపోతే ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే లేక లేక కలిగిన సంతానం. ఉన్నప్పుడు విలువ ఎవరికి తెలియదులే… ఎవరి మటుకు వాళ్ళు ఉద్యోగాలకు పోతున్నారు. మంచి చెడు వాడికి ఏం తెలుస్తుంది. తిననని మారం చేస్తే చేతికి ఆ సెల్‌ ఇచ్చావు. దానికి వాడు బాగా అలవాటు పడిపోయాడు. ఇప్పుడు తిడితే ఏంటి లాభం?” అని మూతి తిప్పుకుంది కౌసల్య.
అంతలో ‘నానమ్మ!’ అంటూ వచ్చి కౌసల్య నడుము చుట్టూ చేతులు చుట్టేసి గట్టిగా హత్తుకున్నాడు బంటి.
”వెళ్ళు నాన్న… వెళ్లి త్వరగా బ్రష్‌ చేసుకోని పాలు తాగు. స్కూల్‌ బస్సు వచ్చేస్తుంది మళ్ళీ అమ్మ కేకలు వేస్తది. త్వరగా వెళ్లి రెడీ అవ్వాలి” అని చెప్పింది కౌసల్య. ”సరే నానమ్మ!” అని చకచకా రెడీ అయి స్కూల్కి వెళ్ళిపోయాడు.
ఆరోజు స్కూల్లో ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. మళ్లీ బంటికి మార్కులు తక్కువగా వచ్చాయి. బేలగా ముఖం వేలాడదీసుకుని ఇంటికి వచ్చాడు. బిక్క ముఖంతో ఉన్న మనవడి పరిస్థితిని చూసి కౌసల్య ”ఏమైంది నాన్న ఎందుకలా ఉన్నావ్‌” అని అడిగింది.
”నువ్వు అమ్మకి చెప్పకు. మళ్లీ నాకు మార్కులు తక్కువే వచ్చాయి. ఈసారి మార్కులు తక్కువగా వస్తే నన్ను హాస్టల్లో వేస్తానన్నారుగా. అందుకే భయం వేస్తోంది” అని సమాధానం ఇచ్చాడు.
”ఓసి అంతేనా! నీకు తెలుసా చిన్నప్పుడు మీ నాన్నకి కూడా మార్కులు తక్కువే వచ్చేవి. వాడు నా వెనక దాక్కొని తాతయ్య తిడుతుంటే ఎక్కి ఎక్కి ఏడ్చేవాడు. నేనున్నాను కదా ఏమి కాదులే” అని మనవడికి ధైర్యం చెప్పింది.
అప్పుడే ఆఫీసు నుండి వచ్చిన భవాని ఆ మాటలు వింది. ”మీరు అలా వెనకేసుకుని రాబట్టే వాడు భయభక్తులు లేకుండా తయారయ్యాడు. ఈసారి మార్కులు సరిగ్గా రాకపోతే హాస్టల్‌లో వేస్తానన్నా కూడా వాడు భయపడ లేదంటే ఎంత చెడిపోయాడో అర్థం అవుతుంది. ఉండు నీ పని చెప్తా” అని కర్రతో నాలుగు వాయించింది భవాని. మధ్యలో కౌసల్య అడ్డుకో బోతుంటే మీరు మధ్యలో తల దూర్చకండి అని కటువుగా చెప్పింది.
అంతలో బంటి తండ్రి శ్రీనివాసరావు రానే వచ్చాడు. ”అబ్బబ్బా! ఏంటి గోల వీధిలోకి వినిపిస్తుంది మీ గోల” అన్నాడు.
”వచ్చారా? రండి! వీడికి పోగ్రాస్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. అన్ని బి2 గ్రేట్‌ లే… తల కొట్టేసినట్టు అవుతుంది పేరెంట్స్‌ టీచర్‌ మీటింగ్‌ కి వెళ్తున్నప్పుడు. పోనీ ట్యుషన్లో పెట్టించమన్నా పెట్టించరు. వీడు ఇలాగే ఉంటే ఎలా బాగుపడతాడో? పెద్దయ్యాక ఏమవుతాడో? అని ఒకటే బెంగపట్టుకుంది” అని తల పట్టుకుంది భవాని.
ఆ మాటలకి శ్రీనివాసరావుకి బంటి మీద చాలా కోపం వచ్చింది. ”అందుకే చెప్పాను లాస్ట్‌ ఇయర్‌ వీడ్ని హాస్టల్లో పెట్టేద్దామంటే విన్నారా? ట్యూషన్‌లో పెట్టిస్తే రోజు ట్యూషన్‌కి ఎవరు తీసుకెళ్తారు? పోనీ ఆ ఉద్యోగం మానేసి ఇంట్లో ఉండి పిల్లాడిని చదివించమంటే నువ్వు నా మాట వినవు. నీ సెల్ఫ్‌ రెస్పెక్ట్‌, నీ సంపాదన, నీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు. అమ్మ వాడిని అంత దూరం ట్యూషన్‌కి తీసుకొని వెళ్లగలదా?” అని గట్టిగా భవానిమీద అరిచాడు.
భర్త అలా మండిపడటంతో భవాన్ని కోపం నషాలానికి ఎక్కింది.
”ఏమన్నారు? నా స్వార్థం నేను చూసుకున్నానా? మీరే గాని రెండు చేతులు నిండా ఏ లోటు లేకుండా సంపాదిస్తే నేనెందుకు కష్టపడతాను? మీ సంపాదన ఇల్లు గడవడానికే సరిపోవటం లేదు. మిగిలిన ఖర్చులన్నీ నా సంపాదనతోనే నెట్టుకొస్తున్నాను. నాకే బాధ్యత ఉందా వాడి మీద. నీకు ఏమీ బాధ్యత లేదా? పోనీ నువ్వు ఉద్యోగం మానేసి చదివించు” అని శివా తాండవం చేసింది.
అలా ఇద్దరు ఒకరిని ఒకరు నిందించుకుంటూ గొడవ పడుతుండగా ”అబ్బబ్బ! ఆపుతారా మీ గోల. మీ ఇద్దరిలా గొడవపడి వాడి బతుకు నాశనం చేస్తున్నారు. వాడి బాగోగులు చూసుకోవడానికి చదివించడానికి మీకు టైం లేదు కానీ గొడవలు పడ్డానికి మాత్రం టైం ఉంటుంది” అని ఇద్దరినీ తిట్టి అదుపు చేసింది కౌసల్య.
వాళ్ళు అలా గొడవ పడుతుంటే బంటి బెదిరిపోయి బిక్క మొఖం వేసుకొని నానమ్మ వెనుక దాక్కున్నాడు.
భవాని, శ్రీనివాసరావులు ఇద్దరు ఒక మాట మీదకు వచ్చి బంటిని మరుసటి సంవత్సరం హాస్టల్లో వేశారు. బంటి లేక కౌసల్య ఇంట్లో ఒంటరిది అయిపోయింది. ఉదయం ఆఫీస్‌కి పోతే ఎప్పుడో రాత్రికి ఇంటికి వచ్చేవారు మొగుడు పెళ్ళాలు.
అక్కడ బంటి పరిస్థితి అంతే. మొదట్లో బంటి హాస్టల్లో ఉండటానికి పేచీ పెట్టాడు. ఎంత పేచీ పెట్టినా ఇంటికి తీసుకువెళ్లరని బంటికి తెలిసి సర్దుకున్నాడు. కానీ అమ్మానాన్న, నానమ్మ ప్రేమకు దూరంగా హాస్టల్లో ఉండలేకపోతున్నాడు. బాగా డిప్రెషన్‌కి లోనయ్యాడని స్కూల్‌ వాళ్ళు చెప్తే కొన్ని రోజులు ఇంటికి తీసుకొచ్చారు.
బుద్ధిగా లేకపోతే హాస్టల్‌కి పంపేస్తారనే భయంతో ఇంటికి వచ్చిన బంటి, తెల్లారు వాళ్ళ అమ్మ లేపకుండానే లేస్తున్నాడు. మునుపటిలా మారం చేయటం లేదు.
ఒకప్పుడు ఉన్న ధైర్యం ఇప్పుడు బంటిలో కనిపించడం లేదు. ఎంతో హాయిగా కల్మషం లేని చిరునవ్వుతో ఇంట్లో తిరుగుతూ అల్లరి చేసేవాడు.
ఇప్పుడు మౌనంగా ఒంటరిగా ఏదో కోల్పోయినట్టు తన గదిలోనే ఉంటున్నాడు. అది గమనించిన కౌసల్య, శ్రీనివాసరావుతో చెప్పింది.
”అమ్మా… నువ్వు ప్రతిదీ బూతద్దంలో చూడొద్దు. పరిసరాలు మారడం వల్ల పిల్లల్లోని ఈ మార్పు సహజం. చిన్నప్పుడు నేను సరిగా చదువుకోకపోవడం వల్లే నేను ఈరోజు ఇంత కష్టపడాల్సి వస్తుంది. నాలా నా కొడుకు కావడం నాకిష్టం లేదు. నేనేమి చేసినా వాడి మంచి కోసమే చేస్తానమ్మా. వాడి మీద ప్రేమ నీకే గాని మాకు లేదా?” అన్నాడు.
ఇక మారు మాట్లాడలేకపోయింది కౌసల్య.
ఆఫీస్‌ నుండి వస్తూ కూరగాయలు తేవడానికి మార్కెట్‌కి వెళ్ళాడు శ్రీనివాసరావు. ఆ మార్కెట్లో శ్రీనివాసరావు చిన్నప్పటి స్కూల్‌ మాస్టర్‌ పద్మనాభం గారు కనిపించారు. అతనికి శ్రీనివాసరావు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అందరు మాస్టర్లు నువ్వు బాగుపడవు అని తిడుతుంటే ఆయనొక్కడే శ్రీనివాసరావుకి ధైర్యం చెప్పేవారు. అందుకే శ్రీనివాసరావుకి ఆయన అంటే అభిమానం.
ఆయనను చూసిన సంతోషంలో గబాలున వెళ్లి ఆయన చేతిలో సంచిని తీసుకొని పలకరించాడు శ్రీనివాసరావు. ముసలితనంతో కళ్లు సరిగ్గా కనిపించక పద్మనాభం మాస్టారు పోల్చుకోలేకపోయారు.
”నేను మాస్టారు… శ్రీనివాసరావుని. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మాస్టారు” అని కుశల సమాచారం కనుక్కున్నాడు.
”ఇక్కడే… దగ్గరలో ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో ఉంటున్నాం” అని బదులిచ్చాడు.
అయ్యో మాస్టారు ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో వుండడం ఏంటి అని ఆశ్చర్యపోయాడు.
”మీకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు” కదా అని అడిగాడు.
”ఉన్నారు పేరుకి” అని నిట్టూర్చాడు పద్మనాభం.
”అదేంటి మాస్టారు ఏమైంది ?” అని అడిగాడు శ్రీనివాసరావు.
”అప్పట్లో ముగ్గురు పిల్లల్ని చదివించాలంటే సంపాదన సరిపోక, జరగక నేను మీ మేడం ఉద్యోగాలకు వెళ్ళిపోయే వాళ్ళం. పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివించాను. ఎప్పుడూ మార్కులు బాగా రావాలి, బాగా చదవాలి, మెరిట్‌ మార్కులు తేవాలి అంటూ వాళ్ళని ఏ కథాకార్యాలకి, పండగలకు పబ్బాలకు కూడా తీసుకువచ్చే వాడిని కాదు. వాళ్లు అలాగే నా మాట జవదాటకుండా కష్టపడి చదివి పైకి వచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరు మంచి పొజిషన్లో సెటిల్‌ అయ్యారు. ఒకరి మీద ఒకరు పోటీపడి మరి సంపాదిస్తున్నారు. వాళ్ల పనుల్లో బిజీ అయిపోయారు. తల్లిదండ్రులను చూసే సమయమే లేదు. వాళ్ళ ఇంటికి వెళ్లినా… వాళ్ల ఇళ్లల్లో ఉన్న గోడలతోని ఫర్నిచర్‌ తోనే మాట్లాడుకోవాలి. ఉదయం పోతే రాత్రికి వస్తున్నారు. ప్రేమాభిమానాలు నేర్పించలేదు కదా వాళ్లకి. పేరు తెచ్చుకోవడం ఎలా? సంపాదించడం ఎలా? అని మాత్రమే నేర్పించాను. అందుకే తల్లి తండ్రి అని మాపై కొంచెం కూడా ప్రేమ లేదు. మమ్మల్ని చూసుకోవటానికి పనివాళ్ళని పెట్టాలంటే వాళ్ళు ఎంత కోల్పోతున్నారో లెక్కలేసుకుంటున్నారు. మా కోసం పని వాళ్లకు ఇచ్చే ఖర్చు బదులు చవకగా వచ్చే ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌లో పెడితే ఎంత మిగులుతుందా అని లెక్కలు వేసుకుని ఇలా ఓల్డ్‌ ఏజ్‌ హోమ్‌ల్లో జాయిన్‌ చేశారు. అప్పట్లో వాళ్లని హాస్టల్లో నేను జాయిన్‌ చేశాను. ఇప్పుడు వాళ్లు మమ్మల్ని ఈ ఓల్డ్‌ ఏజ్‌లో ఇక్కడ జాయిన్‌ చేశారు” అని కళ్ళు తుడుచుకుంటూ బదులిచ్చాడు మాస్టర్‌.
ఆ మాట వినగానే శ్రీనివాసరావు మనసు తరుక్కుపోయింది.
చిన్నప్పుడు అమ్మ మమ్మల్ని కంటికి రెప్పలా పెంచబట్టే ఆ ప్రేమ, అభిమానం వెన్నంటి నీడలా మమ్మల్ని ముందుకు నడిపింది. ఎంత పెద్ద కుటుంబం మాది. ఇప్పటికీ కుటుంబ విలువలు తెలుసు కనుక అమ్మ మాతోనే ఉంటుంది. ఆమెను ఒక మాట అంటే వెనకాల పెద్ద సైన్యమే వస్తుంది నాతో గొడవకి. అందుకే భయపడి మా ఆవిడ మా అమ్మ జోలికి పోలేదు. పాపం మాస్టారు. సంపాదనలో మునిగి బంధుత్వాలను తెంచేసుకున్నట్టున్నారు. పిల్లలు కూడా డబ్బు సంపాదించే మిషన్‌ లాగా తయారయ్యారు. అని మనసులో అనుకున్నాడు.
”సరే మాస్టారు మేం ఈ పక్క వీధిలోనే ఉంటున్నాం. వీలు చూసుకుని మా ఇంటికి ఒకసారి రండి” అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్లినా మాస్టర్‌ చెప్పిన మాటలు పదే పదే శ్రీనివాసరావు మదిలో తోలుస్తున్నాయి. జరిగినదంతా భార్యతో చెప్పాడు. నిజమే ఈరోజు మాష్టారు గారికి వచ్చిన పరిస్థితి రేపు మనకు వస్తుంది అని అంది భవాని.
బంటిని హాస్టల్లో చేర్పించి అటు బంటిని ఇటు కౌసల్యను బాధ పెట్టినందుకు పశ్చాత్తాప పడ్డాడు. అమ్మ దగ్గర ఉంటే కనీసం వాడు ప్రేమాభిమానాలు, ఫ్యామిలీలో, సంఘంలో ఎలా బతకాలో నేర్చుకుంటాడు. అమ్మకు కూడా ఈ వయసులో ఊసుపోతుంది. వాడి భవిష్యత్తుని బాగు చేస్తున్నాం అనుకున్నానే గాని వాడు ఏమి కోల్పోతున్నాడో గ్రహించలేకపోయాను. బతకడానికి సంపాదన ఒకటే కాదు మనిషికి విలువలు కూడా చాలా అవసరం అని మాస్టారుని చూశాక తెలుసుకున్నాను.
బంటీని పిలిచి నువ్విక హాస్టల్‌ కి వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంట్లోనే శ్రద్ధగా చదువుకోవాలని చెప్పాడు.
అది విని బంటి కళ్ళల్లో నీరు తిరిగి గట్టిగా తండ్రిని పట్టుకొని ఏడ్చేసాడు. అది దు:ఖమో ఆనందభాష్పాలో తెలియలేదు. కొడుకుని దగ్గరికి తీసుకొని క్షమించమని అడిగారు భవాని శ్రీనివాసరావులు. బంటి ముఖంలో మళ్లీ నవ్వులు విరిసాయి.
కొడుకు నిర్ణయానికి ఎంతో సంతోష పడింది కౌసల్య. ఆ రోజు నుంచి బంటి శ్రద్ధగా చదువుకుంటున్నాడు. అలా ఆ కుటుంబం ప్రేమాభిమానాలతో అనురాగాలతో సంతోషంగా ఉంది.
– జ్యోతి మువ్వల, 9008083344

Spread the love