త్రిమూర్తులు

హెడ్‌ మాస్టర్‌ జయరామయ్య పదవ తరగతి గది లోనికి ప్రవేశించారు.
”ఈ రోజు మీకొక పరీక్ష పెడుతున్నాను. దేవుడు వున్నాడా లేడా అన్న చర్చకు రాకుండా నేనడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వండి. దేవుడు ప్రత్యక్షమైతే మీరేమని కోరుకుంటారు. మీ సమాధానం ఒకటి లేక రెండు వాఖ్యాలలో రాసివ్వండి” అన్నారు.
ఇరవై రెండు మంది విద్యార్థులు దూర దూరంగా కూర్చొని రాసిన తరువాత పేపర్లు తెచ్చి ఇచ్చారు.
మరుసటి రోజు తరగతిలోనికి ప్రవేశించి ”అందరూ బాగా రాసారు. మీరు రాసిన సమాధానంపై వివరణ కోసం ఒక్కొక్కరు నా గదికి వచ్చి వెళ్ళండి” అన్నారు.
ఒక్కొక్కరు హెచ్‌ హెమ్‌ గదికి వెళ్లివస్తున్నారు. ఆనంద్‌ హెచ్‌ ఏం గదిలోనికి వెళ్ళాడు.
”ఆనంద్‌… సరదాగా ఏదో చిన్న పరీక్ష పెడితే అందులో ముగ్గురు త్రిమూర్తులను అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులను చూసాను” అన్నారు జయరామయ్య .
ఆనందుకు జయరామయ్య చెబుతున్నది అర్థంకాలేదు.
”ఆనంద్‌… మంచి మార్కులతో పాస్‌ కావాలని నీవు సమాధానం రాసావు. కానీ ముగ్గురు విద్యార్థులు ఇంచుమించు ఒకేలా, అంటే… ఆనంద్‌ ఇంటర్నెట్‌ నందు సినిమాలు, వీడియోలు చూసే అలవాటు మానుకొని చదివాడంటే మంచి మార్కులతో పాస్‌ అవుతాడు. వాడి మనసు చదువుపై కలిగేలా చూడమని రాసారు. నా దృష్టిలో వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు” అన్నారు జయరామయ్య.
”సార్‌ నాగురించి ఆలోచించే మిత్రులు వున్నారని తెలిసింది. వారి కోసమైనా నేను బాగా చదువుతాను” అన్నాడు ఆనంద్‌
పదవ తరగతి ఫలితాలు వచ్చాయి. ఆనంద్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆనంద్‌ హెడ్‌ మాస్టర్‌ గదికి వెళ్ళాడు. ”నేను మామూలుగా పాస్‌ అవుతాను అనుకొన్న నాకు మొదటి తరగతి వచ్చింది. అందుకు కారణమైన ఆ త్రిమూర్తుల పేర్లు చెప్పండి. నేను కృతజ్ఞతలు చెప్పుకొంటాను సార్‌” అన్నాడు.
”ఆనంద్‌, తరగతిలో ఇరవై రెండు మందితో నీవు స్నేహంగా వున్నావు. నేను ఆ ముగ్గురు పేర్లు చెబితే ఆ ముగ్గురిని ఎక్కువగా అభిమానిస్తావు. ఆ ముగ్గురు ఎవరో తెలియనంత వరకు నీవు అందరితో స్నేహంగా ఉంటావు. అందుకే చెప్పదలచుకోలేదు” అన్నారు.
ఆనంద్‌ మనసులో అప్పుడప్పుడు ఆ త్రిమూర్తులు ఎవరన్న ప్రశ్న కలగసాగింది.
ఒకరోజు సి.సి తీసుకోడానికి హెడ్‌ మాస్టర్‌ గదికెళ్ళాడు.
హెడ్‌ మాస్టర్‌ తరగతి గదులు చూడటానికి వెళ్లడంతో టేబుల్‌ ముందు నిలబడ్డాడు.
అప్పుడు అనుకోకుండా టేబుల్‌ మీద ఆ రోజు దేవుడు కనబడితే ఏమి కోరుకుంటారు అన్న ప్రశ్నకు సమాధానం రాసిన పేపర్లు ఉండటం చూసి ఉలిక్కి పడ్డాడు.
ఆనంద్‌ ఆ పేపర్ల కట్ట తీసుకొని అన్ని పేపర్లు వేగంగా చదివాడు. ఆ త్రిమూర్తులు ఎవరో తెలిసిపోయింది.
ఆనంద్‌ కళ్ళలో కన్నీరు జలజలమని కారసాగింది.
జయరామయ్య గదిలోనికి ప్రవేశించగానే బోరుమని ఏడుస్తూ కాళ్ళమీద పడుతూ ”సార్‌, మీరే ఆ త్రిమూర్తులని తెలుసుకున్నాను. ఇప్పుడే ఆ పేపర్లు చూసాను. మీరు నా భవిష్యత్తు కోసం నాటకం ఆడారు” అన్నాడు ఆనంద్‌ .
”మీ తల్లి తండ్రులు నీకున్న ఇంటర్నెట్‌ బలహీనత గురించి చెబితే నేనే నీకోసం ఆ పరీక్ష పెట్ట్టాను. ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దు. బీరువా శుభ్రం చేస్తూ పొరపాటున ఆ పేపర్లు పైన పెట్టాను. ప్రతి సంవత్సరం నేనే ఇలా కొంతమంది బాగు కోసం నాటకం ఆడుతుంటాను” అంటూ ఆనందును ప్రేమతో లేపారు జయరామయ్య.
– ఓట్ర ప్రకాష్‌ రావు, 09787446026

Spread the love