పుల్లమ్మ చల్ల

శ్రీ కృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న కాలంలో పుల్లమ్మనే దొడ్డ ఇల్లాలు ఉండేది. ఆమె భర్త సుబ్బయ్య. వారికి పాతిక వరకు గేదెలు, ఆవులు ఉండేవి. వాటి పాలు పితికి అమ్ముకొని జీవిస్తుండేవారు. మిగిలిన పాలు తోడు పెట్టి మజ్జిగ చేసి, తన ఇంటికి వచ్చిన వారికెల్లా లేదనకుండా ఉచితంగా పోస్తుండేది ఆ ఇల్లాలు.
ప్రతి ఏడాదిలాగే ఆ సంవత్సరం కూడా రాయలవారు వసంతోత్సవాలలో భాగంగా, ‘కవిత్వ ఉత్సవం’ ఏర్పాటు చేశాడు. తమ కవిత్వాన్ని వినిపించడానికి దేశ దేశాల కవులు పొలోమంటూ రాసాగారు. విజయనగరమంతా పండుగ వాతావరణం ఆవరించింది. పుల్లమ్మకు చాలా సంబరమైంది. ”ఏమండీ రాయలవారు కవులను ఆదరించి సంతోషపెడుతున్నాడు కదా. మనం కూడా వారికి సంతోషం కలిగే పనిచేద్దామండి” అంది భర్తతో. ”నాకూ ఇష్టమే. ఏంచేద్దామో చెప్పు” అన్నాడు. ”ఎక్కడెక్కడ నుండో ఎండలో పడివస్తుంటారు కదా. వారికి చల్లని మజ్జిగ ఇద్దామండి. మన ఇంటిలో అయ్యే పాడే కదా” అంది. ”అలాగే” అన్నాడు భర్త. ఆ నెల రోజులూ పాలు అమ్మడం మానేసి, వాటిని తోడు పెట్టి మొత్తం మజ్జిగ చేసింది. అందులో కొత్తిమీర, పుదీన, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి వేసి కాస్త ఉప్పు జోడించి బహు రుచికరంగా బానల కొద్ది తయారు చేశారు దంపతులు. వాటిని ఇంటి ముందు పెట్టుకొని భువన విజయానికి వెళ్ళే ప్రతి ఒక్కరికీ ముంతతో ముంచి ఇవ్వసాగారు. మజ్జిగ తాగిన వారంతా బ్రేవ్‌ మని, త్రెంచి తృప్తిగా వెళుతుంటే ఆనందపడేది ఆ ఇల్లాలు. దేశ దేశాలనుండి వచ్చిన కవులు, పండితులు ఆ మజ్జిగ తాగి ‘రాయల వారే కాదు, ప్రజలు కూడా బహు దొడ్డ వారు. లేకుంటే ముక్కూ, మొఖం తెలియని మనల్ని ఇంతగా ఆదరిస్తారా?’ అనుకుంటూ సభకు వెళ్లసాగారు.
ఆ ఏడాది, గతంలో కవిత్వం రాసినవారే కాక, కొత్తగా అనేకమంది తమ కతులను వినిపించ సాగారు. రాయల వారు ఆశ్చర్య పోయారు. ”బట్టలు నేసే వారు, రంగులు అద్దే వారు, వ్యవసాయం చేసేవారు కూడా కవిత్వం వినిపిస్తున్నారెంటి వింతగాకుంటే?” అన్నాడు రాయలవారు. వెంటనే పెద్దన లేచి, ”తమరు అపర సరస్వతీ పుత్రులు. పంచ మహా కావ్యాలలో ఒకటైన ఆముక్తమాల్యద కృతి కర్తలు. తమను చూడగానే సామాన్యులకు కూడా కవిత్వం తన్నుకొస్తుంది” అన్నాడు.
”లేదు. తమరు ముఖస్తుతిగా మాట్లాడుతున్నారు. మనం గత కొన్ని సంవత్సరాలుగా ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. కానీ ఈ ఏడాది వచ్చినంతమంది కవులు ఎప్పుడూ రాలేదు. దీని మర్మమేమిటి రామకృష్ణకవీ” అన్నాడు రాయల వారు.
” పుల్లమ్మ మజ్జిగ మహత్యం మహారాజా” అన్నాడు ఆసనంలోంచి లేచి నిలబడి రామకృష్ణుడు.
”అదేమిటి. ఈ పుల్లమ్మ ఎవరు? మజ్జిగ ఏమిటి? చమత్కారం ఆపి, కాస్త వివరంగా చెప్పు కవీ” అన్నాడు రాయల వారు.
”నిజం మహారాజా. మేమందరం సభకు వచ్చే రహదారి పక్కన పుల్లమ్మనే దొడ్డ ఇల్లాలు చల్లని మజ్జిగ ప్రతి వారికి ఉచితంగా ముంతలకొద్ది అందజేసింది. ఈ ఎండకు ఆ మజ్జిగ తాగిన వారందరూ తన్మయులై అలవోకగా కవిత్వం చెపుతున్నారు. కావాలంటే అడిగిచూడండి. ఇక్కడ కవిత్వం చెప్పిన వారంతా పుల్లమ్మ చల్ల తాగిన వారే.” అన్నాడు రామకృష్ణకవి .
”అవును మహారాజా. మేమందరమూ ఆమె చల్ల తాగి వచ్చిన వారమే. బహు రుచిగా కూడా ఉంది. ఎండకు చక్కని రక్ష” ”కవులందరూ తలో విధంగా పుల్లమ్మను, మజ్జిగను పొగడ సాగారు.
”పుల్లమ్మ చల్ల/ తాగిన వారికెల్ల/ కవిత్వం కొల్ల”
అంత్య ప్రాస కవిత్వం వినిపించి ”కడుపులో చల్ల పడగానే, కవిత్వం వెల్లువలా వచ్చిందంటారు. అంతేనంటావా రామకృష్ణకవీ” అన్నాడు రాయలవారు.
”ముమ్మాటికీ అంతే మహారాజా” అన్నాడు రామకృష్ణుడు.
చిత్రంగా ఉంది. నేను ఎవరినీ మజ్జిగ పొయ్యమని ఆదేశించలేదు. తను ఎందుకిలా చేసింది? ఆసక్తిగా ఉంది. తెలుసుకోవలసిందే ఆ దంపతులను సగౌరవంగా సభకు తోడ్కొని రండి” అని భటులను ఆదేశించాడు.
వెంటనే పుల్లమ్మ, సుబ్బయ్య దంపతులను రథం మీద తీసుకుని వచ్చారు భటులు.
”నిజానికి నేను సభాప్రాంగణంలో ఏర్పాటు చేసి అందరినీ ఆదరించవలసి ఉంది. నేను విస్మరించాను. నా కర్తవ్యాన్ని మీరు పూర్తి చేశారు. ఎందుకమ్మా మీకిలా చల్ల ఉచితంగా వితరణ చేయాలనిపించింది. పాలు అమ్ముకుంటే నాలుగు కాసులు వచ్చేయి కదా” అడిగాడు సౌమ్యంగా.
రెండు చేతులు జోడించి, ”తమరు ఎక్కడెక్కడి నుండో వచ్చిన కవి పండితులను ఆదరిస్తున్నారు. వారు వెళ్ళేప్పుడు మిమ్ము పొగుడుకుంటూ, దీవిస్తూ సంతోషంగా వెళ్ళటం చూశాం. మా వంతుగా మేము కూడా చేతనైనంతలో ఏదైనా మేలు చేసి, వారు సంతోష పడితే ఆనందిద్దామనుకున్నాం. అందుకే సభా ప్రాంగణం వైపు వస్తున్న వారందరికీ చల్ల పంపిణీ చేశాం. ఇంటి పాలే. ఈ నెల రోజులు పంచితే మా సంపాదేమీ కొల్ల పోదు. మాకు జీవితానికి సరిపడా తృప్తి కూడా లభిస్తది” అంది పుల్లమ్మ.
”నీ మజ్జిగ మీద రాయల వారు కవిత్వం కూడా చెప్పారు” అన్నాడు దూర్జటి.
అది విని రాయలవారితో సహా సభలోని వారందరూ సంతోషంగా నవ్వారు.
”మీ వంటి పరోపకారులు నా రాజ్యంలో ఉన్నందుకు గర్వపడుతున్నాను. ప్రజల వలన కూడా రాజు కీర్తి దశ దిశలా వ్యాపిస్తుంది. అందుకు దోహదం చేసిన మిమ్ము మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తగు రీతిగా సత్కరిస్తున్నాం. రండి.” అని ఆసనం నుండి లేచి నిలబడ్డాడు. తన చేతికి ఉన్న రెండు బంగారు కడియాలను తీసి, పుల్లమ్మ సుబ్బయ్య దంపతుల చేతికి తొడిగాడు.
సభ మొత్తం నిలబడి కరతాళ ధ్వనులతో దంపతులను అభినందించారు.
– పుష్పాలకృష్ణ మూర్తి

Spread the love