గణపురం మహారాజు రంగనాథుడికి, భార్య నాగరత్న అంటే మహా ప్రేమ. ఆమె పుట్టిన రోజున రాజ్యంలోని ప్రజలందరినీ పిలిచి భోజనం పెట్టాడు. ఇంటికి వెళ్ళేప్పుడు ఆడవారికో చీర, మగవారికో పంచె ఉచితంగా ఇచ్చి పంపించాడు. మరుసటి రోజు సభలో కొలువు తీరి ఉండగా, నిన్న ప్రజలందరూ వచ్చినట్లేనా? మన దాన గుణం గురించి ప్రజలంతా గొప్పగా చెప్పుకుంటున్నారా” అని మంత్రిని అడిగాడు ఉత్సాహంగా.
మిమ్ము శిబి చక్రవర్తి వంటి వారని, కవచ కుండలాలే లేవు కానీ కర్ణుడంతటి దానగుణం కలవారని ప్రజలు వేనోళ్ల పొగడుతున్నారు మహారాజా, కానీ….” అని నీళ్ళు నములుతూ ఆగిపోయాడు.
ఆ మాటలకు పొంగిపోయి, తర్వాత సందేహంతో కానీ ఏమిటి? నా గురించి ఎవడైనా చెడుగా మాట్లాడాడా? చెప్పండి. ఇప్పుడే సభకు రప్పించి వాడి నాలుక తెగ్గొస్తాను. వాడి శిరసు నరికి కోట గుమ్మానికి వేలాడ దీస్తాను” అన్నాడు నిప్పులు కక్కుతూ.
”లేదు మహారాజా. మిమ్ము పరుషంగా ఎవరూ మాట్లాడలేదు. మిమ్ము విమర్శించను కూడా లేదు. కానీ నారాయనపల్లిలోని దంపతులు మాత్రం రాజధానికి రాకుండా, చేలోనే ఉండిపోయారట కలుపు పీక్కుంటూ. మన గూఢాచారి గుర్రం మీద వస్తూ వారిని చూసి పలకరించాడట. దానికా రైతు ‘పరిగతోటి గుమ్మి నిండదు. చల్లతోటి కడుపునిండడు’ అని సామెత చెప్పి తన పనిలో మునిగిపోయాడట. అతని ఆంతర్యమే అంతుపట్టకుంది. బహుశా మీ పంపిణీ కార్యక్రమం తనకు నచ్చనట్లు అనిపిస్తోంది” అన్నాడు సౌమ్యంగా.
మహారాజుకు మండిపోయింది. ”వెంటనే వాణ్ని లాక్కు రండి. వాడి సంగతి ఇప్పుడే తేలుస్తా” అని హుంకరించాడు కాలు నేలమీద బలంగా తాటిస్తూ. ఇద్దరు భటులు వెళ్ళి రామయ్యను లాక్కొచ్చి రాజు ముందు నెలబెట్టారు.
”ఏం నేనంటే లెక్కలేదా?” అన్నాడు గర్జిస్తూన్నట్లు రాజు.
”నాకు రాజన్నా, రాజ్యమన్నా ఈ రాజ్యంలో ఎవరికీ లేనంత గౌరవం, భక్తి మహారాజా” అన్నాడు వినయంగా. ”అయితే, అందరితోపాటు వచ్చి, నేను ఇచ్చే దానం ఎందుకు స్వీకరించ లేదు? రాజ భోజనం ఎందుకు తినలేదు” అన్నాడు గద్దిస్తూ.
”శాంతించండి మహారాజా. ఒక్కనాడు రాజ భోజనం తింటే, మరుసటి రోజు కూడా నా జిహ్వ అటువైపే లాగుద్ది. ఇంటికాడ నా భార్య ఎంత ప్రేమతో వండినా రుచించదు. నా భార్య మీద గతంలో ఉన్న ప్రేమ తగ్గిపోద్ది. అది నాకు ఇష్టం లేదు. అందుకే రాలేదు” అన్నాడు.
”సరే … వచ్చి వస్త్రాలు స్వీకరించ వచ్చు కదా. దానికేం అభ్యంతరం?” అన్నాడు పరుషంగా.
”అసలు అభ్యంతరం అక్కడే మహారాజా. నేను పెండ్లి చేసుకునేప్పుడే తనను పోషిస్తానని, జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను. ఆ ప్రమాణం తప్పడం ఇష్టం లేదు. నేను ఆరోగ్యంగా ఉండి, నా భార్య పోషణ మరొకరి వలన సాగడం సరి కాదు కదా” అన్నాడు.
”నీ కోసం మేమిచ్చే దుస్తులు తీసుకొని వెళ్లొచు కదా” అన్నాడు రాజు.
”మహారాజా మనిషైన వాడు తను కష్టపడి ఆహారం, దుస్తులు సంపాదించుకోవాలి. మీరిచ్చిన దుస్తులు తీసుకుంటాను. కొంతకాలానికి అవి చిరిగి పోతాయి. మళ్ళీ రాజుగారు ఇస్తే బాగుండు అనిపిస్తది మనసులో. రాజు గారికి ఒక్క భార్య కాకుండా నలుగురు భార్యలు ఉంటే ఎంత బాగుండు. ఏడాదికి సరిపడే దుస్తులు వస్తాయి గదా అనిపిస్తుంది. దుస్తులతోపాటు ఇంటిలోకి ధాన్యం, వెచ్చాలు కూడా ఇస్తే ఇంకెంత బాగుండు అనిపిస్తుంది. అవన్నీ ఇస్తే… కష్టం చేయకుండా, కాలు మీద కాలు వేసుకుని ఇంట్లోంచి బైటకు వెళ్లకుండా బతికేయవచ్చు కదా అనిపిస్తుంది మనసుకు. నాకు తెలీకుండానే సోమరితనం నన్ను ఆవహిస్తది. రేపు మరో రాజు దండెత్తి వచ్చి, మీకంటే ఎక్కువ దుస్తులు, ధనం ఇస్తానంటే అతని వైపే నా మనసు మొగ్గుద్ది. శత్రు రాజైనా అతనివైపే చేరిపోవాలని పిస్తుంది. నేను పూర్తిగా పరాయీకరణకు లోనవుతాను. లొంగి పోతాను. కష్టాన్ని వదిలేసి ఉచితాలకు ఆశపడితే నాలో దేశ భక్తి పూర్తిగా తొలగి పోయి, దేశ ద్రోహిగా మారిపోతాను. అలా మారడం ఇష్టం లేదు కనుకనే ఉచిత దానాలు స్వీకరించడానికి రాలేదు” అన్నాడు వినయంగా.
మహారాజుకు తల తిరిగి పోయింది. ‘నేనిచ్చే ఉచితాల వెనుక ఇంత హాని ఉందా? అని మ్రాన్పడి పోయాడు. చాలా సేపు ఏమీ మాట్లాడలేదు. తరువాత నెమ్మదిగా ”నా కండ్లు తెరిపించావు. నువ్వా సామెత ఎందుకు ఉపయోగించావో ఇప్పుడు అర్థమయింది . నిజమైన దేశభక్తుడివంటే నువ్వే. ఈ రోజు నుంచి ఉచితాలు మానేస్తున్నానని ప్రమాణం చేస్తున్నాను.” అని ప్రకటించాడు. రైతును గాఢంగా హృదయానికి హత్తుకొని వీడ్కోలు పలికాడు.
తరువాత కోశాగారంలో మిగులు ధనాన్ని, చెరువులు, బావుల తవ్వకానికి, రహదారుల నిర్మాణానికి, వాని పక్క చెట్ల పెంపకానికి ఉపయోగించి, ప్రజలకు చేతినిండా పని కల్పించి సమర్ధుడైన రాజుగా చరిత్రలో పేరు తెచ్చుకున్నాడు.
– పుప్పాల కృష్ణ మూర్తి