పోరాటస్ఫూర్తి

ప్రపంచ మానవాళి చరిత్రలో అతి గొప్ప సంఘటన 1917 అక్టోబర్‌ విప్లవం. భూతలంపై సమ సమాజం అనేది కలగా ఉన్నప్పుడు ఆ కలని సాకారం చేసిన విప్లవం అది. కాగా అక్టోబర్‌ విప్లవానికంటే దశాబ్దం ముందే ప్రజల్ని, విప్లవకారుల్ని ప్రభావితం చేసిన గొప్ప రచన మాక్సిమ్‌ గోర్కి ‘అమ్మ’ నవల. మాక్సీమ్‌ గోర్కీ ‘అమ్మ’ని చదివిన వారు ఎవరైనా ఒకసారి తమ అమ్మకు ఆ నవల చదివి వినిపించాలనుకుంటారు. అంతటి ప్రభావవంత మైన నవల అది. గోర్కీ రష్యన్‌ భాషలోనే రాసినా 1906లో తొలి ముద్రణ మాత్రం ఇంగ్లీషులో అయింది. ఆ తర్వాతే 1907లో రష్యన్‌ భాషలో వచ్చింది. వివిధ భాషల్లోకి అనువాదమై దేశదేశాలలో ప్రతి తరాన్ని ఉత్తేజితుల్ని చేసింది… చేస్తుంది… చేస్తూనే ఉంటుంది. ఈ నవలని క్రొవ్విడి లింగరాజు ఎంతో ఇష్టంగా, ప్రేమగా, శ్రద్ధగా తెలుగులోకి అనువాదం చేశారు. ‘మదర్‌’ పేరుతో ఉన్న ఈ నవలకు ఆయన ‘అమ్మ’ అనే పేరు పెట్టారు. అనంతరం ఎందరికో ఈ ‘అమ్మ-విప్లవాల ఉగ్గుపాలు పోసి కార్యోన్ముఖులను చేసింది. ‘అమ్మ’ నవల నేటికీ అనేకమందికి స్ఫూర్తిగా ఉంది. గోర్కీ ‘అమ్మ’ గొప్పతనాన్ని పరిచయం చేసి, తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు క్రొవ్విడి లింగరాజు. తెలుగు నాట ఎంతోమంది ‘అమ్మ’ నవల చదివి కమ్యూనిస్టులయ్యారు. సమాజంలో పీడితుల పక్షం వహించాలన్న ఆకాంక్షని, పట్టుదలని, ప్రేరణని అందించడంలో ‘అమ్మ’ పాత్ర అమేయమైంది. ‘అమ్మ’ గొప్పతనం తెలుసుకోడం ద్వారా మానవీయ ప్రవర్తనని అలవరుచుకుంటారు. హృదయ సంస్కారంతో వ్యవహరించడం తెలుస్తుంది.
ప్రపంచ సాహిత్యక్షేత్రంలో గొప్ప రచయితగా నిలిచిన మాక్సిం గోర్కి రష్యా విప్లవానికి తన రచనల ద్వారా తోడూనీడై నిలిచాడు. అతిపేద కుటుంబం. బాల్యంలోనే తండ్రిని కొల్పోయాడు. తల్లి వేరొకర్ని వివాహం చేసుకున్నది. తొమ్మిదో యేటనే బుక్కెడు బువ్వ కోసం పరితపించాడు. తన సహచరులతో పెనుగులాడాడు. ఆయన బాల్యమంతా బంధిఖానాల్లో మగ్గిపోయింది. పాత ఇనుప సామాన్లు, ఖాళీ సీసాలు, చిత్తుకాగితాల్ని ఏరుకున్న ఒక స్లమ్‌ డాగ్‌ బిడ్డడు గోర్కి. అవాంతరా లన్నింటినీ ఎదుర్కొని కుటుంబానికి ఆసరాగా నిలిచాడు. తల్లే తొలి గురువైంది. ఆమె నేర్పిన అక్షరంతోనే గోర్కి లోకానికి దివిటై వెలుగు ప్రసరించాడు. 1901లో ‘సాంగ్‌ ఆఫ్‌ ద స్టార్మీ పెటైల్‌’ తుఫాను పిట్ట పాట ద్వారా సునామిలా దూసుకొచ్చాడు. ఆనాటి జార్‌ల పరిపాలనలో రష్యా సామ్రాజ్యంలో మెరిక లాంటి రచయితగా ఎదిగాడు. అనతి కాలంలోనే ప్రపంచ సాహిత్య క్షేత్రంలోనే గొప్ప రచయితగా నిలిచాడు. రష్యా సామ్రాజ్యం, దాని ఏలికలు, పాలకుల పునాదులను పెకిలించగల రచనలను చేశాడు. గోర్కి తన మేధా సంపత్తి నుంచి పురుడు పోసుకున్న ‘అమ్మ'(1906) నవల ద్వారా అన్నార్తులు, పేదలు, కడుబీదలు, కార్మికుల పక్షాన గొంతుకై ప్రభవించాడు. 1901లో రచించిన ‘ఫోమా గార్డియన్‌’ (ద మ్యాన్‌ హు వాస్‌ ఎ ఫ్రెండ్‌) రచన రష్యన్‌ సాహిత్యంలోనే కలికితురాయిగా నిలిచిపోయింది. ఆనాటి రష్యన్‌ సమాజం లోని బూర్జువాలు, భూస్వాముల వర్గ దృక్పథాన్ని యధార్థంగా చిత్రీకరించిన నవల ఇది. రష్యా సామ్రాజ్యమంతా గోర్కి ఐదేళ్లపాటు కాలినడకన కలియదిరిగి ఆనాటి పీడిత ప్రజల కడగండ్లని కళ్లారా చూడటమే కాదు… స్వయంగా అనుభవించాడు. అదే ఆయనను పీడితులు, శ్రామికుల పక్షాన నిలబెట్టింది. వారి తరపున అక్షరమై గర్జించాడు. అది రష్యన్‌ విప్లవానికి బీజం పడిన రోజులు కావడం, అమ్మ నవల అదే సమయంలో రావడం, ఉద్యమకారులకు, అనేకులకు ప్రేరణనిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఉత్తేజితులను చేసింది. అతని రచనల్లోని సూటిదనం, నిక్కచ్చితత్వం, వాస్తవికత యధార్థతను సంతరించుకొని నేటికి ఎందరికో స్ఫూర్తినిస్తున్నదంటే అతిశయోక్తి కాదు. వంద ఏండ్లయినా వన్నె తగ్గని రచన అది. నేటికీ సజీవమై మన సాహిత్యంలోనూ గుబాళిస్తున్నది. పోరాటస్ఫూర్తిని ప్రోది చేయడమే కాదు, మనుషుల మధ్య మనిషిగా బతకడంలోని ఉదాత్తతని చెప్పే నవలను ప్రపంచానికి అందించిన గోర్కి 87వ వర్థంతి సందర్భంగా మరోసారి ఆ పోరాటస్ఫూర్తితో పని చేయాల్సిన అవసరం గతం కంటే నేడు ఎక్కువగా ఉంది.

అనంతోజు మోహన్‌ కృష్ణ

Spread the love